Humor Icon

గాంధీ జయంతినాడు

రాట్నం వడుకుతారు, రామ భజన చేస్తారు,

జాతిపిత సూత్రాలను జనానికి బోధిస్తారు;

మర్నాడే ఆ సూత్రాలను వంకెకి తగిలించేస్తారు;

మహమ్మారి భజన మళ్ళీ ప్రారంభిస్తారు.

గాలిబ్ జయంతి నాడు

గజల్ గానంతో, సురాపానంతో

నిషాతో ఖుషీ చేస్తారు :

సారా కొట్టుకో, నీరా కొట్టుకో

ప్రారంభోత్సవం చేస్తారు.

సుభాష్ జయంతి నాడు విప్లవ శంఖం పూరిస్తారు.

అమర వీరుల దివసాన అశ్రుతర్పణం చేస్తారు.

గాలిబ్ కూ గాంధీకీ మధ్య

ఖద్దరుకూ ఖయ్యాంకూ మధ్య

సమన్వయం సాధించాలని ఉద్బోధిస్తారు.

దేశ రక్షణపైన, క్రమశిక్షణపైన,

సంఘ సంస్కరణపైన, నైతిక ధర్మాలపైన,

ప్రణాళికలపైన, పరిశ్రమలపైన,

పరస్పర విరుద్ధ సిద్ధాంతాలపైన

అర్థం పర్థం లేని అనర్గళోపన్యాసాల

అరిగిపోయిన రికార్డులు వారిదగ్గర రెడీ.

తమకు తెలియని వాటిని ఇతరులకు

తెలియజెప్పడం వారి నిత్యకృత్యం.

ఏ ఎండ కా గొడుగు, ఏ మనిషి కామాట,

ఏ అపాయానికా ఉపాయం

వారిదగ్గర ఎప్పుడూ సిద్ధం.

గంటకో రూపం, గడియకో రంగూ మార్చగల

పగటి వేషగాళ్ళు, ఊసరవెల్లి గాళ్ళు

వారిదెప్పుడూ గెలిచినకోడి,

వారి ఎన్నికల చిహ్నం గాలికోడి.

అవినీతి తాలూకు అన్ని రూపాలతో

అనవరతం కాంప్రమైజ్ కావడం

వారి అలీన అనిశ్చిత విధానం.

వారు అబద్ధాల పుట్టలు...

దేశమాత ముఖంపై కాకిరెట్టలు.

చేతలతో మాటలకు విడాకులిప్పించిన ఘనులు,

కోతలతో కోటలు దాటిన వీరులు

ఆచరణ శూన్యమైన ఆవేశంతో

అడల్టరేటెడ్ ఆవేదన అభినయించే

అమోఘ కపట నటసమ్రాట్టులు.

ఆకలితో అలమటిస్తున్న జనానికి

తీయని నినాదాలతో నోరూరిస్తున్న అనృతమూర్తులు;

మొసలి కన్నీటి నంగనాచులు;

చావడానికి సిద్ధంగా ఉన్న చెట్టు పేరు చెప్పుకుని

కుక్క మూతి పిందెలమ్ముకుంటున్న దొంగవర్తకులు;

లంచాలు మరిగి, మంచాలు ఎక్కి,

అధికార కామలీలలు ప్రదర్శిస్తున్న పదవీ మదిరోన్మత్తులు:

నిలబడే ఓపిక లేకుండా సామాన్యుల

వెన్నులపై పన్నుల మూటలు వేస్తూ

సైలెంట్ గా, నాన్ వైలెంట్ గా,

మూకుమ్మడిగా మట్టుబెట్టుతున్న 'మాన్యులు'

ప్రత్యక్ష నరహింస పురాణ కాలక్షేపం చేస్తున్న

పరమ భోగవతార్లు, ప్రజాధన భోక్తాగ్రగణ్యులు:

ఖద్దరు బురఖాల యమకింకరులు,

సమాజపు గాదెకింద పందికొక్కులు,

స్వార్థంతో కుళ్ళిపోయిన ముసలి తొక్కులు,

సోక్రటీసుల పోజు పెడుతున్న హిపోక్రేట్లు.

ఈ హిపోక్రటీసుల కులంలో ముసలం

పుట్టేరోజు ఆట్టే దూరంలో లేదు.

బోరుకొట్టించిన ఈ బృహన్నాటకం

చరమాంకంలో పడింది.

చెట్టు చస్తోందనడానికి

కుక్క మూతి పిందెలే నిదర్శనం.

నండూరి పార్థసారథి
(1976లో ప్రజావాహినిలో ప్రచురితమైనది)

Previous Post Next Post