Title Picture
అంగట్లో అన్నీ వున్నాయి గాని
అల్లుడి గారి నోట్లో శని
తుంగభద్రలో నీళ్లున్నాయి గాని 
అవి నోటికందేదెలాగని?

కోటి రూపాయలు ఖర్చయినాయి గాని
కూటికి గూటికీ యిబ్బంది.
'మన ఖర్మకాలిగాని, కర్నూలా రాజధాని?'
అనుకుంటున్నారు సిబ్బంది.

మాకు తెలుసుబాబూ, ఎంత మోగించినా
ఈ పూటా రూపాయి చెల్లదు,
ఎన్ని రంగులు మార్చి, ఎన్ని హంగులు తీర్చినా
జవరాలు ముదుసలినొల్లదు.

ప్రకాశంగారు ఎంత కర్'నూలు'వడికినా
ప్రభుత్వాధి'నేత' సమస్య తేలదు.
కొంతకాలం పాటు ఎవరేమి మిడికినా
ఈ పరిస్థితి ఎల్లకాలం మారదు.

ఆంధ్రవచ్చినా, విశాలాంధ్రవచ్చినా
ప్రజలు కోరేది ప్రజాస్వామ్యం
కర్నూలు శాశ్వతమైనా, అశాశ్వతమైనా
ఎవడిక్కావాలి ప్రకాశామ్యం?

ఎవరొస్తారెవరొస్తారనగానే
వచ్చాడు తిరుపతి తిమ్మన్న,
వేగిరం సంజీవి వేస్తేనే
మాట దక్కిస్తాడు లక్ష్మన్న.

పదవుల వరదలో, పార్టీల బురదలో
మునుగుతుంది కర్నూలు డేరా,
ఎవరెన్ని చెప్పినా ఇదినమ్ము మదిలో
మన రాజధాని బెజవాడేరా

ప్రజలు తమ చేతుల్లో గదా ప్రాసలు
పట్టుకుంటేనే కదా రాష్ట్రం వచ్చింది.
ఆ ప్రజలకోసమే గదా ప్రాసలు
కవి కలంలోంచి పుట్టింది!

నండూరి రామమోహనరావు
( Nov 4, 1953 ఆంధ్ర సచిత్ర వారప్రతికలో ప్రచురితమైనది)

Previous Post Next Post