Humor Icon

అనగా అనగా ఒక వూళ్లో ఒక రిటైరై రెస్టు తీసుకొంటున్న తెలుగు మాస్టారు. పేరు డి.వి.యల్.గారు. పూర్తి పేరు ఎవరికీ తెలీదు. ఆయన కాట్టే సంతతి లేరు, పెళ్లి కెదిగిన ఆడపిల్లలు నలుగురు ప్లస్ ఒక వంశోద్ధారకుడు తప్ప. గొంతు విషయం తప్ప అచ్చగా కోకిలల్లా ఉంటారు పిల్లలు. పెద్దావిడకి మహా వుంటే, పాతిక ఏళ్లుంటాయి. అక్కణ్ణుంచీ రెండు రెండేళ్లు తేడాగా ముగ్గురు. ఆ పైన 17 ఏళ్లు కడసారి పిల్లవాడు. ఇన్నాళ్లూ పిల్లలకి కట్నాలు లేకుండానే ఎవరైనా ఎగరేసుకుపోతారని ఎదురు చూశాడు గాని అటు వంటి దేమీ జరగలేదు మరి. కృష్ణా రామా అనుకునే యీ వయస్సులో ఆయనకి యీ సంగతే కాస్తంత విచారంగా వుంటుందిట. అయితే, ఆయన తల్లి యింకా బ్రతికే వుండటం వల్ల ఆయన తనింకా వయసు చెల్లిన వాణ్ణనుకోలేడు. ఆ బామ్మగారు మహా ప్రస్థానయాత్రకు మూటా ముల్లే అయితే సర్దేసింది గాని, యిక పూల విమానం రావడమే తరువాయి. ప్రస్తుతం రెస్టు తీసుకుంటోంది.

పిల్లల కింకా పెళ్లిళ్లు చేయలేదని ఆవిడ, భార్యా ఎడాపెడా సాధించే దీవనలు పడలేక ఆయన వీధి అరుగుమీద కూర్చుంటాడు. వేసవి రాగానే సెలవులకి తిరిగి వచ్చే కుర్రాళ్లంతా ఆ వీధినే పోవటం అలవాటు చేసుకున్నారు. 20 నుండి 30 ఏళ్ల వాళ్లు ఎవరు కనుపించినా గుటకలు మింగుతుంటాడు వీధి అరుగు మీది డి.వి.యల్. గారు. ఇప్పటికే చాలా అప్లికేషన్లు పెట్టాడు గాని రీ డైరక్టు అయి వచ్చేస్తున్నాయి. అక్కడికీ సెకండు హాండువి కూడా చూస్తూనే వున్నాడు. కాని లాభం పలకడంలా. ఇప్పటి కాయనకి ఏడు జతల చెప్పులూ తెగాయి. ఇహ దొరుకుతారు వరులు అనుకున్నాడు. కాని ఊహు! ఈ సారీ ఆయన హృదయంలో వేపచెట్టే చిగిర్చింది. అల్లాగే చేదు గుటకలు వేస్తున్నాడు అరుగుమీద కూర్చుని.

ఆ రాత్రి ఆయనకు కలలో ఒక మిఠాయి దుకాణం సాక్షాత్కరించింది, "ఏం కావాలి పంతులూ?" అని 'వరం' అడిగింది. ''సవాశేరు లడ్డూ లెంత? వీసె మిఠాయి ఎంత?" అని అడిగి ధర తెలుసుకొని మనస్సులో ముక్కు మీద వేలేసుకొని అపచారం అనుకున్నాడు. అయినా కుడిచెయ్యి వూరుకోకుండా జేబు తడిమి ఒక అర్ధణా కాసుని బయటికి తీసి దుకాణానికి చూపించింది. కాని చివరికి బూందీ కూడా దాన్ని వరించలేదు. దుకాణ దేవత హేళనగా నవ్వింది. "వీటిల్లో ఒక్కొక్క రుచే వుంటుంది. ఇందులో చూడు మూడు రుచులుంటాయి. ఉప్పు, కారం, పులుపు" అని ఆత్మ ప్రబోధించగా పిసరంత జ్ఞానోదయమై ప్రక్కనే వున్న కారపు శనగలు కొనుక్కున్నాడు. అవి తినబోతూ వుండగా పెద్దమ్మాయి నిద్ర లేపింది. ఉసూరుమని గుటక మింగి లేచాడు డి.వి.యల్. గారు.

అక్కడికీ పాపం ఆ పిల్లలు స్వయంవర మాలలు పుచ్చుకొని సాయంకాలం పూట గుమ్మం దగ్గర నుంచుంటూనే వుంటారు. కాని వారిని వరించగల సమర్థులు ఎవరూ లేరు ఆ చుట్టుపక్కల. పాపం వారు మాత్రం ఏం చేస్తారు! చివరికి నిరాశతో ఆ మాలలు తమ మెడల్లోనే వేసుకుని వరించుకొనేవారు. ఇక ఆ కడసారి పిల్లాడు త్యాగమూర్తి. చాలా మంది ఆడపిల్లలకి హృదయం అర్పించి మళ్లీ తీసుకుంటుంటాడు. అయితే మళ్లీ యింకోళ్ళకి యిచ్చేందుకు మాత్రమే సుమీ! అతగాడి పాలసీ వేరు. అందరూ తాము ప్రేమించే ఆవిడలు, తమను ప్రేమించకపోతే "మన ఖర్మ" అని ఏడుస్తారట. ఇతడు మాత్రం "వాళ్ల ఖర్మ" అని నిట్టూర్చి గుటక వేస్తాడు. మగ పురుషుడు యింట్లో కూర్చో కూడదని వూరు పట్టుకు తిరుగుతాడు. కూటికి తప్ప గూటికి చేరడు.

ఈ విధంగా రోజులు మందంగా గడుస్తూండగా ఒక రోజు వారింటికి ఒక అతిథి వచ్చి తిని తిరిగి వెళ్తూ, "ఇంకా 4 రోజుల్లో మీ ఇంటికి ఒకబ్బాయి, 24 ఏళ్లవాడు వస్తాడు". అనే మాటలని ప్రతిఫలంగా ముట్టచెప్పాడు. డి.వి.యల్ గారి హృదయ పాత్రలో ఆనంద మధువులు పొంగి పొర్లిపోయాయి. ముగ్గురమ్మాయిల ముఖాలు వికసించాయి. పెద్దమ్మాయి ముఖం మాత్రం ముడుచుకొని పోయింది. ఆవిడకి పాపం పాతికేళ్లు కదా. మిగతా ముగ్గురూ రానున్న పెండ్లి కొడుకుని ఏకగ్రీవంగా వలచటానికి సిద్ధంగా వున్నారు. డి.వి.యల్ గారు సుపుత్రుణ్ణి పిలిచి "ఒరే యింకా 4 రోజులుకి ఒక కుర్రాడు 24 ఏళ్లవాడు వస్తాడు. రాగానే నేనెక్కడున్నా వచ్చి చెప్పు" అన్నాడు.

4.... 5... 6... రోజులు నిర్జీవంగా నిరీక్షణలతో గడిచాయి. వరుడు రాలేదు. ఎదురు చూచి చూచి ముగ్గు రమ్మాయిల కళ్లు కాయలు కాచిపోయాయి. డి.వి.యల్ గారి కళ్ళు వాచిపోయాయి. పెద్దమ్మాయి కళ్లు ఎర్రబడ్డాయి. సరే ఎలా గయితేనేం 7వ రోజు పొద్దున 9 గంటల వేళ ఓ కుర్రాడు నల్లనివాడు 24 ఏళ్ల వాడు, చేత పెట్టె ధరించి వారింటిముందు ప్రత్యక్షమయ్యాడు. సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే ఈ రూపంలో అవతరించాడని అనుకున్నారు యింట్లో అంతా. 17 ఏళ్ళ కడసారి వాడికి మూడు రోజుల్నించీ అరుగు మీదే ఉద్యోగం. నాలుగోరోజు అవతార పురుషుడు వచ్చి నోరు తెరిచి ఏదో అడగబోయేలోగానే వాడు అతని పెట్టె, బెడ్డింగు గుంజుకుని లోపల పడేసి 'నాన్నోయ్' అని గావు కేకపెట్టాడు. ఆ కొత్తబ్బాయి తెరిచిన నోరు మూసుకోవటం మరచి, తెల్లబోతూ ఉండగా డి.వి.ఎల్ గారు వడగాలిలా ఊడిపడి ''రా నాయనా రా... నీ కోసం మూడు రోజులుగా ఎదురు చూస్తున్నాం'' అంటూ అతన్ని లోపలికి తీసుకువెళ్ళాడు. కొత్తబ్బాయి కాస్త విస్తుపోయి మళ్ళీ తేరుకున్నాడు.

అతను యింటిలో ప్రత్యక్షంకాగానే ఆడపిల్లల పెట్టెలు తెరుచుకున్నాయి. ఉన్నంతలో ఖరీదైన చీరలు బైట పడ్డాయి. ఆదరాబాదరా అవి ధరింపబడ్డాయి. పెద్దమ్మాయి అతణ్ణి చూసి ధైర్యం తెచ్చుకుంది. ఇంకో రెండేళ్ళు ఎక్కువే ఉంటాయిలే అనుకుంది. ఓ మాదిరి చీర కట్టింది. వాళ్ళింట్లో వున్న ఏకైక అద్దం నాలుగు రెళ్ళు ఎనిమిది చేతుల నుండి జారిపడి బద్దలయింది. అందుకని వాళ్ళమ్మ చేత కోప్పడించుకున్నారు. ఆవిడకది అపశకునంగా తోచింది. తొందరలో ఒకరినొకరు ఢీ కొంటున్నారు. చివరికి ఎలాగైతే నేం అద్దం లేకుండానే స్నోలూ, పౌడర్లూ మెత్తుకుని స్వయంవర మాలలు చేబూని సిద్ధంగా ఉన్నారు. నలుగురూ అతణ్ణి ఏకగ్రీవంగా పెళ్ళాడేద్దామనుకుంటున్నారు. మరి అతను ఆడతాడో లేదో! ప్రతి ఆవిడకీ తన కంటే చిన్నదంటే అసూయగా ఉంది. అతగాడు ఎవరిని ఆడతాడోనని పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఇది ఇలా ఉండగా అక్కడ డి.వి.ఎల్ గారు ఏం చేస్తున్నారయ్యా అంటే అతణ్ణి గబగబా లాక్కొచ్చి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళు ఇచ్చి, అతడి బెడ్డింగు విప్పి ఇస్త్రీ గుడ్డలు తీసి ఇచ్చి ''స్నానం చెయ్యి నాయనా ముందు... ప్రయాణం చేసి వచ్చినట్లున్నావ్'' అన్నారు. పాపం అతడేదో చెప్పబోతే వినిపించుకోకుండా అష్టావధానం చేస్తున్నాడు. బామ్మగారు మూలుగుతూ ''ఎవరూ వచ్చిందీ'' అని దీర్ఘం తీస్తుంటే ''ఎవరైతే నీకు దేనికీ'' అని కసురుకుంటున్నాడు. ''అవున్లే నేనేగా నీకు విషమైపోయింది'' అని ఆవిడ దీవించింది. ఇంకో పక్క ఆయన ఇల్లాలికి వంటలు పురమాయిస్తున్నాడు. అమ్మాయిలని సిద్ధం కమ్మంటున్నారు. కుర్రాడికి బజారు పనులు అప్పజెప్పుతున్నాడు. కొత్త కుర్రాడికి ఈ డెవిల్ గారి తంతు చూస్తే ఇప్పుడు తన బెడ్డింగులోంచి పర్సు తీసి బేడా పెట్టి ఇడ్డెన్లు తెప్పించేటట్లున్నాడు. తనకి తిరుగు ప్రయాణానికి తప్ప డబ్బులేదు. కాని, అలాంటిదేమీ జరగలేదు. అతను స్నానం చేసి వచ్చేసరికి బెడ్డింగులోంచి ఇస్త్రీ బట్టలు తీసి అందించాడు. డెవిల్ గారు తర్వాత అతగాడి చేత ఎంగిలి పడించారు. అతను తాంబూల చర్వణం పూర్తయే సరికి పంతులుగారు అతని బెడ్డింగు మంచం మీద పరచి ''పడుకోనాయనా'' అంటూ అతనేదో చెప్పబోతుంటే వినిపించుకోకుండా లోపలికి పరుగెత్తి తానూ పడుకున్నాడు. సరే చేసేదేం లేక అతనూ మేనువాల్చాడు.

ఈ లోగా వధువులు వరుణ్ణి గురించి మనస్సుల్లో వర్ణించుకుంటున్నారు - ''నల్లనివాడు పద్మ నయనమ్ములవాడు'' అంటూ. సరే-వరుడు నిద్ర లేచి ముఖం కడుక్కుని తీరికగా కూర్చున్న సమయంలో డి.వి.ఎల్ గారు కుశల ప్రశ్నలు మొదలెట్టారు. లోపల ఇల్లాలుగారు పెసరట్లకి పిండి రుబ్బుతోంది. అందుకని కాస్త ఆలస్యం ఉంది. ఎలాగైతేనేం యిప్పటికి కాస్త మాట్లేడేందుకు వీలు చిక్కింది. ''పొద్దున మీ ఇంటి కోసం ఎంతమందిని కనుక్కున్నాననుకున్నావ్ మామయ్యా'' అన్నాడు. 'మామయ్యా' అన్న సంబోధన ఒక్కటే వినిపించింది డి.వి.ఎల్ గారికి వీనుల విందుగా. సంతోషంతో నిలువునా ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ''వెంటేశం గారిల్లేదీ అంటే అటని కొందరూ ఇటని కొందరూ తెగ ఏడిపించారు'' అన్నాడు. డి.వి.ఎల్ గారు విస్తు కొద్దికొద్దిగా పోతూ ''వెంకటేశం గారు ఎవరు నాయనా'' అన్నాడు. ''ఎవరంటావేం మామయ్యా నువ్వేగా. నిన్నంటే మరచిపోయాగాని నీ పేరు కూడా మరచిపోతానా? అందరినీ అడిగినట్లే మీ ఇంటికీ వచ్చి అడిగాను ఫలానా వారిల్లేదని. కాని, వినిపించుకోకుండా పెట్టె లాగేసుకొని మిమ్మల్ని పిలుచుకొచ్చేశాడు బావమరిది. పైగా నా కోసం మూడు రోజుల నుంచీ ఎదురు చూస్తున్నారట. నా కోసం ఎదురు చూసేది మీరు కాక ఇంకెవరుంటారు? వీటన్నింటిని బట్టి నువ్వే మా మయ్యవని గుర్తించగలిగాను లేకపోతే నిన్ను బొత్తిగా గుర్తు పట్టేవాణ్ణి కాను. ఈ ఊరినీ ఎప్పుడో పదిహేనేళ్ళ కిందట చూశాను'' అన్నాడు కుర్రాడు.

ఎవరింటికో వెళ్ళాల్సినవాడు పొరపాటున తన ఇంటికి వచ్చాడని తెలుసుకోడానికి ఎక్కువ సేపు పట్టలేదు డెవిల్ గారికి. ముచ్చెమటలు పోశాయి. "అయినా... ఎవరింటి చుట్టమైతేనేంలే మన పిల్లలని చేసుకునేందుకు? మన అదృష్టం కొద్దీ యిక్కడకు వచ్చాడు" అనుకుని స్థిమితపడి, ఉన్న ఒక్క అనుమానం తీర్చేసుకుంటే సరిపోతుందని "మీరు నియోగులేనా" అని అడిగాడు. అతగాడు చిరునవ్వుతో "అదేమిటి మామయ్యా అలా అడుగుతావు... మనం వైదీకులం కదా!" అన్నాడు. డెవిల్ గారు స్పృహ తప్పి పడిపోయే వారేగాని పోలేదు. 'అవతార పురుషుడు' ఆయన ముఖంలోని పంచరంగులనీ చదువుకున్నాడు.

ఇక తర్వాత ఏం జరిగిందీ చెప్పడం అనవసరం. క్లుప్తంగా - అతడు బెడ్డింగు చంకనీ బెట్టుకుని చక్కా బోయాడు. డెవిల్ గారు ఈ వార్తని వంటింట్లో పడేశారు. వంటిల్లు భగ్గుమంది. ఇల్లాలు తెప్పరిల్లి ''అద్దం పగిలినప్పుడే అనుకున్నా'' అంది. ''ఇదంతా ఆ వెధవ చేశాడు. ఎవడో తెలుసుకోకుండా దారేపోయే అప్రాచ్యపు వెధవని తీసుకొచ్చాడు. ఏడీ భడవ'' అని అరిచాడు డెవిల్ గారు. కాని, ఆ భడవ గారు రోడ్ల మీద ఉద్యోగానికి వెళ్ళారు. ఈ వడగాలి వార్తకి వధువుల ముఖాలు వాడిపోయాయి. పెనం మీద పెసరట్లు అలాగే నిలువునా మాడిపోయాయి.

నండూరి పార్థసారథి
(ఇది నా మొట్ట మొదటి కథ - 1957 డిసెంబరు 25వ తేదీన ఆంద్రప్రభ వారపత్రికలో ప్రచురితమయింది. అప్పటికి నా వయస్సు పద్ధెనిమిది.)

Next Post