రవిశంకర్ కు 'భారతరత్న' అవార్డు రావడం ఎదురు చూస్తున్నదే! గొప్ప అవార్డు ఏదైనా సరే, సంగీతరంగంలో ముందు ఎం.ఎస్. సుబ్బులక్ష్మికి, తర్వాత రవిశంకర్ కి లభించడం ఆనవాయితీగా వస్తున్నది. 'భారతరత్న' అవార్డు కిందటి సంవత్సరం సుబ్బులక్ష్మికి ఇచ్చారు కనుక, ఈ సంవత్సరం రవిశంకర్ కు ఇస్తారని అందరూ అనుకుంటున్నదే! ఇంక ఈ వరసలో వచ్చే ఏడాది బిస్మిల్లాఖాన్ కూ, ఆ పై ఏడాది అలీ అక్బర్ ఖాన్ కూ 'భారతరత్న' లభించగలదని ఊహించవచ్చు.

'భారతరత్న, పద్మవిభూషణ్' వంటి అవార్డులను ప్రభుత్వం రాజకీయ స్వార్థానికి ఉపయోగించుకున్నప్పుడల్లా వాటి విలువ దిగజారిపోతున్నది. సుబ్బులక్ష్మి, రవిశంకర్ వంటి గొప్ప కళాకారులకు ఇచ్చినప్పుడు వాటి విలువ పెరుగుతున్నది.

భారతీయ సంగీతరంగంలో రవిశంకర్ అంతటి బహుముఖప్రజ్ఞాశాలి మరొకరు లేరని నిస్సందేహంగా చెప్పవచ్చు. సితార్ విద్వాంసుడుగా రవిశంకర్ ను ఎరగని సంగీత ప్రియులుండరు. దేశంలోనే కాదు, విదేశాలలో కూడా ఆయనకున్నంత మంది సంగీతాభిమానులు మరెవ్వరికీ లేరు. సితార్ అనగానే, సితార్ వినగానే సంగీత ప్రియులకు చప్పున మనస్సులో మెదిలేది రవిశంకర్ రూపం - ధ్యానమగ్నుడై, నిమీలిత నేత్రాలతో, తానే సితారై... రాగ హృదయాన్ని ఆవిష్కరించే రవిశంకర్ సమ్మోహనరూపం. కాని, రవిశంకర్ అంటే కేవలం సితార్ విద్వాంసుడే కాదు. ఆయన జీవితంలో సితార్ ముఖ్యభాగమే కానీ, ఆయన ప్రతిభ సితార్ కు మాత్రమే పరిమితం కాలేదు.

గత అర్దశతాబ్ది కాలంలో ఆయన సితార్ పరిథిని దాటి, భారతీయ వాద్య సంగీతమంతటినీ ఆక్రమించుకున్నారు. ఇంకా ముందుకు పోయి భారతీయ సంగీతపు ఎల్లలు దాటి, తన కళాసామ్రాజ్యాన్ని విశ్వమంతటికీ విస్తరించుకున్నారు. ఆకాశవీథులలో అమరవాహినిగా సాగిపోయే శాస్త్రీయ సంగీతాన్ని భూమికి దించి, సామాన్య ప్రజాహృదయక్షేత్రాలపై ప్రవహింపజేశారు ఆయన. భారతీయ సంగీతాన్ని విని, ఆనందించడం ఎలాగో పాశ్చాత్య శ్రోతలకు నేర్పినవాడు ఆయన. ప్రాక్పశ్చిమ సంగీతస్నేహవారధి నిర్మాత ఆయన.

సంగీతంలో విశ్వవిద్యాలయాలు, అకాడమీలు సాధించలేని లక్ష్యాలను వ్యక్తిగా ఆయన ఒక్కరూ సాధించగలిగారు. తన రంగంలో ఆయన అపజయమన్నది ఎరుగరు. అదృష్టదేవత ఎప్పుడూ ఆయన వెన్నంటే ఉంటుంది. ఆయన పట్టిందల్లా బంగారం అవుతుంది. సమకాలికులైన గొప్ప విద్వాంసులెవరికీ లభించని అవకాశాలు ఆయనకు లభించాయి.

రవిశంకర్ సుందరరూపం శ్రోతలకు ఒక ప్రత్యేక ఆకర్షణ. ఆయన కచేరీ విన ముచ్చటగానే కాక, చూడముచ్చటగా కూడా ఉంటుంది. సంగీతాభిరుచి లేకపోయినా ఆయన వాయిస్తుంటే చూసి ఆనందించేవారు. ఆయన కచేరీకి హాజరుకావడమే స్టేటస్ సింబల్ అనుకునేవారు కొల్లలు. ఆయన కచేరీకి అందమైన వాళ్లు చాలా మంది వస్తారని, ఆ అందమైన వాళ్లని చూడడం కోసం కూడా చాలా మంది వస్తారని ప్రతీతి. డెబ్భయ్యెనిమిదేళ్ల వయసులో ఇప్పటికీ ఆయన గ్లామర్ తరగలేదు. ఏకాగ్రత, నిరంతర సాధన, నిత్యనూతనోత్సాహం, అచంచల ఆత్మవిశ్వాసం, సుదూర, సువిశాలదృష్టి, కలుపుగోరుతనం, మాటలో మెత్తదనం, వైవిధ్య పూర్ణమైన జీవితానుభవం, ఇవన్నీ ఆయన విజయరహస్యాలు.

1920 ఏప్రిల్ 7వ తేదీన వారణాసిలో ఒక బెంగాలీ బ్రాహ్మణ పండిత కుటుంబంలో రవిశంకర్ జన్మించారు. నలుగురు మగబిడ్డల తర్వాత కడసారి వాడు ఆయన. ప్రఖ్యాత నర్తకుడు ఉదయశంకర్ ఆయన పెద్దన్నగారు. పాశ్చాత్యదేశాలలో భారతీయ నృత్యాలను ప్రదర్శించడానికై 1930లో ఉదయ శంకర్ ఒక పెద్ద బృందాన్ని తీసుకెళ్లినప్పుడు అన్నవెంట తమ్ముడు కూడా వెళ్లాడు. ఉదయశంకర్ ప్రదర్శించిన పెక్కు నృత్యరూపకాలలో రవిశంకర్ కూడా చిన్న చిన్న వేషాలు వేసి, నృత్యాలు చేశాడు. ఆ విధంగా ఆయన కళా జీవితం పదేళ్ల వయసులో నృత్యంతో ప్రారంభమయింది. అన్నగారి వెంట ప్రపంచయాత్ర చేసిన కాలంలో క్రైస్లర్, హైఫెట్జ్, కాసల్స్, టోస్కానినీ వంటి గొప్ప కళాకారుల పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం వినే అవకాశం ఆయనకు లభించింది. ఎనిమిదేళ్ల ప్రపంచయాత్ర తర్వాత ఆయన నృత్యానికి గుడ్ బై చెప్పి, స్వదేశానికి తిరిగి వచ్చి, తిన్నగా మధ్యప్రదేశ్ లోని మైహార్ కు వెళ్లారు. అక్కడ ప్రఖ్యాత సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ గురుకులంలో చేరి, ఏడేళ్ల పాటు ఏకాగ్రదీక్షతో సితార్ నేర్చుకుని, గొప్ప కళాకారుడుగా ప్రపంచంలో అడుగుపెట్టారు. అత్యల్పకాలంలోనే ఆయన అగ్రశ్రేణి సితార్ విద్వాంసుడుగా గుర్తింపు పొందారు.

రవిశంకర్, అల్లా ఉద్దీన్ ఖాన్, అలీఅక్బర్ ఖాన్

రవిశంకర్ ప్రతిభకు, గురుభక్తికి, వ్యక్తిత్వానికి, ముగ్ధుడైన అల్లావుద్దీన్ ఖాన్ తన కుమార్తె అన్నపూర్ణాదేవిని రవిశంకర్ కిచ్చి వివాహం చేశారు. ఈ వివాహంతో గురువుగారి కుమారుడు, అలీ అక్బర్ ఖాన్ రవిశంకర్ కు బావమరిది అయ్యాడు. గురుకులవాసంలో రవిశంకర్ సితార్, అలీ అక్బర్ సరోద్, అన్నపూర్ణాదేవి సుర్ బహార్ కలిసి సాధన చేసేవారు.

1945-48 సంవత్సరాల మధ్య కాలంలో రవిశంకర్ 'ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్' (ఇప్టా)లో చేరి కొన్ని సంగీత నృత్య రూపకాలకు సంగీత దర్శకత్వం వహించారు. వాటిలో 'డిస్కవరీ ఆఫ్ ఇండియా' రూపకం విశేష ప్రశంసలనందుకున్నది. అప్పుడే ఆయన కె.ఏ. అబ్బాస్ తీసిన 'ధర్తీకేలాల్', చేతన్ ఆనంద్ తీసిన 'నీచానగర్' చలన చిత్రాలకు సంగీతం సమకూర్చారు. 1948లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో చేరి, జాతీయ వాద్యబృందం తొలిసంగీత దర్శకుడుగా ఎన్నో సంగీత రచనలు చేశారు. వాద్యబృంద రచనలకు ఆయన ఒక ఒరవడిని పెట్టారు. ఆ రోజుల్లోనే 'సారే జహాఁసే అచ్ఛా' దేశభక్తి గీతానికి స్వర రచన చేశారు. ఇంచుమించు 'జనగణమన' జాతీయగీతంతో సమానమైన గుర్తింపు పొందిన ఆ గీతానికి స్వరకర్త రవిశంకర్ అని చాలా మందికి తెలీదు.

ఏడేళ్ల తర్వాత ఆకాశవాణినించి బయటకు వచ్చి రవిశంకర్ 1956లో సంగీత దిగ్విజయయాత్ర ప్రారంభించారు. ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసుడు యెహూదీమెనూహిన్ ఆయనను అమెరికా శ్రోతలకు పరిచయం చేశారు. పాశ్చాత్య శ్రోతలకు బోరుకొట్టకుండా భారతీయ సంగీతాన్ని నెమ్మదినెమ్మదిగా అలవాటు చేయాలనే ఉద్దేశ్యంతో రవిశంకర్ మొదట్లో ఒక రాగాన్ని ఇరవై నిమిషాలు మించకుండా వాయించేవారు. ప్రతి రాగానికీ ముందు క్లుప్తంగా దాని లక్షణాలను వివరించేవారు. మొత్తం కచేరీ గంటకు మించేది కాదు. ఆ గంట వ్యవధిలోనే తబ్లా సోలోకు కూడా అవకాశమిచ్చేవారు. అమెరికా, యూరప్ లలోని పెక్కు విశ్వవిద్యాలయాలలో రవిశంకర్ సోదాహరణ ప్రసంగాలు చేశారు. ఎన్నో అంతర్జాతీయ సంగీతోత్సవాలలో కచేరీలు చేశారు. పాప్ గాయకులతో, జాజ్ కళాకారులతో కలిసి కొత్త కొత్త ప్రయోగాలు చేశారు. కొత్త కొత్త ప్రక్రియలను సృష్టించారు. 'ఇండోజాజ్', 'ప్యూజన్' సంగీతాలకు ఆద్యుడు ఆయనే!

1965 ప్రాంతంలో బీటిల్స్ గాయకులు రవిశంకర్ కు చేరువైనారు. జార్జి హారిసన్ ఆయన వద్ద సితార్ నేర్చుకోవడం మొదలు పెట్టాడు. దానితో బీటిల్స్ అందరూ రవిశంకర్ అభిమానులయ్యారు. అలాగే మెనూహిన్ అభిమానులు కూడా రవిశంకర్ అభిమానవర్గంలో చేరారు. 1971లో రవిశంకర్ కోరికపై బంగ్లాదేశ్ శరణార్ధుల సహాయార్ధం జార్జిహారిసన్ పాప్ గాయకులను కూడగట్టుకుని బ్రహ్మాండమైన కచేరీ నిర్వహించాడు. అదివరకెన్నడూ ఏ కచేరీ రికార్డుల అమ్మకాల ద్వారా రాని విధంగా ఒక్క ఏడాదిలో పదకొండు కోట్ల రూపాయల ధనం లభించింది. ఆ కచేరీ రవిశంకర్-అలీ అక్బర్ జుగల్ బందీలతోనే ప్రారంభమైంది.

రవిశంకర్, యెహూదీ మెనూహిన్ 'వెస్ట్ మీట్స్ ఈస్ట్' అనే శీర్షికలో మూడు రికార్డులిచ్చారు. తర్వాత రవిశంకర్ ఇద్దరు జాపనీస్ కళాకారులతో కలిసి 'ఈస్ట్ గ్రీట్స్ ఈస్ట్' అనే శీర్షికతో మరో రికార్డు ఇచ్చారు.

సంగీతంలో రవిశంకర్ స్పృశించని శాఖలేదు. శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, జానపద సంగీతం, రవీంద్ర సంగీతం, సినిమా సంగీతం, వెస్టర్న్ క్లాసికల్, పాప్, జాజ్... ఇదీ అదీ అని లేదు-ప్రపంచంలోని అన్ని సంగీత స్రవంతులనూ ఆయన తన స్వరార్ణవంలో లీనం చేసుకున్నాడు. భారతీయ వాద్య బృంద సంగీతంలో 'ఆర్కెస్ట్రేషన్' కు ప్రయత్నించిన మొదటి వ్యక్తి ఆయనే! భారతీయ సంగీతం, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం భిన్నధ్రువాల వంటివి. భారతీయ సంగీతంలో 'మెలోడీ'యేగానీ, 'హార్మొనీ' ఉండదు. పాశ్చాత్య సంగీతానికి హార్మొనీయే ప్రాణం. (ఆర్కెస్ట్రేషన్, మెలోడీ, హార్మొనీ అనే పదాలకు సమానార్థకాలైన పదాలు తెలుగులో లేవు. ఆర్కెస్ట్రేషన్ కు వాద్య సమ్మేళనం అనే మాటతో సరిపెట్టుకోవాలి).

భారతీయ సంగీతం ఆర్కెస్ట్రేషన్ కు ఒదగదు. కాని, రవిశంకర్ ఒదిగించారు. భారతీయ సంగీతాన్ని పాశ్చాత్య సంగీతంతో అనుసంధానపరుస్తూ రెండు అద్భుతమైన 'కాన్ చెటో'లను ఆయన రచించారు. 1971లలో రచించిన మొదటి 'కాన్ చెటో'ను ఆండ్రేప్రెవిన్, 1983లో రచించిన రెండవ కాన్ చెటోను జుబిన్ మెహతా కండక్ట్ చేశారు. ఆ రెండు కాన్ చెటోల రికార్డులు సంగీత ప్రియులందరూ కొని, విని, భద్రపరుచుకోదగినవి. (కాన్ చెటో అనేది పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో ఒక ముఖ్యమైన ప్రక్రియ. సింఫనీలాగా, సొనాటాలాగా. కాన్ చెటో ఒక ప్రధానవాద్యానికి, వాద్య బృందానికి మధ్య జుగల్ బందీలాంటిది).

రవిశంకర్ దాదాపు ఒక డజను చలన చిత్రాలకు సంగీతం సమకూర్చారు. వాటిలో సత్యజిత్ రే తీసిన 'పథేర్ పాంచాలీ', తపన్ సిన్హా తీసిన 'కాబూలీవాలా', హృషీకేశ్ ముఖర్జీ తీసిన 'అనూరాధ', అటెన్ బరో 'గాంధీ' ముఖ్యమైనవి.

సమకాలీన హిందూస్థానీ సంగీతంలో రవిశంకర్ ప్రభావం ఇంతింతని చెప్పరానిది. కచేరీ పద్ధతిలో కూడా ఆయన ఎన్నో మార్పులు తీసుకు వచ్చారు. హిందూస్థానీ కచేరీలలో రవిశంకర్ పేరు ముందుగా చెప్పుకోవాలి. 'హంసధ్వని, చారుకేశి, కీరవాణి, సింహేంద్రమధ్యమ్, వాచస్పతి, మలయమారుతం' వంటి కర్ణాటక రాగాలను హిందూస్థానీ శైలిలో వాయించి వాటికి కొత్త అందాలు తెచ్చారు ఆయన. 'భైరాగి, రసియా, పరమేశ్వరి, కామేశ్వరి, గంగేశ్వరి, రంగేశ్వరి, జోగేశ్వరి, తిలక్ శ్యామ్, వసంత పంచమ్, రజత్ కళ్యాణ్' వంటి కొత్త రాగాలను ఆయన సృష్టించారు.

సితార్ వాదనంలో ఇప్పుడు ప్రధానంగా రెండే బాణీలున్నాయి. ఒకటి రవిశంకర్ బాణి. రెండోది విలాయత్ ఖాన్ బాణి. రవిశంకర్ ది సేనియా బీన్ కార్ ఘరానా. విలాయత్ ఖాన్ ది ఇమ్దాద్ ఖానీ ఘరానా. సితార్ కళాకారులలో నూటికి దాదాపు ఎనభై మంది ఈ రెండు ఘరానాలవారే! విలాయత్ ఖాన్ శిష్య ప్రశిష్యులు ఇప్పుడు తమది 'విలాయత్ ఖాన్ ఘరానా' అని చెప్పుకుంటున్నారు. కనుక రవిశంకర్ బాణిని 'రవిశంకర్ ఘరానా' అనడం సముచితంగా ఉంటుంది.

మనదేశంలో, మన తరంలోనే కాదు, దేశకాలావధులకు అతీతంగా ప్రస్తుతించదగిన అద్భుత ప్రతిభాశాలి రవిశంకర్.

ఒక ఎత్తు ఎక్కినప్పుడల్లా అంతకు మించిన ఎత్తు కనిపిస్తుంది ఆయనకి. 'భారతరత్న' ఎత్తుకి ఎదిగిన రవిశంకర్ కి ఇంకా పై ఎత్తులు ఏమి కనిపిస్తాయో చూడాలి మరి!

నండూరి పార్థసారథి
(1999 మార్చి 1న ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమయింది)

Previous Post Next Post