అక్టోబరు 16 వ తేదీ రాత్రి ఆకస్మికంగా అస్తమించిన 'సంగీత కళానిధి' శ్రీ చెంబై వైద్యనాధ భాగవతార్ అనేక విధాలుగా అద్వితీయుడు. కర్ణాటక శాస్త్రీయ సంగీత రంగంలో ఆయన సీనియర్ మోస్ట్ విద్వాంసుడు. చనిపోయే నాటికి ఆయన వయస్సు 78 సంవత్సరాలు. కాగా, ఆయనకు 70 సంవత్సరాల కచేరీ అనుభవం ఉన్నది. కర్ణాటక సంగీత విద్వాంసులలో ఇంత దీర్ఘ కాలం కచేరీలు చేసినవారు లేరు. 78 సంవత్సరాల వయస్సులో ఆయనవలె పూర్ణారోగ్యంతో, నిత్య నూతననోత్సాహంతో, చెరగని చిరునవ్వుతో, దేశమంతటా తిరుగుతూ కచేరీలు చేసినవారు మరొకరు కనిపించరు. తన జీవితాన్ని పూర్తిగా సంగీతానికి సమర్పణం చేసుకుని, కేవలం సంగీతం కోసం జీవించాడు ఆయన.

చనిపోయేనాటి వరకు అంత వృద్ధాప్యంలో కూడా ఆయన సంగీతపు వన్నె తరగలేదు. ఆయన కంఠంలో ధాటీ తగ్గలేదు. ఆయన కచేరీలకు గిరాకీ తగ్గలేదు. అనారోగ్యంతో మంచం పట్టకుండా, గానం చేస్తూనే అనాయాసంగా మరణించిన ధన్యజీవి ఆయన. 16వ తేదీ రాత్రి ఆయన కేరళలోని ఓట్టపాలంలో ఒక దేవాలయంలో రెండు గంటలసేపు కచేరీ చేశారు. వందలాది సంగీత ప్రియులను ఆనందసాగరంలో ముంచి ఎత్తారు. తర్వాత ఒక మిత్రుని ఇంటికి వెళ్ళారు. కొద్దిగా నలతగా ఉందని చెప్పారు. డాక్టర్లు వచ్చి చికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది. 10.30 గంటలకు ఆయన శాశ్వతంగా కన్నుమూశారు.

వైద్యనాథ భాగవతార్ 1896 సెప్టెంబరు 1వ తేదీన కేరళ లోని చెంబైలో జన్మించారు. ఏడెనిమిదేళ్ళ పిన్న వయస్సులోనే ఆయన కచేరీలు చేయడం ప్రారంభించారు. అప్పటినుంచి జీవితంలో చివరి రోజు వరకు ఆయన 'బిజీ ఆర్టిస్టు' గానే ఉన్నారు. ప్రతి సంవత్సరం దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ కచేరీలు చేస్తూనే ఉన్నారు. 1951లో మద్రాసు మ్యూజిక్ అకాడమీ ఆయనను 'సంగీత కళానిధి' బిరుదంతో సత్కరించింది. 1958లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ చేతులమీదుగా ఆయన సంగీత నాటక అకాడమీ అవార్డునందుకున్నారు. 1973లో 'పద్మభూషణ్' అవార్డు నందుకొన్నారు. 'సంగీత సమ్రాట్', 'గాయన గంధర్వ' వంటి అనేక బిరుదులు కూడా ఆయన పొందారు. క్రిందటి సంవత్సరం తిరుపతిలోని త్యాగరాజ స్వామి ఉత్సవ సంఘం ఆయనకు 'సప్తగిరి సంగీత విద్వన్మణి' బిరుదాన్ని ప్రసాదించింది.

వైద్యనాథ భాగవతార్ తన తండ్రి నుంచే సంగీతం నేర్చుకున్నారు. ఆయన తండ్రి చెంబై అనంత భాగవతార్ గొప్ప సంగీత విద్వాంసుడు. గాత్రంలోనూ, వైలిన్ లోనూ కూడా దిట్ట. వైద్య నాథభాగవతార్ కూడా వైలిన్ వాయించేవారు. కొంతకాలం వేణువుకూడా సాధన చేశారు. ఆయన గొంతు కంచుగంటవలె ఖంగున మ్రోగేది. మైక్ లు లేని రోజుల్లో కూడా ఆయన ఆట్టే శ్రమపడ కుండానే వేలాది శ్రోతలకు స్పష్టంగా వినిపించే విధంగా పాడగలిగేవారు. రెండున్నర స్థాయిలు తేలిగ్గా పాడేవారు. స్వరకల్పనలో అతివేగంగా పాడేటప్పుడు ఆయన చతుర్థకాలాన్ని అందుకునేవారు. ఆయనకు ప్రక్క వాద్యం వాయించడం విద్వాంసులకు ఒక సవాలుగా ఉండేది. మైసూరు చౌడయ్య (వైలిన్), పాల్ఘాట్ మణిఅయ్యర్ (మృదంగం) వంటి మహా విద్వాంసులు కూడా ఆయనకు ప్రక్క వాద్యం వాయించేటప్పుడు చాలా మెలకువగా ఉండేవారు.

చెంబై ఎందరో విద్వాంసులను తయారు చేసి సంగీత రంగానికి కానుకలుగా సమర్పించారు. కొందరికి స్వయంగా సంగీతం నేర్పివృద్ధిలోకి తీసుకువచ్చారు. మరికొందరికి తనకు ప్రకవాద్యం వాయించే అవకాశమిచ్చి, సానబట్టి ప్రకాశింపచేశారు.

ఈ కురువృద్ధుని ధాటికి అగ్రశ్రేణి యువవిద్వాంసులు కూడా తట్టుకోలేకపోయేవారు. అతి వేగంగా పాడుతూ ఆయన వారిని తరిమి తరిమి కొట్టేవారు. వారికి ముచ్చెమటలుపోసేవి. సభలో కరతాళ ధ్వనులు చెలరేగేవి. ఆయన కచేరీ ఒక్క నిమిషం కూడా మందకొడిగా ఉండదు. సభారంజకత్వం ఆయనకు వెన్నెతో బెట్టిన విద్య అనిపిస్తుంది. చొక్కా కూడా లేకుండా రుద్రాక్షమాలలతో, నుదుట విభూతి రేఖలతో, చిరునవ్వులతో వేదిక మీద కూర్చుంటే మూర్తీభవించిన కర్ణాటక సంగీత సంప్రదాయంగా కనిపించేవారు.

చాలామంది వృద్ధ సంగీత విద్వాంసులవలె ఆయన అహంకారి కాదు. అతి సాధుస్వభావుడు. యువతరం వారిపట్ల ఆయనకు చులకన భావం లేదు. వయస్సుతో నిమిత్తం లేకుండా విద్వత్తుగల వారి నందరినీ ఆయన హృదయపూర్వకంగా ప్రశంసించేవారు. ఈ మధ్యనే ఆయన తన వయస్సులో సగం వున్న చిట్టిబాబుకు 'వైణిక కులాలంకార' బిరుదును ప్రధానం చేశారు. అది వరకు ఒకసారి బాలమురళీకృష్ణకు గండపెండేరం తొడిగారు.

కృతులలో సంగీతానికి మాత్రమేకాక, సాహిత్యానికి కూడా ప్రాధాన్యమిచ్చి, స్పష్టమైన ఉచ్ఛారణతో, భావస్ఫూర్తితో గానంచేసే కొద్దిమంది విద్వాంసులలో ఆయన ఒకరు. గురువాయూరప్పన్ (శ్రీకృష్ణుడు)కు ఆయన పరమభక్తుడు. తన సంపాదనలో అధికభాగం గురువాయూర్ దేవాలయానికే ఇచ్చివేశారు. శ్రీకృష్ణ భగవానుని స్తుతించే సంస్కృతగ్రంథం 'నారాయణీయం' ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ప్రతి కచేరీలోనూ ఆయన 'నారాయణీయం' లోని కొన్ని శ్లోకాలను గానం చేసేవారు. గ్రామఫోన్ రికార్డులలో కూడా వాటిని గానం చేశారు. జీవితంలో చివరి రోజున ఓట్టప్పాలం కచేరీలో చిట్టచివర పాడిన శ్లోకం 'నారాయణీయం'లోనిదే.

అక్టోబరులోనే శ్రీ చెంబై తాజా స్టీరియోలాంగ్ ప్లే రికార్డు (S/33 ESX6063) విడుదలయింది. ఇది ఆయన మూడవ ఎల్.పి. ఇందులో ఆయన ఒకవైపు 'వరనారద' (విజయశ్రీ), ఇంకా 'దయరాదా' (చక్రవాకం) కృతులు, రెండోవైపు 'సామగాన వినోదిని' (హంసానంది), 'క్షీర సాగర శయన' (దేవగాంధారి), 'రారా మురళీధర' (విజయ నాగరి) కృతులు గానం చేశారు. ప్రక్క వాద్యాలుగా డాక్టర్ ఎల్. సుబ్రహ్మణ్యం వైలిన్, టి.వి.గోపాల కృష్ణన్ మృదంగం, అలంగుడి రామచంద్రన్ ఘటం వాయించారు.

ఇదివరకు 33ESX6009 రికార్డులో 'వాతాపి గణపతింభజే' (హంసధ్వని) 'రఘువర' (పంతువరాళి), 'ఎదుటనిలచితే' (శంకరాభరణం) కృతులు, యదుకుల కాంభోజిరాగంలో ఒక తమిళకృతి, 'నారాయణీయం'లోని ఒక శ్లోకం గానం చేశారు. S/33ESX6027 రికార్డులో 'రక్షమాం' (గంభీరనాట), 'బంటురీతి' (హంసనాదం) 'మనవి యాలకింప' (నళినకాంతి), 'ఎంత వేడుకొందు' (సరస్వతీ మనోహరి), 'మనసా ఎటులోర్తునే' (మలయమారుతం), 'రామా నీయెడ' (ఖరహర ప్రియ) కృతులు, 'నారాయణీయం'లోని ఒక శ్లోకం గానం చేశారు. ఇవి కాక రెండు ఇ.పి. రికార్డులు, బోలెడు 78 ఆర్.పి. ఎం. రికార్డులు కూడా ఉన్నాయి. ఆ పాత రికార్డులు ఇప్పుడు దొరకవు.

నండూరి పార్థసారథి
(1974 నవంబర్ 22వ తేదీన ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమైనది)

Previous Post Next Post