Title Picture
మంగళంపల్లి బాలమురళీకృష్ణ

కర్ణాటక సంగీత చరిత్రలో మంగళంపల్లి బాలమురళీకృష్ణతో పోల్చదగిన ప్రతిభావంతుడు మరొకరు లేరని-తడుముకోకుండా ధీమాగా చెప్పుకోవచ్చు. సంగీతంలో ఆయన చేసిన కొన్ని కొన్ని ప్రయోగాలను మెచ్చుకోలేకపోయిన వారూ, సమకాలిక అసూయాపరులు కొందరూ కూడా ఆయన అసాధారణ ప్రతిభకు జోహారులర్పించకుండా ఉండలేకపోయారు. కర్ణాటక సంగీతంలోనే కాదు. భారతీయ శాస్త్రీయ సంగీతంలోనే అంతటి విలక్షణ కళాకారుడు ఉన్నాడా అంటే-అనుమానమే. అంతటి మహాజాతకుడూ మరొకరు లేడు.

బాలమురళీ వంటి మహాద్భుత సంగీత కళాకారుడు ఒకడు పాశ్చాత్య సంగీత చరిత్రలో ఉన్నాడు. అతడు ఉల్ఫ్ గాంగ్ అమేడియస్ మోజార్ట్ (1756-1791). మూడేళ్ళ పిన్నవయస్సులో అతడు పియానో కచేరీలు చేయడం మొదలు పెట్టాడు. ఐదేళ్ళ వయస్సులో కంపోజింగ్ ప్రారంభించాడు. పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో మరెవ్వరూ చేయనన్ని రచనలను ముప్పయ్ ఐదేళ్ళ అల్పాయుష్షులోనే చేశాడు. దైవాంశ సంభూతుడు (అమేడియస్) అనే బిరుదు అతడి పేరులోకి వచ్చి చేరింది. అతడి ప్రతిభను భరించలేకపోయిన అసూయాపరుల కారణంగా అతడి జీవితం విషాదాంతమయింది.

బాలమురళీకృష్ణకు అటువంటి దుర్గతి పట్టలేదు. ఎన్నభై ఆరేళ్ళ నిండు జీవితంలో ఆయన అపజయమన్నది ఎరుగడు. దేశ విదేశాలలో ఎన్నెన్నో గొప్ప బిరుదులు, అవార్డులు, సత్కారాలూ ఆయన అందుకున్నారు-ఒక్క 'భారతరత్న' తప్ప. ఎప్పుడో పదిహేనేళ్ళ క్రిందటే రావలసిన ఆ పురస్కారం రాకపోవడానికి సంకుచిత రాజకీయం తప్ప మరొకటి కాదన్నది బహిరంగ రహస్యం. ఇప్పుడు మరణానంతరం ఆ అవార్డు అర్జెంటుగా వచ్చేస్తుంది. ఆ గౌరవం ఆయనకు కాదు, అవార్డుకే.

1930 జూలై 6వ తేదీన మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించిన బాలమురళీకృష్ణ 2016 నవంబర్ 22వ తేదీన చెన్నైలోని స్వగృహంలో అస్తమించారు. అంతిమ క్షణాలలో ఆయన కుటుంబం వారంతా ఆయన చెంతనే ఉన్నారు.

బాలమురళీ కుదురుగా, ఒక పద్ధతి ప్రకారం ఎవరి దగ్గరా సంగీతం నేర్చుకోక ముందే పదేళ్ళ వయస్సులో ఆరితేరిన విద్వాంసుల స్థాయిలో కచేరి చేసి శ్రోతలను ఆశ్చర్యంతో ముంచెత్తారు. స్కూలులో చదివింది ఫస్ట్ ఫారం దాకానే అయినా పద్దెనిమిదేళ్ళ వయస్సులో 72 మేళకర్తలలోనూ సంస్కృతంలో కృతులు రచించాడు. చాలా మంది విద్వాంసులు ఆయనను త్యాగరాజు అపరావతారమని వర్ణించారు. ఆయన తండ్రి, తల్లి, పై తరాల వారు అందరూ గాయకులే. తండ్రి పట్టాభిరామయ్య గారు కొడుకును అతి పిన్న వయస్సులోనే గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి గురుకులంలో చేర్చారు. పంతులుగారు ఒక సందర్భంలో తన ప్రియ శిష్యుణ్ణి గురించి చెబుతూ "వాడికి నేను నేర్పడం ఏమిటి? వాడి సంగీతాన్ని వాడే తెచ్చుకున్నాడు. వాడు పాడుతున్నదంతా నేను నేర్పింది కాదు" అన్నారు.

జన్మపరంపరలున్నాయనీ, ఒక జన్మలో సంపాదించుకున్న సంస్కారం మరుజన్మకు సంక్రమిస్తుందనీ నమ్మలేనివారు సైతం ఇటువంటి బాల మేధావుల ప్రజ్ఞా ప్రాభవాలను ప్రత్యక్షంగా గమనించినప్పుడు "ఏమో అవి ఉన్నాయోమో!" అని అనుమానించవలసివస్తుంది. ఎందుకంటే సామాన్యులు ఒక జీవితకాలంలో సాధించలేని విద్వత్తును వీరు బాల్యదశలోనే ఎలా ప్రదర్శించ గలుగతున్నారనే దానికి నమ్మదగిన సమాధానం కుదరదు. బాల మేధావులలో కొందరి వైభవం యౌవన దశలోనే అంతరించిపోతుంది. అరుదుగా కొందరి ప్రతిభాప్రావీణ్యాలు అంతకంతకు వృద్ధిపొందుతూ జీవితాంతం వరకు ఉంటాయి. అయినా అందరి అదృష్టాలూ ఒక్కరకంగా ఉండవు. కొందరి జీవితాలు సమకాలికుల ఈర్ష్యాద్వేషాలకు బలైపోతుంటాయి-మోజార్డ్ జీవితంలాగా.

బాల మేధావులందరిలో కొన్ని సమాన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. వీరందరూ గురువులను మించిన శిష్యులు. వీరికి గురువుల శిక్షణ నామమాత్రమే. పూర్వ జన్మల నుంచి విద్వత్తునంతా మూటగట్టుకు వచ్చారా అనిపిస్తుంది. వారి గళాలనుంచి, వాద్యాల నుంచి స్వరాలు ఉరవళ్ళు, పరవళ్ళతో దూసుకొస్తూ ఉంటాయి. ఎదుట ఎంతటి విద్వాంసులు కూర్చున్నా జంకూ గొంకూ లేకుండా ఝమాయించి తమ ప్రజ్ఞను ప్రదర్శించగలరు. వీరి ఆకర్షణ ప్రధానంగా బాల్యంలోనే ఉంటుంది. "వేలెడు లేడు ఎంత అద్భుతంగా పాడుతున్నాడు" అని ఆశ్చర్యంతో నోళ్ళు తెరుచుకు వింటారు. పిల్లవాడు అందంగా, ముద్దుగా ఉంటే యింక చెప్పనక్కరలేదు. విపరీతమైన పబ్లిసిటీ. వీరిని వినడం కోసం కాక చూడడం కోసం వచ్చే జనం ఎక్కువ. ఈ చోద్యం అంతా గడ్డాలూ, మీసాలూ వచ్చేవరకే. ఆ తర్వాత జనాలకు మోజు తగ్గి, అమ్మాయిలకు మోజు పెరుగుతుంది. పుకార్లు షికార్లు చేయడం మొదలవుతుంది. పెళ్ళయి సంసారంలో పడితే ఆకర్షణ మరికాస్త తగ్గుతుంది.

బాల మురళీకృష్ణ కూడా ఈ దశలన్నీ గడచినవాడే. కాని, చివరివరకు ఆయన జీవితాన్ని సింహావలోకనం చేస్తే అంతటి గొప్ప జాతకుడు మరొకరు లేరేమోననిపిస్తుంది. కీర్తిధన సంపాదనలో ఆరోహణే తప్ప అవరోహణ ఆయన ఎరగడు; జీవితాన్ని వర్ణరంజితంగా, అలంకారమయంగా, అతి జటిల, అనితరసాధ్య రాగతాళ మాలికగా మలచుకోగలిగినవాడు; సంవాదిత్వం ఎరిగినవాడు; వివాదిత్వానికి వెరవనివాడు; తలవంచని వీరుడిగా నెగ్గుకురాగలిగిన వాడు; శాస్త్రీయ సంగీతంలో, లలిత సంగీతంలో, సినిమా సంగీతంలో, గాత్రంలో, వాద్యంలో, ధాతు, మాతు రచనలతో 'బాల మురళీ బ్రాండ్'ను సృష్టించుకోగలిగిన వాడు; 'ఇది బాల మురళీ కృష్ణ ఘరానా, ఇష్టమైతే వినండి, కష్టమైతే మానండి' అనగలిగినవాడు.

ఉద్యోగాలు, పదవులు, బిరుదులు, అవార్డులు ఆయనకు లభించినంత చిన్న వయస్సులో మరెవరికీ లభించలేదు. ఇరవై రెండేళ్ళకు 'ఆకాశవాణి' సంగీత పర్యవేక్షక ఉద్యోగం, ఇరవై తొమ్మిదేళ్ళకు ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపల్ పదవి, తర్వాత వరసగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు, ప్రభుత్వ ఆస్థాన గాయక పదవి, ఇంకా లెక్కలేనన్ని ప్రైవేటు బిరుదులు ఆయన్ని వరించివచ్చాయి.

సినిమారంగంలో ఎన్టీఆర్ కు ఉన్నంత జనాకర్షణ సంగీత రంగంలో బాల మురళికి ఉన్నది. సూపర్ ముఖ్యమంత్రితో ఢీ అంటే ఢీ అని, మళ్ళీ ఆయన చేతనే సన్మానం చేయించుకోగలిగారు. తెలుగు విశ్వవిద్యాలయం ప్రోఛాన్సలర్ పదవి సంపాదించుకోగలిగారు. ఒక సినిమా (నర్తనశాల)లో ఎన్టీఆర్ కు ప్లే బాక్ పాడారు కూడా. 'హంసగీతె', 'ఆది శంకరాచార్య', 'రామానుజాచార్య', 'మధ్వాచార్య', 'భగవద్గీత' చిత్రాలకు సంగీతం సమకూర్చాడు. గాత్ర సంగీతంలోనే కాక, వైలిన్, వయోలా, మృదంగం, కంజీర వంటి వాద్యాలపై కూడా ఆయన గొప్ప ప్రావీణ్యం సాధించారు. భీమ్ సేన్ జోషీ, జశ్ రాజ్, కిశోరీ అమోంకర్, హరిప్రసాద్ చౌరాసియా వంటి ప్రముఖ హిందూస్థానీ సంగీత విద్వాంసులతో జుగల్బందీ కచేరీలు చేశారు.

తన గాత్ర సంగీతానికి తానే వయోలాపై పక్క వాద్యం వాయించుకొంటూ, తానే మృదంగం వాయించుకొంటూ త్రిపాత్రాభినయం చేసి గ్రామఫోన్ రికార్డును వెలువరించాడు ఆయన ఎప్పుడో నలభై ఐదేళ్ళ క్రిందట. నాలుగైదేళ్ళ వయస్సు నుంచి బాల మురళీకృష్ణ లీలలు లెక్కలేనన్ని.

నండూరి పార్థసారథి
(2016 నవంబర్ 23వ తేదిన ప్రచురితమైనది)

Previous Post Next Post