Title Picture

నూటికి నూరు పాళ్లూ ఈ చిత్రం యువజన మనోరంజకంగా తయారైంది. కళా ప్రమాణాలను గురించి, నైతిక విలువలను గురించి, ఆట్టే పట్టింపులేని వారికి, కాలక్షేపమే ప్రధానమైనవారికి ఇది అమృతోసమానమైన చిత్రం. దర్శక, నిర్మాతల సంకల్పం పూర్తిగా సిద్ధించింది. ఎందుకంటే వారు చెప్పదలచుకున్నది ఏదైనా సూటిగా వేగంగా, చచ్చులేకుండా చెప్పగలిగారు.

ఈ చిత్రానికి కథ ప్రధానం కాదు. సింగపూరు రబ్బరు ఎస్టేటులో ఒకచోట ఎక్కడో నిక్షిప్తధనం ఉందిట. అందుకోసం నాయకునికీ, దుండగుల ముఠాకూ మధ్య తగాదా ఏర్పడుతుంది. చివరికి దుండగులు చచ్చి, నాయకుడు, అతని నాయిక, వారి అనుచరులూ హాయిగా ఉంటారు. రాక్కెన్ రోళ్లకు, పిస్తోలు యుద్దాలకు బోలెడు సస్పెన్సుకు, శృంగార సన్నివేశాలకు ఆలంబనంగా మాత్రమే ఈ కథను స్వీకరించారు.

ఆచార్య వినోబా భావే లాటివారు ఈ చిత్రం చూస్తే సత్యాగ్రహం చేసే ప్రమాదం ఉన్నదనిపిస్తుంది. సింగపూర్ లో సిగ్గు ఎరగని పడుచు పిల్లలు తప్ప మరెవరూ ఉండరేమో నన్న అపోహ కలిగేటట్లు చిత్రించారు దర్శకులు. పాస్ పోర్టుల పేచీ లేకపోతే ఈ చిత్రం చూసిన యువకులలో చాలా మంది తండోపతండాలుగా సింగపూరుకు మూటా ముల్లే సర్దేస్తారు. సింగపూరు యువతుల జలక్రీడా దృశ్యాలు యువకులకు ప్రత్యేకాకర్షణ. ఇటువంటి చిత్రానికి శంకర్ జై కిషన్ సంగీతం కూర్చడం యుక్తంగానే ఉంది. ఉన్న ఏడు పాటలలోనూ రెండు బాగా ఉన్నాయి. మిగతావి బాగానే ఉన్నాయి. ఈ చిత్రం కోసం సింగపూరు సంగీతంలో శంకర్ జైకిషన్ ప్రత్యేకంగా కృషి చేసినట్లున్నారు. పాటల వరుసలన్నీ చక్కగా ఉన్నా, ఎకార్డియన్ల రొద, ట్రంపెట్ల సొద కొంత చిరాకు కల్గిస్తాయి. శబ్దం అతిగా ఉంది.

ఈ మధ్య విడుదలైన చాలా హిందీ చిత్రాలలో వలె, ఇందులో కూడా ఛాయాగ్రహణం చాలా బాగుంది. సింగపూరు దృశ్యాలు కన్నుల పండువుగా ఉన్నాయి.

షమ్మీకపూర్ తన మామూలు ధోరణిలో పైలా పచ్చీస్ గా నటించాడు. పద్మిని, శశికళ, ఆగా చక్కగా నటించారు. ట్రేడ్ మార్క్ విలన్ పాత్రను కె.ఎన్. సింగ్ ధరించాడు. బట్టీ పట్టిన పద్యాన్ని అప్పజెప్పినంత ధారాళంగా ఉంది అతని నటన. మరియా మనాడో అనే ఒక సింగపూరు తారను ఇందులో పరిచయం చేశారు. ఆవిడలో ప్రత్యేక విశేషం ఏమీ లేదు.

నిర్మాత : ఎఫ్.సి. మెహ్రా; దర్శకత్వం : శక్తి సామంత; సంగీతం : శంకర్, జై కిషన్; మాటలు : వ్రజేంద్రగౌర్; పాటలు : శైలేంద్ర, హస్రత్; స్క్రీన్ ప్లే : క్వమార్ జలాలాబాది; ఛాయా గ్రహణం : ద్వారకా దివేచా; కథ : సురీందర్; నేపథ్యగానం : లతా, రఫీ, ముఖేష్; తారాగణం : షమ్మీకపూర్, పద్మిని, శశికళ మరియా మనాడో, కె.ఎన్. సింగ్, మదన్ పురి, ఆగా, హెలెన్.

నండూరి పార్థసారథి
(1960 నవంబరు 13వ తేదీన ఆంధ్రప్రభ సంచికలో ప్రచురితమైనది)

Previous Post Next Post