Title Picture

ఆదుర్తికి 'అభినందన'

తీసిన ప్రతి చిత్రాన్నీ కనీసం వంద రోజులు నడిపించగల ధీమా దక్షిణ భారతదేశంలో నలుగురైదుగురు దర్శకులకు మాత్రమే ఉంది. వారిలో అగ్రగణ్యుడు ఆదుర్తి సుబ్బారావు. రెండు దశాబ్దాల చైత్రయాత్రలో అసిస్టెంట్ ఎడిటర్ గా, ఎడిటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా, డైరెక్టర్ గా, నిర్మాతగా ఒక్కొక్క మెట్టు ఎక్కి నేటి ఉన్నత స్థితికి వచ్చాడు ఆయన. విజయసౌధానికి సోపానాలు ఇంకా ఎక్కుతూనే ఉన్నాడు ఆయన. అయితే ఒకప్పుడు కఠిన శిలాసోపానాలు ఎక్కారు. ఇప్పుడు మృదుల 'సోఫానాలు' ఎక్కుతున్నారు. అంతే తేడా.

ఆయన నిర్మించిన 'మూగ మనసులు' చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలో అపూర్వమైన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ఆయనకు ప్రజల అభిమానమే కాక ప్రభుత్వ అభిమానాన్ని కూడా సంపాదించి పెట్టింది. ఆయన ఇంతటివాడు కావటం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమే అయినా రాజమండ్రి పౌరులకు మరీ గర్వకారణం. ఎందుకంటే ఆయన పుట్టి పెరిగింది అక్కడే. వారు ఇటీవల తమ ఆదుర్తిని సగర్వంగా సన్మానించుకున్న సందర్భంలో 'అభినందన' సంచికను వెలువరించారు.

ఈ సంచికలో నాగేశ్వరరావు, ఎస్.వి. రంగారావు, జెమినీ గణేశన్, ఎమ్.జి. రామచంద్రన్, డి. మధుసూదనరావు, వి. మధుసూదనరావు, సి. సుందరం, కె.వి. మహదేవన్, పి. రామకృష్ణ, సావిత్రి, జమున ప్రభృతుల అభినందన వ్యాసాలు, ఆదుర్తి జీవిత కథా కమామీషు, ఫొటోలు ఉన్నాయి. ఆర్ట్ పేపర్ మీద అందంగా ముద్రించారు. చాలా వ్యయప్రయాసలకోర్చి వెలలేని సంచికను వెలువరించిన సన్మాన సంఘంవారు అభినందనీయులు.

నండూరి పార్థసారథి
(1964 సెప్టెంబర్ 09వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post