Title Picture

నిన్నటి తెలుగు మేకు నేటి హిందీ రీమేకు

భారతీయ చలన చిత్ర చరిత్రలో ఇది రీమేకుల యుగం అంటే జోకుకాదు. మన చిత్రసీమ నిజంగానే ఇప్పుడు మూడు మేకులు ఆరు రీమేకులుగా వర్థిల్లుతున్నది. నిన్నటి తెలుగు మేకు నేటి హిందీ రీమేకు. అదే రేపటి కన్నడమేకు. తెలుగులో తీసిన పదేళ్ళకి హిందీలో తీసి, దాన్నే మళ్ళీ పదేళ్ళకి తెలుగులో తీసిన సందర్భాలున్నాయి. వాటిని రీరీమేకులు అనవచ్చు.

తెలుగులో వచ్చిన 'ధర్మాత్ముడు' చిత్రానికి హిందీనకలు 'మేరాసాథీ'. రాఘవేంద్రరావు దర్శకత్వంలో పద్మాలయా వారు తీసిన జయప్రద చిత్రరాజం ఇది. ఇటీవల వచ్చిన అనేక రీమేకులతో పోల్సితే ఇది కొంత నయం. ఇందులో చెప్పుకోవడానికి కథంటూ కాస్త ఉంది. మసాలా సంగతి సరేసరి. జితేంద్ర ఉండగా డిషుండిషుంకీ, జయప్రద ఉండగా గ్లామరుకూ కొదవేమున్నది!

విజయం సాధించే ప్రతి జితేంద్ర వెనకా ఒక జయప్రద ఉంటుందనేది ఈ కథ సారాంశం. రంగా అనే రౌడీని రాగిణి అనే అమ్మాయి మరమ్మతు చేసి పెళ్ళి చేసుకుంటుంది. అతను స్టంటు మానేసి బుద్ధిమంతుడైపోతాడు. హీరో అలా చేతులు ముడుచుకూర్చుంటే హాల్లో జనానికి బోర్ కొడుతుందికదా. బహుశా హీరోయిన్ కి కూడా బోర్ కొట్టినట్టుంది. అందుకని అత్యాచారం చేయడం పాపమైతే అత్యాచారాన్ని సహించడం మహాపాపం అని ఒక నినాదం అందించింది. ఇదే ఛాన్సు అని హీరో మళ్ళీ డిషుండిషుం చేసి దుండగులను చితక్కొట్టి ప్రేక్షకుల ఈలలను చూరగొంటాడు.

'కార్మికరంగా'గా మారిన రవుడీరంగా కాసినిరీళ్ళు గడిచాక ఫ్యాక్టరీ యజమానిగా సూటూ బూటూతో, నాజూకుగా కాస్త నెరిసిన జుట్టుతో ప్రత్యక్షమవుతాడు. హీరోయిన్ గ్లామరు మాత్రం చెక్కు చెదరదు. అప్పటికే వాళ్ళకో పెళ్ళీడు కూతురు. ఆ పిల్ల శ్యామ్ అనే పిల్లాణ్ణి ప్రేమిస్తుంది. ఆ పిల్లాడు విలన్ చెప్పుచేతల్లో ఉంటాడు. రంగామీద కక్ష సాధించడానికి విలన్ ఆ పిల్లాడికీ పిల్లకీ పెళ్ళయే దాకా వూరుకుని తర్వాత విజృంభిస్తాడు. అతని పథకం ప్రకారం జూనియర్ హీరో జూనియర్ హీరోయిన్ ని కాల్చుకుతింటూ ఉంటాడు. చివరికి కష్టాలన్నీ మంచులా కరిగిపోయి అందరూ నవ్వుతూ గ్రూపు ఫొటో తీయించుకుంటారు.

నండూరి పార్థసారథి
(1985 సెప్టెంబరు 23వ తేదీన ఆంద్రప్రభ బెంగుళూరు ఎడిషన్ లో ప్రచురితమయింది)

Previous Post Next Post