Humor Icon

అల్ట్రా న్యూవేవ్ భయంకర సస్పెన్స్ చిత్రం

ఫ్రెంచ్, స్వీడిష్, ఇటాలియన్ న్యూవేవ్ చలన చిత్రాల కోవలో పండిత ప్రేక్షకుల మేధాశక్తిని పరీక్షించగల అద్భుతమైన, అపూర్వమైన ఇంటలెక్చువల్, థాట్ ప్రవోకింగ్, సస్పెన్స్ చిత్రాన్ని నిర్మించి అంతర్జాతీయ ఖ్యాతి నార్జించగోరే యువ దర్శకుల కోసం ఈ స్క్రిప్టును ప్రత్యేకంగా తయారుచేశాను. ఇటువంటి చిత్రం 75 సంవత్సరాల ప్రపంచ చలన చిత్ర చరిత్రలో ఎన్నడూ రాలేదని ఘంటాపథంగా చెప్పగలను. ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని కూడా గ్యారంటి యిస్తాను.

ఆల్ర్ఫెడ్ హిచ్ కాక్ 'రోప్' అనే డిటెక్టివ్ చిత్రాన్ని ఒకే ఒక్క చిన్నగది సెట్ లో తీశాడు. సునీల్ దత్ 'యాదేఁ' చిత్రాన్ని ఒకే ఒక్కసెట్ లో, ఒకే ఒక్క పాత్ర (తనే)తో తీశాడు. ఈ మధ్య చాలా మంది బెంగాలీ దర్శకులు అసలు సెట్స్ వేయకుండా మొత్తం అంతా ఔట్ డోర్ లో తీస్తున్నారు. న్యూయార్క్ లో యువకులు 16 ఎం.ఎం. కెమెరాలుచేత బుచ్చుకుని నడివీధుల్లో చిత్రాలు తీసేసి ఆస్కార్లు మొదలైనవి కొట్టేస్తున్నారు. ఆ మధ్య అంతర్జాతీయ బహుమతి పొందిన ఒక జాపనీస్ చిత్రంలో సంభాషణలు, సంగీతం కూడా లేకుండా సహజమైన శబ్దాలను మాత్రమే వుపయోగించి, సహజమైన పరిసరాలలో ఆయా సన్నివేశాలను చిత్రీకరించారు.

మన చిత్రంలో వాటినన్నింటినీ మించిన మహత్తర ప్రయోగాలుచేస్తున్నాము. మన చిత్రంలో సెట్స్ వుండవు. స్టూడియోతో పనిలేదు. అంతా ఔట్ డోర్ లోనే తీస్తాము. అదికూడా ఒకే ఒక్క వీధిలో తీస్తాము. మన చిత్రంలో ఒక్క నటుడు కూడా వుండడు - అరనటుడు మాత్రమే వుంటాడు. (ఆశ్చర్యంగా వుందా? పూర్తిగా చదవండి తెలుస్తుంది.) సంభాషణలు, పాటలు వుండవు. నేపథ్యసంగీతం వుండదు. సహజమైన శబ్దాలను మాత్రమే వుపయోగిస్తాము. వాటినికూడా కొద్దిగానే వుపయోగిస్తాము. కథ (?) అంతా ఒక అర్ధరాత్రి వేళ జరిగిన ఒక చిన్న సంఘటన మాత్రమే.

మన చిత్రంలో ఇంకా కొన్ని విశేషాలు ఏమిటంటే ఇందులో మామూలు చిత్రాలలో మాదిరిగా 'కట్'లు, 'మిక్స్'లు, 'వైపౌట్'లు, 'ఫేడిన్', 'ఫేడౌట్'లు వుండవు. మొత్తం చిత్రం అంతా ఒకే ఒక్క షాట్ లో ముగుస్తుంది. కత్తిరింపులు, అతికింపులు వుండవు. చిత్రం నిడివి ఈ స్క్రిప్టును స్వీకరించే దర్శకుని దక్షతపై ఆధారపడి వుంటుంది. (ఈ సినేరియోను దర్శకుడు తన ఓపికను బట్టి, ప్రతిభను బట్టి ఎంతైనా సాగదీసుకోవచ్చు.) చిత్రీకరణ రియలిస్టిక్ గా, సింబాలిక్ గా, సజెస్టివ్ గా వుంటుంది. అనగా ప్రేక్షక మహాశయుల వూహాశక్తిని బట్టి, మేధా శక్తినిబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమయ్యే అవకాశం వుంది.

(మేధకు ఇంతపని కల్పించే, పదును పెట్టే చిత్రం ఇంతవరకు రాలేదు) ఇది సామాన్య ప్రేక్షకులకు ఎంతమాత్రం అర్థం కాదు. వారు దీనిని హర్షించలేరు. ఈ చిత్రం అర్థం కానివాళ్ళని, ఈ చిత్రం వల్ల రసానుభూతిని పొందలేకపోయిన వాళ్ళని సామాన్య ప్రేక్షకులక్రింద జమకట్టడానికి సందేహించ నక్కర్లేదు. ఇది ఇంటలెక్సువల్స్ కు మాత్రమే ఉద్దేశించినది. అసలు ఈ సందర్భంలో ఒక్క అమూల్యమైన సూచన చేయదలచుకున్నాను. చలన చిత్రాలకు సెన్సారువారు 'యు' (అన్ రిస్ట్రిక్టెడ్ ఎగ్జిబిషన్) సర్టిఫికేట్లు, 'ఎ' (అడల్ట్స్ ఓన్లీ) సర్టిఫికేట్లు ఇస్తున్నట్లుగానే మేధావులకు వుద్దేశించిన ప్రయోగాత్మక చిత్రాలకు, న్యూవేవ్ కళాఖండాలకు ప్రత్యేకంగా 'ఐ' (ఇంటిలెక్చువల్స్ ఓన్లీ) సర్టిఫికేట్లు ఇవ్వడం అవసరం. ఇలా చేస్తే వీటిని సామాన్య ప్రేక్షకులు చూసి తిట్టుకునే ప్రమాదం తప్పిపోతుంది. అంతేకాక-ఇంటలెక్చువల్స్ గా పరిగణన పొందగోరేవారందరూ ఈ చిత్రాలను ఒకటికి రెండుసార్లు చూసి తమ మేధకు పదును పెట్టుకుంటారు.

మళ్ళా మన విషయానికి వద్దాం. నా స్క్రీన్ ప్లే అంతా చదివిన తర్వాత 'దీన్ని సినిమాగా తీస్తే ఆంధ్రప్రదేశంలో ఒక్కవారం కూడా ఆడదు' అని మీరు అఁటారని నాకు తెలుసు. వారం రోజులు అక్కర్లేదు - ఒక్కరోజు ఆడినా, ఒక్క ఆట ఆడినా మన డబ్బులు మనకు రావడమే కాకుండా బోలెడు లాభం వస్తుంది. చిత్రాన్ని కొనేనాథుడు (డిస్ట్రిబ్యూటర్) లేక, ఆడించే దిక్కు (థియేటర్) లేక, ఒక్క ఆట కూడా ఆడకపోయినా మనకు కాస్తో కూస్తో లాభమే వస్తుందిగానీ, నష్టం మాత్రం రాదు. ఏలాగో చెబుతాను - సావధానంగా వినండి.

సినిమా తీయడానికి మనకి (ప్రింట్లు, పబ్లిసిటీతోసహా) ముఫ్ఫై, నలభై వేల కంటే ఎక్కువ ఖర్చు కాదు! ఉత్తమ ప్రయోగాత్మక చిత్రంగా మనకు కేంద్ర ప్రభుత్వం వారి పతకం, యోగ్యతాపత్రం, కాస్తో కూస్తో నగదు బహుమతి లభిస్తాయి. (సువర్ణ పతకం వస్తే ఆశ్చర్యపడనవసరం లేదు) హైదరాబాద్ లో తీస్తే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి యాభై వేలు సబ్సిడీ వస్తుంది. బెంగుళూరులో అయితే మరీ మంచిది. మైసూరు ప్రభుత్వం యాభై వేలు యివ్వడమే కాకుండా వినోదం పన్ను మినహాయిస్తుంది కూడా. (మనదాంట్లో బొత్తిగా వినోదం వుండదుకదా మరి!) ఈ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వంకంటే మైసూరు ప్రభుత్వానికి ఔదార్యం, సానుభూతి ఎక్కువ. బెంగుళూరు నగరం ఇంటలెక్చువల్స్ తో కిటకిట లాడిపోతున్నది కనుక బహుశా మన పెట్టుబడి అంతా ఒక్క బెంగుళూరులోనే రాబట్టుకోవచ్చు.

మరొక సూచన - ఈ స్క్రిప్టును ఫిలిం ఫైనాన్స్ కార్పొరేషన్ కి చూపించి, మన ఆదర్శాలను, ఆశయాలను ఏకరువు పెట్టి, వాళ్లని పట్టుకోవలసిన విధంగా పట్టుకుంటే మనకు పెట్టుబడి సమస్య కూడా వుండదు, జేబులో నుంచి దమ్మిడీ కూడా ఖర్చుపెట్టనవసరం లేదు. ఫిలిం ఫైనాన్స్ కార్పొరేషన్ వల్ల మరొక గొప్ప ప్రయోజనం ఏమిటంటే మన చిత్రానికి దేశంలో అవార్డు ఖాయం. మన రాష్ట్రంలో విడుదల అయినా కాకపోయినా విదేశాలకు వెళ్లడం ఖాయం. (అసలు మనం ఈ చిత్రాన్ని నిర్మించేది ప్రధానంగా ఫారిన్ మార్కెట్ కోసమే) పారిస్, రోమ్, స్టాక్ హోమ్, న్యూయార్క్ లాంటి నగరాల్లో మన పిక్చరు బాగా ఆడుతుంది. మన చిత్రంలో అసలు సంభాషణలు వుండవు కనుక, మనది ఒక ప్రాంతానికి, ఒక భాషకు పరిమితమైనది కాదు. అఁదుకని మన చిత్రానికి విశ్వవ్యాప్తమైన ఆదరణ లభిస్తుంది. కాన్స్ ఫెస్టివల్లోనో, వెనిస్ ఫెస్టివల్లోనో మన చిత్రానికి బహుమతి వచ్చే అవకాశం లేకపోలేదు. విదేశీ టెలివిజన్ సంస్థలు బోలెడు డబ్బుపోసి మన చిత్రాన్ని కొనుక్కుంటాయి.

అంత దిగ్విజయ యాత్రచేసి స్వదేశానికి తిరిగివస్తే దేశంలోని అన్ని రాష్ట్ర రాజధానులలోనూ మన చిత్రానికి బాగా డబ్బులొస్తాయి. మన రాష్ట్రంలో కనీసం హైదరాబాద్, విశాఖపట్టణం, కాకినాడ, గుంటూరు లాంటి కేంద్రాల్లో నైనా మన చిత్రానికి డబ్బులు రాకపోవు. అప్పుడు బెజవాడలో మనకు ఘనసన్మానం చేసి, పత్రికా విలేఖరుల గోష్టి ఏ మనోరమా హోటల్లోనో ఏర్పాటు చేస్తారు, మన పత్రికలు వేనోళ్ళ పొగుడుతాయి.

ఇంతా చేసి ఈ చిత్రాన్ని తీయడం అతి సులభం కూడా -

చిత్రనిర్మాణానికి కావలసినవి :

ఒక అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ (పూనా ఫిలిం ఇన్ స్టిట్యూట్ వాడైతే శ్రేష్టం).

ఒక అద్దె మూవీకెమెరా (16 ఎం.ఎం. అయితే చౌక. పైగా ఇప్పుడు విదేశాల్లో 16 ఎం.ఎం. పట్ల మోజు పెరుగుతోంది).

ఒక టేప్ రికార్డర్ (ఇది కూడా అద్దెకు తెచ్చుకోవచ్చు);

ఒక దర్శకుడు; ఒక లైట్ బాయ్; ఒక నౌకరు కుర్రాడు. (వోపికవుంటే ఈ ఇద్దరి పనులూ దర్శకుడే చేసుకోవచ్చు. ఖర్చు కలిసొస్తుంది)

మన చిత్రం పేరు: 'ఎవరు? ఏమిటి? ఎందుకు?' నేను చిత్రీకరించే ఈ క్రింది దృశ్యాలను మీ మనస్సనే వెండితెరపై తిలకించండి. మీ మనస్సు విశాలమైనదైతే వైడ్ స్క్రీన్, పేనావిజన్ లేదా సినిమాస్కోప్ వెర్షన్ తిలకించవచ్చు. ఇంకా స్పెక్టాక్యులర్ ఎఫెక్ట్ కావాలనుకుంటే మీ మనోవైశాల్యాన్ని బట్టి 70 ఎంఎం, సినేరమా, సర్కోరమా వెర్షన్ కూడా తిలకించవచ్చు. మీ అభిరుచినిబట్టి ఈస్ట్ మన్ కలర్, టెక్నికలర్, మెట్రోకలర్, ఫ్యూజీకలర్; మరేదైనా కలర్ ను ఎంచుకోవచ్చు. కాని, నా మట్టుకు నేను 35 ఎం.ఎం. లేదా 16 ఎం.ఎం. బ్లాక్ అండ్ వైట్ వెర్షన్ నే సిఫార్సు చేస్తాను. సీరియస్ గా వుండే న్యూవేవ్ కళాఖండాలు ఎప్పుడూ బ్లాక్ అండ్ వైట్ లోనే వుండాలి. కొంచెం మసగ్గా, మత్తుగా, మందకొడిగా, ఆవులిస్తూ ఈగలు తోలుకుంటున్నట్లుగా, తుమ్మల్లో పొద్దూకుతున్నట్లుగా, నిశ్శబ్దంగా వుంటే మంచిది. అదే న్యూవేవ్ టెక్నిక్. అలావుంటే అంతర్జాతీయ ఖ్యాతి లభించే అవకాశం వుంటుంది, ఇప్పుడు మనం తీయబోయే చిత్రం అలాగే వుంటుంది. ఫెలినీ, ట్రూఫా, రెన్నాయిస్, ఇంగ్మార్ బెర్గ్ మన్ ల చిత్రాలు మన చిత్రం ముందు దిగదుడుపు. అందుకు మనకు గ్రాండ్ ప్రీ ఖాయం.

ఇక మన చిత్రరాజంబునకు కధాక్రమం బెట్టిదనిన -

ఒకానొక మహానగరంలో ఒకానొక వీధి. అర్థరాత్రి సమయం. వీధిలో వందగజాల కొక దీపం వెలుగుతోంది; అట్టే వెలుగు లేదు. పైగా పొగమంచు, అందుకని మసక మసకగా వుంది. వీధి నిర్మానుష్యంగా వుంది. కీచురాళ్ళగోల తప్ప వేరే శబ్దాలేవీ లేవు.

(పొగమంచు ఎఫెక్ట్ రావాలంటే కణకణమండే బొగ్గులమీద కాస్త వూకపొయ్యండి, సత్యజిత్ రే 'దేవి' సినిమాలో పొగమంచుకోసం గుగ్గిలం కాబోలు వుపయోగించాడు. అప్పటి నుంచి న్యూవేవ్ దర్శకులంతా ప్రతిసినిమాలో పొగపెట్టడం మొదలుపెట్టారు. ఒక తెలుగుసినిమాలో ఎవరో జ్వాలను రగిలించారని నేపధ్యంలో పాటపెట్టి గడ్డిమోపులు కాబోలు తగలెట్టారు).

కొద్ది క్షణాలు దృశ్యం నిశ్శబ్దంగా వుంటుంది. తర్వాత కెమెరా నెమ్మదిగా రోడ్డును, పేవ్ మెంట్లను, రోడ్డుపక్క భవనాలను ఒక్కొటొక్కటిగా చూపుతూ వుండగా టైటిల్స్ ప్రారంభం.

'.... పిక్చర్స్ సమర్పించు -

'ఎవరు? ఏమిటి? ఎందుకు?'

'కౌన్? క్యా? క్యోఁ?'

'హూ? వాట్? వై?'

(టైటిల్స్ ను తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలతోపాటు ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, స్వీడిష్, రష్యన్ భాషల్లో కూడా చూపడం మంచిది. అది వ్యాపారదృష్ట్యా శ్రేయస్కరమేకాక, మన విశ్వజనీన ధృక్పధానికి నిదర్శనంగా కూడా వుంటుంది, ఏ దేశంలో ప్రదర్శించినా మన చిత్రానికి సబ్ టైటిల్స్ అవసరం లేదు కదా!)

'కథ, స్క్రీన్ ప్లే....'

శుభ్రమైన కాంక్రీట్ రోడ్డు; ఊడ్చినట్లుగా వుంది. అటూ యిటూ పేవ్ మెంట్లు. పేవ్ మెంట్ మీద ఒక కుక్క ముడుచుకుని పడుకుంది.

'ఛాయాగ్రహణం...'

రోడ్డుపక్క అందమైన భవనాలున్నాయి. కొన్ని నాలుగైదు అంతస్తులున్నాయి. కొన్ని భవనాల ఆవరణల్లో పెద్ద వృక్షాలు. వాటి నీడలవల్ల ఆ భవనాలవద్ద చీకటిగా వుంది. ఆ భవనాలమీదుగా నెమ్మదిగా కెమెరా పాన్ చేయబడుతుంది. ఒక చెట్టుమీద నుంచి ఒక తీతుపిట్ట బిగ్గరగా అరుస్తూ ఆకాశంలోకి దూసుకుపోయింది. ఆ అరువు జనం జడుసుకునేట్లుగా వుంది.

(పక్షిగూడు వున్న చెట్టును ముందే చూసుకుని వుంచుకుని, దానిమీదకు కెమెరాను గురిపెట్టి, మనకు అవసరమైనప్పుడు దానిమీదకు గురిపెట్టి రాయి విసరండి. పక్షి విగిరిపోతుంది. తీతూపిట్ట అరుపును తర్వాత డబ్ చేసుకోవచ్చు.)

'శబ్ద గ్రహణం.....'

నిశ్శబ్దం ఆవరించుకున్నది. కీచురాళ్ళ గోల తప్ప మరే శబ్దం లేదు. కెమెరా వీధి దృశ్యాన్ని చూపుతూ వుంటుంది. వరసగా భవనాలను చూపుతూ కెమెరా దృష్టి ఒక ప్రదేశంపై నిలుస్తుంది.

'నటుడు.....'

కెమెరా దృష్టిపడినచోట ఒకమేడవుంది. మేడబైట ఒకపెద్ద వృక్షం వుంది. ఆ వృక్షం చుట్టూ నీడ వ్యాపించి వుంది. ప్రహరీగోడను ఆనుకుని ఒక చెత్త కుండీ వుంది. మేడపై గదిలో లైట్లు వెలుగుతున్నాయి. గదికిటికీ అద్దాలతలుపులు మూసివున్నాయి.

'నిర్మాత, దర్శకుడు....'

కెమెరా ఎదుటగల దృశ్యంలో ఆమేడగది అద్దాల తలుపులలో నుంచి కనిపించే దీపకాంతి తప్ప మరే వెలుగూ లేదు. దూరంగా, సన్నగా 'టక్ టక్ టక్ టక్' శబ్దం.

'కృతజ్ఞతలు... రాష్ట్ర ప్రభుత్వం వారికి, - నగరపాలక సంఘంవారికి, - వీధి గృహస్థులకు.

(సబ్సిడి ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, షూటింగ్ కు అనుమతించి నందుకు నగరపాలక సంఘానికి, షూటింగ్ చూడడానికైనా చీటికీమాటికీ తలుపులుతీసి తొంగి చూడకుండా, అంతరాయం కలిగించకుండా వున్నందుకు వీధి గృహస్థులకు కృతజ్ఞతలు చెప్పడం అవసరం).

టక్ టక్ శబ్దం బూట్ల చప్పుడుగా స్పష్టంగా తెలుస్తూ వుంటుంది.

టక్... టక్... టక్... టక్...

లయబద్దంగా, వేగంగా నడుస్తున్నచప్పుడు. ఆ చప్పుడు మొదట దూరంగా, సన్నగా వినిపించి క్రమంగా దగ్గరవుతూ, బిగ్గరవుతూ వుంటుంది. లైట్లు వెలుగుతున్న ఇంటిపై దృష్టి వుంచిన కెమెరా బూట్లచప్పుడు వినిపించడంతో, నిశ్శబ్దాన్ని భంగపరుస్తున్న ఆవ్యక్తి ఎవరో, ఎటునుంచి వస్తున్నాడో తెలుసుకోడాని కన్నట్టు వీధి చివరికి దృష్టి పారిస్తుంది.

(కెమెరా పొజిషన్ గురించి ఒక్కసూచన - వీథిలోలైట్లు వెలుగుతున్నాయని చెప్పిన మేడఎదుట వీధిమధ్యలో ట్రాలీమీద కెమెరాను ఎక్కించండి. ఆ మేడదగ్గరనుంచి వీధి చివరివరకు దృష్టి సారించడానికి వీలుగా, వీధి చివరనుంచి ఈ మేడవరకు వరసగా అన్ని ఇళ్ళమీదనుంచి కెమెరాను 'పాన్' చేయడానికి వీలుగా ట్రాలీని అవసరానుగుణంగా నడిపించుకోవాలి. అంతా ఒకటే షాట్ అనే సంగతి గుర్తుంచుకోవాలి.)

టక్... టక్.... టక్... టక్...టక్....

లాంగ్ షాట్ లో మసకవెలుగులో రెండు కాళ్ళు-పుల్ బూట్సు ధరించిన కాళ్ళు నడిచి వస్తూ వుంటాయి. లయబద్ధమైన శబ్దం. నడుస్తూ, క్రమంగా దగ్గరవుతున్న కాళ్ళను కెమెరా గమనిస్తూ వుంటుంది.

(మనిషి కనిపించకుండా కాళ్ళు మాత్రం - సుమారుగా తొడలనుంచి క్రింది భాగం మాత్రం-కనిపించేటట్లుగా కెమెరా యాంగిల్ ను ఎప్పటికప్పుడు సర్దుకోవాలి)

పాలిష్ తో మెరుస్తున్న బూట్లు... లయతప్పకుండా నడుస్తున్న కాళ్ళు ఒక్కసారి ఆగుతాయి. కెమెరాకూడా ఆగుతుంది. ఆ వ్యక్తి దేనికోసమో ఒక్కసారి చుట్టూ చూడడానికి ఆగినట్టు ఆగి, మళ్ళీ నడక ప్రారంభిస్తాడు. కెమెరా మళ్ళీ అతడి నడకను అనుసరిస్తుంది. కాళ్ళు క్రమంగా సమీపిస్తాయి... కెమెరా ఎదుటికివచ్చి ఆగుతాయి. ఆ వ్యక్తి ఖరీదైన ఉలెన్ పాంట్, లాంగ్ కోట్ ధరించాడు. చేతులు కోటు జేబుల్లో వున్నాయి. (లాంగ్ కోట్ ఖరీదు చులాగా నాలుగొందలు వుంటుంది. దాన్ని బట్టి అతడు ధనికుడనీ, ఆధునిక నాగరిక సమాజానికి చెందినవాడనీ తెలుస్తున్నది)

ఇప్పుడతను లైట్లు వెలుగుతున్న మేడబయట చెట్టుదగ్గర వున్నాడు. కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ నడక ప్రారంభిస్తాడు. ఈ సారి ఇందాకటిలా కాకుండా నెమ్మదిగా, చప్పుడు కాకుండా, ఎవరికీ వినిపించకూడదన్నట్లు నడుస్తున్నాడు. ఇంటిని దాటి, కెమెరాపక్కగా, కెమెరానుదాటి, వీధి రెండో వైపుకి నడుస్తాడు. కెమెరా పక్కగా నడుస్తున్నప్పుడు బూటుకాళ్ళు క్లోజప్ లోకి వస్తాయి. జాగ్రత్తగా (అడుగులో అడుగు వేస్తున్న ఆ నడకను కొద్దిసేపు 'స్లో మోషన్'లో తీస్తే ఎఫెక్టివ్ గా వుంటుంది. ఒకసారి కాలు ఎత్తినప్పుడు 'ఫ్రీజ్' చెయ్యండి. ఎందుకైనా మంచిది. న్యూదేవ్ చిత్రానికి ఒక చిట్కా-మధ్య మధ్య ఒక్కొక్క షాట్ ను 'ఫ్రీజ్ చేస్తూ వుండాలి. ఒక్కోసారి 'బ్లర్ చేస్తూ వుండాలి. ఒక్కోసారి మొత్తం స్క్రీన్ ని 'బ్లాక్' చేస్తూ బ్యాగ్రౌండులో శబ్దాలను మాత్రం వుపయోగించాలి. ఈ టెక్నిక్లను మాత్రం వుపయోగించాలి. ఈ టెక్నిక్లను దర్శకుడు జాగ్రత్తగా అప్పుడప్పుడూ, సందర్బోచితంగా వుపయోగించుకోవాలి).

ఆ వ్యక్తి కెమెరాను దాటి వెళ్ళిన తర్వాత అతడి కాళ్ళు వెనుకనుంచి కనిపిస్తూ వుంటాయి. కొంతదూరం వెళ్ళి ఆగుతాడు. ముందుకు వెళ్ళాలా, వెనక్కి రావాలా అని తటపటాయిస్తున్నట్లుగా కాళ్ళు కాసేపు ముందుకూ వెనక్కూ తచ్చాడుతాయి. మళ్ళీ వెనక్కి వచ్చి మేడ ప్రహరీ పక్క చెట్టు దగ్గర ఆగుతాడు. మేడగేటు అవతలి నుంచి కుక్క మొరుగుడు వినిపిస్తుంది. అతడు చెట్టు నీడలోకి వెడతాడు. చెట్టు అవతల కొద్ది దూరంలో వీధిలైటు గుడ్డిగా వెలుగుతోంది. ఆ వెలుగులో అతడి మోకాళ్ళ క్రింది భాగం మాత్రం కొద్దిగా కనిపిస్తోంది. మిగతా మనిషంతా చెట్టు నీడ చీకటిలో వున్నాడు.

(కెమెరా ఆ వ్యక్తిని ఎటువైపు నుంచి చూపినా ఏ సందర్భంలోనూ నడుముపైన కనిపించకుండా జాగ్రత్తపడాలి. దీనినంతటినీ దృష్టిలో వుంచుకుని కెమెరాను నిలబెట్టేచోటును జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి.)

కొద్ది క్షణాలు ఆగి అతను నెమ్మదిగా లాంగ్ కోట్ కుడిజేబులోంచి ఏదో తీశాడు. చీకట్లో స్పష్టంగా కనిపించకపోయినా, తీసిన పద్ధతిని బట్టి అది సిగరెట్ అని తెలుస్తోంది. తర్వాత ఎడమజేబూ నుంచి ఏదో తీశాడు. (కెమెరా ట్రాలీ నెమ్మదిగా అతడు నుంచున్న చెట్టు సమీపానికి కదులుతుంది) ఆ వస్తువు చీకటిలో కూడా ధగ ధగమెరుస్తుంది. (అదేమి చూడాలన్నట్లు ఆసక్తితో కెమెరా ఇంకా దగ్గరగా క్లోజప్ రేంజ్ లోకి వెడుతుంది) ఆ వస్తువు మధ్యలో రేడియం డయల్ గడియారం. అంకెలు, ముళ్ళు మెరుస్తున్నాయి, టైము ఐదునిముషాల తక్కువ పన్నెండు (క్లోజప్). అతను దానిని ఒకపక్కన టక్కుమని నొక్కుతాడు. అందులో నుంచి సన్నని మంట వస్తుంది. దానిని బట్టి అది సిగరెట్ లైటర్ అని తెలుస్తుంది. (లైటర్ వెలగగానే షాట్ ని ఫ్రీజ్ చెయ్యండి. - లైటర్ వెలుగులో ఇప్పుడు అతడి చేతికి గ్లవ్స్ వున్నట్లు కనిపిస్తుంది. అతడు గ్లవ్స్ ధరించవలసిన అవసరం ఏమిటి అనే దానిపై ప్రేక్షకుల బుర్రలు పనిచేస్తాయి. రేడియం డయల్ గడియారంతో కూడిన, ధగధగమెరిసే ఆ సిగరెట్ లైటర్ ఖరీదు మూడొందలకి తక్కువ వుండదు. అవి ఇండియాలో తయారయ్యేవి కావు. ఇంపోర్టెడ్, లేదా స్మగుల్డు అయి వుండాలి. అతడు బాగా ధనికుడని మరోసారి స్ఫురిస్తుంది ప్రేక్షకులకు) అతడు లైటర్ ను పైకి తీసుకున్నాడు. మరో క్షణంలో పొగ వస్తుంది. అతను లైటర్ జేబులో పెట్టేశాడు. (సిగరెట్ ముట్టించే దృశ్యం కనిపించదు. కెమెరా దృష్టి అతడి నడుముదాటి పైకిపోదు).

ఇంతలో మేడమీది గదిలో నుంచి సీసాలు క్రిందపడి పగిలిన శబ్దం వినిపిస్తుంది. అతడు వులిక్కిపడి మరి కాస్త చీకటిలోకి జరిగాడు. (కెమెరాకూడా గబగబా వెనక్కు-అతనికి దూరంగా జరుగుతంది) చెట్టు క్రింది చీకటిలో కాలుతున్న సిగరెట్ మాత్రం కనిపిస్తున్నది, మేడమీది గదిలో నుంచి సీసా పెంకులు ఏరుతున్న శబ్దం. మరొక క్షణంలో చెత్తకుండీలోకి గాజు పెంకుల పొట్లం విసిరివేయబడిన శబ్దం. (కెమెరాదృష్టి చెట్టుక్రింద దృశ్యం నుంచి మేడగదివైపు మళ్లుతుంది,) గదికిటికీ దగ్గర ఎవ్వరూ లేరు. కిటికీ తలుపు ఒకరెక్క కొద్దిగా తెరిచి వుంది. ఇంకొక్క క్షణం తర్వాత గదిలో లైటు ఆరిపోయింది. (కెమెరా దృష్టి మళ్లీ చెట్టువద్దకు మళ్ళింది) చెట్టు అవతలవున్న విధిలైటు గుడ్డి వెలుతురు తప్ప మిగతా అంతా చీకటి. ఆ వ్యక్తి కాళ్లు మాత్రం మసక వెలుతురులో కనిపిస్తున్నాయి. అతడు సిగరెట్టు క్రిందవేసి కాలితో నలిపివేశాడు.

కొంచెం తటపటాయించినట్లుగా ముందుకు వెనక్కు పచార్లు చేశాడు. తర్వాత నెమ్మదిగా ప్రహరీగోడ అంచువద్దకు జరిగాడు. లోపలనుంచి మళ్లీ కుక్క మొరుగుడు. అతను రెండడుగులు వెనక్కువేశాడు. (కెమెరాదృష్టి గోడమీద, ఇంటి గేటు మీద వుంది) గోడ బాగా పొట్టిది. గేటుకు గొలుసుతో తాళం పెట్టి వుంది. (కెమెరాదృష్టి గేటు మీద నుంచి మేడగది కిటికీ వైపు మళ్ళింది.) మేడగది చీకటిలో నుంచి కాలుతున్న సిగరెట్ ఒకటి కనిపిస్తుంది. అది చెట్టు వద్ద నున్న వ్యక్తికి కనిపించే యాంగిల్ లోలేదు. (కెమెరా మళ్లి చెట్టు వద్దకు తిరిగింది)

ఢాం... ఢాం... ఢాం...

మూడుసార్లు రివాల్వర్ ప్రేలింది.

'ఆ....' పెద్దగా ఆర్తనాదం. చెట్టు దగ్గర వ్యక్తి విరుచుకు పడిపోయాడు.

భౌ... భౌ... భౌ... కుక్క గొంతు చించుకుని మొరుగుతోంది.

రివాల్వర్ ప్రేలినశబ్దం, ఆర్తనాదం, కుక్క మొరుగుడు దాదాపు ఒకేసారి జరిగాయి. కుక్క మొరుగుడులో ఆర్తనాదం వినిపించలేదు.

కుక్క మొరుగుడు ఆపింది. అంతా నిశ్శబ్దం (కెమెరాదృష్టి మేడగది మీదకి మళ్లింది) కిటికీ తలుపు పూర్తిగా మూసి వుంది. అక్కడ ఎవరూలేరు. గదిలో లైట్లు లేవు. అంతా చీకటి. (కెమెరా మళ్లీ చెట్టువైపు తిరిగింది). రివాల్వర్ దెబ్బకు గురి అయిన వ్యక్తి బోర్లగిలా పడివున్నాడు. నడుముక్రింద భాగం మాత్రమే కనిపిస్తున్నది. నెత్తురు మడుగులో వున్నాడు అతను.

(ఈ దృశ్యాన్ని గమనిస్తున్న కెమెరా నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తున్నట్లు వెనక్కి వెనక్కి వెళ్లిపోతుంది). శవం మసక చీకటిలో దూరంగా, చిన్నదిగా కనిపిస్తుండగా ఫ్రీజ్ చేయాలి.

'ఎవరు? ఏమిటి? ఎందుకు?'

'కౌన్? క్యా? క్యోఁ?'

'హూ? వాట్? వై?'

ఈ అక్షరాలు కరిగిపోయిన తర్వాత ఎక్కడో కుక్క మూలుగుతున్న శబ్దం....

'సమాప్తం'

'ది ఎండ్'

'ఫినిస్'

'.....'

ఆ వ్యక్తి ఎవరు? అసలు ఈ వ్యవహారమంతా ఏమిటి? అతడు ఎందుకు హత్య చేయబడ్డాడు? - ప్రశ్నలకు సమాధానాలను మేధావుల వూహకే వదిలిపెడుతున్నాను. మనం ఒక చిన్న సంఘనను ఇచ్చాము. కథను మేధావులైన ప్రేక్షకులు ఎవరికి వారే అల్లుకోవచ్చును. మన చిత్రం మేధకు పదును పెడుతుందనీ, దీనికి ప్రత్యేకంగా 'ఐ' సర్టిఫికేట్ ఇవ్వాలనీ చెప్పింది ఇందుకే.

ఆ వ్యక్తికీ ఆ మేడ యజమానికీ ఏదో వైరం వుండవచ్చు. ఆ యజమానిని హత్య చేయడానికి ఇతడు వచ్చి వుండవచ్చు. ఇతడి సిగరెట్ ను చూసి అనుమానించిన యజమాని లైట్లు ఆర్పేసి చీకట్లోంచి గమనించి, అతడిని గుర్తుపట్టి రివాల్వర్ తో కాల్పివేసి వుండవచ్చు. లేదా - ఆ వ్యక్తికి ఆ ఇంటి యజమాని భార్యకు ఏదైనా సంబంధం వుండవచ్చు. అసలు ఆ ఇంటాయనకీ, అతనికీ ఏ సంబంధం, వైరం లేకపోవచ్చు. ఆ యజమాని తనపై ఆ రాత్రి హత్యా ప్రయత్నం జరగవచ్చునని అనుమానించి ముందే సిద్ధంగా వుండి వుండవచ్చు. ఈ వ్యక్తి మరెవ్వరి కోసమో అక్కడ ఎదురు చూస్తూ వుండవచ్చు. లేదా ఆ ఎదురింటిలో ఎవరినో రహస్యంగా కలుసుకునేందుకు వచ్చి వుండవచ్చు. లేక, ఆ వీధిలో ఏదైనా నేరాన్ని దర్యాప్తు చేయడానికి వచ్చి, సమయం కోసం ఎదురుచూస్తున్న పోలీస్ అధికారి కావచ్చు. ఆ ఇంటి యజమాని అపార్థం చేసుకుని కాల్చి వేసి వుండవచ్చు. జరిగిన సంఘటన అది. దానికి కారణాలు ఏవైనా కావచ్చు, ఎన్నైనా వుండవచ్చు.

నిత్య జీవితంలో అనేక సంఘటనలు మనకు... ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అవసగతమవుతూ వుంటాయి. ఎవరికి అవగతమైనది నిజం అనేది ఎవరూ చెప్పలేరు. ఈ చిత్రంలో అంతర్లీనంగా వున్న మహత్తర సత్యం ఇదే.

ఈ సినేరియోను నేను టూకీగా మాత్రమే రచించాను. దర్శకుడు తన ప్రతిభను బట్టి ఈ చిన్న సంఘటనను తెరపై ఎంతసేపైనా చెప్పవచ్చు. టక్ టక్ మని అడుగుల చప్పుడు మొదలైనప్పటి నుంచి 'ఫినిస్' వరకు ఈ సంఘటనను ఎంతైనా పీకి పీకి సాగదీయవచ్చు. ఏదో ఇంట్లో ఎవరో దగ్గిన చప్పుడు, తుమ్మిన శబ్దం, దూరంగా బీటు పోలీసు విజిల్ ఊదిన శబ్దం, గూర్కావాడు లాఠీ టక్ టక్ మని కొట్టుకుంటూ వెళ్ళిన శబ్దం, ఇంకా ఇలాంటి సమయోచితమైన శబ్దాలు వుపయోగించుకోవచ్చు. పిల్లి గోడదూకి పారిపోతున్న దృశ్యం, రెండు వూరకుక్కలు ఒకదాని నొకటి తరుముకుంటూ పరుగెత్తుతున్న దృశ్యం - ఇటువంటివి ఎన్నైనా చొప్పించుకోవచ్చు.

రివాల్వర్ ప్రేల్చినప్పుడు, అర్తనాదం వినిపించినప్పుడు వీధిలో జనం నిద్రలేచి ఎందుకు పరుగెత్తుకు రాలేదన్న సందేహం కొందరికి రావచ్చు. కుక్క మొరుగుడులో ఆ శబ్దాలు గాఢనిద్రలో వున్నవారికి బాగా వినిపించి వుండకపోవచ్చు. అవి దీపావళి రోజులైతే రివాల్వర్ ప్రేలినా టపాకాయి అనుకోవచ్చు. ఒక వేళ హత్య జరిగినట్లు అనుమానించినా బయటకు రావడానికి జనం భయపడి వుండవచ్చు. కొందరు చలిలో నిద్ర లేవడానికి బద్ధకించి వుండవచ్చు. ఇంతకంటే మంచి కారణాలు ఇంకేవైనా మేధావులకు తోచవచ్చు'.

మన పిక్చర్ 'మోడరన్ ఆర్ట్'లాగా అనంతమైన అర్థాలకు ఆస్కారం కల్పిస్తుంది. దీనిని చిత్రంగా తీసే సదుద్దేశం గలవారు దీనికి ఉచితంగా, నా అనుమతి అవసరం లేకుండానే స్వీకరించవచ్చు. ఐ విష్ దెమ్ బెస్ట్ ఆఫ్ లక్.

'ఫినిస్'

నం.పా.సా.
(ఈ రచన-ఆంధ్రసచిత్ర వారపత్రిక 1973 ఏప్రిల్ 20వ తేదీ సంచికలో ప్రచురితమయింది)

Previous Post Next Post