Humor Icon

ఎడతెరిపి లేకుండా పదేళ్ళపాటు హోటలు భోజనం చేసిన ఒక యువబ్రహ్మచారికి జిహ్వచచ్చి, చివరికి మానవ జన్మం మీదనే విరక్తి కలిగింది. ప్రపంచమనే హోటల్ బల్లపై వడ్డించిన విస్తరిలా కనిపించింది జీవితం. అతను నిక్షేపంగా ఎం.ఏ. వరకు చదువుకున్నాడు. బుద్ధిమంతుడు, తెలివైనవాడు. విశాల హృదయుడు (40 అంగుళాలు). హోటల్ భోజనం చేయగా మిగిలిన పర్సనాల్టీయే దాదాపు ఎన్టీరామారావంత ఉంటుంది. అయినా అతను పెళ్ళి చేసుకోవడానికి ఎందుకు మొహమాటం పడుతున్నాడో స్నేహితులెవరికీ అంతుపట్టటం లేదు. ఆర్థిక సమస్యలేవైనా ఉన్నాయానుకుంటే అదీ లేదు. ఆస్తి పాస్తులు లేకపోయినా నెలకు 500 సంపాదిస్తున్నాడు. 'అతనికి ఓ పట్టాన ఏ పిల్లా నచ్చదు' అనుకున్నారు స్నేహితులు. 'అతనికి కట్నం దాహం మరీ జాస్తి లేస్తురూ' అనుకున్నారు బంధువులు. అతను కిమ్మనకుండా ఉండేవాడు. రోజూ భోం చేస్తున్నప్పుడు మాత్రం మనస్సులో 'పెళ్ళిచేసుకోవాలి' అనుకునేవాడు.

ఎలాగైనా అతనికి పెళ్ళిధ్యాస కలిగించాలని అతని స్నేహితులు ఎందరో అందమైన అమ్మాయిలనీ, చదువుకున్న వాళ్ళనీ, డబ్బున్న వాళ్ళనీ చూపిస్తూ ఉండేవాళ్ళు. అయినా అతను ఉత్సాహంగా ముందడుగు వేయలేదు. వీణ వాయించే అమ్మాయిలూ, భరతనాట్యం చేసే అమ్మాయిలూ కూడా అతని అనుగ్రహానికి పాత్రులు కాలేకపోయారు. చివరికి ఒక స్నేహితుడికి మెరుపులాంటి ఆలోచన తట్టింది. ఈ బ్రహ్మచారి కమ్మటి భోజనం చేసి పదేళ్ళు అయింది. ఇంటి భోజనం రుచి అతను పూర్తిగా మరిచిపోయాడు. అందుచేత ఇప్పుడు అతనికి షడ్రసోపేతమైన భోజనం రుచి చూపిస్తే పెళ్ళి చేసుకోవలసిన అవసరాన్ని అతను గుర్తిస్తాడని స్నేహితుడు భావించాడు. ఆ రోజు అతన్ని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. పాకశాస్త్రంలో ఆరితేరిన ఒక వంటలక్కని పిలిపించి వంట చేయించాడు. భోజనానికి కూర్చునేముందు ఆవిడ వంట రుచిని గురించి అర్థగంట సేపు వర్ణించాడు. ఆవిడ నల్లగా సిద్ధిలాగా, పిప్పళ్ళబస్తా ప్రమాణంలో ఉంటుంది. మనిషిని చూస్తే భోజనం రుచించదు కనుక, తలవంచుకుని భోంచేయమని సలహా ఇచ్చాడు. మిత్రుడి సలహా ప్రకారం బ్రహ్మచారి తల వంచుకునే భోం చేశాడు. తర్వాత తృప్తిగా త్రేన్పాడు. వంటను గొప్పగా మెచ్చుకున్నాడు. ''ఇవాళ నాకు మహాపర్వదినం'' అన్నాడు. మిత్రుడు సంతోషించాడు.

తర్వాత వారం తిరక్కుండా బ్రహ్మచారి ఆ వంటలక్కతో పరారీ అయిపోయాడు. మిత్రుడు ఈ ప్రమాదవార్త విని 'హతోస్మి!' అనుకున్నాడు.

నండూరి పార్థసారథి
(ఈ రచన 1963లో జ్యోతి మాసపత్రికలో ప్రచురితమయింది)

Previous Post Next Post