Title Picture

అనగనగా ఒక ఊళ్లో కాంతం అనే పదహారేళ్ల పల్లె పడుచు అయస్కాంతంలా వయసు మీరిన వారిని సైతం ఆకర్షిస్తూ ఉంటుంది. పోకిరీరాయుళ్ళెవరూ ఆమె మీద కన్నూ, చెయ్యీ వేయకుండా అంగరక్షకుడుగా కాపాడుతుంటాడు వాళ్ళ అన్నయ్య రాజు. అతను జానకిరామయ్య అనే ముసలి జమిందారు దగ్గర పాలికావు. జమిందారు కూతురు శారద పట్నం నుంచి చదువు ముగించుకుని వచ్చిందే తడవుగా రాజును ప్రేమించటం ప్రారంభిస్తుంది. తన కూతురుని పచ్చగన్నేరుపాలెం బుచ్చిబాబుకు ఇచ్చి, పెళ్ళి చేయాలని జానకిరామయ్య గారి సంకల్పం. ఆ ఊళ్లో 'అగ్గిపిడుగు జగ్గడు' అనే అతి భయంకరుడైన రాక్షసుడొకడు సపరివారంగా కాపురమున్నాడు. 'నరవాసన' అంటూ అతను దాడి ప్రారంభించగానే ప్రజలు ఎక్కడి వాళ్ళక్కడ పారిపోయి ప్రాణాలు దక్కించుకునే వారు.

ఇలా ఉండగా, పట్నం నుంచి వచ్చిన బుచ్చిబాబు, అగ్గిపిడుగు జగ్గడు, ముసలి జమిందారు ఒకే ముహూర్తంలో కాంతం మీద కన్ను వేస్తారు. ఒకరోజున జగ్గడు, బుచ్చిబాబు, చెరోవైపున ఆమె వెంటపడతారు. ముగ్గురూ ఒకేచోట తారసపడతారు. బుచ్చిబాబును చితక తన్నేసి, కాలవలో పారేసాడు జగ్గడు. అహ్హాహ్హా... అంటూ కాంతం వంటి మీద చెయ్యి వేశాడు. ఇంతలో 'దుష్టుడా, నిలునిలు మంటూ రాజు అరుదెంచాడు. ఇద్దరూ కుస్తీ పట్టారు. రాజు గెలిచాడు. 'ఖబర్దార్' అంటూ చెల్లెలును తీసుకుని వెళ్ళిపోయాడు.

కథను ఇక్కడ ఆపుచేసి, ''అగ్గిపిడుగు అంతమగునా? జానకిరామయ్య ముచ్చట తీరునా? రాజు, శారదల ప్రేమ ఫలించునా? చివరి కేమగును?'' అని ప్రశ్నలు వేస్తే-

"మిగతా కథ వెండి తెరమీద చూడ నక్కరలేదు. జగ్గడు చచ్చును, రాజు శారదను, కాంతం బుచ్చిబాబును పెళ్ళి చేసుకుందురు" అని పప్పులో కాలువేస్తారు చాలా మంది ప్రేక్షకులు.

జరిగిందేమంటే - జగ్గడు బలాత్కారముగా కాంతమును పెళ్ళి చేసుకొనుట, భర్త చేతిలో ఆమె నానాహింసల పాలగుట, చివరికి ఆమె పాతివ్రత్య మహిమవలన అతను సత్పురుషుడగుట, రాజు శారదను వివాహం చేసుకొనుట, బుచ్చిబాబును ఒక పల్లెపడుచు బలాత్కారముగా వివాహమాడుట.

తలవని తలంపుగా కథలో వచ్చే ఈ మలుపే ఈ చిత్రంలో విశేషం, కేవలం కథ కోసమే కాక, కాంతం పాత్రధారిణి దేవిక నటనకోసం కూడా చిత్రాన్ని తప్పక చూడవచ్చును. ఆమె తెరపై కనుపించినంత సేపూ ప్రేక్షకులు సేదతీరవచ్చును. కరుణరసానికి దేవిక, హాస్యరసానికి చలం, శృంగార రసానికి (దక్షిణాది) మీనాకుమారి, రౌద్ర భీభత్స భయానక రసాలకు రాజనాల, వీరరసానికి రమణమూర్తి - ఇందులో ప్రాతినిధ్యం వహించారు.

తెరకు దగ్గరగా కూర్చునేవారు ఆనందంపట్టలేక ఈల కొట్టేంత జోరుగా నటించాడు రాజనాల (అగ్గిపిడుగు). రాజుగా రమణమూర్తి, శారదగా మీనాకుమారి నటించారు. నేటి తెలుగు చిత్రాల స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా, తమకు బాగా అలవాటయిన థోరణిలో దర్శకుడు విఠలఆచార్య తీర్చిదిద్దారు. రచయిత: జి.కృష్ణమూర్తి; సంగీతం: రాజన్-నాగేంద్ర; పి.బి.శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది, సుశీల, జానకి పాటలు పాడారు.

నండూరి పార్థసారథి
(1960 జూన్ 19వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Previous Post Next Post