Title Picture

వసంతోత్సవ వినోదాలలో నిమగ్నులై ఉండగా మహారాజును దుండగులెవరో హత్య చేశారు. గురుకులంలో విద్యా భ్యాసం ముగించి రాజధానికి తిరిగి రానున్న యువరాజుకు ఈ విషయం తెలిసింది. ఆ రాత్రే యువరాజుపై కూడా హత్యా ప్రయత్నం జరిగింది. దుండగులను పరిమార్చి రాజధానికి తిరిగి వస్తూ దారిలో స్పృహతప్పి పడిపోతాడు. ప్రమీల అనే అందమైన అమ్మాయి బండి మీద పాటపాడుకుంటూ వచ్చి యువరాజును చూసి ప్రేమించి సేదతీర్చుతుంది. బండిలో రాజధానికి చేరవేస్తుంది. రాకుమారుడు తనకు నా అన్న వాళ్లెవరూ లేరనీ పరదేశిననీ ఆమెతో చెప్తాడు.

రాజధానికి రాగానే ఈ హత్యకు కారణం తన పినతండ్రి సైన్యాధిపతి అయిన ప్రచండుడని తెలుసుకుంటాడు. తల్లి బోధల వల్ల ఆవేశాన్ని అణచుకొని సమయం కోసం వేచియుంటాడు. అనుమానితులనే నెపంతో ప్రచండుడు రాకుమారుని ఆజ్ఞ పేరిట పలువురిని ఉరితీయిస్తాడు. అలా మరణించిన వారిలో ప్రమీల అన్న కూడా ఉన్నాడు. రాకుమారుడు, ప్రతాపునిపై పగబట్టి అతని రక్తం కళ్ళ చూస్తానని ప్రతిజ్ఞ చేస్తుంది ప్రమీల. శూరసేనుని సహాయంతో విప్లవసంఘం స్థాపించుతుంది. రాకుమారుని పట్టాభిషేకం సందర్భంలో ప్రచండుడు విషం కలిపిన మధుపాత్రను రాకుమారునికి ఇస్తాడు. కుట్రను పసికట్టిన ప్రతాపుడు పానియాన్ని త్రాగినట్లు నటించుతాడు. ఆ తర్వాత పిచ్చి ఎక్కినట్లు నాటకమాడుతాడు. ప్రచండుని దురాగతాలన్నీ ప్రతాపుని పేరిట జరుగుతూ ఉండటం వల్ల ప్రజలలో తనపై విశ్వాసం కుదిరేటట్లు చేసుకునేటందుకు 'నల్లత్రాచు' అనే ముసుగు మనిషిగా చెలామణి అవుతూ ప్రచండునికి పక్కలో బల్లెంగా మెలగుతూ ఉంటాడు. 'నల్లత్రాచు' విప్లవసంఘానికి నాయకుడవుతాడు. ప్రమీల ప్రతాపుల ప్రేమ బలపడుతుంది. శూర సేనునికి యీర్ష్య రగులుతుంది. ప్రతాపుని హత్య చేసేందుకు అందరూ 'నల్లత్రాచు'ను పంపుతారు. ప్రతాపుని హత్య చేసి తీసుకుపోయినట్లు 'నల్లత్రాచు' నటిస్తాడు. అరాచకం ప్రబలుతుందనే వంకతో ప్రచండుడు తన కుమారునికి పట్టాభిషేకం తలపెట్టుతాడు. ఈర్ష్యతో రగులుతున్న శూరసేనుడు నల్లత్రాచును పట్టి ఇస్తానని ప్రచండుని తెస్తాడు. ఉపాయంగా నల్లత్రాచు మిత్రులంతా శూరసేనుడే నల్లత్రాచు అని చెప్పి అతనిని ఉరితీయిస్తారు. నల్లత్రాచు వేషాన్ని తీసివేసి రాకుమారుడుగా ఎదుట పడగానే ప్రచండుడు అతన్ని బంధించి జలసమాధి చేయించటానికి ప్రయత్నిస్తాడు. ప్రమీల ప్రతాపుని రక్షిస్తుంది. ప్రచండుని పన్నాగం బైటపడుతుంది. కథ సుఖాంతమౌతుంది.

ఈ కథను రచయిత డి.వి. నరసరాజు, దర్శకుడు శ్రీ బి.యన్. రెడ్డి, సంగీత దర్శకుడు వేణు మోజారిటీ ప్రజలకు నచ్చే విధంగా రూపొందించారు. డప్పుల పాటలు, వీధి నృత్యాలు, కత్తి, కర్ర, మల్ల, విల్లు యుద్ధాలు పుష్కలంగా ఉన్నాయి. వినోదం కావలసినవారు చూడవచ్చును. ఆర్థికంగా విజయం సాధించగల హంగులన్నీ చిత్రానికి ఉన్నాయి.

నటీ నటులు : ఎన్.టి. రామారావు, రాజసులోచన, కన్నాంబ, గుమ్మడి, రాజనాల, పద్మనాభం, వంగర మున్నగువారు; పాటలు : కొసరాజు, నాగరాజు, కృష్ణశాస్త్రి రచించారు.

నండూరి పార్థసారథి
(1960 ఫిబ్రవరి 28వ తేదీన ఆంధ్రప్రభ సంచికలో ప్రచురితమైనది)

Previous Post Next Post