Title Picture

(పిల్లల పుస్తకం ; ప్రచురణ, ప్రాప్తిస్థానం : యూనివర్సల్ నాలెడ్జి సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, 193, మౌంట్ రోడ్, మద్రాసు-2; 8 పేజీలు; వెల : రూ. 1.50 పైసలు)

'కొత్తగా బడికి వెళ్ళే పిల్లల కోసం, రంగు రంగుల బొమ్మలతో, శబ్దాలతో కూర్చిన అందమైన పుస్తకం ఇది. రెండు వైపులా ఉన్న అట్టలుకాక లోపల ఎనిమిది పేజీలున్నాయి. అట్ట మీద, లోపల కూడా రంగుల బొమ్మలున్నాయి. ఇందులో 'అ నుంచి అః' వరకు అక్షరాలు, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క బొమ్మ ఉన్నాయి. ప్రతి పేజీకి మధ్య ఒక ఈల అమర్చారు. పేజీలు బాగా మందంగా ఉండి, నొక్కితే ఈలవేస్తూ ఉంటాయి. ఒక్కొక్క పేజీ ఒక్కొక్క రకం శబ్దం చేస్తూ ఉంటుంది.

ఋ నుంచి అః వరకు కొన్ని అక్షరాలకు బొమ్మలు వేయలేదు. ఊరికే అక్షరాలు మాత్రం వ్రాశారు. 'ఇ' అనే దానికి ఇద్దరు అనీ, 'ఔ' అనేదానికి ఔషధం అనీ వ్రాయటం బాగాలేదు. అవి తేలికైన పదాలు కావు. బొమ్మలు బాగున్నాయి. అంతకంటే వాటి రంగులు, ముద్రణ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. చిన్న పిల్లలకు ఇటువంటి ఆకర్షణలు అవసరం. ఈ పుస్తకం పాఠం నేర్పేదిగానూ, ఆట వస్తువుగానూ కూడా ఉపయోగిస్తుంది. ఇటువంటి పుస్తకాలు ఇంగ్లీషులో చాలానే ఉన్నాయి. తెలుగులో ఇదే మొదటిది. తెలుగు అక్షరాలన్నింటినీ రంగుల బొమ్మలతో నేర్పే ఇటువంటి పుస్తకాలను విరివిగా ఉత్పత్తి చేసి, సామాన్యుల పిల్లలకు కూడా అందుబాటులో ఉండేటట్లు చేయటం అవసరం. రూపాయిన్నర ఖరీదుపెట్టి కొనగల స్తోమతు చాలా తక్కువ మందికి ఉంటుంది. తక్కువ ధరకు ప్రభుత్వమే స్వయంగా ప్రచురిస్తే పిల్లలకు మేలు చేసినట్లవుతుంది. స్తోమతుగల వారు, పిల్లలు గలవారు తప్పక కొనవలసిన పుస్తకం ఇది.

నండూరి పార్థసారథి
(1965 ఏప్రిల్ 21వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post