Picture

"నేను చచ్చిపోదలుచుకున్నాను. తలుచుకున్నా, తలుచుకోకపోయినా ఎప్పటికైనా చచ్చిపోక తప్పదనుకోండి-అరవయ్యో యేటో, డెబ్భయ్యో యేటో, వందో యేటో. కాని, అలా చావు సహజంగా వచ్చేవరకు బ్రతికి, భూమ్మీద నూకలు వృధా చేయడం నాకు ఇష్టం లేదు. అందుకని అర్జెంటుగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను. ఎండ్రినో, సైనైడో సంపాదించడమే తరువాయి. అంతకంటే స్లీపింగ్ పిల్స్ అయితే శ్రేష్ఠం. సునాయాసంగా శాశ్వత నిద్రలోకి జారిపోవచ్చు. ప్రస్తుతం వాటిల్లో దేన్నో ఒక దాన్ని సంపాదించే ప్రయత్నంలో ఉన్నాను. దానికి పెద్ద ప్రయత్నం కూడా కావాలా అంటారేమో, మందుల షాపువాడు నా వాలకం చూసి అనుమానించి మీకు (పోలీసు వారికి) పట్టిస్తే మొదటికే మోసం.

అసలు ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే, రేపు ఎక్కడన్నా నా శవం కనిపిస్తే హత్యో, ఆత్మహత్యో తెలీక మీరు దర్యాప్తు చేస్తారేమోనని, మీకు ఆ శ్రమ లేకుండా చేయడానికే నన్ను గురించి వివరాలన్నీ రాస్తున్నాను."

"నా పేరు రామారావు, వయస్సు 24 సంవత్సరాలు. పి.యు.సి. దాకా చదివాను. మా నాన్నగారు పోగానే చదువు మానేశాను సోమతులేక. మా అమ్మ అంతకు ముందే పోయింది. నాకు తోబుట్టువు లెవరూ లేరు. నా అన్న వాళ్ళెవరూ లేరు. (ఉన్నా, నేను వాళ్ళవాడినని వాళ్ళు ఒప్పుకోరు) పి.యు.సి. పాసైన తర్వాత నేను చాలానే ఉద్యోగాలు చేశాను. ఆత్మగౌరవం కలవాడిని కాబట్టి 'ఉద్యోగాలు' అంటున్నాను. మామూలుగా అందరూ వాటిని 'కూలిపనులు' అంటూ ఉంటారు, ఎవరేమన్నా నాకేం ఫర్వాలేదనుకోండి. ప్రస్తుతం నేను రైల్వే బ్రిడ్జిపక్కన పార్కు నిర్మాణంలో రాళ్ళెత్తే ఉద్యోగం చేస్తున్నాను. రెండు పూటలా భోజనానికి సరిపోయే జీతం సంపాదిస్తున్నాను. నా విలాసం పట్టణం పొలిమేరల్లో వున్న పాడుపడిన రామాలయం.

''ఆత్మహత్యకు కారణాలు కూడా మీకు అవసరమనుకుంటాను. నాకు ఎవరిపట్ల ద్వేషంగానీ, కోపం గానీ లేవు. నన్ను ఆదరించకపోవచ్చుగానీ నేనంటే ఎవరికీ ద్వేషం, కోపం లేవు. అసలు ఎవరైనా గానీ నన్ను ఆదరించలేదని నేనెప్పుడూ అనుకోలేదు. ఎందుకు ఆదరించాలి.? రాయిలా వున్నాను. నాకేం తీపరమా? సినిమా హీరో అంత పర్సనాల్టీ వుండి కూడా నేను సంపాదించి నలుగురిని ఆదుకోలేకపోతున్నాను కదా అని బాధపడుతున్నాను. కేవలం నా పొట్టకోసమే బతుకుతున్నాననీ, తినడం కోసమే బతుకుతున్నాననీ, ఇంతకంటే నా బతుక్కి అర్థం, ప్రయోజనం లేవనీ తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం కలుగుతోంది.

"విద్యావంతుల నిరుద్యోగ పరిస్థితిని ప్రతిపక్షాల దృష్టికి తెచ్చి, పార్లమెంటులో గొడవ చేయిద్దామనే దుర్బుద్ధితో నేను ఆత్మహత్య చేసుకోవడం లేదు. పాపం ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుంది జనాభా పెరిగిపోతుంటే.

"తను భూమికే బరువుచేటు అనీ, తన వల్ల దేశంలో ఆహార ధాన్యాలు వృధా అవుతున్నాయనీ, ఎంతకాలం వేచియున్నా ఈ పరిస్థితి మారదని అనుకున్న తర్వాత ఎవడైనా గానీ ఆత్మహత్య చేసుకొనకపోవడం అన్యాయం, అక్రమం అనిపించింది నాకు. ఏటా ఎలకలవల్ల ఎన్ని వేల టన్నుల ఆహార పదార్థాలు వృధా అవుతున్నాయో ప్రభుత్వం అంచనా వేసి చెప్పింది. నిరుద్యోగుల వల్ల ఎన్ని టన్నుల ఆహారం వృధా అవుతున్నదో అంచనా వేసే రోజు త్వరలోనే రావచ్చు. అంతవరకు ఆగడం నాకు ఇష్టం లేదు.

"ఆశ (అనగా 'హోప్') మనిషికి ప్రాణం. ఆశ పోతే ప్రాణం పోయినట్లే. ఎవడైనా చావడానికి సిద్ధంగా వున్నాడంటే వాడిలో 'ఆశ' అంతరించిపోతున్నదన్నమాట. వాడు మళ్ళీ కోలుకుంటున్నాడంటే 'ఆశ' మళ్ళీ పుంజుకుంటున్నదన్నమాట. 'ఆశ' చచ్చిపోయినా మనిషి చావలేదంటే వాడు జీవచ్ఛవం అన్నమాట. ప్రస్తుతం నేను ఆ స్థితిలో వున్నాను. చట్టరీత్యా ఆత్మహత్య నేరమని నాకు తెలుసు. నేరం చేసినవాళ్ళు శిక్ష అనుభవించాలనీ తెలుసు. నా ఆత్మహత్యా నేరానికి మీరు ఏ శిక్ష విధించినా అభ్యంతరం లేదు.

''ఇకపోతే అన్నింటికంటే ముఖ్యమైన విషయం, నా యావదాస్తిని మీకు - అనగా ప్రభుత్వం వారికి - సర్వహక్కులతో ధారపోస్తున్నాను. నా యావదాస్తి ఒక చిన్నసంచీలో వుంది. ఆ సంచీ నా విలాసమందిరమైన రామమందిరంలో ఉత్తరపు గోడ బీటు యిచ్చినచోట, ఆ బీటులో నుంచి రావి మొక్క మొలిచిన చోట భద్రం చేశాను. దానిని మీరు స్వాధీనం చేసుకోవచ్చును. అందులో శాల్తీలన్నీ సరిగా వున్నాయో లేవో చూసుకోండి. అందులో ఒకచొక్కా. ఒక లాగూ, ఒక బనీను, ఒక డ్రాయరు, ఒక తుండుగుడ్డ, ఒక ఎస్సెల్సీ రిజిష్టరూ-అమాంబాపతు ఆరు శాల్తీలున్నాయి. ఎస్పెల్సీ రిజిష్టరులోనే నా పి.యు.సి. సర్టిఫికేట్, కాండక్ట్ సర్టిఫికేట్, గజెటెడ్ ఆఫీసర్ చేత ఎటెస్ట్ చేయించిన పాస్ పోర్టు సైజు ఫొటో ఉన్నాయి. నా పుట్టిన తేదీ, పుట్టిన వూరు, తండ్రిపేరు వగైరా వివరాలన్నీ ఆ రిజిష్టరులో ఉన్నాయి. వాటి సహాయంతో జనన మరణాల చిఠ్ఠాలో మరణాల కాతాలో నా పేరు జమ కట్టించండి. మరొక ముఖ్య విషయం-బతికుండగా ప్రపంచానికి లయబిలిటీగా ఉన్న నా దేహం మరణానంతరం ఎస్సెట్ కావచ్చు. నా దేహంలో పనికోచ్చే స్పేర్ పార్టులన్నింటినీ జాగ్రత్తగా ఊడబెరికించి అవి లేనివారికి ఉచితంగా దానం చెయ్యండి. ఇక సెలవు''.

పోలీసులకు లేఖ రాయడం పూర్తి అయిన తర్వాత ఆ కాగితాన్ని మడిచి పాంటు జేబులో పెట్టుకున్నాడు రామారావు. 'రాత్రి భోజనం మానేసి, డబ్బులు మిగిల్చి ఒక పావలా పెట్టి గడ్డం గీయించుకుని, ఇంకో పావలా పెట్టి చొక్కా లాగూ ఇస్త్రీ పెట్టించుకుని, కొంచెం స్టయిలుగా వెళ్ళి డబాయించినట్లుగా అడిగితే షాపువాడు స్లీపింగ్ పిల్స్ ఇవ్వకపోడు' అనుకుంటూ ఉద్యోగానికి బయల్దేరాడు.

ఉదయం ఎనిమిది గంటలకే ఎండ చుర్రుమంటోంది. అతను కార్యక్షేత్రానికి చేరేసరికి అప్పటికే అతని సహోద్యోగులందరూ రాళ్ళతట్టలు, సిమెంటు, బాల్చీలు మోస్తున్నారు.

''నీకోసమే సూత్తండా రా... ఇయీల అందర్లోకి నువ్వే ఆల్సెం. రేత్రి రొండో ఆటకెల్లావేంటి? లేకపోతే సుక్కేసుకున్నావా?" అంటూ స్వాగతమిచ్చాడు బాస్.

"అయ్యో రాత. ఇంతోటి సంపాదనకి అది కూడానా మేస్త్రీ" అన్నాడు రామారావు.

"నీ కేంటయ్యా పొంతులూ... ఎనకా ముందూ ఎవరూ లేరు. మా రాజులా ఓటల్లో బోంచేత్తావ్. అయినా సదువుకున్నోడివి, నీకిదేం పనయ్యా-నిచ్చేపనంగా ఏ గుమాత్తాపనో చూసుకోక".

"నా చదువు సంగతి జ్ఞాపకం చెయ్యకు మేస్త్రీ నీకు పుణ్యం వుంటుంది" అంటూ రామారావు పాంటుపైకి మడతపెట్టి పనిలోకి దిగాడు.

రసవత్తరమైన బూతులు మిళాయించి సినిమా కబుర్లు చెప్పుకుంటూ కూలీలు జోరుగా, హుషారుగా పనిచేస్తున్నారు. కొందరు పునాదులు త్రవ్వుతున్నారు. కొందరు త్రవ్విన మట్టిని తట్టల్లో కెత్తుకుని వేరేచోట పోస్తున్నారు. కొందరు రాళ్ళు, ఇటుకలు, సిమెంటు చేరవేస్తున్నారు. కొందరు సిమెంటు, ఇసక నీళ్ళతో కలుపుతున్నారు. కొందరు తాపీ పని చేస్తున్నారు. మేస్ట్రీ అజమాయిషీ చేస్తున్నాడు.

అంతకంతకు ఎండ ముదురుతోంది. కూలీల బూతుల జోరు తగ్గింది. అదే నిష్పత్తిలో పని వేగం తగ్గింది.

"తొమ్మిది... పది... పదకొండు గంటలయింది. కూలీల బనీన్లు చెమటతో తడిసిపోయాయి. మధ్య మధ్య తాంబేటికాయ ఎత్తి గటగట నీళ్ళు తాగుతున్నారు. కాసిని నీళ్ళతో మొహాలు తడుపుకుంటున్నారు. మళ్ళీ పనులు చేస్తున్నారు.

ఎండ కణకణ మండుతోంది. కాకా హోటల్ కుర్రాడు పది పైసల స్పెషల్ టీ తెచ్చాడు. అందరూ ఒక్క నిమిషం పని ఆపి, టీ సేవించారు. అంత ఎండలోకూడా వేడి వేడి టీని ఊదుకుంటూ, ఊరించుకుంటూ, చప్పరించుకుంటూ తాగుతుంటే వాళ్ళకి మహా తృప్తిగా వుంది. ఆ తృప్తితో మళ్ళీ ఓ గంటసేపు మంచి వూపులో పనిచేశారు.

పన్నెండు అయింది.... కూలీల పని జోరు తగ్గింది. ఎండ నిప్పులు చెరుగుతోంది. కడుపులో ఆకలి చిచ్చు రేగుతోంది. అన్నం మూటలు విప్పడానికి ఇంకా గంట టైము వుంది. అందరితోపాటు రామారావుకీ ఇదంతా మామూలే. తను చాలా కష్టపడి పోతున్నట్లు అనుకోవడం మానేసి కొన్ని సంవత్సరాలయింది. ప్రచండమైన ఎండకీ, ఎముకలు కొరికే చలికీ, గాలివానలకీ, ఢక్కామొక్కీలకీ ధాటీగా తట్టుకుని రాటు తేలింది అతని శరీరం. వీటికే కాదు ప్రపంచంలో దేనికీ అతను భయపడలేదు. జీవితానికే భయపడలేదు. మరి ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం దేనికి? బతకడం యమ బోరుగా ఉంది గనక. యమలోకంలో కూడా ఇంత యమబోరు ఉండదని అనుకుంటున్నాడు గనక. ప్రపంచం ఆరుబయలు కారాగారంలాగా, జీవితం యావజ్జీవ కారాగార శిక్షలాగా ఉంది గనక. బ్రతుకు భయంకరంగా లేదు. చిరాకుగా, అసహ్యంగా ఉంది. చస్తే పీడా పోతుందనిపిస్తోంది.

"లెగండ్రా లెగండి... సద్ది మూట లిప్పండి... ఒంటి గంటయింది" అన్నాడు మేస్త్రీ కూలీలను హెచ్చరిస్తూ.

కూలీలు బిలబిలమంటూ చెట్టు నీడకి నడిచి వెళ్లారు. అక్కడ అందరూ మూటలు విప్పారు. జొన్న సంగట్లో ఉల్లిపాయ, పచ్చి మెరపకాయ కొరుక్కుతింటుంటే... ఆహా... ఏం తృప్తి... ఏం మజా... స్వర్గానికి బెత్తెడే ఎడం. తాంబేటికాయలో నీళ్లు రెండు గుక్కలు తాగితే... హమ్మయ్య... కడుపు చల్లబడింది. పైన మర్రిచెట్టు రెమ్మాడుతుంటే ప్రాణాలు ఎక్కడికో తేలిపోతున్నాయి.

"ఇదిగో పొంతులూ... ఓటల్కి పోయి వణ్ణంబోంచేసి రాపో... అయినా సదువుకున్నోడివి నీకిదేం వుజ్జోగవఁయ్యా... నిచ్చేపనంగా..." మిగతా మాటలు వినలేదు రామారావు. లేచి రోడ్డు వైపు నడిచాడు.

హోటల్లోకి వెళ్ళి ముందు చల్లటి నీళ్ళతో మొహం తడుపుకుని, కాళ్ళు, చేతులు కడుక్కుని, టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఆకలితో కడుపు ఆవురావురుమంటోంది. ఐదారు గంటలు ఒళ్ళొంచి పనిచేస్తే భోజనం ఎంత నాసిరకమైనా, సన్నాసిరకమైనా అమృతతుల్యంగా ఉంటుందికదా అనుకున్నాడు.

చిన్నప్పుడు-అమ్మా, నాన్నా ఉన్నప్పుడు, బాగా బతికినప్పుడు ఏమీ సయించేది కాదు. ప్రతి ఆదరువుకీ వంకలు పెట్టేవాడు. నెయ్యి వేసి కలిపిన అన్నం పారేసేవాడు. అమ్మా, నాన్నా పోయిన తర్వాత తను దరిద్రుడయ్యాడు. దరిద్రుడికి ఆకలెక్కువ. ఆకలి రుచెరగదు. అందుకే యిప్పుడు అన్నీ సయిస్తున్నాయి. రుచిసంగతి పట్టించుకోకుండా తినడంలో నాలుకకి చాలా కష్టపడి ట్రైనింగ్ యిచ్చాడు. 'భీముడుపట్టు' అనే కొత్త పద్ధతి కనిపెట్టాడు. ఈ పద్ధతిలో భోజనం మూడు వాయలుగా, లేక మూడు దశలుగా వుంటుంది. మొదటి వాయలో పప్పు, కూర, పచ్చడి, ఇంకా ఏమేమి ఘన పదార్థాలుంటే అన్నీ అన్నంలో కచాపచా కలిపేసి, వీలైనంత పెద్ద ముద్దలు చేసుకుని నోట్లో కుక్కేసుకోవాలి. ముద్ద నాలుక మీద ఆట్టే నిలబడకుండా మింగేయ్యాలి. మింగుడు పడకపోతే గొంతులో కాసిని నీళ్ళు పొయ్యాలి. రెండోవాయ సాంబారు, రసం కలిపి కొట్టాలి. మూడో వాయ మజ్జిగ అన్నం. గొంతులో నుంచి తేలిగ్గా జారిపోయేందుకు వలసినన్ని మజ్జిగ లేదా నీళ్ళు పోసి జుర్రెయ్యమే. ఈ 'భీముడుపట్టు'కి రుచితో పేచీలేదు, నమిలేపని లేదు-మింగెయ్యడమే. ఇదేం కూర, ఇదేం పచ్చడి, సాంబారులో ముక్కలేమిటి, అసలు వీటన్నింటిలోనూ ఉప్పు ఉందా అన్న విచక్షణ లేదు. భోక్తకి అన్ని ఆదరువులపట్ల సమదృష్టి ఏర్పడుతుంది. ఈ భోజనం నిష్కామకర్మ మోడల్లో ఉంటుంది.

మూడు వాయలూ ఆరు నిమిషాల్లో పూర్తి చేసి రోడ్డుమీద పడ్డాడు రామారావు.

"హలో... హలో... మైక్ టెస్టింగ్... మైక్ టెస్టింగ్" మున్సిపల్ గ్రౌండ్స్ లో ఏదో సభకి మైకులు ఏర్పాటు చేస్తున్నారు. వేదికపై షామియానా వేశారు. రంగుకాగితాల తోరణాలు కట్టారు. బల్లలు, కుర్చీలు వేశారు. బల్లలపై అందమైన కలంకారి బట్ట కప్పారు. వేదికపై చుట్టూ పూల కుండీలు పెట్టారు. బల్లలకు అటూ యిటూ, వెనకా ముందూ నాలుగు పెడస్టల్ ఫాన్ లు నిలబెట్టారు. బల్లలపై ఫ్లవర్ వేజ్ లు, అగరువత్తుల స్టాండులు పెట్టారు.

రామారావు కార్యరంగానికి తిరిగి వచ్చేసరికి ఎవరో ఒక 'వైట్ కాలర్' పెద్ద మనిషి మేస్త్రీతో మాట్లాడుతున్నాడు. మున్సిపల్ గ్రౌండ్స్ లో ఇప్పుడు మంత్రి గారి ఉపన్యాసం ఉందిట. గ్రౌండ్స్ లో స్టేడియం నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేస్తారట. తర్వాత వేదిక ఎక్కి ఉపన్యసిస్తారట. జనం ఎక్కువమంది వచ్చేటట్లు లేరుట. ఎక్కువ మంది రాకపోతే మంత్రిగారికి ఇన్స్పిరేషన్ రాదుట. కోపం వస్తుందట. 'ఈ మాత్రానికేనా నన్ను అంత దూరం నుంచి పిలిపించారు' అని విసుక్కుంటారుట. అందుకని ఇక్కడి కూలీ లందరినీ పిల్చుకు వెళ్ళడానికి ఆ వైట్ కాలర్ గారు వచ్చారు. రైలుకట్ట అవతల కొండల దగ్గర రాళ్ళు కొట్టే జనాన్ని కూడా పిల్చుకు వస్తారట.

''మేవంతా పనొదిలేసి వత్తే కంట్రాకరు గారు కోప్పడరంటండీ. గంట కింతని కూలిడబ్బుల్లో యిరక్కోత్తారండి. సాయంకాలం సల్లబడిన తరవాత పెడితే జనం శానామంది వొచ్చేవోళ్ళు గదండీ. ఈ మిట్ట మజ్జాన్న పేళ ఎండలో పెడితే ఇంటోంచి ఎవురు కదుల్తారండీ, మేం పొద్దు కూకులూ ఎండలో పని చేసే వోళ్ళం గాబట్టి ఎక్కడైనా ఒకటే ననుకోండి'' అన్నాడు మేస్త్రీ.

''సాయంకాలం మంత్రిగారు మళ్ళీ ఇంకో టౌనుకెళ్ళి సారా దుకాణానికి ప్రారంభోత్సవం చెయ్యాలిట. ఈ శంకుస్థాపనకి ఆయన్ని రప్పించేసరికి తలప్రాణం తోకకి వచ్చింది. మీ కాంట్రాక్టర్ గారితో నేను చెబుతానులే. మంత్రిగారి ఉపన్యాసమంటే ఆయనేమి అనడు మిమ్మల్ని, ఆయనకీ, మంత్రిగారికీ జోస్తీ కూడా ఉంది. అయినా ఎంత సేపు-ఒక్క అరగంట''.

మేస్త్రీ చేత సరే ననిపించుకుని ఆయన వెళ్ళాడు.

''అమ్మమ్మమ్మమ్మొ ముద్దంటే చేదా...'' సభా స్థలం నుంచి లౌడ్ స్పీకర్ లో పాట వినిపిస్తోంది.

''అరేయ్ తట్టలూ, బాల్చీలు కింద పడెయ్యండ్రా. ఎవురో మంత్రిగా రొచ్చారంటా. ఆయనేందో మాట్లాడతారంట. పదండి. ఓ అరగంట ఇనేసి వద్దారి'' అన్నాడు మేస్త్రీ.

'లంచ్ అవర్' అనంతరం మళ్ళీ పనిలోకి దిగిన కూలీలంతా పని వదిలేసి, మున్సిపల్ గ్రౌండ్ కు బయల్దేరారు. వారితో పాటు రామారావు కూడా బయల్దేరాడు.

క్రమంగా సినిమా రికార్డుల జోరు పెరిగింది. రోడ్డు పక్క చెట్లకింద గోలీలాడుకుంటున్న పిల్లలు, బడి ఎగ్గొట్టిన కుర్రాళ్ళు కాలక్షేపం లేక బడ్డీ కొట్ల దగ్గర బీడీలు కాల్చుకుంటూ కూర్చునే నిరుద్యోగులు ఓ రెండు మూడు వందల మంది మైదానంలో చేరారు. తర్వాత రిక్షాలలో పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వోద్యోగులు, పత్రికా విలేకరులు వగైరా ఇంకో నాలుగు వందల మంది చేరారు.

''నేను పుట్టిందే నీ కోసమూ, కన్ను కొట్టిందీ నీకోసమూ'' అని లౌడ్ స్పీకర్ స్వాగతం పాడుతూ వుండగా మంత్రిగారు ప్లిమత్ కారులోంచి దిగారు. ఆయన కారుకు ముందు పది కార్లు, వెనక పది కార్లు వచ్చాయి. వాటిల్లో ఓ వందమంది అధికారులు, శాసనసభ్యులు, పురపాలక సంఘ సభ్యులు, పురప్రముఖులు వచ్చారు. అప్పటికి చుట్టుపక్కల వివిధ 'నిర్మాణాత్మక కార్యకలాపాల్లో' పాల్గొంటున్న కార్మిక మహాజనులు ఐదారు వందలమంది చేరారు.

అంత విశాలమైన మైదానంలో ఈ జనం సముద్రంలో కాకి రెట్టలా వున్నారు. ఈ జనాన్ని చూసి మంత్రిగారు ఆశాభంగం పొందారు. ఆశాభంగం ఆయన మొహంలోనే కనిపిస్తోంది. 'ఎండ పేల్చేస్తుంటే ఇంట్లోంచి బయటకి ఎవరొస్తారు? ఈ పురప్రముఖులు కూడా తప్పనిసరిగా మొక్కు బడి తీర్చుకోవటం కోసం తిట్టుకుంటూ వచ్చినవాళ్ళే' అని మంత్రిగారు గ్రహించారు.

''అబ్బ.... ఏం ఎండ, ఏం ఎండ, చాలా తీవ్రంగా ఉంది. ఈ శంకుస్థాపన లాంఛనం పది నిముషాల్లో ముగించండి'' అన్నారు మంత్రిగారు శంకుస్థాపన కోసం త్రవ్విన గొయ్యి దగ్గరికి వెడుతూ.

సినిమా పాటలు ఆపు చేశారు. పురోహితుడు గారు మైక్ లో మంత్రాలు చదివారు. మంత్రిగారు కొబ్బరికాయ కొట్టారు. తాపీతో కాస్త సిమెంటు తీసి ఓ ఇటుక మీద వేశారు. ఈ కాస్త లాంఛనం అయ్యేసరికే మంత్రి గారు ఖద్దరు లాల్చీ చెమటకి తడిసింది. కండువాతో మొహాన చెమటతుడుచుకుంటూ ఆయన సపరివారంగా వేదికవద్దకు వెళ్లారు. వేదికపై ఆయన ఆసీసులు కాగానే నాలుగు పెడస్టల్ ఫాన్ లు ఝంయ్ మని తిరగడం మొదలుపెట్టాయి.

మైదానంలో ముందు వేదికకు దగ్గరగా రెండు మూడు వందల కుర్చీలు వేసి ఉన్నాయి. వాటిమీద అధికారులు, స్థానిక నాయకులు, పురప్రముఖులు, విలేఖరులు ఆసీనులైనారు. కార్మిక మహాజనులు వెనక నుంచున్నారు. పదినిమిషాల స్వాగతోపన్యాసం తర్వాత పుష్పమాలాలంకృతులైన మంత్రిగారు ఉపన్యాసం ప్రారంభించారు.

''మహాజనులారా... సోదర సోదరీ మణులారా... మీయావన్మందికీ నా యొక్క నమస్కారాలు. ఈనాడు మనం ఇక్కడ ఈ శుభసందర్భంలో-అనగా ఈ యొక్క స్టేడియం శంకుస్థాపన మహోత్సవ సందర్భంలో సమావేశం కావడం అనేటటువంటిది నిజంగా కూడా ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. నా సొంత నియోజకవర్గంలో ప్రధాన పట్టణంలో ఈ విధంగా ఒకానొక స్టేడియంకు శంకుస్థాపన చేయడం అనేటటువంటిది నాకు ఎంతో గర్వకారణమైనటువంటి విషయం''.

మంత్రిగారి ఉపన్యాసం జోరు పెరుగుతోంది. ఎండ పేలిపోతోంది. సూర్య భగవానుడు సభాసదులపై నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. పెడస్టల్ ఫాన్ గాలికి మంత్రి గారి కండువా నాట్యం చేస్తోంది.

''....ఈనాడు ఈ యొక్క ఎండ చాలా తీవ్రంగా ఉన్నప్పటికిన్నీ కూడా తమ యావన్మందిన్నీ విచ్చేశారంటే అది నా పట్ల మీకుగల ఆదరాభిమానాలేనని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. మీకు ఆట్టే శ్రమ లేకుండా నా ప్రసంగాన్ని ఒక్క అరగంటలో ముగించగలనని మనవి చేసుకుంటున్నాను...''

''అయ్య బాబోయ్... ఇంకా అరగంటే! ఎరక్కపోయి వచ్చాంరా దేవుడా'' అన్నాడు ఒక విలేకరి జనాంతికంగా.

''గెస్ట్ హౌస్ లో బాగా డోసు వేసుకున్నట్టున్నాడు గురూ... చుక్క పడితే గానీ ఈయనకి ఇన్ స్పిరేషన్ రాదు. ఆ నిషా తగ్గేదాకా ఉపన్యాసం ఇస్తాడు'' అన్నాడు ఇంకో విలేఖరి.

''ఏడ్చి మొత్తుకున్నట్లే ఉంది. ఆయనకి ఇన్ స్పిరేషనూ, మనకి పెర్ స్పిరేషనూ'' అన్నాడు మొదటి విలేకరి-చెమట తుడుచుకుంటూ.

మంత్రిగారు వేదికపై ఆవేదన పడుతున్నాడు. ''దేశంలో నానాటికీ నైతిక ప్రమాణాలు అడుగంటిపోతున్నాయి. ఇది ఎంతో శోచనీయం''.

''నీలాంటి వాళ్ళు మంత్రులవుతుంటే అడుగంటక చస్తాయా? పర్మిట్లకీ, లైసెన్సులకీ లంచాలు పట్టి ఆరేళ్ళల్లో నలభై లక్షలు సంపాయించావు'' అన్నాడు రెండో విలేఖరి.

''ఇష్... ఎవడైనా వింటే బావుండదయ్యా... కాసేపు మాట్లాడకు'' అని హెచ్చరించాడు ఒకటో విలేఖరి.

మంత్రిగారు అభిభాషిస్తున్నారు. ''ప్రాచీన సంప్రదాయాలను, ధర్మాలను, భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. వ్యవసాయ క్షేత్రాల్లో, కర్మాగారాల్లో, ఇతర నిర్మాణాత్మక కార్యకలాపాల్లో ఇతోధికంగా కష్టపడి, చెమటోడ్చి, పనిచేసి ఉత్పత్తులను పెంచాలి. అన్ని రంగాల్లోనూ దేశాన్ని స్వయం సమృద్ధం చేయాలి. ఆనాడే మనయొక్క దేశంలో దారిద్ర్యం తొలగిపోతుంది. ఆనాడే మనం కలలుగన్న సోషలిష్టు వ్యవస్థ నెలకొంటుంది. ఆనాడే దేశం సౌభాగ్యవంతమవుతుంది. ఆనాడే మన దేశం ప్రపంచంలో గర్వంగా తల ఎత్తుకోగలుగుతుంది.

''దేశం ఎన్నో క్లిష్టపరిస్థితుల నెదుర్కొంటున్న ఈ సమయంలో ప్రతి ఒక్క పౌరుడు ఆత్మ విమర్శ చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, దేశానికి ఎంత వరకు ఉపయోగపడుతున్నాం అని ప్రశ్నించుకోవాలి. గొప్పవాడు, పేదవాడు, బలవంతుడు, బలహీనుడు అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరూ ఉడతాభక్తిగా, యథాశక్తిని దేశానికి సేవచేయాలి. నవభారత నిర్మాణంలో పాల్గొనాలి. దేశాన్ని సంపన్నం చేయాలి.

''మనకు కావలసినంత కార్మికశక్తి వుంది. దీనిని మనం పూర్తిగా సద్వినియోగపరచుకోవాలి. కార్మిక మహాజనులే మన జాతి నిర్మాతలు. ప్రాజెక్టులు, వంతెనలు, రోడ్లు, కాలవలు, కర్మాగారాలు నిర్మించేది ఎవరు? కార్మగారాలను నడిపిస్తున్నది ఎవరు? కార్మికులే. నిరుద్యోగ సమస్య వల్ల ఎన్నో లక్షలమంది శక్తి వృధా అవుతున్నది. ఈ సమస్యా పరిష్కారానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. ఈలోగా నిరుద్యోగులు నిరుత్సాహపడకూడదు. వారు కూడా శాయశక్తులా దేశానికి సేవచేయాలి.

"ఈనాడు దేశంలో నలుమూలలా నక్సలైట్ల విధ్వంసక కృత్యాలు చెలరేగుతున్నాయి. వీటిని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. మన కార్మికులు చెమటోడ్చి, రక్తం ధారపోసి నిర్మించిన కర్మాగారాలు ప్రాజెక్టులు, వంతెనలు నక్సలైట్ల విధ్వంస కృత్యాలకు ఆహుతి కాకుండా మనం కాపాడుకోవలసివుంది. అందుకోసం ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా మనం వెనుదీయకూడదు. సరిహద్దుల్లో మన జవాన్లు దేశ రక్షణకై ప్రాణాలర్పిస్తూ అమరజీవులవుతున్నారు. అదే విధంగా ప్రతి పౌరుడు దేశ సేవకు అంకితం కావాలి. ప్రతి వ్యక్తి అమరజీవి కావాలి..."

మంత్రి గారు గుక్కతిప్పుకోకుండా గంటసేపు ఉనన్యాసం దంచాడు. దేశంలో ఉన్న ఏ సమస్యను ప్రస్తావించకుండా వదలిపెట్టలేదు. ఉద్ఘాటించాడు, ఉద్భోధించాడు. హితవు చెప్పాడు. విజ్ఞప్తి చేశాడు, హెచ్చరించాడు. ఆవేదన వ్యక్తం చేశాడు. ఆశాభావం వ్యక్తం చేశాడు, విశ్వాసం ప్రకటించాడు. ఈ లోగా సభాసదులు 120 డిగ్రీల ఎండలో వడియాల్గాగ వేగిపోయారు. సగంలోలేచి వెళ్ళిపోతే బావుండదని చివరిదాకా భరించారు. "ఎందుకొచ్చామురా దేవుడా" అనుకున్నారు. "వీడి ఉపన్యాసం మండిపోను" అని తిట్టుకున్నారు.

"....మహాజనులారా... ఇప్పటికే కాలాతీతమయింది. తీవ్ర ఎండను భరించి మీరందరూ శ్రద్ధగా నా ఉపన్యాసం విన్నారంటే అది నాపట్ల మీ ప్రేమాభిమానాలేనని మనవి చేసుకుంటున్నాను. యువతరాన్ని ఉత్తేజపరచడమే నా జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాను. నా ఉపన్యాసం కనీసం మీలో ఏ ఒక్క వ్యక్తినైనా ఉత్తేజపరచగలిగితే ఈ నా శ్రమ సార్ధకమైనట్లుగా భావిస్తాను. ఇంతటితో విరమిస్తున్నాను. సెలవు".

మంత్రిగారి అరిగిపోయిన రికార్డు ఉపన్యాసం నిజంగానే సార్థకమయింది. ఆయన అన్నట్లుగానే అంతమందిలో కనీసం ఒక వ్యక్తి ఉత్తేజితుడైనాడు. అతను రామారావు. మంత్రిగారి ఉపన్యాసపు వరదపరవడిలో అతని ఆత్మహత్యా సంకల్పం ఊడ్చిపెట్టుకుపోయింది. ఉపన్యాసంలో చాలా భాగం వూకదంపుడుగానే అనిపించినా, కొంత భాగం ఎందుకో అతని మనస్సుకు బాగా పట్టింది. అంత మంది జనంలో తనను ఒక్కణ్ణి ఉద్దేశించే మంత్రిగారు ఆ మాటలు అన్నట్టు అనిపించింది.

సభలో ముందు వరసలో కుర్చీల్లో కూర్చున్న వైట్ కాలర్ పెద్దమనుషులు తిట్టుకున్నట్లుగా కార్మికులు తిట్టుకోలేదు ఉపన్యాసాన్ని. వాళ్ళకి, రామారావుకి రోజూ పగలంతా మండుటెండలో పని చేయడం అలవాటే, అసలు నగరంలోని ఎండ అంతా వాళ్ళ ఒంటిమీదే కాస్తుంది. మంత్రిగారి పుణ్యమా అని వారికి గంటైనా పని తప్పింది. ఆయన ఏం చెప్పారో వాళ్ళు విననేలేదు. అసలు వినడానికి వస్తే కదా? మేస్త్రీ చెప్పాడు కదా అని వచ్చి నించున్నారు అంతే.

ఉపన్యాసం అయిన తర్వాత అందరూ పనిలోకి తిరిగి వచ్చారు. రామారావు యాంత్రికంగా పని చేస్తున్నాడన్నమాటే గానీ, మనసంతా మంత్రిగారి మాటలమీదే వుంది. "....గొప్పవాడు, పేదవాడు, బలవంతుడు, బలహీనుడు... ఉడతాభక్తిగా, యథాశక్తిని దేశసేవ చేయాలి... కార్మికులే జాతి నిర్మాతలు... కార్మికులు చెమటోడ్చి రక్తం ధారపోసి నిర్మించిన కర్మాగారాలు, వంతెనలు... విధ్వంసక కృత్యాలకు ఆహుతి కాకుండా కాపాడుకోవాలి. ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా వెనుదీయకూడదు... ప్రతి వ్యక్తీ అమరజీవి కావాలి..."

సాయంత్రం ఆరు అయింది. అందరూ పని కట్టి పెట్టారు. మేస్త్రీ పంపిణీ చేసిన కూలి డబ్బులు మొల్లో దోపుకుని, ఎవరి దారిని వారు పోతున్నారు. రామారావు కూలి డబ్బులు జేబులో వేసుకుని హోటల్ కి వెళ్ళాడు. ఒక మూల ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుని, కాఫీకి ఆర్డరిచ్చాడు. అతని బుర్రంతా ఆలోచనలతో నిండిపోయింది. కాఫీ త్రాగేసి, జేబులోంచి పొద్దున్న రాసిన కాగితం తీసి చదువుకున్నాడు.

"ఉహూ... నా జీవితం నిరర్థకం కాదు. నేను తినే తిండి వృధాకాదు. తిండి వల్ల నేను పొందుతున్న సత్తువ వృధా కావడం లేదు. నా కాయకష్టం దేశానికి ఉపయోగపడుతున్నది. నా లాంటి వాళ్ళు ఎందరో శ్రమిస్తేనే దేశం సంపన్న మవుతుంది. ఎందరో లాగితేనే జగన్నాథ రథం కదులుతుంది. నా ఒక్కడివల్ల ఏమవుతుందిలే అని ఎవడికి వాడు కాళ్ళు జాపేస్తే రథం కదలదు. నాలాంటి వాళ్ళు చావకూడదు. సోమరితనం బలిసినవాళ్లు తప్ప యథాశక్తిని ఏదో ఒక పని చేసేవాళ్ళంతా దేశానికి ఉపయోగపడతారు. పులి విస్తరాకు కూడా ఎరువుగా పనికొస్తుంది. చీకి పారేసిన మామిడి టెంక కూడా ఒక మహా వృక్షాన్ని సృష్టించి, ప్రపంచానికి మధుర ఫలాలను అందిస్తుంది. మానవ జన్మ మామిడి టెంకపాటి చేయదా? నేను చావకూడదు. నా జీవితం సార్థకం అనుకుంటే, నా శ్రమ పవిత్రమనుకుంటే బ్రతుకుబోరుకొట్టదు. ఇక నా జీవితంలో నిరుత్సాహానికి తావులేదు. నిర్వేదానికి టైము లేదు" అనుకున్నాడు.

అంతలోనే - "ఈ ఉత్తేజం ఎక్కువ సేపు నిలబడదు, శ్మశాన వైరాగ్యంలాగా, పురాణ వైరాగ్యంలాగా ఇది క్షణికం" అనుకున్నాడు. మళ్ళీ "ఉహూ... ఇది క్షణికం కాకూడదు. ఇదంతా కాగితం మీద రాయాలి. నిరుత్సాహం ఆవరించినప్పుడల్లా కాగితం తీసి చదువుకోవాలి" అనుకున్నాడు. పొద్దున్న రాసిన కాగితాన్ని వెనక్కి తిప్పి, జేబులోంచి పెన్సిల్ ముక్క తీసి, తను అనుకున్నదంతా రాశాడు. మంత్రిగారి ఉపన్యాసంతో తన దృక్పథమే మారిపోయిందనీ, తన జీవితం కొత్త మలుపు తిరిగిందనీ రాసుకున్నాడు. చివర "అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ" అని రాసుకున్నాడు. కాగితం, పెన్సిల్ జేబులో వేసుకున్నాడు. బిల్లు చెల్లించి హోటల్లోంచి బైటపడ్డాడు.

రోడ్డు మీద లైట్లు వెలిగాయి. రామారావు ఆలోచిస్తూ నడుస్తున్నాడు. ఇక స్లీపింగ్ పిల్స్ అక్కర్లేదు. గడ్డానికేం తొందరలేదు. ఇస్త్రీ అనవసరం. కాబట్టి ఈ రాత్రి శుభ్రంగా భీముడుపట్టు పట్టవచ్చు. మరీ హుషారు తన్నుకొచ్చినప్పుడు-నెల్లాళ్ళకో, పదిహేను రోజులకో ఒకసారి ఒక సిగరెట్టు ముట్టించడం రామారావుకి అలవాటు. సిగరెట్టును ఒక లక్జరీగా అట్టేపెట్టుకున్నాడు. అతను ఇప్పుడు ఒక్క సిగరెట్టు కాల్చేసి, బుర్ర ఝాడించేసుకుంటే బావుంటుందని అనిపించింది. సెంటర్ కి వెళ్ళి, పేవ్ మెంట్ మీద నుంచుని, సిగరెట్ విలాసంగా తాగుతూ, వచ్చేపోయే వాహనాలనీ, జనాన్నీ చూస్తున్నాడు. పరధ్యానంగా సిగరెట్లు తాగితే డబ్బులు వేస్టు అవుతాయని, సిగరెట్టు మజా మీద మనస్సును కేంద్రీకరించాడు. పొగను రకరకాలుగా ఊదాడు. ఒకసారి ఊదినట్లు ఇంకోసారి ఊదకుండా కొత్త కొత్త ప్రయోగాలు చేశాడు. మధ్య మధ్య పొగను మింగి ముక్కులోంచి తెప్పించాడు. ఓ పది నిమిషాలు మంచి కాలక్షేపం అయింది. తర్వాత కొంత సేపు రోడ్లు సర్వే చేశాడు. సినిమా పోష్టరు తిలకించాడు.

ఎనిమిదింటికి హోటల్ కి వెళ్ళి టేబుల్ ముందు కూర్చున్నాడు. మంత్రిగారు ఇతోధికంగా కృషి చేయమన్నారు. అందుకని ఈ పూట ఇతోధికంగా భోజనం చేయాలనుకున్నాడు. 'తిండి గలిగితె కండగలదోయ్. కండ గలవాడేను మనిషోయ్' అనుకున్నాడు. సర్వర్ వడ్డిస్తుంటే తన మట్టుకు తాను చాలు అనలేదు. సర్వర్ చాల్లెమ్మనుకుని వెళ్ళీపోతున్నాడు. ఇది లాభం లేదనుకుని, వెళ్ళిపోతున్న వాడిని వెనక్కి పిలిచి వడ్డింపించుకున్నాడు. అతని తిండి చూసి సర్వర్ అదిరిపోయాడు. కౌంటర్ దగ్గర కూర్చున్న ప్రొప్రయిటర్ కూడా ఓ కంట కనిపెడుతున్నాడు. "నువ్వు ఇచ్చిన డబ్బుకి ఇంత తిండి తింటే మాకు గిట్టుబాటు కాదు" అన్నట్లుగా ఉంది అతడి చూపు. "నీకు గిట్టుబాటు కాకపోయినా దేశానికి గిట్టుబాటవుతుంది లేవయ్యా, రేపటి నుంచి ఇతోధికంగా పనిచెయ్యబోతున్నాను" అని మనస్సులోనే సమాధానమిచ్చాడు రామారావు. ఇంకా ఎక్కువ తింటే ప్రొప్రయిటర్ దిష్టికొట్టేట్టున్నాడని లేచి చెయ్యి కడుక్కున్నాడు.

మరికాసేపు రోడ్లు సర్వేచేసి, గూటికి చేరదామనుకుని బయలుదేరి మళ్ళీ ఆ ఉద్దేశం విరమించుకున్నాడు. "మనస్సు కాస్త ఉల్లాసంగా ఉందికదా. ఇప్పుడు ఆ పాడుబడ్డ గుడికి వెళ్ళడం దేనికి-రైలు వంతెన కింద ఇసకలో పడుకుంటే చల్లగాలికి హాయిగా నిద్రపడుతుంది' అనుకుని అక్కడికి బయలుదేరాడు.

రైలు వంతెన అరమైలు పొడుగుంది. దాని క్రింద నది పూర్తిగా ఎండిపోయింది. సాయంత్రం చల్లబడిన తర్వాత ఊళ్ళో జనం అక్కడికి షికారుగా వస్తారు. వెన్నెల రోజులయితే రాత్రి ఎనిమిది, తొమ్మిది గంటల దాకా కూర్చుని వెడతారు. వెన్నెల రోజుల్లో అదే ఆ వూరికి మెరీనాబీచ్. చీకటి రోజుల్లో అయితే సూర్యాస్తమయం తర్వాత అక్కడ ఎవరూ ఉండరు-అన్నిటికీ తెగించిన రామారావు లాంటివాళ్ళు తప్ప. రామారావు అప్పుడప్పుడూ అక్కడి కొచ్చి పడుకుంటూనే ఉంటాడు. ఆ మెత్తటి ఇసుక సుఖం ముందు డన్ లప్పిల్లో బలాదూరు.

Picture

రామారావు కటిక చీకట్లో ఆ ఇసుక మీద పడుకొన్నాడు. చుట్టూ రెండుమూడు ఫర్లాంగుల వరకు జనసంచారం లేదు. రాత్రి పది గంటలయింది. పగలుకాచిన ఎండధాటికి ఇసక ఇంకా కొంచెం వేడిగానే వుంది. ఇప్పుడిప్పుడే చల్లగాలి తిరుగుతోంది. ఆ గాలికి ప్రాణం లేచిపోతోంది. హాయిగా నిద్రపట్టింది.

అర్ధరాత్రి ఏదో అలికిడికాగా ఉలిక్కిపడినట్లుగా మేలుకున్నాడు రామారావు. టైము ఎంతయిందో తెలియదు. ఎవరో ముగ్గురు వ్యక్తుల ఆకారాలు తనకు ఓ పది పన్నెండు గజాల దూరంలో నీడల్లా మసలడం ఆ చీకట్లో కనిపించింది. వాళ్ళ చేతుల్లో ఏవో ఉన్నాయి. వాటిని క్రిందపెట్టి ఏదో చేస్తున్నారు. వాళ్ళు తనని చూసినట్లు లేదు. చీకట్లో తను కనిపించలేదు కాబోలు. అసలు ఇంత రాత్రివేళ చీకట్లో ఇక్కడ ఎవరైనా ఉంటారన్న అనుమానం వాళ్ళకి కలిగివుండదు. వాళ్ళు చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నారు. అయినా చుట్టూ నిశ్శబ్దం ఆవరించివున్నందువల్ల వాళ్ళ మాటలు స్పష్టంగానే వినిపిస్తున్నాయి.

"ఈ డైనమైటు పని చేస్తదంట్రా. కల్తీ సరుకు కాదుకదా? ఈ ఏదవన్నర ఎదవ గవర్నమెంటులో తినేతిండి దగ్గర్నించి అంతా కల్తీయేగదా?"

"ఇది స్మగుల్డు సరుకురా నాయనా. గ్యారంటీ."

"అరే... బ్రిడ్జీకంతా సరిగా పెట్టారంట్రా?"

"పెట్టాంలేగానీ... నువ్వు తొందరగా పూర్తి చెయ్యరా, టైమవుతావుంది".

"ఒంటిగంటన్నరే గదంట్రా రైలొచ్చేది. ఇంకా అరగంట టైముంది. నాపని ఐదు నిమషాల్లో అయిపోతది".

రామారావుకి అంతా అర్థమయింది. ఒక్క ఉదుటున లేచి, ముగ్గురినీ పచ్చడి కింద కొట్టాలనిపించింది. కాని, తమాయించుకున్నాడు. సినిమాల్లో అయితే హీరో పాతిక మందిని పచ్చడి చేస్తాడు. కానీ, ఇది సినిమాకాదు. తను హీరోయిజం ప్రదర్శించబోతే వీళ్ళు ముగ్గురూ కలిసి తనని సున్నంలోకి బొమికల్లేకుండా చితక్కొడతారు. తను ఆరిస్తే పలికేవాళ్ళు కూడా లేరు ఇక్కడ. తనను చంపిన తర్వాత వీళ్ళు బ్రిడ్జి కూల్చేస్తారు. బ్రిడ్జికీ, రైలుకీ ప్రమాదం తప్పితే తను చచ్చినా సార్థకం. ఏమీ సాధించకుండా ఊరికే చచ్చిపోవడం దేనికి? వీళ్ళు ఏం చేస్తారో జాగ్రత్తగా కనిపెట్టి, తర్వాత ఏదైనా చెయ్యాలి.

"మజ్ఞానం మంత్రిగాడి ఉపన్యాసం ఇన్నావంట్రా? నక్సలైట్లు, ఇధ్వంసం అంటూ ఏంటో వాగాడు".

"ఆడి కారుకే డైనమైటు పెడితే సరిపోయేదిరా".

"అయిపోయిందిరా నా పని. ఇప్పుడు సెప్పు నీ సంగతి".

మీ ఇద్దరూ ఇక్కడుండండి. నేను రైలు పట్టాల కాడికి ఎళ్తాను. మొత్తం రైలంతా బ్రిడ్జీ మీది కెళ్ళగానే నేను బాట్రీ లైటు ఎలిగించి ఊపుతాను. మీరిక్కడ దీని హాండిలు నొక్కేయండి. మనపనైపోతుంది".

"వైర్లు, కనక్షన్లు అన్నీ సరిగ్గా వున్నాయంట్రా?"

"ఓరి ఎదవన్నర ఎదవ. నాకిదేం కొత్తంట్రా యియాళ? నేను చెయ్యి పెట్టానంటే ఏ పనైనా పెర్ ఫెక్టు".

"సరే ఐతే నువ్వు పద".

ఒకడు బాట్రీలైటు పుచ్చుకుని బ్రిడ్జి దగ్గరకు వెళ్ళాడు. తను ఏం చెయ్యాలో తేలలేదు రామారావుకి. తను ఇప్పుడే వీళ్ళమీదపడితే, వెళ్ళినవాడు కూడా పరుగెత్తుకు రావచ్చు. పైగా వీళ్ళ దగ్గర ఆయుధాలు కూడా ఉండి ఉంటాయి. తనని చంపేసి వాళ్ళ పని చేసుకుపోతారు. అందుకని, రైలు బ్రిడ్జి మీదకు వచ్చే సమయానికి వీళ్ళ మీద పడాలి. రైలు బ్రిడ్జి మీద నుంచి పూర్తిగా వెళ్ళిపోయే వరకు వీళ్ళతో యుద్ధం చెయ్యాలి. వీళ్ళు ఆ హాండిల్ నొక్కకుండా అటకాయించాలి. తర్వాత వీళ్ళు తనని చంపేసినా, బ్రిడ్జిని కూడా కూల్చేసినా, కనీసం రైలుకు ప్రమాదం తప్పుతుంది. కొన్ని వందల మంది ప్రయాణీకులకు చావు తప్పుతుంది. ప్రస్తుతం ఇంతకంటే చెయ్యగలిగిందేమీ లేదు.

దూరంగా రైలు వస్తున్న శబ్దం వినిపించింది. శబ్దం క్రమంగా దగ్గరయింది... రైలు బ్రిడ్జి దగ్గరకు వచ్చింది... పూర్తిగా బ్రిడ్జి మీదకు వచ్చేసింది. బ్యాటరీ లైటు వెలిగీ వెలగడంతోనే రామారావు మెరుపులా లేచి, ఒక్క ఉదుటున వెళ్ళి, ఇద్దరినీ బలంకొద్దీ తన్నాడు. ఇద్దరూ దూరంగా వెళ్ళి పడ్డారు. వాళ్ళలో ఒకడు గబుక్కున కత్తి తీశాడు. రెండోవాడు రివాల్వర్ తీసి పేల్చాడు. చీకట్లో రివాల్వర్ గురి తప్పింది. రామారావు కత్తి దూసిన వాడి మీదికి లంఘించాడు. వాడి పిడికిలి గట్టిగా పట్టుకుని, మెలిపెట్టి, కత్తి కిందపడగానే వాడిని ఒక్క తన్ను తన్నాడు. వెంటనే కత్తి తీసుకుని వైరుకోసేసి, విసిరేశాడు. ఈ లోగా రెండోవాడు రెండుసార్లు రివాల్వర్ ప్రేల్చాడు. రెండూ గురితప్పాయి. మొదటివాడు మళ్ళీ రామారావు మీదికి ఉరికాడు. వాళ్ళిద్దరూ పెనగులాడుతూఉండగా రెండో వాడు మళ్ళీ రివాల్వర్ ప్రేల్చాడు. ఆ దెబ్బకి మొదటి వాడు బిగ్గరగా అరుస్తూ కుప్పకూలిపోయాడు. బ్రిడ్జి దగ్గరున్న వాడు ఈ రివాల్వర్ కాల్పులు, అరుపువిని పరుగెత్తుకు రావడం మొదలుపెట్టాడు. ఇంకోవైపు నుంచి పోలీసులు విజిల్స్ వేస్తూ పరుగెత్తుకొస్తున్నారు. విజిల్స్ విని బ్రిడ్జి దగ్గరివాడు అటు నుంచి అటే పారిపోయాడు. రెండో వాడు మళ్ళీ రామారావు మీదికి రివాల్వర్ ప్రేల్చాడు. రామారావు వాడి మీదికి దూకి వాడి చేతిలోని రివాల్వర్ ను ఒక్క తన్ను తన్నాడు. రివాల్వర్ చీకట్లో దూరంగా పడింది. వాడు మీదికి లంఘించి, రామారావు చేతిలోని కత్తి లాక్కుని, బలంగా పొట్టలో మూడుపోట్లు పొడిచాడు. రైలు బ్రిడ్జి దాటి వెళ్ళిపోయింది. పోలీసులు బ్యాటరీ లైట్లతో పరుగెత్తుకొచ్చేసరికి దుండగులు పారిపోయారు.

ఆస్పత్రికి చేర్చేలోపుగానే రామారావు అసత్యం నుంచి సత్యంలోనికి, తమస్సు నుంచి జ్యోతిస్సులోనికి, మృత్యువు నుంచి అమరత్వంలోనికి అధిగమించాడు.

ఒక వ్యక్తి సాహసకృత్యం వల్ల, ప్రాణత్యాగం వల్ల ఘోరమైన ప్రమాదం తప్పిపోయిందని తెల్లరేసరికి ఊరంతా తెలిసింది. కొన్ని వార్తాపత్రికలు ఈ వార్తను తాజా వార్తగా టూకీగా ప్రచురించాయి. విలేకరులు వివరాలు కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. పోలీసులు రామారావు జేబులో దొరికిన కాగితాన్ని, రాత్రి సంఘటనలో స్వాధీనం చేసుకొన్న కత్తిని, రివాల్వర్ ను, డైనమైట్ ను ప్రేల్చడానికి ఉపయోగించే పరికరాలను, వైర్లను, బ్రిడ్జికి అమర్చిన డైనమైట్సు చూపించారు. రామాలయం నుంచి స్వాధీనం చేసుకున్న సంచిని కూడా చూపించారు. ప్రెస్ ఫొటోగ్రాఫర్లు ఆ పరికరాలను, రామారావు దేహాన్ని, దుండగుని దేహాన్ని ఫొటోలు తీశారు.

సారా దుకాణానికి ప్రారంభోత్సవం చేయడానికై ప్రక్కటౌనుకి వెళ్ళిన మంత్రిగారు ఈ వార్త విని హుటాహుటి బయలుదేరి వచ్చారు. పోలీసులు గెస్ట్ హౌస్ లో ఆయన్ని కలుసుకుని, రామారావు జేబులో దొరికిన కాగితాన్ని చూపించారు. అది చదివిన తర్వాత ఆయన మొహంలో విజయగర్వం తొంగి చూసింది. "మా ఉపన్యాసాలన్నీ కంఠశోష అనే వారికి ఇది గొప్ప గుణపాఠం. నా ఉపన్యాసం వల్ల ఒక యువకుడు ఉత్తేజం పొంది, బ్రిడ్జిని, రైలుని కాపాడడానికి ప్రాణమే త్యాగం చేశాడు. నేను ఆ విధంగా ఉద్భోధించి ఉండకపోతే ఈయువకుడు ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. బ్రిడ్జి కూలిపోయి, రైలు ఘోర ప్రమాదానికి గురియై ఉండేది. నా శ్రమ సార్థకమయింది. అమరజీవి రామారావుకు జోహారులర్పిస్తున్నాను" అని చిన్నసైజు ఉపన్యాసం ఇచ్చారు మంత్రిగారు.

పోలీసులు వెళ్ళిన తర్వాత గెస్ట్ హౌస్ లో మంత్రిగారు, ఆయన దర్శనార్థం వచ్చిన కాంట్రాక్టరు మాత్రం మిగిలారు. "రావయ్యా రా... లోపలికి రా..." అంటూ ఆయన కాంట్రాక్టర్ ని ఆహ్వానించాడు. గదిలోకి వెళ్ళిన తర్వాత తలుపు బిగించి, సూట్ కేస్ లోంచి సీసా తీశాడు ఆయన.

"ఒకటో నంబరు స్మగుల్డు విస్కీ... రా కూర్చో..." అంటూ రెండు గ్లాసుల్లో పోసి, ఒకటి కాంట్రాక్టరుకి అందించాడు.

కాంట్రాక్టర్ విస్కీ సిప్ చేస్తూ, అసలు విషయం కదిపాడు. "మరి ఈ అమరజీవికి ఏదైనా స్మారకచిహ్నం కట్టించద్దంటండీ".

"అదే ఆలోచిస్తున్నానయ్యా ఇందాకట్నీంచీ... ప్రత్యేకంగా స్మారకచిహ్నం కట్టించాలంటే చాలా అవుతుంది. అంత డబ్బు కేటాయించడానికి కుదరదు. ఏదో లాలూచీ వ్యవహారమని ఎవరైనా అనుమానించవచ్చు. అందుకని ఆ పాడుపడిన రామాలయాన్ని రెనొవేట్ చేయిద్దామా అని ఆలోచిస్తున్నాను. ఆ గుడిని బాగుచేయించాల్సిందని ఇదివరకే కొందరు ప్రభుత్వాన్ని అడిగారు. దానికోసమైతే ఓ నలభై వేలో, యాభై వేలో ఖర్చు చేసినా అనుమానించేందుకు ఉండదు. ఇటు జీర్ణదేవాలయోద్ధరణ చేసినట్టూ అవుతుంది. ఆ సత్కార్యాన్ని రామారావు స్మృతి చిహ్నంగా చేయించినట్టూ అవుతుంది. ఆ విషయం ఒక రాతి పలకమీద చెక్కించి పెట్టచ్చు. రామారావు, రామాలయం పేరుకూడా బాగా కలిశాయయ్యా".

"అవునండి. మరి ఆ కాంట్రాక్టు..."

"నువ్వు వేరే చెప్పాలిటయ్యా... అది నీకే వస్తుంది. నీకొస్తే నాకొచ్చినట్టు కదూ? కాని. ఈ సారి నా పెర్సంటేజ్ పెంచక పోతే మట్టుకు లాభం లేదు. ఓ కాంట్రాక్టు దక్కించటం అంటే సామాన్యం కాదు మరి. టెండర్లు, గొడవ బోలెడు వ్యవహారం.

"సరే దానిదేవుందండి. మీరు ఎంతంటే అంత".

కాంట్రాక్టరు సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయిన తర్వాత కొంత సేపటికి విలేకరులు వచ్చారు. మంత్రిగారు ఇంతకు ముందు పోలీసులకు చెప్పినదాన్ని పునరుద్ఘాటించారు. అమరజీవికి జోహారులర్పించారు. అసాధారణ ధైర్య సాహసాలు, త్యాగనిరతి ప్రదర్శించిన వారికి ఇచ్చే పతకం ఒకటి రామారావుకి (మరణానంతరం) ప్రదానం చేయించగలననీ, అతని స్మృతి చిహ్నంగా జీర్ధదేవాలయోద్ధరణ జరిపించాలని యోచిస్తున్నామనీ ఆయన చెప్పారు. నేటి యువతరానికి రామారావు ఆదర్శం కావాలని ఆయన అన్నారు. ఒక వ్యక్తిని ఉత్తేజపరచగలిగినందుకు తన రాజకీయ జీవితం ధన్యమయిందని కూడా ఆయన అన్నారు.

ప్రశ్నోత్తరాలు అయిన తర్వాత మంత్రి గారు ఒక విలేకరిని దగ్గరికిపిలిచి "ఆ అమరజీవి కాయితంలో చివర శ్లోకం లాంటిదేదో రాశాడు. అది రాయడంలో అతని వుద్దేశం ఏమైవుంటుంది?" అని అడిగాడు ఆంతరంగికంగా.

మంత్రిగారి నోరు గుప్పున వాసన కొట్టింది విలేకరికి. "అదా... దీని అర్థం మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. భగవంతుడా... నా బ్రతుకంతా అబద్ధమే అయిపోయింది. నిజంలోకి నడిపించు. అజ్ఞానాంధకారంలోపడి కొట్టుకుంటున్నాను. వెలుగులోకి నడిపించు. అనుక్షణం చచ్చిపోతున్న జీవచ్చవాన్ని నేను-అమరజీవిని చెయ్యి".

నండూరి పార్థసారథి
(ఈ రచన 1975 జూన్ 27వ తేదీ ఆంద్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమయింది.)

Previous Post Next Post