Title Picture

'న్యూసినిమా'ను మన ప్రభుత్వం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుందా?

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా రాజధానిలో-చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి పరచాలను కోవడంలో మొదటి నుంచి ప్రభుత్వపు లక్ష్యం ఒక్కటే-మద్రాసు నుంచి తెలుగు సినీరంగాన్ని మన రాష్ట్రానికి తరలించడం. తెలుగు సినిమాలు చూసేదీ, వాటికి డబ్బు ఇచ్చేదీ మన రాష్ట్రంవారైతే, ఈ డబ్బునంతటినీ తమిళనాడులో ఖర్చుపెట్టడం, తమిళనాడు ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చడం ఏం న్యాయం? మన ప్రజలు చెల్లించే డబ్బు మన రాష్ట్రంలోనే ఖర్చు కావాలి. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఈ మాటే చేప్పారు. ఇది న్యాయమే. తెలుగు చిత్రాలు తెలుగు దేశంలోనే తయారు కావాలి. కాదని ఎవరూ అనరు. కాని, అసలు మన చిత్రాల నాణ్యాన్ని పెంచడానికి గాని, మద్రాసులోని సినీజనంపై ఆధారపడకుండా హైదరాబాద్ లో స్వతంత్రంగా ఒక నూతన చలనచిత్ర రంగాన్ని నెలకొల్పడానికి గాని మన ప్రభుత్వం ఎప్పుడూ ప్రయత్నించలేదు. కడచిన 15 సంవత్సరాలలో హైదరాబాద్ లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం వేసిన పథకాలలోని అవాస్తవిక దృక్పథానికి ప్రత్యక్ష నిదర్శనంగా 'బహ్మానంద చిత్రపురి' మిగిలింది. ఇప్పుడు దాని సంగతి మాట్లాడేవారు లేరు. అగ్రనటులిద్దరూ నగరంలో తమ సొంత స్థలాల్లో స్టూడియోలు నిర్మిస్తున్నారు. ఇదివరకటి రెండు స్టూడియోలను పునరుద్ధరించితే మొత్తం నాలుగు స్టూడియోలు అవుతాయి. ప్రస్తుతానికి అవిచాలు. కొత్తగా ఎవరైనా స్టూడియోలు నిర్మించదలచినా 'బ్రహ్మానంద చిత్రపురి'దాకా పోరు. చిత్రపురి కోసం ఖర్చుచేసిన లక్షలన్నీ వృధా.

ఉత్తమ చిత్రాల నిర్మాణానికి

అదంతా పూర్వగాథ. ఇప్పటి సంగతి చూద్దాం. టూకీగా చెప్పుకోవాలంటే చలనచిత్ర అభివృద్ధి సంస్థచేసే పనులివి : (1) ''స్టూడియోలు, లాబొరేటరీలు, థియేటర్లు నిర్మించేవారికి ఋణసహాయం అందజేస్తుంది. ఒక్కొక్క స్టూడియో నిర్మాణానికి పాతిక లక్షలవరకు ఋణం ఇస్తుంది, (2) ఔట్ డోర్ షూటింగ్ యూనిట్ సమకూర్చుకొని, అడిగినవాళ్ళకు అద్దెకు ఇస్తుంది, (3) ఔట్ డోర్ షూటింగ్ కోసం డామ్ ప్రవేశాలను, ఇతర పిక్నిక్ స్థలాలను అందంగా అభివృద్ధిపరుస్తుంది, (4) డాక్యుమెంటరీలు, వార్తాచిత్రాలు నిర్మిస్తుంది, (5) కొంతకాలం తర్వాత ముడిఫిలిం ఇతర సామగ్రి సరఫరా బాధ్యత కూడా స్వీకరిస్తుంది, (6) నాటక శాలల నిర్మాణానికి కూడా ఋణ సహాయం అందజేస్తుంది, (7) చలనచిత్రాలకు బహుమతులు ఇవ్వడం, రాష్ట్రంలో నిర్మించే చిత్రాలకు సబ్సిడీ ఇవ్వడం, చలన చిత్రోత్సవాలు నిర్వహించడం వంటి-ఇంతకు ముందే జరుగుతున్న పనులను కూడా స్వీకరిస్తుంది.

ఈ సదుపాయాలన్నింటి ద్వారా 'ఉత్తమ' చిత్రాల నిర్మాణాన్ని ఆ సంస్థ ప్రోత్సహిస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా కేంద్ర మంత్రి వచ్చి తెలుగు చిత్రాల తీరును ఈసడించినప్పుడు 'అవును, మనం ఇక నుంచి మంచి చిత్రాలు తీయాలి' అని మాటవరసకి అనడమే తప్ప, తెలుగులో నిజంగా మంచి చిత్రాలు రావడం లేదని మన ప్రభుత్వం అనుకోవడం లేదు. హిందీ నుంచి, కన్నడం నుంచి, తమిళం నుంచి అనువదించిన ఉత్తమ చిత్రాలకు ప్రభుత్వం శాయశక్తులా బంగారు నందులు, వెండి నందులు, కంచునందులు ఇస్తూనే వుంది.

అగ్రనటుల స్టూడియోలు సిద్ధమైతే హైదరాబాదులో చిత్రనిర్మాణం జోరు పెరుగు తుందనడంలో సందేహం లేదు. పాత స్టూడియోలు మళ్ళీ పుంజుకుంటాయి. కొత్త వాళ్లు వచ్చి ప్రభుత్వ సహాయంతో స్టూడియోలు, లాబొరేటరీలు నెలకొల్పుతారు. ఫలితంగా ఇక తెలుగులో 'దసరా బుల్లోడు', 'దొరబాబు', 'నిప్పులాంటి మనిషి', 'దేవుడు చేసిన మనుషులు', 'పండంటి కాపురం' వంటి ఉత్తమ చిత్రాలు, 'అత్యుత్తమ' చిత్రాలు, 'సంచలనాత్మక' చిత్రాలు, 'విప్లవాత్మక' చిత్రాలు, 'కళాఖండాలు' లెక్కకు మిక్కిలిగా వెలువడుతాయి. ఆ వైభోగం చూడటానికి మనకు వెయ్యికళ్లు చాలవు. ఈ రకం సినీవ్యాపార వటవృక్షం నీడలో 'న్యూసినిమా' అసలు మొలకెత్తుతుందా?

బాక్సాఫీసు ఫార్ములా

'న్యూ సినిమా' అంటే ఏమిటి? దాని గొప్పేమిటి? ఇప్పుడు దాని అవసరం ఏమిటి? కమర్షియల్ చిత్రాలకు వచ్చిన తెగులు ఏమిటి? ఇవి-'న్యూ సినిమా' సంగతి సరిగా తెలియనివాళ్ళు తరచుగా అడిగే ప్రశ్నలు. క్షుణ్ణంగా చర్చించాలంటే వీటిని గురించి ఒక గ్రంథం రాయవలసి ఉంటుంది. ఇక్కడ టూకీగా వీటి సంగతి చెప్పుకుందాం. సినిమాలు చూస్తున్న వారిలో అత్యధిక సంఖ్యాకులు పేదవారు, ఆట్టే విద్యాగంధం లేనివారు. సినిమాకంటే చౌకగా లభించే వినోదసాధనం మరొకటిలేదు. కనుక వారు సినిమాలు చూస్తున్నారు. మన చిత్ర నిర్మాతలు వారి సంస్కారపు స్థాయిని పెంచే ప్రయత్నం ఏ మాత్రం చేయకుండా వారికి చౌకబారు వినోదం అందించి, తేలిగ్గా డబ్బు చేసుకోవడం కోసం కొన్ని చిట్కాలు-మసాలాద్రవ్యాలు-కనిపెట్టారు. ఇవి రెండర్థాల బూతు పాటలు, కేబరే డాన్సులు, వెకిలి హాస్యం, రేప్ సీనులు, స్టంటు మొదలయినవి-బాక్సాఫీస్ ద్రవ్యాలుగా చెలామణీ అవుతూ మన చలన చిత్ర సామ్రాజ్యాన్ని నిరంకుశంగా పాలిస్తున్నాయి. కథ ఏదయినా, అసలుకథే లేకపోయినా, ఇవన్నీ తప్పనిసరిగా ఉంటున్నాయి. ఈ చిట్కాలన్నింటినీ పామర జనరంజకంగా తగు మోతాదుల్లో మేళవించుకోవడమే బాక్సాఫీస్ ఫార్ములా. ఈ ఫార్ములా రానురాను వెర్రితలలు వేయడంతో మన చిత్రాలు పరమ అవాస్తవికంగా, కృతకంగా తయారైనాయి. సామాన్య ప్రజలను బ్రెయిన్ వాష్ చేయడం ద్వారా ఈ చిత్రాలు మన సంస్కృతికి చేస్తున్న ద్రోహం ఇంతా అంతా కాదు. ఈ చిత్రాలకు 'మెలోడ్రామా' వెన్నెముక లాటిది. ప్రతిదాన్నీ భూతద్దంలో నుంచి చూపించి, 'అతి'గా, అఘాయిత్యంగా చెప్పడం మెలోడ్రామా లక్షణం.

ఫార్ములా చిత్రాలన్నీ చౌకబారువి, కృతకమైనవి కానక్కర్లేదు. పామర జనరంజన కోసం కథకు సంబంధంలేని 'బాక్సాఫీస్ సన్నివేశాల'ను కృత్రిమంగా చొప్పించనవసరం లేకుండానే సహజంగా కథలో ప్రేక్షకులను ఆకట్టుకోగలిగిన సత్తా ఉండవచ్చు. కథకు స్వతస్సిద్ధంగానే ఒక విధమయిన ఫార్ములా ఉండవచ్చు. అప్పుడు ఆ చిత్రం కృతకంగా కనిపించదు. అటువంటి చిత్రాలు హాలీవుడ్ లోనూ, తెలుగులోనూ కూడా ఒకప్పుడు చాలానే వచ్చాయి. ఒకప్పటి వాహినీ చిత్రాలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాని, ఇప్పుడు మన చిత్రాలలో ఫార్ములా క్లోజప్ లోనూ కథ లాంగ్ షాట్ లోనూ కనిపిస్తున్నాయి. ఫార్ములాకు కథ ఒక ఉపాంగం లాగా తయారయింది. అసలు సినిమా తీయాలన్న సంకల్పం బుర్రలో పుట్టగానే, నిర్మాతగారు, దర్శకునితో చర్చించే మొట్టమొదటి విషయం సినిమాలో ఉండవలసిన హంగులు-అంటే ఫలానా తారలు, ఫలానా చోట ఔట్ డోర్ షూటింగ్ (కాశ్మీరా, సింగపూరా, లండనా అనేది జేబులో డబ్బు మీద ఆధారపడి ఉంటుంది-కథనుబట్టి కాదు).

కమర్షియల్ చిత్రాలను సమర్థించే వారి ఫేవరిట్ వాదం ఒకటి ఉంది. 'నిత్యజీవితంలోని బరువు బాధ్యతలను, సమస్యల చీకాకులను మరచిపోయి, కాసేపు ఉల్లాసం పొందడానికి, సేదతీరడానికి, హాయిగా ఊహాలోకంలో విహరించడానికి పేద ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బులిచ్చి సినిమాలు చూస్తున్నారు. ఇటువంటి బాక్సాఫీస్ హంగులున్న చిత్రాలే వారి డబ్బుకు పూర్తి విలువను ఇవ్వగలుగుతాయి. బోరుగా ఉండే 'న్యూసినిమా' చిత్రాలను చూడడం డబ్బు దండుగపని. డబ్బులిచ్చి, తలనొప్పి కొనితెచ్చుకోవడమే'-ఇది వారి వాదం. శ్రమను మరపించే ఉల్లాసం, వినోదం అందరికీ అవసరమే. సేద తీర్చడానికి చల్లని పండ్లరసం ఇవ్వాలా? విస్కీబాటులు ఇవ్వాలా? మొదటిదానికంటే రెండోది కొంచెం ఎక్కువగా మనస్సుకు విశ్రాంతి నిస్తుందేమో. కాని, మొదటిది, ఆరోగ్యకరమైన పద్ధతి రెండోది అనారోగ్యకరమైనది, బలహీనపరచేది. మన కమర్షియల్ చిత్రాలు అందించేది విస్కీ బుడ్డీ వినోదం. సేదతీరడంలో తప్పులేదు; ఊహాలోకంలోనూ తప్పులేదు; కాని, ఊహాలోకంలో విహరిస్తూ వాస్తవ జగత్తును మరచిపోవడం ప్రమాదకరం. మన చిత్రాలు ప్రజల వాస్తవ దృష్టిని మందగింపజేస్తున్నాయి. నిషా తలకెక్కించి ప్రపంచం అంతా పచ్చపచ్చగా కనిపించేటట్లు చేస్తున్నాయి. నిషా దిగిపోగానే మామూలు సమస్యలన్నీ ఎదురవుతాయి. అయితే వాటిని ఎదుర్కొనే శక్తి మాత్రం క్షీణించిపోతుంది. విస్కీ బాటిల్ ప్రభావం లాగా ఈ చిత్రాల ప్రభావం వెంటనే కనిపించదు. కాని, చాలా నెమ్మదిగా వీటి ప్రభావం వ్యక్తిత్వంలోకి ఇంకుతుంది. దృఢమైన వ్యక్తిత్వం గల మేధావి వర్గంవారు ఈ చిత్రాలను చూసి, వెటకారంగా నవ్వేసి ఊరుకో గలరు. ఈ చిత్రాలు వారినేమీ చేయలేవు.

కాని, ఆట్టే విద్యాగంధం లేనివారు, ఇంకా వ్యక్తిత్వం రూపొందని ఎడోలసెంట్ దశలో నున్నవారు వాటి ప్రభావానికి తప్పక గురి అవుతారు. (వైరస్ కూడా కొంచెం అర్భనాకారంగా ఉండేవారినే కదా పీడించేది. మన తెలుగు దేశంలో ఈ రకం చిత్రాలలో పూర్తిగా ఒక తరం పెరిగి పెద్దదయింది. ఈ అంటువ్యాధి ఇప్పుడు మన సాహిత్యానికి అంటుకున్నది. ఈ రకం చిత్రాలను ప్రోత్సహించడం ఆదాయం కోసం మద్యపాన నిషేధాన్ని తొలగించడం లాంటిది. ప్రధాని ఇందిరా గాంధి గారు ఒక ఆర్డినెన్సు ద్వారా ఈ చిత్రాల బెడద వదిలిస్తే సమాజం బాగుపడుతుంది.

న్యూ సినిమా

'న్యూ సినిమా' స్వభావం ఇందుకు పూర్తిగా విరుద్ధమైనది. అది సమాజాన్ని సహజంగా, సజీవంగా చిత్రిస్తుంది. చిలవలు పలవలు, పిట్టకథలు లేకుండా చెప్పదలచిన విషయాన్ని సూటిగా, స్పష్టంగా, అరమరికలు లేకుండా చెబుతుంది. మనస్సును నిద్ర పుచ్చడం కాదు-నిద్రమత్తు వదిలిస్తుంది. ఊహాలోకాల నుంచి వాస్తవ జగత్తులోకి దింపుతుంది. రుగ్మత వదిలించడానికి అవసరమైతే మిరియాల కషాయం బలవంతంగా తాగిస్తుంది. కళ్ళు మూసుకోకుండా, మొహం తిప్పుకోకుండా దారిద్ర్యాన్ని, అన్యాయాన్ని, దౌష్ట్యాన్ని సూటిగా చూడగల ధైర్యాన్ని ఇస్తుంది. వాటిపై తిరుగుబాటుకు పురికొల్పుతుంది. 'న్యూ సినిమా' ప్రయోజనాత్మకం మాత్రమే కాదు-కళాత్మకం కూడా. కథా గమనానికి అడుగడుగునా అడ్డుతగిలే పాటలు, డాన్సులు, హాస్యసన్నివేశాలు మొదలైనవి ఇందులో ఉండవు. మెలోడ్రామా ఉండదు. అందుచేత రసపోషణే తప్ప రసాభాస ఉండదు. కథను చెప్పడంలో, కెమెరాను ఉపయోగించుకోవడంలో కూడా 'న్యూసినిమా' దర్శకుల సామర్ధ్యం కమర్షియల్ సినిమా వారికంటే ఎక్కువ. కాని, ఆడంబరం, హంగు లేకపోవడం వల్ల సామాన్య ప్రేక్షకులకు 'న్యూ సినిమా' చిత్రాలు టెక్నికల్ గా బాగాలేనట్లు అనిపిస్తాయి. 'న్యూ సినిమా' చిత్రాలు సామాన్య ప్రేక్షకులకు ఎందుకు నచ్చడం లేదు? మేధావి వర్గాన్ని మాత్రమే ఎందుకు ఆకర్షిస్తున్నాయి? 'కమర్షియల్ సినిమా వైరస్' మేధావి వర్గాన్ని ఏమీ చేయలేకపోయింది. సామాన్య ప్రేక్షకులు వైరస్ దాడికి గురియై అస్వస్థులైనారు. అస్వస్థులుగా ఉన్నవారికి అన్నం చేదుగా ఉంటుంది. ఆ అస్వస్థత వదిలించడానికే దేశంలో 'న్యూ సినిమా' ఉద్యమం అల్లుకుంటున్నది. బెంగాల్ లో ప్రారంభమైన ఈ ఉద్యమం మన పొరుగునవున్న కర్ణాటక వరకు వచ్చింది. ఫిలిం ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ ఉద్యమానికి మూలస్తంభంగా ఉంది. ఈ సంస్థ ప్రోత్సాహంతో ఎందరో ప్రతిభావంతులు రంగంలోకి వచ్చారు. అంతర్జాతీయ పరిగణన పొందారు.

ప్రభుత్వం చేయవలసింది

ఇటువంటి 'న్యూసినిమా'ను మన ప్రభుత్వం హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుందా? ఆదరిస్తుందా? చలనచిత్ర అభివృద్ధి సంస్థ ప్రారంభోత్సవంలో ఈ 'న్యూసినిమా'ను ప్రోత్సహించడానికి అవసరమైన చర్యల ప్రస్తావన రాలేదు. 'న్యూ సినిమా'కు ఆదరణ లభించాలంటే ప్రజల అభిరుచి పెరగాలి. అందుకు రాష్ట్రంలోని పట్టణాలన్నింటిలో ఫిలిం సొసైటీ ఉద్యమాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి. కళా ప్రక్రియగా, భావ ప్రకటనకు శక్తివంతమైన 'భాష'గా సినిమా పట్ల అవగాహన పెంపొందింపజేయడానికి పెద్ద పట్టణాలలో ఫిలిం అప్రీసియేషన్ కోర్సులు నిర్వహించాలి; రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్నింటిలోనూ ఈ కోర్సులను మూడేసి నెలల సర్టిఫికేట్ కోర్సులుగా నిర్వహించాలి. ఔత్సాహికులు ఐదేసి నిమిషాల చిన్న ప్రయోగాత్మక చిత్రాలు తీయడానికి, అభ్యాసంతో తమనైపుణ్యాన్ని పెంచుకోవడానికి ప్రతి విశ్వవిద్యాలయంలోనూ 8 ఎం.ఎం., 16 ఎం.ఎం. కెమెరాలు, లైట్స్, రిఫ్లెక్టర్స్, సన్ గన్స్ వగైరా పరికరాలను, ఎడిటింగ్ టేబుల్స్ ను సమకూర్చాలి. ప్రైవేట్ వ్యక్తులకు వదిలిపెట్టడం కాక ప్రభుత్వం స్వయంగా-పూనాఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ కు ఏ మాత్రం తీసిపోని-ఒక ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ను నెలకొల్పాలి.

ఫిలిం ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రాంతీయ భాషా చిత్రాలకు అంతగా అందుబాటులో లేదు కనుక, తెలుగులో లోబడ్జెట్ 'న్యూ సినిమా' చిత్రాలు నిర్మించేవారికి చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఋణ సహాయం అందజేయాలి. ఋణ సహాయం మంజూరు చేయడానికి ముందుగా స్క్రిప్టులను క్షుణ్ణంగా పరిశీలించాలి. అందుకు ఉత్తమ శ్రేణి దర్శకులు, రచయితలు, చలనచిత్ర విమర్శకులతో కూడిన ఒక పరిశీలక సంఘాన్ని నియమించాలి.

ఈ చర్యలన్నీ తీసుకుంటే తప్ప తెలుగు చిత్రాల నాణ్యం మెరుగయ్యే అవకాశం లేదు. ఇవన్నీ ఆచరణసాధ్యమైన, అత్యవసరమైన చర్యలు.

నండూరి పార్థసారథి
(1975 నవంబర్ 2వ తేదీ ప్రజాతంత్రలో ప్రచురితమైనది)

Previous Post Next Post