Title Picture

నిర్మాతలు : పి. సూరిబాబు, కె. నాగుమణి; దర్శకుడు : కె. కామేశ్వరరావు; కథ, మాటలు-పాటలు : పింగళి నాగేంద్రరావు; సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు; నృత్యం : పసుమర్తి కృష్ణమూర్తి, వెంపటి సత్యం; కళ : గోఖలే; నేపధ్యగానం : ఘంటసాల, మాధవపెద్ది, పి. లీల, సుశీల, జిక్కి, జయలక్ష్మి, రాణి; నటీనటులు : నాగేశ్వరరావు, యస్.వి. రంగారావు, రేలంగి, సి.యస్.ఆర్, లింగమూర్తి, సూరిబాబు, కె.వి.యస్. శర్మ, వంగర, శ్రీరంజని, రాజసులోచన.

పింగళి, అక్కినేని, కమలాకర, పెండ్యాల - యీ నలుగురి చిర తపః ఫలితం 'మహాకవి కాళిదాసు'. కళాత్మకమైన చిత్రాల కోసం అలమటించే పండిత ప్రేక్షకుల చిర స్వప్నాలపంట ఈ చిత్రం; నిర్దుష్టమైన వినోదం కోసం ఎదురు చూచే వారికి అమృతపు జల్లు.

తెలుగు చిత్రాలలో చాలా తరచుగా కనుపించే శక్తి వంచన, ఆత్మవంచనా యీ చిత్రంలో వెతికి చూచినా కనుపించవు. పాత్రల రూపు రేఖలను తీర్చి దిద్దటంలో, వ్యక్తిత్వం ప్రసాదించటంలో, జీవింప చేయటంలో, కవి నట గాయక దర్శకులు చూపిన శ్రద్దా భక్తులు అసాధారణం.

మత్తుగా కునుకుతూ, జోగుతూ ఎప్పుడో ఒక్కసారి ఉలిక్కి పడి లేచి అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించటం తెలుగు చరిత్రకు మామూలు. కాళిదాసు చిత్రంలో తెలుగు చలన చిత్ర చరిత్ర మరొకసారి అలా మత్తు విదిలించుకుంది. తెలుగు చిత్రాలలో చిత్త శుద్ధి బొత్తిగా లోపించిందని ఎత్తి పొడిచే పరాయి నిర్మాతలకు తెలుగు వారీ చిత్రాన్ని చూపి గర్వంగా నవ్వుకోవచ్చు.

అయితే చిత్తశుద్ది ఉన్నంత మాత్రాన ప్రయత్నాలు పరిపూర్ణంగా, లోప రహితంగా ఫలించక పోవచ్చును. చిత్రాలు పరిపూర్ణంగా రూపొందక పోవటం చాలా సహజం. అలా అని లోపాలను సూచించక పోవటమూ అన్యాయమవుతుంది. శక్తి వంచన, ఆత్మ వంచనా లేకుండా, ఏకాగ్రధ్యేయంతో కృషి చేశామన్న సంతృప్తి చాలు కళాకారులకు; అది ఫలితం కన్నామిన్న. కాళిదాసు చిత్రం లోపరహితం కాదు.

కథా సంగ్రహం

'కాళిదాసు' వంటి కథలు ఏ పుస్తకాలలోనూ, సంగ్రహించటానికి సిద్ధంగా ఉండవు. చారిత్రకాధారం కొంత, కట్టు కథల ఆధారం మరి కొంత, ఆయా కవుల రచనలలోని పాత్ర మనఃప్రవృత్తులూ, కొన్ని సన్నివేశాల కల్పనలూ ఆధారంగా మరి కొంత, వీటన్నంటికీ మించి స్వయంగా ఊహించినది, మరింత, మేళవించుకుని కథను సిద్ధం చేయాలి. ఈ శ్రమ అంతా చలన చిత్రం కోసమని మాత్రం జ్ఞప్తి వుంచుకోవాలి. చలన చిత్రమంటే చరిత్ర పుస్తకం కాదు, వివరాల జాబితా కాదు, ఉపన్యాసం కాదు-అన్నివిధాలా పింగళి నాగేంద్రరావుగారు, కథను చాలా గొప్పగా బిగువుగా అల్లారు.

అవంతి రాజు వినయ భూషణుడు. ఆయన కూతురు విద్యాధరి, సార్దకనామధేయ, సకల సుగుణ సంపన్న, సౌందర్యరాశి. ఆమె ఒక రోజు దేవిని సేవించుకొని తిరిగి వస్తూండగా చారణుడొకడు ఆమెను చూసి 'నీవు ఒక అద్భుత కథకు నాయకివి కాగలవన్నాడు. మంత్రి రాజ్యకాంక్షతో తన కుమారునికి రాచ విద్యాధరినిచ్చి వివాహం చేయమని రాజు నడిగి, పరాభూతుడై, పగతీర్చుకొనేందుకై కుట్రపన్ని, పామరభాషలను కోమలం చేయగల మహా పండితుడని చెప్పి వంచించి కాలుడు అనే మూర్ఖుడిని తెచ్చి రాకుమార్తెకు వివాహం చేయిస్తాడు. భర్త పిచ్చి వాడని తెలుసుకొని అతనికి విద్యలు ప్రసాదించమని దేవిని ప్రార్ధించి మూర్చపోతుంది విద్యాధరి. కాలుడు పిచ్చివాడైనా అతడికి రూప సౌందర్యం, హృదయ సౌందర్యం కూడా ఉన్నాయి. తనకు విద్య లేకుంటే భార్య బ్రతుకదని తెలిసి భార్య కోసం తనకు విద్యలు ప్రసాదించమని అమాయికంగా దేవిని వేడుకుంటాడు. తల నేలకేసి కొట్టుకుంటాడు. దేవి ప్రత్యక్షమై అతనికి సమస్త విద్యలూ ప్రసాదించి అంతర్హిత మవుతుంది. కాలుడు దివ్య జ్ఞానమూర్తియై, కాళిదాసుడై, పూర్వస్మృతి కోల్పోయి విశాల విశ్వంలోనికి వెళ్ళిపోతాడు. రఘువంశం వ్రాసి మహాకవి అవుతాడు. విద్యాధరి మూర్ఛ తేరుకుని భర్త జాడ కానక పురుష వేషంలో అతడిని అన్వేషిస్తూ బయలుదేరి ధారానగరంలో భోజమహారాజు ఆస్థానంలో భర్తను చూస్తుంది. కాని అతనికి పూర్వస్మృతి లేనందుకు చింతిస్తూ, అతనికి సేవచేస్తూ, కన్యగానటిస్తూ అతని ప్రేమ కోసం అలమటిస్తూ వుంటుంది. కాళిదాసు ఆమెను ప్రేమిస్తాడు. ఒకరోజు ఆమె మెడలో మంగళ సూత్రాలు చూచి తన పొరపాటుకు చింతిస్తాడు. భరించలేని ఆ వియోగావస్థలో, ప్రోషిత భర్తృక యైన ఆమె స్థితినీ ఎక్కడో ఉన్నాడనుకొంటున్న ఆమె ప్రియుని విరహ దైన్యాన్నీ ఊహించుకొని మేఘసందేశం కావ్యాన్ని రచించాడు.

Picture

బాల్యం నుంచీ నిరంతరం భర్తృధ్యానంలో మునిగిపోతూ, అన్యధ్యాస ఎరుగని పార్వతీదేవి స్థితినీ, చనిపోయిన సతీదేవియే పార్వతిగా జన్మించి ఎదుటికి వస్తే, గుర్తించలేక విరహపడిన శివుని స్థితినీ ఊహించి కుమార సంభవ కావ్యాన్ని రచించాడు. ఇక్కడ కూడా విద్యాధరి విరహావస్థయే అతనికి ప్రేరణ అయింది. వివాహం చేసుకుని కూడా భార్యను కాదన్న దుష్యంతుడు నాయకుడుగా అనర్హుడైనా, భోజరాజు ప్రోత్సాహం వల్లనూ, శాపమో వరమో కారణమైతే అతని తప్పు ఉండదు కదా అని విద్యాధరి సూచించటం వల్లనూ, దుర్వాసుని శాపాన్ని, అంగుళీయక వృత్తాంతాన్ని, కల్పించి శాకుంతల నాటకాన్ని రచించాడు. కాళిదాసు నిజ జీవితానికి ఇదీ ప్రతిబింబమే. వివాహ సమయంలో మామగారు వ్రేలి నుంచిన ఉంగరంతో కాళిదాసుకు పూర్వస్మృతి కలుగుతుంది. భార్యను స్వీకరిస్తాడు.

రచన

చిత్రం మరీ నాసిరకం అయితే, సూచనలివ్వటం, చిన్న చిన్న లోపాలను ఎత్తి చూపడం వృధా అవుతుంది. ఒక్క మాటలో 'చెత్త' అని తేల్చి వేయవచ్చును. చిత్రం ఎంతో ఉత్తమంగా వుంటే, అందులో ఏమైనా చిన్నలోపాలు దొరలితే, ఇవి కూడా లేకుంటే ఇంకా ఎంత బావుండేది' అనిపిస్తుంది - చిత్రంలో సంభాషణలు విపరీతంగా గుప్పించటం పింగళివారికి ఆనవాయితీగా వస్తున్న అలవాటు. సంభాషణలు తగ్గిన కొద్దీ చిత్రానికి ఉదాత్తత పెరుగుతుంది. ఇక 'కాళిదాసు' విషయంలో, కనీసం చిత్రం ఉత్తరార్ధంలోనైనా కొంచెం సంభాషణలు తగ్గితే బాగుండుననిపించింది. చిత్రంలో ఎక్కడా రెండు నిముషాల పాటు అయినా నిశ్శబ్దంగా ఉండదు. మహాకవి కాళిదాసు కూడా కొద్ది సేపయినా మౌనంగా ఉండడు - రెండవది. వరం పుచ్చుకున్న తర్వాత కాళిదాసు తిరిగి ఒక్క మారైనా కాళిమాతను స్మరించినట్లు చూపలేదు - మూడవది. ఋతుసంహారం, మాళవికాగ్ని మిత్రం, విక్రమోర్వశీయం వంటి కావ్యాలను కనీసం ఒక్క మాటలోనైనా ప్రస్తావించకపోవటం. ఇది స్థలాభావం వల్ల కావచ్చును. అన్ని కావ్యాలకూ, ప్రేరణలనూ, సన్నివేశాలనూ కల్పించక పోయినా, సూక్ష్మంగా మూడు నిమిషాలలో చూపే అవకాశం ఉంది. వివిధ ప్రకృతి దృశ్యాల నేపధ్యంలో, వివిధ మనః ప్రవృత్తులలో, వివిధ రకాల భావావేశాలతో, పారవశ్యంతో, ఆయన ముఖతః శ్లోకాలు ఆశువుగా, అమృతధారా వాహికంగా వెలువడుతున్నట్లు, విధ్యాధరి వాటిని లిపి బద్ధం చేస్తున్నట్లు, దినాలు, మాసాలు, ఋతువులు గడిచిపోతున్నట్లు, మహాకవి ఒక్కొక్క కావ్యంతో కైవల్యానికి ఒక్కొక్కసోపానం నిర్మిస్తున్నట్లు, జ్ఞానవృద్ధువుతున్నట్లు, మూడు నాలుగు నిమిషాల వ్యవధిలో చిత్రించవచ్చును. కానీ అట్టి ప్రయత్నం జరగలేదు.

నాల్గవది-శాకుంతల నాటక ప్రదర్శనకు కావ్య గౌరవం అబ్బలేదు. స్థాయి చాలా నిమ్నంగా ఉన్నది. దుర్వాసుని శాపం మినహా మిగతా దృశ్యాలన్నింటినీ చూపారు. భారతంలోని కథను అతిక్రమించి, కాళిదాసు స్వయంగా ప్రవేశ పెట్టిన ఘట్టం అది ఒక్కటే. ఆ సన్నివేశం లేకుంటే అది కాళిదాసు శాకుంతలం కాబోదు. విలాసవతి శకుంతల వేషం వెయ్యటం సబబుగానే వున్నది కానీ, కాళిదాసు దుష్యంతుని వేషం వెయ్యటం అంత ఉచితంగా లేదు. మరే వ్యక్తి అయినా ఆ పాత్రను ధరించి, నాటకాన్ని చూస్తున్న విద్యాధరి శకుంతల అవస్థలో తననూ, దుష్యంతుని పాత్రలో కాళిదాసునూ, రూపించుకొన్నట్లు, కాళిదాసుకు మాత్రం మామూలుగానే కనిపిస్తూన్నట్లు, చూపితే మరింత బాగుండేది. శాకుంతల నాటకాన్ని పింగళి వారు రచించిన తీరు కూడా మామూలు సినిమా పాటల థోరణిలోనే ఉన్నది.

దర్శకత్వం

ఇక చిత్రీకరణ విషయంలో, దర్శకుడు రచయితకు న్యాయం చేకూర్చటానికి శాయశక్తులా ప్రయత్నించటం వల్ల, రచనలోని లోపాలు కొన్ని దొరలక తప్ప లేదు. చిత్రం ఆద్యంతం ప్రతి దృశ్యం, ప్రతి 'ఫ్రేం' కూడా కళాత్మకంగా ఉంది. అయితే కొన్నింటిలో ఉండతగినంత బిగువు లేదు. కొన్ని దృశ్యాలు నిస్సహాయంగా, దర్శకుని వేళ్ళ మధ్య నుంచి పేలవంగా జారిపోయినట్లు, కనుపిస్తాయి. ఉదాహరణకు 'చకారకుక్షి' బొడ్డులో కాళిదాసు వ్రేలు పెట్టిన దృశ్యం ప్రేక్షకులలో ఇంకా ఎంతో ఉత్కంఠను రేపవలసింది. కానీ ఆ దృశ్యం నీరసంగా జారిపోయింది. అలాగే కవి రాక్షసుని హనుమంతుడు శిక్షించిన సన్నివేశం కూడా ఇంకా ఎంతో కట్టుదిట్టంగా, ప్రేక్షకులలో ఎంతో 'త్రిల్' కల్గించ వలసింది - రచనలోగానీ, దర్శకత్వంలో గానీ ఇటు వంటి చిన్న చిన్న లోపాలు చిత్రం ఉత్తరార్ధంలోనే దొరలాయి. పూర్వార్ధం దాదాపు లోప రహితంగా, నిర్దుష్టంగా ఉంది. ఏ చిత్రంలోనైనా చివరి చివరి సన్నివేశాలు ఎప్పుడూ తీరుబడిగా నడవ కూడదు. పాటలు, హాస్యాలు, నృత్యాలూ మొదలైనవి సాధ్యమైనంత వరకు పూర్వార్ధంలోనే ముగించేందుకు ప్రయత్నించాలి. కథ గడుస్తున్న కొద్దీ, పాటలను, పిట్టకథలనూ భరించగల ఒర్పు ప్రేక్షకులలో తగ్గుతుంది-ఈ చిత్రం చివరిలో కొన్ని పాటలు, నృత్యాలు లేకుంటే బావుండేదనిపించింది.

నటన

దేవదాసు, విప్రనారాయణ చిత్రాల తర్వాత నాగేశ్వరరావు కాళిదాసు పాత్రలో కళాకైవల్యానికి మరో సోపానాన్ని అధిగమించాడు. కాళిదాసు వంటి మహాపురుషుని పాత్రను స్వీకరించినందుకు ఆ పాత్రకు సాధ్యమైనంత (రచన, దర్శకత్వాల అవధిలో) న్యాయం చేకూర్చేందుకు, ఆయన చూపిన శ్రద్ధ, చిత్రరంగంలోని నటీనటులందరికీ గుణపాఠం కాగలదు. రచన, దర్శకత్వం లాగే, నాగేశ్వరరావు నటన ఉత్తరార్ధంలో కంటే పూర్వార్థంలో ఎక్కువగా రాణించింది. పామర భాషను పింగళి ఎంత అద్భుతంగా రచించారో, నాగేశ్వరరావు అంత అద్భుతంగా ఉచ్చరించాడు. పండితుడుగా కంటే పామరుడిగానే ఆయన నటన వీసమంత ఎక్కువ స్థాయిలో ఉందేమో ననిపించింది. నిజానికి పామరుడి పాత్రను నిర్వహించటమే కష్టమనిపిస్తుంది కూడా -

అసత్యం నుంచి సత్యంలోనికీ, అజ్ఞానాంధకారం నుంచి మిరుమిట్లు గొలిపే జ్యోతిర్మయ ప్రపంచంలోనికీ, సంకుచితత్వం నుంచి విశాలత్వంలోనికీ, కారణాతీతమైన ఏ దివ్య శక్తి వల్లనో ఒక్క ముహూర్త మాత్రంలో పరిణతిచెందిన మానవుని హావ భావాలను నాగేశ్వరరావు అపూర్వంగా, అద్భుతంగా ప్రదర్శించాడు. ముఖం గంభీరంగా, దివ్య తేజస్సుతో నిండిపోయింది. ఆ ముహూర్త కాలంలో మూర్ఘుడైన యువకుడు జ్ఞాన వృద్ధుడవుతాడు - 'రచయిత, దర్శకుల భావాలను యథాతథంగా ప్రతిబింబించగల అద్దం నాగేశ్వరరావు ముఖం' అనిపిస్తుంది. నటన విషయంలో, చిత్రం అంతటిలోనూ ఆ ఒక్క అంశం అత్యున్నత స్థాయిలో వున్నది. తర్వాత గడ్డం, మీసాలతో, రఘువంశం రచిస్తున్న దృశ్యంలో కూడా ఆ గంభీర భావం ద్యోతకమయింది. ఆ పైన క్రమంగా రచన, దర్శకత్వం లాగానే ఆయన నటన కూడా కొంచెం బలహీనమయింది.

శ్రీరంజని ఇది వరకెన్నడూ నటించనంత చక్కగా, నిండుగా, మితంగా ఈ చిత్రంలో నటించింది. రంగారావు, రేలంగి, సి.యస్.ఆర్. ప్రభృతులను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసింది ఏమీ లేదు. అందరూ అవధి మేరకు చక్కగా నటించారు. అంతా కలిసి ఉమ్మడిగా చిత్రాన్ని తిన్నగా గమ్యానికి చేర్చారు.

సంగీతం, నృత్యం, కళ

పెండ్యాల కూడా ఈ చిత్రంలో ఆయన పూర్వపు రికార్డును అధిగమించారు. పద్యాలూ, పాటలూ మొత్తం 28 లోనూ, చివరి రెండు మూడు మినహా మిగతా వన్నీ చాలా బాగున్నాయి. ప్రత్యేకంగా చెప్పుకోతగినవి 'ఛాంగు భళా', 'ఎందుకువేసిన వేషమయా', 'నీ కెట్టుందోగాని పిల్లా' మాణిక్య వీణాం మొదలయిన శ్లోకాలు, 'జయ జయ శారదా కళా విశారదా', 'ఔనులే ఔనౌనులే' అనే జావళీలు, వాటి నృత్యాలు కూడా చక్కగా వున్నాయి. ఇంత చక్కని నృత్యాలు ఈ మధ్య ఏ చిత్రంలోనూ లేవు. చిత్రంలో ప్రతి 'ఫ్రేం' కళాత్మకంగా ఉండటానికి గోఖలే గారి కళ చాలా తోడ్పడింది -

ఈ చిత్రం పండిత పామర జన రంజకంగా కీర్తినీ, ధనాన్నీ కూడా విశేషంగా ఆర్జించగలదు. నిర్మాతలు అభినందనీయులు.

నండూరి పార్థసారధి
(1960 ఏప్రిల్ 10వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post