మణిలాల్ నాగ్

బెంగుళూరు, అక్టోబర్ 5: ప్రముఖ సితార్ విద్వాంసుడు మణిలాల్ నాగ్ ఇటీవల ఇక్కడ ఇంజనీర్స్ ఇన్ స్టిట్యూషన్ హాలులో బెంగుళూరు సంగీత సభ ఆధ్వర్యాన మూడున్నర గంటలసేపు చిరస్మరణీయమైన కచేరీ చేశారు. ప్రసిద్ధ తబ్లా విద్వాంసుడు కానాయ్ దత్తా ప్రక్కవాద్యం వాయించారు.

మణిలాల్ నాగ్ బెంగాల్ కు చెందిన ప్రసిద్ధ సితార్ విద్వాంసుడు గోకుల్ నాగ్ కుమారుడు. ఆయన నాల్గవ ఏటనే తండ్రి వద్ద సితార్ అభ్యాసం ప్రారంభించారు. 14వ ఏటనే-1953లో కలకత్తాలో జరిగిన అఖిలభారత సంగీత మహాసభలో కచేరీ చేశారు. రెండు సంవత్సరాల క్రితం అమెరికా, కెనడా, బ్రిటన్, ఇతర యూరప్ దేశాలలో పర్యటించి కచేరీలు చేశారు.

మొన్నటి కచేరీలో ఆయన మొదట 'లలిత్ గౌరి' రాగంలో గంటన్నరసేపు ఆలాప్, జోడ్, ఝాలా, మసీత్ ఖానీగత్, రజాఖానీగత్ లను వాయించారు. 'లలిత్', 'గౌరి' హిందూస్థానీ సంగీతంలోని రెండు ప్రసిద్ధ రాగాలు. 'లలిత్' ఉదయకాలపు రాగం. 'గౌరి' సాయంకాలపు రాగం. ఈ రెండు రాగాల మధురమేళనం 'లలిత్ గౌరి'. మొదట పావుగంట సేపు 'ఆలాప్' కొంత మందకొడిగా అనిపించింది. 'జోడ్' ప్రారంభించే సమయానికి ఆయన మనస్సును పూర్తిగా రాగభావంలో నిమగ్నం చేయగలిగారు. అక్కడి నుంచి క్రమంగా సంగీతంలో రంజకత్వం పెరుగుతూ వచ్చింది.

విరామానంతరం కచేరీ మరింతగా రక్తి కట్టింది. 'మిశ్రకాఫీ' రాగంలో 40 నిమిషాల సేపు ఠుమ్రీ అంగ్ లో ఆలాప్, జోడ్, విలంబిత్, ధ్రుత్ గత్ లను, చివర 'ఝాలా'ను అతి మనోహరంగా వాయించారు. ఈ రాగంలో అతి నాజూకుగా, ఆకర్షకంగా ఇతర రాగాలను ప్రవేశపెట్టారు. 'మిశ్ర కాఫీ' మొఖమల్ వస్త్రంపై రకరకాల ఇతర రాగాల జలతారు నగిషీలు అల్లారు. అతి వేగంగా 'ఝాలా' వాయించేటప్పుడు కూడా ఆయన 'కాఫీ' రాగంలో ఇతర రాగాలను మేళవింపజేయడం గొప్ప విషయం.

'మిశ్రకాఫీ' తర్వాత వాయించిన 'భాటియాలీ' అనే బెంగాలీ జానపదగీతం మరింత మధురంగా ఉంది. పది నిమిషాల 'భాటియాలీ'తో ఆయన బెంగాల్ సుందర ప్రకృతి దృశ్యాన్ని శ్రోతల మనో నేత్రాలఎదుట ఆవిష్కరించారు. దాని తర్వాత హిందూస్థానీ కచేరీ సంప్రదాయానుసారం 'భైరవి' రాగంతో కచేరీని ముగించారు. భక్తిరస ప్రధానమైన రాగాన్ని అరగంటసేపు అద్భుతంగా వాయించి శ్రోతలను పరవశింపజేశారు.

నండూరి పార్థసారథి
(1975 అక్టోబర్ 06వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Previous Post Next Post