విజయరాఘవరావు

హైదరాబాద్, ఏప్రిల్ 7 : హిందూస్థానీ సంగీత విద్వాంసుడుగా జగత్ప్రసిద్ధుడైన ఏకైక ఆంధ్రుడు పండిత్ విజయరాఘవరావు ఇవాళ రాత్రి రవీంద్ర భారతిలో గంటసేపు ఆపాత మధురమైన, చిరస్మరణీయమైన వేణుగానంతో జంటనగరాల సంగీత రసికులను సమ్మోహితులను చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో మూడు రోజులు జరిగిన ఉగాది తెలుగు సాంస్కృతిక ఉత్సవాలలో చివరి సంగీత కచేరీ ఇదే. విజయరాఘవరావు వేణుగానం ఉరవళ్లు, పరవళ్ళతో ఎడతెరిపిలేని మాధురీ ప్రవాహంగా రసజ్ఞులను ముంచెత్తింది. కచేరీ ముగిసే సమయానికి శ్రోతలకు అవర్ణనీయ ఆనందానుభూతితో పాటు తనివి తీరని అతృప్తి కూడా కలిగించింది. కనీసం మూడు గంటలు వినవసిన సంగీతాన్ని గంటసేపు మాత్రమే విని తృప్తిపడమనడం నిరుత్సాహం కలిగించింది.

శాస్త్రీయ సంగీత కచేరీలు సాధారణంగా రెండున్నర, మూడు గంటల సేపు జరుగుతాయి. కాని ఈ మధ్య మన ప్రభుత్వం మినీ కచేరీలను ప్రజలకు అలవాటు చేస్తున్నది. ఈ గవర్నమెంటు కచేరీలన్నీ గంటసేపు జరుగుతున్నాయి. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, బాలమురళీకృష్ణ లాంటి ప్రసిద్ధులు కూడా ఒక లాంగ్ ప్లేరికార్డు వ్యవధిలో కచేరీలు చేస్తున్నారు.

హిందూస్థానీ సంగీత విద్వాంసులు సాధారణంగా ఒక్కొక్క రాగాన్ని గంటసేపు వాయిస్తారు. ఇవాళ విజయరాఘవరావు గంటసేపట్లో రెండు రాగాలు వినిపించారు. మొదట ముప్పావుగంటసేపు 'యమన్' రాగం వాయించి, తర్వాత పావు గంటసేపు 'మిశ్రపీలూ' ఠుమ్రీ వినిపించారు.

హిందూస్థానీ విద్వాంసులు వాయించే బాసుఁరీ (వేణువు) దాక్షిణాత్యుల వేణువుకు రెట్టింపు పొడుగు-24 అంగుళాలు ఉంటుంది. దక్షిణాది వేణువు కంటే దాని నాదం గంభీరంగా ఉంటుంది. ఈ వేణువును సృష్టించినవారు స్వర్గీయ పండిత పన్నాలాల్ ఘోష్. దేశంలో ఇప్పటి బాసుఁరీ విద్వాంసులందరూ పన్నాలాల్ శిష్యులో, ఏకలవ్య శిష్యులో; విజయరాఘవరావు రవిశంకర్ శిష్యుడైనప్పటికీ బాసుఁరీ వాదనంలో ఆయనది పన్నాల్ల్ ఘరానా అనే చెప్పాలి. మధ్య సప్తక్ లో, తార సప్తక్ లో వాయించేటప్పుడు 24 అంగుళాల వేణువును ఉపయోగిస్తూ, మంద్రసప్తక్ లో వాయించ వలసి వచ్చినప్పుడు 36 అంగుళాల వేణువును ఉపయోగించడం పన్నాలాల్ పద్ధతే. అయినా విజయరాఘవరావుకు ఒక సొంత శైలి ఉంది. ఆయన వాయించే ఆలాప్ పైనా, గత్ లపైనా, ఠుమ్రీలపైనా విజయరాఘవ ముద్ర ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. పన్నాలాల్ ఎల్.పి. రికార్డులోని 'యమన్'తో విజయరాఘవరావు 'యమన్'ను పోల్చుతూ వింటే ఇద్దరి బాణీల మధ్య తేడా స్పష్టంగా తెలుస్తుంది.

విజయరాఘరావు మంద్ర, మధ్య, తార సప్తక్ లలో పావుగంటసేపు ఆలాప్ వాయించి 'యమన్' రాగ స్వరూపాన్ని సమగ్రంగా ఆవిష్కరించారు. తర్వాత మధ్యలయలో ఒక గత్, ధ్రుత్ లయలో ఒక గత్ వాయించారు. సరిగా ఆరు గంటలకు ప్రారంభించి 6-45 గంటలకు ఆరాగాన్ని ముగించారు. హిందూస్థానీ సంగీత సంప్రదాయం ప్రకారం 'యమన్' రాగాన్ని గానం చేయవలసిన సమయం అదే. కర్ణాటక సంగీతంలో 'కళ్యాణి'కి సమమైన ఈ రాగం హిందూస్థానీ సంగీతంలోని పది జనక రాగాలలో మొదటిది.

'యమన్' తర్వాత విజయరాఘవరావు 'మిశ్రపీలూ' రాగంలో ఒక ఠుమ్రీ అందుకున్నారు. ఐదారు నిమిషాలు వాయించిన తర్వాత దానిని రాగమాలికగా మార్చి హంసధ్వని, జింఝూటి, శివరంజని రాగ ఛాయలను వినిపించారు. ఈ ఠుమ్రీ విజయరాఘవరావు అభిమానులకు బాగా పరిచయమైనదే.

ఇంత మంచి కచేరీకి హాల్లో జనం ఆట్టే మంది లేకపోవడం, వచ్చిన వారిలో కొందరు మధ్యలో లేచి వెళ్ళిపోవడం బాధాకరం. అయితే ఇది గవర్నమెంటువారి కచేరీ అనీ, ఆహ్వానితులకు మాత్రమే పరిమితమైనదనీ, ఆహ్వానితులలో అధిక సంఖ్యాకులు సంగీత సంబంధంలేని అరసిక పుర ప్రముఖులనీ జ్ఞాపకం చేసుకుంటే ఈ పరిస్థితి ఆశ్చర్యం కలగదు.

నండూరి పార్థసారథి
(1976 ఏప్రిల్ 07వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Previous Post Next Post