Title Picture

దుష్ట శిక్షణ శిష్ట రక్షణా తత్పరుడు, బుద్ధదేవుడు, టాగూరుల అడుగు జాడలలో నడచుకొనువాడూ, రూపజిత మన్మధుడు, సకల విద్యా పారంగతుడు, హోర్మోనియం, వేణువు, మృదంగం, సితారీత్యాది వివిధ వాద్య ప్రవీణుడు, అయిన ఒక సకల సద్గుణ సంపన్నుడిని, ఈ లక్షణాలన్నీ గల ఒక సినీ నాయిక ప్రథమ వీక్షణముననే ప్రేమించుట, అనంతరం వారిరువురూ, చిలకాగోరింకలవలె సైకిళ్ళపై షికారు చేయుట, డ్యూయెట్లు పాడుట, బీచిలో పుట్ బాల్ ఆడుకొనుట, జలక్రీడలు చేయుట, అహో రాత్రములు తియ్యని కలలు కనుట, ఈ చర్యలను సహించక ఒక విలను వాంప్ తో కలిసి కుట్ర పన్నుట, దుండగములు చేసి హీరో పైకి వాటిని నెట్టుట, నాయకీ నాయకులు పెక్కు కష్టములకు లోనగుట, నేపథ్యములో శివరంజనీ రాగము శహనాయిచే ఉచ్ఛైస్వనమున ఊదబడుట, బఫూను గంతులు వేయుట, క్లైమాక్సు నందు విలను విఫలుడై చనిపోవుట, ప్రేమికులు తిరిగి మొదటి డ్యూయెట్ ను పాడుకొనుట మున్నగు పాత సన్నివేశముల కుప్ప శారదా వారి 'బస్ కండక్టర్'.

నాయకుడుగా ప్రేమ్ నాథ్, నాయికగా శ్యామా, విలన్ గా అమర్ నాథ్, హాస్యనటుడిగా మారుతి యధోచితంగా నటించారు. బిపిన్ బాబుల్ సంగీతం తధోచితంగానే ఉంది. ఉన్న వాటిలో గీతాదత్, సుధామల్హోత్రాలు పాడిన రెండు పాటలు బాగున్నాయి. మిగతావి మరీ అల్లరీ ఆగంగా ఉన్నాయి. పాటల కంటే నేపథ్య సంగీతం కొంత బావుంది. ముఖ్యంగా సితార్ వాద్య సంగీతం.

సంగీత సాహిత్య శిల్ప నృత్యాలకూ, రొమాన్సు స్టంటు, సస్పెన్సు, హ్యూమర్, సింపతీ మొదలయిన రసాలకూ ఈ చిత్రంలో జాగా ఉంటుందని పైన వివరించిన సన్నివేశాల జాబితా వల్లనే తెలుస్తుంది.

సన్నివేశాలు క్రొత్తగా లేక పోయినా, ఓ మోస్తరు కన్నుల పండువుగా, వీనుల విందుగానే ఉండటం వల్ల, డబ్బులు పెట్టుకుని సినిమాకి వెళ్ళిన వారెవరూ, నిరుత్సాహపడరు. శ్యామా చాలా అందంగా ఉంది. ఇది వరకు ఎన్నో సార్లు ధరించిన పాత్రనే నటిస్తున్నట్లు, దుఃఖం, ఆనందం వగైరాలూ, సంభాషణలూ కంఠోపాఠంగా వచ్చేసినట్లు, పదో ఎక్కం అప్ప చెప్పినట్లు నటించింది.

దర్శకుడు ద్వారకాఖోస్లా. ఈ చిత్రం జనాన్ని ఆకర్షిస్తుందనటానికీ, ఆర్థికంగా విజయవంతం కాగలదనడానికీ ఏమీ సందేహం లేదు.

నండూరి పార్థసారథి
(1960 ఫిబ్రవరి 21వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Previous Post Next Post