Title Picture

ఉత్తర హిందూస్థానంలో శతదినోత్సవాలు, రజతోత్సవాలు చేయించుకున్న అంజలీ పిక్చర్సు వారి 'సువర్ణసుందరి' హిందీ చిత్రం ఈ నెల 24వ తేదీన ప్రప్రథమంగా ఆంధ్రదేశంలో విడుదల అయింది. ఈ చిత్రం అంతకు ముందు తెలుగులో నిర్మించబడి ఆంధ్రప్రదేశ్ లో రజతోత్సవాలు చేయించుకున్న విషయం పాఠకులకు విదితమే. 'సువర్ణసుందరి' తెలుగు చిత్రం రెండవ సారి కూడా ఆంధ్రదేశంలో విడుదలై విశేషంగా ధనం ఆర్జించింది. ఈ హిందీ చిత్రం ఉత్తరాదిన మూడు సంవత్సరాల క్రితమే విడుదల అయింది. ఈ చిత్రాన్ని హిందీలోకి డబ్ చేయకుండా కొందరు అగ్రశ్రేణి బొంబాయి తారలను కూడా చేర్చి పునర్నిర్మించారు. ఉత్తరాది మార్కెట్ లో ఇంత ఘన విజయాన్ని సాధించిన దక్షిణాది చిత్రం మరొకటి లేదు. ఈ చిత్రంలో ఆదినారాయణరావు కూర్చిన సంగీతం ఉత్తరాది శ్రోతల విశేషాదరణకు పాత్రమయింది. ఆ సంవత్సరం బొంబాయి ఫిలిం ఫ్యాన్స్ సంఘం వారు ఆదినారాయణరావును ఉత్తమ సంగీతదర్శకునిగా ఎన్నుకున్నారు.

ఆదినుండి అంతం వరకు ఒక్క అంగుళం మేర నయినా విసుగుపుట్టించకుండా బిగువయిన కథా గమనంతో, చక్కని నృత్యాలతో, కమ్మని పాటలతో, లలితమైన హాస్యంతో ప్రేక్షకులను అలరించగల సుదీర్ఘమయిన జానపద చిత్రం 'సువర్ణసుందరి'. సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. 'కుహూ కుహూ బోలే కోయలియా' అన్న రాగమాలిక, 'ముఝేనాబులా' అన్న పాట చాలా కాలం వరకు జ్ఞప్తికి ఉండేది. ఆర్కెష్ట్రా హోరు లేకుండా నిజమైన శ్రావ్యత గల పాటలు అవి. వాటి రచన (అనువాదం) కూడా చాలా హాయిగా ఉంది.

Picture
నాగేశ్వరరావు, అంజలీదేవి

తెలుగు సినిమా అభిమానులంతా రెండేసి సార్లు, మూడేసి సార్లు, చూసేసిన ఈ చిత్రంలో కథను గురించి ఇక్కడ తిరిగి రాయాల్సిన అవసరం లేదు.

కథను రసవత్తరంగా చెప్పగల శక్తి సామర్ద్యాలు దర్శకునిలో ఉంటే, చిత్రం నిడివి ఎంత ఉన్నా, ప్రేక్షకులకు అభ్యంతరం ఉండదనీ, నిడివి ప్రశ్న లేనే లేదని ఈ చిత్రం నిరూపిస్తూంది. అందరూ కాలక్షేపానికి ఒకసారి తప్పక చూడదగిన చిత్రం-హిందీ 'సువర్ణసుందరి'.

నిర్మాత, సంగీతం దర్శకుడు: ఆదినారాయణరావు; దర్శకుడు: వేదాంతం రాఘవయ్య; కెమెరా: రహమాన్, సి. నాగేశ్వరరావు; నృత్యం: హీరాలాల్, వెంపటి; తారాగణం: నాగేశ్వరరావు, అంజలీదేవి, శ్యామా, కుంకుం, ఆగా, ముక్రీ, రాధాకిషన్, గుమ్మడి, డైసీ ఇరానీ వగైరా.

నండూరి పార్థసారథి
(1961 సెప్టెంబర్ 3వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post