Humor Icon

ఫిబ్రవరి నెల ఆఖరు తేదీన కేంద్రఆర్థిక మంత్రిగారు పన్నుల వల పన్నుతారు. పప్పు మీద పన్ను, ఉప్పు మీద పన్ను, చెప్పు మీద పన్ను, పన్ను మీద పన్ను, పండిస్తే పన్ను, అమ్మితే పన్ను, కొంటే పన్ను, తింటే పన్ను.

బడ్జెట్ దినాన మధ్యతరగతి వారికి పన్నుల సలపరింత తప్పదు. ఈ సలపరింత కొన్ని రోజులపాటు ఉంటుంది. ఆ తర్వాత అలవాటైపోతుంది. కాస్త మాను పట్టబోతుండగా మళ్ళీ వస్తుంది తద్దినం. పన్నులు రుద్దడానికి మంత్రిగారు యథాశక్తిని కృషి సలుపుతారు. కథ మళ్ళీ మొదటికి.

పన్నులు వేసే వారికి చెలగాటం, మోసే వారికి ప్రాణసంకటం. ఈ పన్నుల వల్ల ఆపన్నులయే వారు పెక్కు మంది. సంపన్నులయేవారు కొద్దిమంది. పన్నుల వల్ల సంపన్నులు మరింత సంపన్నులవుతున్నారు. ఏమైనప్పటికీ దేశంలో సమ్ పన్నులు అవసరమని అంగీకరించక తప్పదు.

పన్నులంటూ ఉంటే సలపరింత తప్పదు కనుక పన్నులను ఊడగొట్టాలని కొందరు తీవ్రవాదులు వాదిస్తున్నారు. కాని పన్నులు హాసానికీ, హాస్యానికీ ఎంత అలంకారంగా ఉంటాయో, బడ్జెట్ కీ అంతే. వాటిని ఊడగొడితే బడ్జెట్ బోసిపోతుంది. అయినా అసలు పన్నులు లేకుండా అభివృద్ధి ఫలాలను భోంచేయడం ఎలా?

కాబట్టి సమ్ పన్నులు అవసరమే. అయితే వాటిని సంపన్నుల పైనే విధించుట న్యాయం. పన్నుల వల విపన్నులపై పన్నుట అన్యాయం. సంపన్నులు తొస్సి పన్నులకు బంగారపు పన్నులు వేయించుకుంటూ ఉంటారు. వాటికి పన్ను మినహాయింపు మంజూరు చేయడం అవసరం. లేకుంటే పన్నుల సలపరింత భరించలేక వారు బంగారు పన్నులను పెరికించుకునే ప్రమాదం ఉన్నది. అలా చేస్తే వారి నవ్వులు బోసిపోయి, నవ్వులపాలై పోతాయి. పసిడి నవ్వులపై పన్నులు రువ్వుట అన్యాయం. కాబట్టి పన్నులు సలపరించ కుండా, అలంకార ప్రాయంగా ఉండేటట్లు చూడాల్సిన బాధ్యత ఆర్థిక మంత్రిపై ఉన్నది.

పన్ డిత్ పన్నాలాల్
(1979 మార్చి 4వ తేదీ ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితమయింది)

Previous Post Next Post