Humor Icon

"నిక్షేపంలాంటి సంబంధం. ఇంక ఊరికే తటపటాయించకండి. కుర్రాడు బుద్ధి మంతుడు, దురలవాట్లు ఏమీ లేవు. బెంగుళూరు మహానగరంలో ఉంటున్నా భాస్కరానికి కనీసం సిగరెట్లయినా అలవాటు కాలేదు. నెలకి పన్నెండు వందలదాకా సంపాదిస్తున్నాడట. వాళ్ళ నాన్నకి ప్రతి నెలా ఖచ్చితంగా వంద రూపాయలు మనియార్టరు పంపిస్తాడు. పైన మూడొందలో, నాలుగొందలో బ్యాంకులో వేస్తాడు. అయినా అతన్ని గురించి నేను మీకు చెప్పడం ఏమిటి? నా కంటే మీకే బాగా తెలిసి ఉండాలి. అతనూ, మీ అబ్బాయీ చిన్నప్పుడు కలిసి చదువుకున్నారాయె. ఏరా అంటే ఏరా అనుకునేటంత చనువు గలవాళ్ళాయె. ఆ పరంధామయ్యగారూ, మీరూ చిన్నప్పటినించీ స్నేహితులాయె."

"శాస్తుర్లుగారూ, ఆ విషయాలన్నీ నేను కాదన్నానా? వాళ్ళ కుటుంబం గురించి సంప్రదాయం గురించి మాకు తెలీని దేముంది? మూడు సంవత్సరాల నుంచి సంబంధాల కోసం తిరిగి తిరిగి విసుగెత్తిపోయింది. బి.ఎ. పాసై ఓ నాలుగొందలు సంపాదిస్తుంటే చాలు ఏడు వేలిస్తావా, పది వేలిస్తావా అని బేరాలు. నేనా నాలుగైదు వేలకంటే తూగలేను. అలా అని చూస్తూ చూస్తూ నిక్షేపం లాంటి పిల్లని ఎస్సెల్సీ తప్పిన వాడికి ఇవ్వనూ లేను. భాస్కరం ఏమ్.ఎ. పాసై బెంగుళూరులో ఉంటూ సంపాదిస్తున్నాడు కదా-కనీసం పదివేలైనా అడక్క పోతాడా అని నేనూ ఇన్నాళ్ళూ అతని సంగతి ఆలోచించలేదు. ఇప్పుడు అతను కట్నం లేకుండా చేసుకుంటానని చెప్పాడంటున్నారు కనక మాకు మాత్రం అంతకంటే కావలసిందేముంది? కాని అతను చేసే ఉద్యోగమో, వ్యాపారమో అదేమిటో తెలుసుకోకుండా సంబంధం ఎలా నిశ్చయం చేయగలం చెప్పండి? దయచేసి ఆ ఒక్క విషయం మీరు కనుక్కోగలిగితే మీ మేలు ఈ జన్మలో మరిచిపోలేను. ఏదో అదృష్టం కొద్దీ అతనొచ్చాడు. ఇంకో రెండు మూడు రోజులుంటాడంటున్నారు. కనక ఈ లోగానే అన్నీ తేల్చేసుకుని, తాంబూలాలు పుచ్చేసుకుంటే మనస్సుకి నెమ్మదిగా ఉంటుంది. అతను బెంగుళూరు వెళ్ళిపోతే ఇంక పట్టుకోలేము. మళ్ళీ ఏడాదికో, రెండేళ్ళకో కాని రాడు. ఆరొందల మైళ్ళు ప్రయాణం చేసి మనం అక్కడికి వెళ్ళనూ లేము. మీరు ఇంకొక్కసారి వెళ్ళి ప్రయత్నించండి శాస్తుర్లుగారూ. ఎలాగైనా అతని వ్యాపార రహస్యం మాత్రం కనుక్కోండి".

"ఆ పని మాత్రం నా వల్ల కాదు రామనాధం గారూ. నా శాయశస్తులా ప్రయత్నించాను. ఎన్నో రకాలుగా అడిగి చూశాను. లాభం లేకపోయింది. అతను చాలా ముక్కుసూటి మనిషి. చెప్పదలుచుకున్నదాన్ని అవతలి వాళ్ళకి కష్టం కలిగినా సరే కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తాడు. మనం డొంక తిరుగుడుగా మాట్లాడినా, కూపీ లాగుతున్నట్లుగా మాట్లాడినా అతనికి చిర్రెత్తుకొస్తుంది. ఎం.ఎ. పాసైన తరవాత ఒక ఆర్నెల్లు ఉద్యోగం కోసం ప్రయత్నించి లాభం లేక ఇందిరా గాంధి సలహా ప్రకారం స్వయం ఉపాధి పథకం అమల్లో పెట్టాడట. ఒకళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చెయడం ఇష్టం లేక తన వ్యాపారం తనే పెట్టుకున్నాడు. రెండు చేతులా సంపాదిస్తున్నాడు. మీ ప్రభాకరం చూడండి. బి.ఎ. పాసై ఐదేళ్ళుగా ఉద్యోగం లేకుండా ఇంట్లో కూచున్నాడా? అంతకంటే భాస్కరం చేసిన పని మంచిదంటారా? కాదంటారా? ఎటొచ్చి ఆ వ్యాపారం ఏమిటో ససేమిరా చెప్పనంటున్నాడు. అంతేకదా? మీ అబ్బాయికైనా చెప్పనివాడు. సొంత తల్లి తండ్రులకే చెప్పని వాడు ఇంకోసారి అడిగితే మాత్రం నాకు చెబుతాడా? రెట్టించి అడిగితే అసలు ఈ సంబంధమే వద్దు పొమ్మంటాడు. మీ అమ్మాయిని చేసుకోవాలని అతను మోజు పడ్డ మాట నిజమే కానీ, దాన్ని ఆసరా చేసుకుని మీరు తన రహస్యం లాగడానికి ప్రయత్నిస్తున్నారని తెలిస్తే మాత్రం అతను పెంకె ఘటంగా తయారవుతాడు. అయినా అతని వ్యాపారం రహస్యం తెలుసుకోవాలని మీకు అంత పట్టుదల అనవసరం అనుకుంటా".

"తల్లిదండ్రులకి కూడా చెప్పకుండా రహస్యంగా ఉంచాడంటే, ఆ వ్యాపారంలో ఏదో లొసుగు ఉంటుందేమోనని నా అనుమానం. పన్నెండొందలు సంపాదిస్తున్నాడా, పద్దెనిమిదొందలు సంపాదిస్తున్నాడా అనేది ముఖ్యం కాదు. ఎలా సంపాదిస్తున్నాడనేది ముఖ్యం. బ్రాకెట్లు ఆడి సంపాదిస్తున్నాడా గుర్రప్పందాలు ఆడుతున్నాడా, లాటరీలు కొడుతున్నాడా, అనేది తెలుసుకోవద్దుటండీ?".

"కుర్రాణ్ణి గురించి మీకు అటువంటి అనుమానాలేమన్నా ఉంటే, అసలు ప్రయత్నించడం అనవసరం. ఎందుకంటే, అతను ససేమిరా చెప్పడు. మీకు అనుమానం తీరదు. అనుమానంతో ఏ పని చేసినా మనస్సుకు శాంతి ఉండదు".

"అబ్బే అదికాదు శాస్తుర్లుగారూ, అతను బుద్ధిమంతుడనే నమ్మకం ఇప్పటికీ ఉంది నాకు. కాని, అతని సంగతేమిటో తెలుసుకోవాలి. ఎలాగైనా నేనే ప్రయత్నించి తెలుసుకుంటాను. తాంబూలాలు పుచ్చుకునేటప్పుడు మళ్ళీ మీకు కబురు చేస్తాను".

"సరే, మంచిది. నేను వెళ్ళొస్తాను. మీరు సాధించగలిగితే అంతకంటే కావలసిందేముంది?". శాస్త్రులుగారు వెళ్ళిన తరవాత రామనాధం గారు కూపీ లాగడంలో కొడుక్కి తర్ఫీదు ప్రారంభించాడు. ఉపదేశం మొదలుపెడుతుండగానే ప్రభాకరం "అబ్బే! లాభం లేదు, నాన్నా" అనేశాడు. "వాడు మొండి ఘటం. అరిచ్చచ్చినా చెప్పడు. "నీ వ్యాపారం ఏమిటో చెప్పరా, నా తాహతుకు తగినదైతే నేనూ పెడతాను" అని ఎన్నోసార్లు అడిగాను. నీకు పోటీ రాకుండా వ్యాపారం హైదరాబాద్ లో పెడతారా నాయనా అని కూడా చెప్పాను. వాడు కాస్త కూడా మెత్తబడలేదు. వాడి వ్యాపారం సంగతి తప్ప మిగతా విషయాలన్నీ సరదాగానే మాట్లాడతాడు" అన్నాడు.

"నీది వట్టి మట్టి బుర్రరా. నేరుగా అడిగితే చెప్పనప్పుడు లౌక్యంగా మాటల్లోకి దింపి, కూపీ లాగాలి. నువ్వు కూపీ లాగుతున్నట్లు, అతనికి ఏ మాత్రం అనుమానం రాకుండా మాట్లాడాలి. ఏకధాటిగా క్రాస్-ఎగ్జామినేషన్ చేస్తున్నట్లు కాక తాపీగా, సరదాగా మాట్లాడాలి. ఏదో ఉబుసుపోక మాట్లాడుతున్నట్లుగా అతనికి అనిపించాలి" అంటూ రామనాధంగారు సాయంత్రం దాకా కొడుక్కి ట్రైనింగు ఇచ్చాడు.

ట్రైనింగు పూర్తయేసరికి ప్రభాకరం బుర్ర సానబట్టిన వజ్రంలా తయారయింది. సాయంత్రం ప్రభాకరం, భాస్కరం ఊరి కొబ్బరితోపుల్లోకి షికారుకి వెళ్ళారు. భాస్కరం ఆవులిస్తే పేగు ల్లెక్కబెట్టే రకం. ప్రభాకరం వాటం చూడగానే పసి గట్టేశాడు, అతగాడు కూపీలాగే ప్రయత్నంలో వచ్చాడని. నిజానికి అప్పటికింకా ప్రభాకరం క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభించనే లేదు. అనుమానించడానికి ఆధారాలేవీ అతని మొహంలో కనిపించ లేదుకూడా. అయినా అతని నడకని బట్టి మామూలుగా కంటే సరదాగా కనిపించడానికి అతను చేస్తున్న ప్రయత్నాన్ని బట్టి భాస్కర్ గ్రహించేశాడు ఏదో విశేషం ఉందని. అయినా తను గ్రహించినట్లు ప్రభాకరానికి ఏమాత్రం తెలియనివ్వలేదు. భాస్కరం పసిగట్టేశాడని ప్రభాకరం ఎంత మాత్రం అనుమానించలేదు. ఎందుకంటే తండ్రి ఇచ్చిన తర్ఫీదు వల్ల అతను గొప్ప ఆత్మ విశ్వాసంతో ఉన్నాడు.

పొలిమేర దాటగానే ప్రభాకరం జేబులోంచి సిగరెట్ పెట్టె, అగ్గిపెట్టె తీశాడు. తను ఒకటి నోట్లో పెట్టుకుని ఇంకొటి భాస్కరానికి ఆఫర్ చేశాడు. "అబ్బే వద్దురా! నాకు సిగరెట్లు పడవు" అన్నాడు భాస్కరం.

"ఫరవాలేదు లేవోయ్ పెద్ద - ఇక్కడ చూసే వాడెవడూ లేడు. సరదాగా కాసేపు ఊది పారేసేదానికి ఏమిటంత పట్టింపు" అని మొహమాటపెట్టాడు ప్రభాకరం.

"ఇష్టం ఉంటే దర్జాగా ఊళ్ళోనే కాల్చచ్చు. దానికోసం ఇంత దూరం వచ్చి రహస్యంగా కాల్చాలా?".

"బెంగుళూరులో ఉంటూ సిగరెట్లయినా అలవాటు కాలేదంటే ఎవడైనా నమ్ముతాడా-పెద్ద బడాయిగానీ?".

"నమ్మకపోతే పోనీ. నమ్మమని నేనేం బలవంతం చేశానా? అయినా సిగరెట్లు కాల్చేవాడి మొహం పొగచూరుకుపోయి కనిపిస్తూనే ఉంటుంది. మొహంలో కనిపించకపోయినా పళ్ళు చూస్తే తెలుస్తుంది. అదీ కాకపోతే చేతి వేళ్ళు చూసి చెప్పచ్చు. అబద్దం చెబితే దాగదు".

"సరే లేవోయ్. అలవాటుగా కాకపోతే ఎప్పుడైనా సరదాకి కాల్చచ్చుగా. ఒక సిగరెట్టు ఊది పారేస్తే పాపం చుట్టుకుంటుందా ఏం?".

"అది తప్పనీ, పాపమనీ అనడం లేదు. నాకు ఇష్టం లేదు. అంతే. నీకు ఇష్టమైతే కాల్చు-వద్దన్నానా? నాతో వంతు దేనికి?".

"సిగరెట్టు ఒంటరిగా కాల్చడంలో మజా ఉండదురా. సరే ఏం చేస్తాం? నువ్వు అంత పట్టుదలగా ఉంటే నేనే ముట్టిస్తాను" అంటూ సిగరెట్ వెలిగించాడు ప్రభాకరం. పొగ వూదుతూ మళ్ళీ తనే సంభాషణ ప్రారంభించాడు. మధ్య మధ్య భాస్కరం చేతి వేళ్ళ కేసి చూస్తున్నాడు ఓరగా. 'సరదాగా ఎప్పుడైనా ఒకటీ అరా కాలుస్తాడేమో గాని మొత్తం మీద వీడికి సిగరెట్లు అలవాటు లేదు' అని తేల్చేసుకున్నాడు.

"ఈ వెధవ్వూర్లో లైఫ్ యమ బోరు కొడుతోందిరా. పనీపాటా లేదు. కాలక్షేపం లేదు. ఫ్రెండ్సూ లేరు. అలవాటయిన వాణ్ణి ఇలా ఉంటే బెంగుళూరులో ఉండి వచ్చిన నీకు ఎలా ఉందో?".

"నాలుగైదు రోజులుండి పోయేవాణ్ణి నాకు బోరేమిట్రా? బోరు కొట్టేన్ని రోజులు ఉండనే ఉండను కదా? అయినా ఏ ఉద్యోగం లేకుండా, వ్యాపారం లేకుండా ఊరికే గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటే ఎవడికైనా బోరు కొడుతుంది".

"వ్యాపారం పెట్టేందుకు పెట్టుబడి ఎక్కడేడిసింది గానీ, ఉద్యోగ ప్రయత్నం చేస్తూనే ఉన్నారానాయనా... ఇంగ్లీషు పేపరుకి చందా కట్టి తెప్పించుకుని, కనిపించిన ఉద్యోగాలన్నింటికీ అప్లికేషనులు పెడుతూనే ఉన్నాను. ఇంటర్వ్యూల కోసం బెజవాడ, ఏలూరు, రాజమండ్రి లాంటి వూళ్ళన్నీ వెళ్ళివస్తున్నాను. రెండుసార్లు హైదరాబాద్ కూడా వెళ్ళాను. ప్రయాణం ఖర్చులూ, పోస్టు ఖర్చులూ తప్ప ప్రయోజనం ఏమీ కనిపించలా. ఎక్కడికి పోయినా చప్రాసీ ఉద్యోగానిక్కూడా రికమెండేషను. విసుగెత్తిపోయి ఇక ఇంటర్వ్యూలకి కూడా వెళ్ళడం మానేశాను. పోనీ నువ్వేదో బెంగుళూరులో ఉఁటున్నావు కదా. బోలెడు పలుకుబడి ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉంటాయి. రికమెండ్ చేసి ఏదైనా గుమాస్తా ఉద్యోగం ఇప్పిస్తావని చూస్తే, నువ్వూ లౌక్యంగా తప్పించుకుంటున్నావు. స్నేహితులే మోహం చాటువేస్తే ఇంక బయటవాళ్ళ కేం పట్టింది?".

"బెంగుళూరులో ఉంటున్నానంటే నేనేదో పెద్ద పొజిషన్ లో ఉన్నా ననుకుంటున్నావు కాబోలు. అక్కడ నేను వూరూ పేరూ లేని అనామకుణ్ణిరా బాబూ. నాకు అక్కడ పలుకుబడీ లేదు, పెద్ద వాళ్ళతో పరిచయాలూ లేవు. నీకు రికమెండ్ చేసేంతటి వాడినైతే నేనే ఒక ఉద్యోగం సంపాదించుకునేవాణ్ణి కదా? ఉద్యోగం దొరక్కనే కదా వ్యాపారం పెట్టింది?".

"ఉద్యోగం దొరక్కనే వ్యాపారం పెట్టావనుకో. ఇప్పుడు వ్యాపారంలో బాగా నిలదొక్కుకున్నావు కనక, నీ కింక ఎవడైనా ఇస్తే మాత్రం ఉద్యోగం దేనికి? తలుచుకుంటే నువ్వే ఇతర్లకి ఉద్యోగాలివ్వగలవు. పోనీ నీ ఆఫీసులోనే నాకో గుమాస్తా ఉద్యోగం ఇవ్వరా. నీ కింద పని చెయ్యడానికి నాకేం నామోషీ లేదు".

"నాకు ఆఫీసెక్కడేడిసిందిరా, నాయనా నీకు ఇవ్వడానికి?"

"ఇష్టం లేకపోతే లేదని చెప్పు. అంతేగానీ ఆఫీసే లేదంటావేంరా? ఆఫీసు లేకుండా, గుమాస్తాలూ, టైపిస్టులూ లేకుండా వ్యాపారం ఎలా చేస్తున్నావురా?"

"నువ్వు నమ్మకపోతే నేనేం చెయ్యను? నాకో ఆఫీసూ లేదు, నా దగ్గర పనివాళ్ళూ లేరు. నాది అంత పెద్ద వ్యాపారమేం కాదు".

"సరే... ఏం చేస్తాం? ఇంతకీ నాకు ఉద్యోగం రాతలేదు. వ్యాపారం అన్న తర్వాత అంతకంతకి పెరుగుతుంది కదా? రేపు నీ వ్యాపారం బాగా పెరిగితే, చేతి కింద ఉద్యోగులు అవసరమైతే నన్ను కాస్త జ్ఞాపకం పెట్టుకో, అప్పటికింకా నేను ఇలా నిరుద్యోగిగా ఉంటే నాకో ఉద్యోగం ఇవ్వు."

"నాది అలా అంచెలంచెలుగా పెరిగే వ్యాపారం కాదురా నాయనా. ఎప్పుడూ ఇదే లెవెల్లో ఉంటుంది. అందుకని నా మీద ఆశ పెట్టుకోకు".

"సరేలేరా... ఈ వెధవ ఉద్యోగాల సంగతి మానేద్దాం కాసేపు. బెంగుళూరు విశేషాలేమన్నా చెప్పరా" అన్నాడు ప్రభాకరం ప్లేటు మారుస్తూ.

ఇంతవరకు జరిగిన సంభాషణవల్ల భాస్కరం వ్యాపారం ఎలా ఉంటుందో తెలియక పోయినా, ఎలా ఉండదో కొంతవరకు తెలిసింది. ఆఫీసు, గుమస్తాలు, టైపిస్టులు ఉండే వ్యాపారం కాదు. అంతకంతకు అభివృద్ధి అయేది కాదు. పెద్దవాళ్ళతో పరిచయాలుండే వ్యాపారం కాదు. ఈ సంభాషణ ఇదే మాదిరిగా సాగితే తను కూపీ లాగుతున్నట్లు భాస్కరానికి తెలిసిపోతుంది. అందుచేత టాపీక్ మార్చడం మంచిదనుకున్నాడు.

తన వ్యాపార రహస్యం తెలుసుకోవడానికి ప్రభాకరం పడుతున్న అవస్థ చూస్తుంటే భాస్కరానికి మనస్సులో ఒకటే నవ్వుగా ఉంది. 'చూద్దాం ఇంకా ఎన్ని రకాలుగా ప్రశ్నలు వేస్తాడో' అనుకున్నాడు. 'నా వ్యాపారం ఇది' అని చెప్పుకోవచ్చుగానీ, ప్రభాకరం అడిగే ప్రశ్నలకు సమాధానంగా తను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు.

భాస్కరం అబద్ధం చెప్పడనే నమ్మకం ప్రభాకరానికీ ఉంది. "బెంగుళూరులో లైఫ్ మంచి హుషారుగా ఉంటుందట కదురా? అసలు తోచకపోవడం అంటూ ఉండదట. పెద్ద సిటీ ఆయెను. బోలెడు కాలక్షేపాలుంటాయి. సినిమాలు, క్లబ్బులు, బార్లు, రేసులు...."

"సిటీలో కాలక్షేపాలకేం కొదవ? డబ్బు, మోజు ఉండాలిగాని బోలెడు వ్యసనాలు. సంపాదించడం, కష్టంగానీ తగలెయ్యడం మహా తేలిక. అవన్నీ డబ్బు గల వాళ్ళకి గానీ మనలాటి వాళ్ళకి కాదు".

"అంత బీదరుపులు అరుస్తావేరా నెలకి వెయ్యిపైగా సంపాదిస్తూ? క్లబ్బులో పేకాడితే మాత్రం, రేసులాడితే మాత్రం ఎప్పుడూ పోతుందా ఏం? వస్తూంటుంది, పోతూంటుంది. నేను పేకాడితే పోయేదానికంటే వచ్చేదే ఎక్కువగా ఉంటుంది. కాని, నా దగ్గర డబ్బులున్నప్పుడు ఆడేందుకు ఎవ్వడూ ఉండడు. నీకా సమస్య ఉండదు కదా? క్లబ్బుకి వెడితే బోళ్ళంతమంది దొరుకుతారు."

"నాకసలు జూదం అంటే గిట్టదురా, బాబూ. పేకాట ఎవరైనా ఆడుతుండగా చూస్తేనే నాకు చిరాగ్గా ఉంటుంది."

"పేకాట కాకపోతే రేసులు... దాం దుంపతెగ... జీవితంలో ఏదో ఒక ఎడ్వెంచర్ లేకపోతే ఎల్లారా? ఉద్యోగం సద్యోగం లేక ఈ పల్లెటూర్లో పడి చస్తున్నాను గానీ, సిటీలో ఉంటే చూపించేవాణ్ణి తడాఖా. వెధవది... ఉద్యోగంలో, వ్యాపారంలో ఏం సంపాదిస్తాంరా? లక్కీ చాన్సుగా జాక్ పాట్ తగిల్తే జీవితం అంతా కాలుమీద కాలేస్కుని రాజాలాగా అనుభవించ వచ్చు. అసలు ఒకసారి బెంగుళూరు వచ్చి చూడాల్రా రేసుల సంగతేమిటో! సినిమాల్లో తప్ప ఒక్కసారైనా నిజంగా రేసులు చూళ్ళేదంటే షేమ్ గా ఉంది. అవునుగాని... జాక్ పాట్ టిక్కెట్టు ఎంతుంటుందిరా?"

"నే నెప్పుడూ రేస్ కోర్స్ గోడ పక్కగా నడవనైనా లేదురా, బాబూ... నన్నడిగితే నాకేం తెలుస్తాయి అవన్నీ? తెలుసుకోమంటే బెంగుళూరు వెళ్ళిన తర్వాత ఎవణ్ణయినా అడిగి నీకు ఉత్తరం రాస్తాను".

"నీకూ నాకూ చుక్కెదుర్రా... నా కిష్టమైన వేవీ నీకు ఇష్టం లేదు. నాక్కావలసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేవు. అసలు నీలాంటి వాడు బెంగుళూరులో ఉండడం దండగరా... అనుభవించడం చేతకానివాడు సిటీలో ఉన్నా, పల్లెటూర్లో ఉన్నా ఒకటే. సరదాగా ఎప్పుడైనా బెంగుళూరు వస్తే కనీసం బార్ కైనా తీసుకెళ్ళేటట్లు లేవు నీ ధోరణీచూస్తే..."

"సారీ, మై డియర్ ఫ్రెండ్... నా మీద అటువంటి ఆశలు పెట్టుకోకు. నా కవన్నీ అలవాటూ లేదు, ఆసక్తీ లేదు. నువ్వువస్తే ఒక్కడివీ వెళ్ళు. నాకేం అభ్యంతరం లేదు".

"నీ కంటే మన వెంకట్రావు నయంరా... ఇంటర్వ్యూకోసం హైదరాబాద్ వెళ్ళినప్పుడు బార్ కి తీసుకెళ్ళి బీర్ ఇప్పించాడు. సరేగానీ, అసలు సరదాకైనా బార్ కీ, రేసులకీ, క్లబ్బులకీ వెళ్ళకపోతే తీరిక సమయాలలో ఎలా కాలక్షేపం అవుతుందిరా నీకు?"

"లైబ్రరీకి పోతాను. రూమ్ కి పుస్తకాలు తెచ్చుకుంటాను. ఎప్పుడైనా సినిమాకి పోతాను. నాకేం బోర్ కొట్టడం లేదు లైఫ్".

"అదృష్టవంతుడివిరా, నాయనా" అన్నాడు ప్రభాకరం సిగరెట్టు చివరి దమ్ము ఊది ఆవతలపడేస్తూ. "నువ్వేమిట్లే-నా కంటే అందరూ అదృష్టవంతులే. చిన్నప్పటి మన బ్యాచ్ వాళ్ళతో నాకు తప్ప అందరికీ ఉద్యోగాలు దొరికాయి. అది సరేగానీ, బెంగుళూరులో కాస్టాఫ్ లివింగ్ చాలా ఎక్కువేంరా?"

"ఆఁ... ఎక్కువే. హైదరాబాద్ కంటే, మెడ్రాస్ కంటే ఎక్కువే."

"ఒక మనిషికి ఎంతవుతుందంటావ్ నెలకి?"

"అది మనం చేసే ఖర్చునుబట్టి ఉంటుంది. బీదా బిక్కీ జనం కూడా సిటీల్లో బతుకుతున్నారు కదా?".

"అది కాదురా... కాస్త చౌకరకం హోటల్లో రెండుపూటలా భోజనం, రెండు పూటలా కాఫీ, ఒక చిన్న గది... ఎంతవుతుంది?"

"మూడొందల యాభైలో బతకచ్చు".

"నీకు వో అయిదొందల దాకా ఖర్చవుతుందనుకుంటా?".

"అవుతుంది".

"నీ రూమ్ కి అద్దె ఎంతరా?"

"ఎనభై".

"బెంగుళూరులో నెలకి ఎనభై అంటే డెడ్ చీఫ్ కదురా?"

"ఏం చీప్ రా... నేనుండేది కాస్త చౌకరకం హోటల్లో. మా రూమ్ లో ముగ్గురు ఉంటున్నాం. ముగ్గురం మూడు ఎనబైలు ఇస్తున్నాం?"

"ఆఁ! హోటల్లో ఉంటున్నావా? చెప్పావుకావేం ఇందాకట్నించీ... అయితే కాలక్షేపానికేం తక్కువ? బలే మజాగా ఉంటుందనుకుంటాను".

భాస్కరం అర్ధంకానట్లు మోహం చిట్లీంచి చూశాడు ప్రశ్నార్థకంగా.

"రోజూ గాజుల గలగల వినిపిస్తుందన్న మాట!" అన్నాడు ప్రభాకరం కొంచెం రహస్యంగా.

"ఛీ... వెధవ మాటలూ నువ్వునూ. ఇంత చౌకబారుగా మాట్లాడతావేంరా?" అని చీదరించుకున్నాడు భాస్కరం.

"అబ్బెబ్బే లేదురా. పొరపాటున నోరు జారింది. ఆ వెంకట్రావు గాడి దగ్గర మాట్లాడే మాటలు నీ దగ్గర దొర్లాయి అలవాటు ప్రకారం. వాడు బలే జల్సారాయుడులే. అయినా నీకు బొత్తిగా సెన్సాఫ్ హ్యూమర్ లేదురా. సరదాకి అన్న మాటలని సీరియస్ గా తీసుకుంటావు" అన్నాడు ప్రభాకరం.

"చీకటి పడుతూంది-లేవరా. ఇంక పోదాం" అన్నాడు భాస్కరం.

ఇద్దరూ లేచి ఊరివైపు నడక ప్రారంభించారు. "బెంగళూరులో నీ షాపుకి అద్దె ఎంతరా?" ప్రభాకరం మళ్ళీ సంభాషణ ప్రారంభించాడు.

"నాకు షాపేమిట్రా?"

"షాపు కాకపోతే గోడౌను".

"షాపూ లేదు, గోడౌనూ లేదు".

"మరి సరుకు ఎక్కడ నిలవ చేస్తావురా?"

"సరుకేమిటి?"

"ఇది మరీ బాగుంది. వ్యాపారం చేస్తూ సరుకేమిటంటావేమిట్రా? ఆఫీసు లేకుండా, షాపు లేకుండా, గోడౌను లేకుండా, అసలు సరుకే లేకుండా చేసేది ఇదేం వ్యాపారంరా బాబూ... ఎక్కడా వినలేదు. అసలు వ్యాపారం అంటే ఏమిటి? సరుకు తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మడమే కదా?"

"అవును నిజమే... నేను కాదన్నానా?"

"మరి సరుకంటే ఆశ్చర్యపోతున్నట్టు నటిస్తావేం?"

"నేను కొని అమ్మే వాటిని సరుకు అనడం అంత బాగా ఉండదు. వాటి కోసం ఆఫీసు, షాపు, గోడౌను లాంటి వేవీ అవసరం లేదు".

"పోనీ సరుకు అంత ఎక్కువగా లేకపోయినా జమా, ఖర్చు, లెక్క, పత్రం, టాక్సులు, రసీదులు, ఆడిటింగు వగైరాల కోసమైనా ఒక ఆఫీసు గది అక్కర్లేదట్రా? అక్కౌంటు పుస్తకాలు కూడా రూమ్ లో తలగడ కింద పెట్టేస్తావా ఏమిటి-చోద్యంగా చెబుతావు?"

"నా వ్యాపారానికి ఆ గొడవంతా లేదురా నాయనా. అయినా నా వ్యాపారం గురించి అడక్కురా అని నీకు ఇదివరకు వందసార్లు చెప్పాను. అయినా మళ్ళీ కూపీ లాగడం మొదలు పెట్టావు. ఇంక నువ్వు ఒక్క ప్రశ్న అడిగినా సమాధానం చెప్పేది లేదు".

"నీ వ్యాపారం సంగతి ఎవడడిగాడోయ్ ఇప్పుడు? బెంగుళూరులో ఏదైనా దుకాణం పెట్టాలంటే అద్దె ఎంతవుతుందోనని అడిగాను. వందనో, రెండొందలనో చెప్పేస్తే ఇన్ని ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉండేది కాదు కదా? నువ్వే అసలు గోడౌనేమిటి, షాపేమిటి అని సాగదీశావు. హైదరాబాద్ లో కంటే అద్దెలు తక్కువంటే బెంగుళూరులో ఏదైనా ఒక ఏజెన్సీ పెడదామా అని ఆలోచిస్తున్నా. అయినా నీది ఏ వ్యాపారమైతే నాకు దేనికి? ఏదో ఒక సరుకు ఒక చోట కొంటావు. ఇంకో చోట అమ్ముతావు. లాభం జేబులో వేసుకుంటావు. జేబులో పట్టకపోతే బ్యాంకులో వేస్తావు. ఎవడైనా చేసేది అదే. ఇందులో పెద్ద రహస్యం ఏముంది?"

మాటల్లోనే ఇద్దరూ వూళ్ళోకి వచ్చేశారు. భాస్కరం గుడ్ నైట్ చెప్పాడు. "వెళ్ళేలోగా ఒకసారి కనిపించి పోరా" అన్నాడు ప్రభాకరం.

"అలాగే" అన్నాడు భాస్కరం. రాత్రి భోజనాల దగ్గర ప్రభాకరం పూసగుచ్చినట్లు అంతా చెప్పాడు తండ్రికి. వడ్డిస్తూ అంతా విన్నది జానకమ్మగారు. తలుపు చాటునుంచి కాబోయే పెళ్ళి కూతురు నిర్మలకూడా విన్నది. 'ఆయనేదో వ్యాపారం చేసి సంపాదిస్తున్నాడు. బుద్ధిమంతుడనే అందరూ అంటున్నారు. కట్నం లేకుండా చేసుకుంటానంటున్నాడు. వంక పెట్టడానికి వీల్లేని మనిషి. ఆయన వ్యాపారం ఏమిటో తెలుసుకోవాలని వీళ్ళకి ఎందుకింత పట్టుదల అని మనస్సులో విసుక్కుంది నిర్మల. జానకమ్మగారూ అలాగే అనుకుంది. ఆ మాటే బయటకి అనేసింది ఆవిడ.

"ఊరుకోవే నీకేం తెలుసు? పిల్ల నిస్తున్నప్పుడే వీలున్నంత వరకు నాలుగు విషయాలూ వాకబు చేయవలసిన ధర్మం ఉన్నది. మన ఊరి వాడే కదా, మన పరంధామయ్య కొడుకే కదా, కట్నం లేకుండా చేసుకుంటున్నాడు కదా అని కళ్ళు మూసుకుని తాంబూలాలు పుచ్చుకోవడమేనా? రేపు ఏదైనా లొసుగువస్తే ముందూ వెనకా చూడకుండా, వాకబు చేయకుండా తొందరపడి చేశాడు సమ్మంధం అని నలుగురూ నన్ను ఎత్తి పొడవరూ?" అని భార్యని మందలించాడు రామనాధం గారు.

"సరే, అన్నీ చూసి కుదిర్చిన సమ్మంధాలన్నీ నిరవాకం అవుతున్నాయి గనకనా? ఆ సుందరికాపురం, శారద కాపురం చూస్తూనే ఉన్నాంగా?"

"అన్నీ చూసి చేసినా లోటు పాట్లు వస్తే అది వాళ్ళ కర్మ. తొందరపడి చెయ్యలేదు-మన ప్రయత్నం మనం చేశామన్న తృప్తి అయినా ఉంటుంది".

"ఒకటి మాత్రం నమ్మచ్చు నాన్నా. భాస్కరానికి దుర్వ్యసనాలేవీ లేవు" అన్నాడు ప్రభాకరం.

"ఏమో ఎవడికి తెలుసు? నువ్వు చెల్లెలి పెళ్ళి కోసం ఆరాలు తీస్తున్నావని కనిపెట్టి మాట్లాడి ఉండవచ్చు అతను".

"లేదు, నాన్నా. కేవలం ఇవాళ్టి మాటలని బట్టి చెప్పడం లేదు నేను. వాడి ధోరణి చిన్నప్పటినుంచీ తెలుసుగా నాకు. అబద్దాలు చెప్పే రకం కాదు. ఇష్టం లేకపోతే అసలు చెప్పనే చెప్పడు గానీ, చెవితే మాత్రం నిజమే చెబుతాడు."

"సరే లేవోయ్! అతని వ్యాపారం సంగతి తేల్లేదు కదా! నువ్వేదో కిటుకు పట్టేస్తావనుకుంటే వెర్రి మొహం వేసుకొచ్చావు".

"ఖచ్చితంగా ఇదీ అని తెలీక పోయినా ఆ వ్యాపారలక్షణాలు తెలిశాయి కదా? పెద్ద పెట్టుబడి లేదు. ఆఫీసూ, షాపూ, గోడౌనూలేదు. సరుకు అనదగినదేమీ లేదు. పన్నులులేవు. అక్కౌంట్లూ, ఆడిటింగూ లేవు. అంచెలంచెలుగా పెరిగేది కాదు. పార్టనర్ షిప్పు, కాంట్రాక్టులు లేవు. ఈ లక్షణాలుగల వ్యాపారం ఏదై ఉంటుందో వూహించి తెలుసుకోవాలి. తెలుసుకోలేకపోతే మెదలకుండా వూరుకోవాలి. ఇవాళ్టి నుంచి ఇంట్లో అందరం వూహాగానాలు ప్రారంభిద్దాం".

"తెలుసుకుంటే తెలుసుకోండి, లేకపోతే లేదు గానీ, ఈ సమ్మంధం మాత్రం పోనీకండి. అతన్ని చేసుకోవాలని దానికీ ఉంది" అని హెచ్చరించింది జానకమ్మ గారు.

"పోనీలేవే. పోనిచ్చేటట్లయితే ఇంతరాద్దాంతం దేనికి?" అన్నారు రామనాధం గారు.

తలుపు చాటున ఉన్న నిర్మల సంతోషించింది ఆ మాటలు విని.

ఆ రాత్రి రామనాథం గారికి, ప్రభాకరానికి నిద్ర పట్టలేదు. భాస్కరం చేసే వ్యాపారం ఏమై ఉంటుందా అని ఇద్దరూ అదేపనిగా ఆలోచిస్తున్నారు. ఆ రహస్యం తెలుసుకోవాలనుకోవడంలో ఇద్దరి ఉద్దేశాలూ వేరు. రామనాథం గారు ఇందాక భోజనాల దగ్గర చెప్పిన ఆర్గ్యుమెంటు అంతా భార్యను డబాయించడానికే. నిజానికి భాస్కరం ప్రవర్తనపై ఆయనకు ఎటువంటి అనుమానం లేదు. అతని రహస్యం తెలుసుకోవాలన్న పట్టుదలకు కారణం కుతూహలం తప్ప మరేమీ కాదు. గుప్పిలిమూసి గట్టిగా బిగించి, ససేమిరా తెరవనని భీష్మించుకు కూర్చుంటే, అందులో ఏముందో తెలుసుకోవాలని కుతూహలం రేకెత్తుతుంది-అందులో ఏమీ లేకపోయినా సరే. కొందరు గుప్పెట్లో ఏముంటే ఎవడిక్కావాలి అని దులిపేసుకుపోగలరు. కాని, అందరూ అలా ఉండలేరు. గుప్పిలి బిగించిన కొద్దీ వారికి కుతూహలం ఎక్కువవుతుంది. ఈ సంగతి రామనాథం గారికి తెలియక కాదు. తెలిసినా, కుతూహలాన్ని అణుచుకోలేడు.

ఇక ప్రభాకరం సంగతి. అతనూ ఇదివరకు కుతూహలం కొద్దీ భాస్కరాన్ని అడిగి, అతను చెప్పకపోతే 'పోనీలెద్దూ' అని ఊరుకున్నాడు. మళ్ళీ దానిసంగతి ఆలోచించలేదు. కానీ, ఇప్పుడు చెల్లెలి పెళ్ళి సంబంధం కోసమని నాన్నగారు పురెక్కించారు. అణచుకున్న కుతూహలం మళ్ళీ రేగింది. కుతూహలం సంగతి అటుంచి, అసలు ఆ వ్యాపారం ఏమిటో తెలుసుకోవడం తనకు చాలా అవసరంగా కనిపిస్తోంది. అది ఏం వ్యాపారమోగానీ, అని విధాలా తనకు అనుకూలమైనదిగా కనిపిస్తోంది. అదేమిటో తెలిస్తే తనూ మొదలు పెట్టవచ్చు. తను ఉద్యోగాలకోసం తిరిగి తిరిగి విసుగెత్తిపోయాడు. ఏదైనా వ్యాపారం చేద్దామంటే పెట్టుబడికి డబ్బులేదు. ఇలా నిరుద్యోగిగా పల్లెటూర్లో ఎన్నాళ్ళు సోమరిగా కూర్చోవాలో తెలియడం లేదు.

ఎంత ఆలోచించినా తండ్రీ కొడుకు లిద్దరికీ రహస్యం అంతుపట్టలేదు. ఇంక ఆలోచించడం అనవసరం అనుకున్నారు. బేషరతుగా తాంబూలాలు పుచ్చేసు కుంటే తర్వాత-పెళ్ళయి, పిల్ల కాపురానికి వెళ్ళిన తర్వాత-అతని వ్యాపారం ఏమిటో నెమ్మదిమీద తెలియకపోదు అనుకున్నాడు రామనాథం గారు. మనస్సు రాయి చేసుకున్నాడు. చెల్లెలి పెళ్ళయిన తర్వాత ఎప్పుడైనా చుట్టపు చూపుగా బెంగుళూరు వెళ్ళి పరిశోధించ వచ్చునని సరిపెట్టుకున్నాడు ప్రభాకరం.

జానకమ్మగారు నిశ్చింతగా నిద్రపోయింది. నిర్మల తీయని కలలు కంటూ నిద్రపోయింది. మర్నాడు రామనాథంగారు శాస్త్రులు గారికి కబురు పంపాడు. అయిష్టంగానే ఆయన దగ్గర తన ఓటమిని అంగీకరించాడు. "తాంబూలాలు పుచ్చేసుకుందాం. పరంధామయ్యతో మాట్లాడి ఏర్పాట్లు చెయ్యండి. వీలైనంత తొందరలో జరిపిద్దాం పెళ్ళి" అన్నాడు.

శాస్త్రులుగారు వెంటనే వెళ్ళి పరంధామయ్య గారితో, భాస్కరంతో మాట్లాడాడు. వాళ్ళిద్దరూ సంతోషించారు. ఆ తర్వాత రెండు రోజులకి తాంబూలాలు పుచ్చుకొనేందుకు వియ్యంకుళ్ళు, వియ్యపురాళ్ళు, కాబోయే వధూవరులూ, శాస్త్రులుగారు, ప్రభాకరం సమావేశమయ్యారు.

ఆఖరిఛాన్సుగా ఇంకొక్కసారి ప్రయత్నించి చూద్దామని రామనాథంగారు మాటల మధ్యలో నెమ్మదిగా కదిలించారు. "మొత్తానికి నీ మాటే నెగ్గించుకున్నావోయ్ భాస్కరం! నీ వ్యాపారం రహస్యం మాత్రం బైట పెట్టావుకావు... తల్లిదండ్రులకే చెప్పని వాడివి ఇవాళ మాకు చెబుతావా ఏమిటి గాని... సరే ఏదైతే నేంలే... ఏదో కాస్త గౌరవప్రదమైన వ్యాపారం, దివాళా తీయకుండా నిలకడగా ఉండే వ్యాపారం అయితే సరి...."

"నా వ్యాపారం విషయంలో మాత్రం నేను ఎటువంటి హామీలు ఇవ్వలేనండి. గౌరవప్రదమైనదా కాదా, నిలకడగా ఉంటుందా లేదా అనేది కూడా నేను చెప్పలేను. ఎందుకంటే ఒకరికి గౌరవప్రదంగా కనిపించేది ఇంకొకరికి గౌరవప్రదంగా కనిపించకపోవచ్చు. కొందరికి అసలు వ్యాపారమే గౌరవప్రదంగా కనిపించకపోవచ్చు. తక్కువ ధరలకు కొని ఎక్కువ ధరకు అమ్మడం అంటేనే మోసంగా కనిపించవచ్చు. నా చేతుల్లో ఉన్న సరుక్కి గిరాకీ పెరిగిన కొద్దీ ధర పెంచుతాను. సరుకు సప్లె తగ్గినకొద్దీ ధర పెంచుతాను. కొనేవాళ్ళు తక్కువైతే ధర తగ్గిస్తాను. ఎవడూ నా దగ్గరికి రాకపోతే నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమాలి అంటగడతాను. ఒక్కొక్కప్పుడు నేను కొన్న ధర కూడా గిట్టుబాటు కాకపోవచ్చు. ఇది వ్యాపార లక్షణం. వ్యాపారం అన్న తర్వాత ఒడిదుడుకులుంటాయి. నేను చేస్తున్నది న్యాయమైన వ్యాపారం కాదని కొందరికి అనిపించవచ్చు. నా మట్టుకు నాకు ఫరవాలేదనిపించింది. చేస్తున్నాను. అయితే ఇది చాలా మంచి వ్యాపారమని సంతోష పూర్వకంగా మాత్రం చేయడం లేదు. ఉద్యోగాలు చేసేవాళ్ళందరూ సంతోషంగా, సంతృప్తిగా చేస్తున్నారా? గత్యంతరం లేక చేస్తున్నారు. అంతకంటే మంచి ఉద్యోగం వస్తే చేస్తున్న దాన్ని వదిలేస్తారు. నేనూ అంతే. ఇంతకంటే మంచి ఉద్యోగం గానీ వ్యాపారంగానీ దొరికితే ఇది మానేస్తాను. ఇతర ప్రయత్నాలు చేస్తున్నాను కూడాను."

ఈ మాటలు రామనాథంగారికి రుచించలేదు. భాస్కరం కనీసం ఈ సమయంలోనైనా ఏమైనా ఉపశమన వాక్యాలు చెబుతాడేమో ననుకుంటే కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడేశాడు. 'ఇష్టమైతే తాంబూలాలు పుచ్చుకోండి, లేకపోతే లేదు' అని సవాలు చేసినట్లుగా ఉంది అతని ధోరణి. అతని వ్యాపార రహస్యానికి క్లూ దొరక్కపోగా ఇంకా జటిలమయింది. ఏం మాట్లాడాలో తెలీలేదు ఆయనకి.

ఆయన అవస్థ గ్రహించి మళ్ళీ భాస్కరమే అన్నాడు - "పిల్లనిచ్చే తండ్రిగా మీకు ఎటువంటి ఆదుర్దా ఉంటుందో నేను అర్ధం చేసుకోగలను. మీకు నేను మనస్ఫూర్తిగా ఒక్క హామీ మాత్రం ఇవ్వగలను".

రామనాథంగారి ముఖం ఎంతో ఆశతో నిప్పారింది. ఏం చెబుతాడా అని ఉత్కంఠతో ఉగ్గబట్టుకుని వింటున్నాడు.

"భార్యను పోషించుకోగల సమర్ధత నాకు ఉంది. మీ అమ్మాయికి నేను ఎటువంటి లోటూ చేయను. నన్ను చేసుకున్నందుకు మీ అమ్మాయి పశ్చాత్తాప పడవలసిన అవసరం ఎప్పుడూ రాదు. నాకు ఎటువంటి దుర్వ్యసనాలూ లేవు. నేను పీనాసినీకాను, దుబారా మనిషినీ కాను. ఈ మాటల మీద మీకు నమ్మకం కుదిరితే తాంబూలాలు పుచ్చుకోండి. నమ్మకం లేకపోతే నిష్కర్షగా చెప్పెయ్యండి. నేనేమీ అనుకోను".

భాస్కరం ఆ మాటలు త్రికరణశుద్దిగా చెబుతున్నట్లు రామనాథం గారికి నమ్మకం కలిగింది. ఎంతో సంతృప్తి కలిగింది. కొండంత ధైర్యం కలిగింది. భాస్కరం మాటలకి నిర్మల కూడా ఎంతో సంతోషించింది.

"శుభస్య శీఘ్రం. ఆలస్యం అమృతం విషం. ఇంక తాంబూలాలు పుచ్చేసుకుందాం" అన్నాడు రామనాథంగారు.

"తథాస్తు" అన్నాడు పరంధామయ్యగారు నవ్వుతూ.

"శుభం" అన్నాడు శాస్త్రులుగారు.

తరవాత రెండు నిమిషాల్లో తాంబూలాల తాలూకు లాంఛనాలు పూర్తయినాయి. శాస్త్రులుగారు పంచాంగం చూసి ముహూర్తం కూడా నిశ్చయించేశారు. నెల రోజుల వ్యవధిలో మంచి ముహూర్తం దొరికింది.

"అయితే నేను రేపే బయల్దేరతాను" అన్నాడు భాస్కరం.

"ఇప్పుడు వెళ్ళకపోతే ఏమోయ్? ఈ నెల రోజులూ ఆగి, ఏకంగా పెళ్ళయిన తర్వాతే వెళ్ళవచ్చుగా? సెలవు దొరకదన్న సమస్యలేదు. సొంత వ్యాపారం కదా? అడిగేవాడు లేడు" అన్నాడు రామనాథంగారు.

"అదికాదండీ... బెంగుళూరులో ఇళ్ళుదొరకడం చాలా కష్టం. నేను వెళ్ళి వెంటనే ఇంటి ప్రయత్నం చేయడం అవసరం. ఇల్లు కుదుర్చుకుని, ఇంటి క్కావలసిన సామాన్లు అన్నీ కొని, సర్దేసుకుని వస్తే మంచిది కదా?"

"ఒహో... పెళ్ళయిన తరవాత అబ్బాయి ఇంక ఒంటరిగా వెళ్ళదలచుకోలేదన్న మాట. భేషుగ్గా ఉంది ఆలోచన. కొత్తగా కాపరం పెట్టడానికి కూడా వచ్చేనెల చాలా శుభప్రదంగా ఉంటుంది" అన్నాడు శాస్త్రులుగారు. మర్నాడే భాస్కరం బెంగుళూరుకు బయల్దేరి వెళ్ళాడు. పదిహేను రోజులపాటు వేటాడి, రెండు వందల యాభై రూపాయలకి ఒక చిన్న ముచ్చటయిన పోర్షను సంపాయించాడు. బాంకులోంచి డబ్బుతీసి ఇంటికి వో వెయ్యి రూపాయలు అడ్వాన్సు చెల్లించాడు. ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అన్నీ కొన్నాడు. జోడు మంచాలు, సోఫా-కం-బెడ్ మొదలుకొని వంట ఇంట్లో పాత్ర సామాను వరకు అన్నీ కొని, ఇంట్లో ఎక్కడి వక్కడ సర్దేశాడు. హోటలునుంచి ఇంట్లోకి మకాం మార్చేశాడు.

అనుకున్న ముహూర్తానికి వివాహం సలక్షణంగా జరిగిపోయింది. అమ్మాయీ, అబ్బాయీ చాలా అందమైన జంట అని పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా అనుకున్నారు. "ఇంతకీ పిల్ల అదృష్టవంతురాలు" అని చాలా మంది అన్నారు.

"అదృష్టమంటే నీదయ్యా, రామనాథం! దమ్మిడీ కట్నం లేకుండా రత్నంలాంటి అల్లుణ్ణి సంపాదించావు" అని కొందరు రామనాథం గారిని అభినందించారు.

పెళ్ళికూతురికి కావలసిన పట్టు చీరలు, కొద్దిగా నగలు, మధుపర్కాలు వగైరాలు అన్నీ తల్లి రాసిచ్చిన జాబితా ప్రకారం భాస్కరం బెంగుళూరులోనే కొని తీసుకొచ్చాడు. అవన్నీ చూసి అమ్మలక్కలంతా 'ఆహా... ఎంత జాగర్తగలవాడు కుర్రాడు' అని మెచ్చుకున్నారు.

పెళ్ళయిన వారం రోజులకి శాస్త్రులు గారు నిర్ణయించిన ముహూర్తానికి భాస్కరం నిర్మలను తీసుకుని బయల్దేరాడు. అమ్మాయికి, అల్లుడికి కన్నీళ్ళతో వీడ్కోలు ఇచ్చారు రామనాథంగారు, జానకమ్మగారు. వారం తిరక్కుండా నిర్మల నుంచి ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం చదువుకుని తల్లి దండ్రులు మురిసిపోయారు. తమ ఇల్లు చిన్నదైనా అందంగా, సౌకర్యంగా ఉందనీ, ఇంట్లో దేనికీ తడుముకోవలసిన అసరం లేకుండా సమస్త వస్తువులు అల్లుడుగారు కొని సిద్ధంగా అమర్చి పెట్టారనీ, బెంగుళూరు నగరం చాలా అందంగా ఉందనీ రాసింది నిర్మల. తరవాత పదేసి రోజుల కొకటి చొప్పున నిర్మల నుంచి ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. ఆమె చాలా సంతోషంగా ఉన్నట్లు, ఏ ఇబ్బందీ లేనట్లు ఉత్తరాలవల్ల తెలుస్తూంది. వీలు చూసుకుని ఎప్పుడైనా వచ్చి తమ దగ్గర ఒక నెల్లాళ్ళు ఉండి పొమ్మని రాసింది నిర్మల. భాస్కరం కూడా ఒక ఉత్తరంలో మామగారిని, అత్గారిని, బావమరిదిని ఆహ్వానించాడు. వీళ్ళకీ ఒకసారి వెళ్ళి చూడాలనే ఉంది. కాని, ఇలా వెళ్ళి అలా వచ్చేందుకు దగ్గరాదాపా, దూరాభారమాయెను. ప్రయాణానికే వందలు ఆరిపోతాయి. మనం ఎక్కడ వెళ్ళగలం. ఏదో వాళ్ళిద్దరూ చిలకా గోరింక ల్లాగా హాయిగా కాపురం చేస్తున్నారు. వాళ్ళను గురించి దిగుల్లేదు. ఏ పండక్కో రమ్మని రాస్తే వాళ్ళే వస్తారు" అని వూరుకున్నారు రామనాథంగారు, జానకమ్మగారు.

ప్రభాకరానికి మాత్రం మళ్ళీ బుర్ర తొలచడం ప్రారంభించింది. పల్లెటూళ్ళో బతుకు దుర్భరంగా ఉంది. ఉద్యోగం దొరకదు. ఇప్పటికే నలుగురు దృష్టిలో అప్రయోజకుడిగా తయారయ్యాడు. తెగించి ఏ సిటికో పోయి తన బతుకు తను చూసుకోవాలి. ముందుభాస్కరం చేసే వ్యాపారం ఏమిటో తేల్చుకుంటే తన మార్గం సుగమం అవుతుంది. భాస్కరం అడుగు జాడల్లో నడవడం తప్ప ఇంకో ఉపాయం కనిపించడం లేదు తనకి. 'ఒక్కసారి బెంగుళూరు వెళ్ళి రావాలి. సిటీ చూసినట్టూ అవుతుంది. చెల్లిలి కాపురం చూసినట్టూ అవుతుంది. బతుకు తెరువు దొరికినట్టూ అవుతుంది' అనుకున్నాడు. ఆ మాటే తండ్రికీ చెప్పాడు. ఆయనకీ సబబుగానే అనిపించింది. జానకమ్మ గారూ వెళ్ళి రమ్మంది. "మేమిద్దరం వెళ్ళి రావాలంటే బోలెడు ఖర్చు. పోనీ నువ్వైనా వెళ్ళి వాళ్ళని చూసిరా. ఎలా ఉంటున్నారో ఏమిటో" అంది.

రామనాథంగారు ఎలాగో డబ్బు పుట్టించి కొడుకుని రైలెక్కించాడు. ముందుగా ఉత్తరం రాసి వెళ్ళడం కంటే, ఇన్కంటాక్స్ అధికారుల ఆకస్మిక దాడుల మాదిరిగా వాళ్ళ ఇంటిమీద దాడిచేస్తే రెడ్ హాండెడ్ గా వాళ్ళ బండారం బయట పడుతుందనుకున్నాడు ప్రభాకరం. అందుకే ముందు ఉత్తరం రాయకుండా బయలుదేరాడు. తలిదండ్రులతో మాత్రం ఉత్తరం రాసినట్లు చెప్పాడు. బెంగుళూరులో ఆట్టే శ్రమ పడకుండానే అడ్రసు ప్రకారం ఇల్లు కనుక్కోగలిగాడు. ప్రభాకరాన్ని చూడగానే నిర్మలకి, భాస్కరానికి ఆశ్చర్యం, ఆనందం కలిగాయి.

"ఇదేమిట్రోయ్! ఉత్తరమ్ముక్క రాయకుండా ఇంత హఠాత్తుగా వచ్చావ్?" అన్నాడు భాస్కరం.

"మూడ్రోజుల కిందటే రాశానే. ఇంకా చేరలేదన్న మాట. నువ్వు స్టేషనుకి రాలేదేమిటా అనుకున్నాను. ఉత్తరం అందలేదేమో అనుకుని, అడ్రసు వెతుక్కుంటూ వచ్చాను" అన్నాడు ప్రభాకరం.

ఒక్కసారి కళ్ళతో హాలు అంతా సర్వే చేశాడు. "చాలా బాగుందిరా మీ ఇల్లు" అని మెచ్చుకున్నాడు. తరవాత స్నానం, భోజనం అన్నీ అయ్యేలోగా ఇంట్లో మనుషులనీ, సామాన్లనీ ఒక్క విడత తనిఖీ చేశాడు. అనుమానించ దగినదేదీ కనిపించలేదు. బండారం అనదగినదేదీ బయట పడలేదు. ఇల్లు శుభ్రంగా, కుదుమట్టంగా, ముచ్చటగా ఉంది. సోఫాకంబెడ్, రేడియో, గ్రామఫోన్, గాడ్రెజు బీరువా, జంట మంచాలు, డైనింగ్ టేబుల్, వంటింట్లో స్టీలు సామాను అన్నీ ఉన్నాయి. అన్నీ చక్కగా సర్దినట్లు ఉన్నాయి. ఇంటికి ఎవరో అతిధి వస్తుంటే అమర్చినట్లుగా ఉన్నాయి. చెల్లాయి, భాస్కరం చాలా సంతోషంగా ఉన్నారు. అన్యోన్యంగా ఉన్నారు. 'వీళ్ళకాపురం చూస్తే అమ్మా, నాన్నా సంతోషిస్తారు' అనుకున్నాడు మనస్సులో.

భాస్కరం బయటికి వెళ్ళడానికి బయలుదేరుతూ "నేను పని మీద వెడుతున్నా, మళ్ళీ మూడు గంటలకి వస్తా" అని చెప్పాడు.

భాస్కరం వెళ్ళగానే ప్రభాకరం నెమ్మదిగా చెల్లెలిని కబుర్లలోకి దింపి, "ఇంతకీ మీ ఆయన చేసే వ్యాపారం ఏమిటే"? అనడిగాడు.

"ఈ విషయం పరిశోధించడానికా నువ్వు ఇంత దూరం వచ్చింది?" అంది నిర్మల.

"అబ్బే! అది కాదే... మిమ్మల్నిద్దర్నీ చూసి పోదామనే వచ్చాను. అయినా భాస్కరం ఇంకా వ్యాపారాన్ని అంత రహస్యంగా ఉంచాడా అనుకున్నాను. రహస్యమైతే చెప్పద్దులే."

"చెప్పాలంటే మాత్రం నాకు తెలిస్తే కదా నీకు చెప్పడం".

"నీక్కూడా చెప్పలేదా? ఆశ్చర్యంగా ఉందే! తెలుసుకోవాలని నీకు అనిపించలేదా? పెళ్ళానిక్కూడా తెలీకుండా ఎవడైతేమట్టుకు వ్యాపారం ఎలా చెయ్యగలడబ్బా!"

"ఆయన ఎప్పుడూ చెప్పలేదు. నేను అడగలేదు. తెలుసుకోవాలన్న కుతూహలం నాకు లేదు. అందుకే ప్రయత్నించలేదు. ఇష్టం లేనప్పుడు బలవంతంగా చెప్పించడం దేనికి? సంపాయించి తెస్తున్నారు. నాకు ఏ లోపం చెయ్యడం లేదు. నేను అడిగినవన్నీ కొని తెస్తారు. మా జీవితం హాయిగా గడుస్తోంది. ఇంత కంటే ఎవరైతే మాత్రం కోరుకునేదేమి ఉంటుంది? ఆయన వ్యాపారం ఏదైతే నాకేం?"

"అవునవును... ఏ వ్యాపారమైతేనేం సంపాదన ముఖ్యంగాని. అది సరే. భాస్కరం టయిమింగ్స్ ఏమిటే? ఎప్పుడు వెళ్ళి ఎప్పుడొస్తాడు? సెలవు ఎప్పుడు?"

"పొద్దున్న పది గంటల ప్రాంతంలో వెళ్ళి 12 గంటలకి వచ్చేస్తారు. తర్వాత రాత్రి తొమ్మిది దాకా వెడుతూ వస్తూ ఉంటారు".

"వోహో... వాడు బిజినెస్ చేసేది ఏ ఏరియాలో?"

"అదుగో-నువ్వు మళ్ళీ కూపీ తీసేట్లున్నావ్? అవన్నీ నాకు తెలియవు. ఇటువంటి ప్రశ్నలన్నీ అడిగి, ఆయనకి కోపం తెప్పించకు. ఆయన వెడుతుంటే నువ్వు వెంటబడి వెళ్ళకు. ఆయనకి తీరిగ్గా ఉన్నప్పుడు ఆయనే నిన్ను తీసుకెళ్ళి వూరు చూపిస్తారు". ఇంక వీళ్ళని అడిగి లాభం లేదనీ, వీళ్ళకి తెలీకుండా తనే స్వయంగా పరిశోధించాలనీ అనుకున్నాడు ప్రభాకరం. రెండు రోజులు రకరకాల ప్లాన్లు వేశాడు, కొట్టేశాడు. చివరికి ఒక ఉపాయంతోచింది. మూడోరోజు పొద్దున్న అలా వెళ్ళి ఊరుచూసి వస్తానని భాస్కరం కంటే ఒక అరగంట ముందుగా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిన వాడు ఇంటికి దగ్గరగా ఉన్న బస్ స్టాప్ కి కొంతదూరంలో కాపలా వెశాడు. బస్ స్టాండు దగ్గర్నుంచి చూసేవాళ్ళకి తను కనుపించకుండా ఒక చెట్టు చాటున నించున్నాడు. కొంత సేపటికి భాస్కరం బస్ స్టాప్ దగ్గరికి వచ్చాడు. అతను బస్సు ఎక్కగానే ప్రభాకరం ఆటో ఎక్కి, బస్సును ఫాలో కమ్మన్నాడు.

భాస్కరం కెంపెగౌడా సర్కిల్ దగ్గర బస్సు దిగాడు. అతను దిగడం చూసి ప్రభాకరం ఆటో దిగాడు. భాస్కరానికి ఒక అరఫర్లాంగు వెనక ఉండి ఫాలో అయ్యాడు. భాస్కరం కెంపెగౌడా రోడ్డులో నడుస్తున్నాడు. ప్రభాకరం ఆ రోడ్డును అటూ ఇటూ, పరకాయించి చూశాడు. రోడ్డు చాలా అందంగా ఉంది. అటూ ఇటూ పెద్ద పెద్ద అందమైన సినిమా థియేటర్లు, బ్యాంకులు, హోటళ్ళు, బట్టల షాపులు ఉన్నాయి. భాస్కరం ఒక పెద్ద సినిమా ధియేటర్ లోకి వెళ్ళి, క్యూలో నించున్నాడు. క్యూ చాలా పొడుగు ఉంది. అది ఆ రోజే విడుదలయిన సరికొత్త సినిమా.

"భాస్కరం నన్ను, చెల్లాయిని తీసుకెళ్ళకుండా ఒక్కడూ సినిమాకు వెడుతున్నాడేమిటి?" అనుకున్నాడు ప్రభాకరం. టైము చూస్తే మార్నింగ్ షో టయిము దాటిపోయింది. టిక్కెట్లు తీసుకున్న వాళ్ళు బైటకు వచ్చేస్తున్నారు. వోహో అడ్వాన్స్ బుకింగ్ కాబోలు. అయితే ఇవాళ భాస్కరం సినిమాకు తీసుకు వెడతాడు కాబోలు అనుకున్నాడు. కాసేపటికి భాస్కరం టిక్కెట్లు తీసుకుని బైటకు రావడం కనిపించింది. అతనికి కనిపించకుండా ఒక చెట్టుచాటున నించున్నాడు ప్రభాకరం. తర్వాత మళ్ళీ భాస్కరాన్ని వెనక నుంచి ఫాలో అయ్యాడు. భాస్కరం మళ్ళీ ఇందాకటి నంబరు బస్సే ఎక్కాడు. 'ఓహో ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నట్లున్నాడు' అనుకున్నాడు ప్రభాకరం. ఇంక ఆ బస్సు ఫాలో కావడం అనవసరమనుకున్నాడు. ఓ గంటసేపు ఆ రోడ్డు అంతా సర్వే చేసి, అక్కడి నుంచి బస్కెక్కి ఇంటికి వెళ్ళాడు.

భోజనం చేసేటప్పుడుగానీ, ఆ తర్వాతగానీ భాస్కరం 'ఇవాళ సినిమాకి వెడదాం, టిక్కెట్లు తెచ్చాను' అనలేదు. ఇక ఆ ప్రస్తావన తెచ్చేటట్లు లేదనే ఉద్దేశంతో ప్రభాకరమే కదిలించాడు. "మీ ఊరు వచ్చి మూడు రోజులైనా ఒక్క సినిమా అయినా చూపించావు కావు" అన్నాడు.

"సారీ, ప్రభాకరం! చాలా బిజీగా ఉన్నాను. మధ్యాహ్నం రెండున్నరకి మళ్ళీ వెళ్ళాలి. వచ్చే సోమవారం తప్పకుండా వెడదాం" అన్నాడు భాస్కరం.

'టికెట్లు జేబులో పెట్టుకుని కూడా అబద్దం ఆడుతున్నాడు. ఇందులో ఏదో లిటిగేషనుంది. అది ఏమిటో తేల్చాలి' అనుకున్నాడు ప్రభాకరం. "సరే... సోమవారంలోగా నే నొక్కణ్ణే వెళ్ళి లాల్ బాగ్, కబ్బన్ పార్క్, మ్యూజియం చూసొస్తా" అన్నాడు పైకి.

భాస్కరం రెండున్నరకి బయలు దేరతానన్నాడు కనక తను రెండింటికే ఇంట్లోంచి బయలుదేరి, బస్ స్టాప్ కి కాస్త దూరంలో కాపలా వేశాడు. భాస్కరం కాసేపటికి వచ్చి పొద్దున్న ఎక్కిన బస్సు ఎక్కాడు. ప్రభాకరం పొద్దున్న మాదిరిగానే ఆటో ఎక్కి ఫాలో అయ్యాడు. భాస్కరం పొద్దుటి ధియేటరు దగ్గరికే వెళ్ళాడు. ప్రభాకరం కొంచెం దూరంలో చెట్టు చాటున నక్కి చూస్తున్నాడు.

ధియేటర్ దగ్గర జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. తోసుకుంటున్నారు, కుమ్ముకుంటున్నారు. రోడ్డుకి అటూ ఇటూ వరసగా ఉన్న అన్ని ధియేటర్ల దగ్గర అలాగే జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. అది మాట్నీ టైము. రోడ్డు అంతా రద్దీ, గోల, భాస్కరం వెళ్ళిన ధియేటరు బయట హౌస్ ఫుల్ బోర్డు పెట్టి ఉంది. భాస్కరం ధియేటరులోపలికి వెళ్ళలేదు. బయట నుంచున్నాడు. స్టైలుగా జేబులో చేతులు పెట్టుకుని. ఎవరితోనో ఏదో మాట్లాడుతున్నాడు. కొంచెం పక్కకి తీసుకెళ్ళి జేబులోంచి టిక్కెట్లు తీసి ఇచ్చాడు. ఆ వ్యక్తి నోట్లు ఇస్తే తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. తరవాత ఇంకో పెద్దమనిషికి అలాగే టిక్కెట్లు ఇచ్చి డబ్బు జేబులో వేసుకున్నాడు. ఆవతల ఎవరో ఒకాయన కనిపించేసరికి 'హలో అంటూ పలకరించి నవ్వుతూ షేక్ హాండ్ ఇచ్చాడు. తరువాత ఆ మనిషి ధియేటర్లోకి వెళ్ళిపోయాడు. భాస్కరం మళ్ళీ జేబులోంచి టిక్కెట్లు తీసి ఇంకో వ్యక్తికి ఇచ్చి నోట్లు జేబులో పెట్టుకున్నాడు. అలా పావుగంటలో ఏడెనిమిది మందికి టిక్కెట్లు ఇచ్చాడు. కొందరికి మూడేసి, నాలుగేసి కూడా ఇచ్చినట్లున్నాడు.

అంటే భాస్కరం కనీసం ఇరవై టిక్కెట్లయినా కొని ఉంటాడు. టిక్కెట్ల పంపిణీ కాగానే భాస్కరం మళ్ళీ బస్ స్టాప్ వైపు నడక ప్రారంభించాడు.

ప్రభాకరం భాస్కరాన్ని ఫాలో కాలేదు. తిన్నగా ధియేటరు దగ్గరికి వెళ్ళాడు. మూసేసిన బుకింగ్ కౌంటర్ల దగ్గర ఆశాభంగం పొందిన జనం తచ్చాడుతున్నారు. "హలో. యూ వాంట్ టిక్కెట్? త్రీఫిప్టీ క్లాస్ సెవెన్ రూపీస్, ఫోర్ ఫిఫ్టీ క్లాస్ టెన్ రూపీస్" అంటూ ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి ఇంగ్లీషులో పలకరించాడు. "నో థాంక్స్" అని చెప్పి వచ్చేశాడు. ఆ చుట్టుపక్కల ఉన్న ఏడెనిమిది ధియేటర్ల దగ్గిరికి వెళ్ళి, రేట్లు వివరాలు వాకబు చేశాడు. ఆ రోజే రిలీజయిన సినిమా టిక్కెట్లు రోడ్డు మీద రెట్టింపు ధర పలుకుతున్నాయి. రెండో వారం, మూడో వారం ఆడుతున్న సినిమాల టిక్కెట్లు, రూపాయి, రెండు రూపాయలు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి.

లాల్ బాగ్, కబ్బన్ పార్కు, చూసి చీకటి పడే వేళకి ఇంటికి చేరాడు ప్రభారం. బోలెడు ఖర్చు పెట్టుకుని ఇంత దూరం వచ్చినందుకు మొత్తం మీద వచ్చిన పని అయిందని సంతోషించాడు. తన కొక బతుకు తెరువు దొరికింది. భాస్కరంతో పోటీ లేకుండా ఈ వ్యాపారం హైదరాబాద్ లో ప్రారంభించాలని నిశ్చయించుకున్నాడు. బుక్కింగ్ క్లర్కులకీ, పోలీసులకీ మామూళ్ళు పోను భాస్కరం నెలకి కనీసం పదిహేను వందలయినా సంపాదిస్తూ ఉండవచ్చునని అంచనా వేశాడు. ఈ వ్యాపారంలో బాగా నిలదొక్కుకున్నాడు కనక అంత ధారాళంగా సంపాదించ గలుగుతున్నాడు. తను అలా సంపాదించడం సాధ్యం కాదు. ఎన్నో ఢక్కా, మొక్కీలు తినాలి. ఆ రాత్రి భోజనాల సమయంలో - "నేను ఎల్లుండి బయలుదేరి వెడదామనుకుంటున్నారా" అన్నాడు ప్రభాకరం.

"అదేమిట్రా, అప్పుడే వెడతానంటావ్? వెళ్ళి ఏం చేస్తావ్? పదిరోజులాగి వెళ్ళకూడదు?" అన్నాడు భాస్కరం.

"దేనికీరా. ఉండి ఇక్కడ మాత్రం చేసేదేముంది - రోడ్లు పట్టుకు తిరగడం తప్ప. వచ్చిన పనయింది. చూడాలనుకున్నవి చూశాను. తెలుసుకోవాలనుకున్నవి తెలుసుకున్నాను, వెళ్ళి ఏదో ఒక బతుకు తెరువు చూసుకోవాలి కదా?"

"అయితే ఏం చేద్దామనుకుంటున్నావు? ఏదానా ఉద్యోగం దొరికేట్టుందా?"

"నా కెవడు ఉద్యోగం ఇస్తాడురా? ఏదో మన స్తోమతకు తగిన వ్యాపారం ప్రారంభిద్దామనుకుంటున్నా".

"మన వూళ్ళోనేనా? ఏ మాత్రం పెట్టుబడి?"

"హైదరాబాద్ లో. ఆట్టే పెట్టుబడి ఆవసరం లేని వ్యాపారం చేద్దామని చూస్తున్నా".

"అబ్బో హైదరాబాద్ లోనే! అక్కడ ఆఫీసు తెరవాలన్నా, దుకాణం పెట్టాలన్నా బోలెడు అద్దె అడ్వాన్సు చెల్లించాల్రా నాయనా. లైసెన్సు సంపాదించాలంటే లంచాలు పెట్టాలి. ఇంతకి హైదరాబాద్ లో ఎక్కడ నీ వ్యాపారం?".

"ఆర్.టీ.సీ క్రాస్ రోడ్సు దగ్గర మొదలు పెట్టాలనుకుంటున్నా వ్యాపారానికి దుకాణం, ఆఫీసు, గోడవును అక్కర్లేదు. లైసెన్సులు, టాక్సుల బెడద ఉండదు. అకౌటెంట్లు, ఆడిట్ల గొడవ లేదు" అన్నాడు ప్రభాకరం.

భాస్కరం సన్నగా నవ్వాడు "కంగ్రాచ్యులేషన్స్" అన్నాడు.

వాళ్ళ సంభాషణ నిర్మలకి మాత్రం ఏమీ అర్థం కాలేదు.

నండూరి పార్థసారథి
(1982 జూన్ 27, జూలై 7 తేదీలలో ఆంధ్రప్రభ వార పత్రికలో ప్రచురితమైనది)

Previous Post Next Post