Title Picture

'పరిపూర్ణత' - అదెలా ఉంటుంది? దాన్నెలా నిర్వచించాలి? దాన్నెవరైనా సాధించారా? అసలది సాధ్యమా? అది అగమ్యం. ఎప్పుడూ అల్లంత దూరాన కనిపించే మురిపించే అందం. అది అందదు-కాని, దానికి అతి సమీపంగా వెళ్ళిన మహానుభావులున్నారు. వారిలో బాపుగారు ఒకరు. సృజనాత్మక ప్రతిభలో, రేఖా సౌందర్య సాధనలో 'పరిపూర్ణత' దిశగా ఆయన వెళ్ళినంత దూరం మరెవరూ వెళ్ళలేదనిపిస్తుంది. చివరికి ఆయనే అగమ్యుడైపోయాడు. చిత్రకారులందరికీ ఆయన గీత భగవద్గీత అయింది.

కొంటెబొమ్మలు గాని, పత్రికల్లో కథలకు వేసే బొమ్మలు గాని, ప్రాచీన కావ్య నాయికల బొమ్మలుగాని, ఇంకా ఏ తరహా బొమ్మలు గాని ఆయన వేస్తే గీస్తే వాటిని అంతకంటే గొప్పగా వేయడం సాధ్యం కాదనిపిస్తుంది. కాని, సాధ్యమే. అది ఆయనకే సాధ్యం. అంతకంటే బాగా ఆయనే వేయగలడు. ఆయన బొమ్మలు వేయడం అరవై ఐదేళ్ళ క్రిందట 'బాల' పత్రికతో మొదలు పెట్టారు. తర్వాత ఐదారేళ్ళకే ఆయనకి ఇమిటేటర్ల బెడద మొదలయ్యింది. ఆ తర్వాత ట్రేస్ ఆర్టిస్టులు, కార్బన్ ఆర్టిస్టులు వెంటబడ్డారు. వారిని తప్పించుకోవడం కోసం ఆయన చాలా సార్లు తన స్టైలును మార్చుకున్నారు. సంతకం కూడా మార్చారు. వాటిని కూడా కార్బన్ మాస్టర్లు వదల్లేదు. 'బాల' నుంచి 'కోతికొమ్మచ్చి' దాకా ఆయన గీసిన బొమ్మలన్నింటినీ సేకరించి కాలక్రమంలో వరసగా ప్రదర్శిస్తే ఆయన ప్రస్థానం ఎలా సాగిందో, ఎన్నిమలుపులు తిరిగిందో స్పష్టంగా తెలుస్తుంది. అసలు ఆయన ఎన్ని బొమ్మలు వేశారో ఎవరైనా లెక్క తేల్చారా? అది సాధ్యమా? 'లెక్కలేనన్ని' అని మాత్రమే చెప్పగలం.

ఇవాళ-డిసెంబరు 15 - బాపు గారి పుట్టినరోజు, ఆయన పోయిన తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు. ఆయనతో నా పరిచయం యాభై ఏడేళ్ళ నాటిది. అప్పట్లో మా అన్నయ్య నండూరి రామమోహనరావు గారు మద్రాసులో ఆంధ్రపత్రిక వీక్లీలో పనిచేస్తుండేవారు. ముళ్ళపూడి వెంకటరమణ గారూ అందులోనే పనిచేసేవారు. ఆ పత్రికలో బాపు గారు ఉద్యోగి కాకపోయినా వారికి రెగ్యులర్ గా బొమ్మలు వేస్తుండేవారు. మైలాపూర్ లోని అప్పర్సామీ కోయిల్ స్ట్రీట్ లో ఆయన నివాసం. ఆ ఇంట్లోనే ఒక పోర్షన్ లో మా అన్నయ్య నివాసం ఉండేవాడు. రమణ గారూ అక్కడికి దగ్గర్లోనే ఇంకో ఇంట్లో ఉండేవాడు. కాని, ఎక్కువగా బాపు గారితోనే ఉండేవాడు. ఆ ముగ్గురూ ఒక టీమ్ గా ఆంధ్రపత్రిక వీక్లీ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని ఆవిష్కరించారు. వారు నా ముగ్గురువులు. అప్పర్సామీ కోయిల్ స్ట్రీట్ ఇంట్లో కూడా మా అన్నయ్య కుటుంబం, బాపు గారి కుటుంబం ఒక ఉమ్మడి కుటుంబంలా ఉండేవారు.

1957లో నేను హైదరాబాద్ లో బీఏ చదువుతూ ఉండేవాణ్ణి. ఆ ఏడాది వేసవి కాలం సెలవుల్లో మద్రాసు వెళ్ళాను. అక్కడ ఒక నెల రోజులు కాబోలు ఉన్నాను. నేను కథలు రాయడం మొదలు పెట్టిందీ ఆ ఏడాదే. నా మొదటి కథ ఆంధ్రప్రభ వీక్లీలో అచ్చయింది. మా అన్నయ్యకి చూపించే ధైర్యం లేక రహస్యంగా 'ప్రభ'కి పంపించాను. తర్వాత ప్రభలోనే ఇంకో మూడు నాలుగు కథలు అచ్చయ్యాక ధైర్యం చేసి పత్రిక వీక్లీకి రాంబాబు మొదటి కథ ఇచ్చాను. దానికి బాపు గారు బోలెడు చిన్న చిన్న బొమ్మలు వేశారు. ఆ బొమ్మలతోనే ఆ కథకి రాణింపు వచ్చింది. నాకు మంచి పేరు వచ్చింది. తర్వాత 'ప్రభ' వీక్లీలో, 'జ్యోతి' మాసపత్రికలో, మరికొన్ని పత్రికల్లో వచ్చిన 'రాంబాబు డైరీ'లకి కూడా బాపుగారు బొమ్మలు వేశారు.

నాకంటే బాపుగారు ఆరేళ్ళు, రమణగారు తొమ్మిదేళ్ళు, మా అన్నయ్య పన్నెండేళ్ళు పెద్దవాళ్ళు. వాళ్ళతో కలిసి తిరిగే వయస్సు కాదు నాది. అయినా బాపు గారికి నేనొక తమ్ముడి లాగా కనిపించేవాడిననుకుంటాను. ఆయనా, ఆయన తల్లి సూరమ్మ గారు, రమణ గారు, ఆయన తల్లి కక్కి గారు, బాపు గారి తమ్ముళ్ళు, బాపు గారి భార్య భాగ్యవతి గారు అందరూ నాకూ, మా కుటుంబంలో అందరికీ ఆత్మీయులే.

1959లో హైదరాబాద్ లో నా చదువైపోయి, ఉద్యోగాల కోసం తిరిగి తిరిగి అలిసిపోయి మద్రాసులో ఏమైనా ఛాన్సు దొరుకుతుందేమోనని వెళ్ళాను. 57లోనూ, 59లోనూ కూడా మద్రాసులో ఉన్నప్పుడు బాపు గారు మేడమీది గదిలో కూర్చొని బొమ్మలు వేసుకుంటుంటే నేను వెళ్ళి కూర్చొనేవాణ్ణి. ఆయన గెరార్డ్ రికార్డ్ ఛేంజర్ మీద బడే గులాం అలీఖాన్ గారి 78 ఆర్ పీఎం రికార్డులు వింటూ బొమ్మలు వేస్తూ ఉండేవారు. అప్పటికింకా మనదేశంలో ఎల్.పి. రికార్డుల శకం మొదలవలేదు. ఖాన్ సాహెబ్ గారి ఠుమ్రీలు బాపు గారు ఎన్నిసార్లు విన్నారో లెక్కలేదు. అంత గొప్ప సంగీతం వింటూ బాపు గారు బొమ్మలు ఎలా వేయగలిగేవారా అని నాకు ఆశ్చర్యంగా ఉండేది. బొమ్మ వేస్తున్నప్పుడు నిజంగా ఆయన మనస్సుకి సంగీతం ఎక్కుతోందా అని నాకు అనుమానంగా ఉండేది. ఖాన్ సాహెబ్ గానంలో ఏదైనా ఛెణుకు వినిపిస్తే బాపుగారు కనుబొమ్మలెగరేసి 'చూశారా' అన్నట్టు నావంక చూసేవారు. బొమ్మ వేస్తున్నా ఆయన శ్రద్ధగానే వింటున్నారని అప్పుడు నాకు అర్థమయ్యేది. ఆయన లాగే నేను కూడా సంగీతం వింటూ ఏదైనా కథో, వ్యాసమో రాయాలని చాలా సార్లు ప్రయత్నించాను గాని సాధ్యం కాలేదు. మంచి సంగీతం వింటున్నప్పుడు నేను ఇంకే పనీ చేయలేను. ఏదైనా రాయాలనుకుంటే సంగీతాన్ని కట్టిపెట్టాల్సిందే.

ఆ కాలంలో బాపుగారు ఎప్పుడూ హిందుస్థానీ సంగీతమే వింటూ ఉండేవారు. 1960 నుంచి మన దేశంలో ఎల్.పి. ఇ.పి. రికార్డుల శకం మొదలయింది. బాపుగారు అవీ కొంటూ ఉండేవారు. ఆయన కర్ణాటక సంగీతం వినేవారు కారు. నాకూ చిన్నప్పటినుంచీ-పదమూడో ఏడు నుంచీ-సహజంగానే హిందుస్థానీ సంగీతం పట్ల అబిరుచి ఏర్పడింది. మా పెద్దబావ గారి దగ్గర నారాయణ్ రావ్ వ్యాస్ రికార్డులు చాలా ఉండేవి. అవి వింటూ ఉండేవాణ్ణి. బి.ఏ. చదివే రోజుల్లో హైదరాబాద్ లో హిందూస్థానీ కచేరీలకు వెళ్ళి శ్రద్ధగా వినేవాణ్ణి. కాని, బడేగులాం గారి సంగీతంతో నా పరిచయం బాపు గారి ఇంట్లోనే. తర్వాత నజాకత్ అలీ, సలామత్ అలీల జుగల్బందీ రికార్డులు, మెహ్దీహసన్ రికార్డులు, సజ్జాద్ హుస్సేన్ మాండలిన్ కచేరీల టేపులు-అన్నీ నాకు బాపు గారి ద్వారానే పరిచయం.

1959 డిసెంబర్ లో నేను బెజవాడ ఆంధ్రప్రభలో చేరాను. అక్కడ రెండేళ్ళు పనిచేశాక చిత్తూరు ఎడిషన్ కి పంపించారు. అక్కడ ఒక రెండేళ్ళు. తర్వాత 1963లో మద్రాసు ప్రభ వీక్లీకి పంపించారు. వీక్లీలో రెండేళ్ళు. సరిగ్గా ఆ కాలంలోనే నేనూ, బాపు గారు కలిసి చేసిన 'ఘనకార్యం' ఏమిటంటే రమణ గారికీ, మా చెల్లెలు శ్రీదేవికీ పెళ్ళి చేయడం. అప్పటిదాకా పెళ్ళిధ్యాసే లేని రమణ గారిని బాపుగారు, సూరమ్మగారు, కక్కిగారు మూకుమ్మడిగా ఒప్పించి సంసారంలో పడేశారు. 1963 అక్టోబరులో పెళ్ళి చూపులైనాయి. అంగీకారం కుదిరింది. మా నాన్నగారు డబ్బు ప్రయత్నాలు చేస్తుండగానే 1964 జనవరి 19న బాపుగారు ఆకస్మికంగా నన్ను పిలిచి జనవరి 26వ తేదీకి ముహూర్తం పెట్టించమని ఆదేశించారు. ఆ రాత్రి మెయిల్లో బయల్దేరి 20వ తేదీ మా ఊరు ఆరుగొలను చేరాను. సరిగ్గా ఆరురోజుల వ్యవధిలో ముహూర్తం పెట్టించడం, శుభలేఖలు అచ్చు వేయించడం, పందిళ్ళు వేయించడం, తోరణాలు కట్టించడం వగైరా సమస్తమైన పనులు లక్షణంగా చేయించాను. మా ఇంట్లో అదివరకెన్నడూ జరగనంత వైభవంగా శ్రీదేవీ రమణల పెళ్ళి జరిగింది. (ఆ విశేషాలు 'కోతికొమ్మచ్చి'లోనూ, తిరుపతిలో నేడే విడుదలవుతున్న శ్రీదేవి రచన 'నెమరేసిన మెమరీస్'లోనూ చదవండి)

1960లోనే ఆంధ్రపత్రిక నుంచి బైటికొచ్చేసిన రమణ గారు పెళ్ళయ్యేనాటికి సినిమా రైటర్ గా స్థిరపడ్డారు. పెళ్ళయ్యాక కొద్దినెలలకే ఆయనా, బాపు గారు అప్పర్సామీ కోయిల్ స్ట్రీట్ నుంచి మౌబ్రేస్ రోడ్ లోని ఒక పెద్ద ఇంట్లోకి మారారు. అప్పట్నించి 1988లో ఆర్.ఎ.పురంలో సొంత ఇల్లు కట్టుకునేదాకా ఎన్ని ఇళ్ళు మారినా చివరిదాకా ఇద్దరూ ఎప్పుడూ ఒకే ఇంట్లో ఉంటూ వచ్చారు.

బాపుగారు, రమణ గారు చిన్నప్పట్నించీ-బహుశా ఇరవయ్యేళ్ళలోపు వయస్సు నుంచే-హాలీవుడ్ క్లాసిక్స్, దొరికినంత మట్టుకు ఇతర దేశాల ఫిల్మ్ క్లాసిక్స్ చూస్తుండేవారు. బాపు గారు ఫిల్మ్ టెక్నిక్స్ గురించి కూడా స్టడీ చేస్తుండేవారు. సత్యజిత్ రాయ్, చాప్లిన్, హిచ్ కాక్, బెర్గ్ మన్, అంటోనియోనీ, కురసావా వంటి దర్శకులను ఎడ్మైర్ చేస్తుండేవారు. ఎప్పుడైనా మాటల్లో ఆ దర్శకుల ప్రస్తావన వచ్చినా తనకి సినిమా తీయాలనే ఆసక్తి ఉన్నట్లు బాపుగారు చెప్పలేదు. నేను 1966 జూలైలో ఆంధ్రప్రభ బెంగళూరు ఎడిషన్ కు వెళ్ళిపోయాను. అక్కడ 11 సంవత్సరాలుండి 1977లో హైదరాబాద్ కు ట్రాన్స్ ఫర్ అయ్యాను. నేను ఏ నగరంలో ఉన్నా, ఏదో ఒక ఫిల్మ్ సొసైటీలో మెంబర్ గా ఉండేవాణ్ణి. ఫిల్మ్ అఫ్రీసియేషన్ కోర్సులలో చేరుతుండేవాణ్ణి. 1968లో-నేను బెంగుళూరులో ఉన్నప్పుడు-బాపుగారు 'సాక్షి' సినిమా తీయబోతున్నట్లు తెలుసుకొని త్రిల్లైపోయాను. బాపు, రమణలిద్దరూకలిసి తెలుగు సినిమాల దశ, దిశ మారుస్తారనీ, కొత్త శకం ఆవిష్కరిస్తారనీ ఆశపడ్డాను. బెంగాలీ సినిమాల్లో సత్యజిత్ రాయ్, తపన్ సిన్హా, మృణాళ్ సేన్ లాంటి వాళ్ళు తీసుకొచ్చిన మార్పుల్లాంటి వేవో తెలుగు సినిమాల్లో తీసుకొస్తారేమో అనుకున్నాను. అలా అనుకోవడానికి కారణం ఏమిటంటే తెలుగులో బాపు రమణలంతటి మేధావులు, ప్రతిభావంతులు లేరనే అభిప్రాయం నాకు ఉండేది. కాని, వారి సినిమాలతో నాకు ఆశాభంగమే మిగిలింది. తెలుగు ప్రేక్షకుల అభిరుచి స్థాయిని పెంచడానికి-కనీసం ప్రయత్నించడానికి బదులు-తామే ప్రేక్షకుల అభిరుచికి దిగివచ్చినట్లు అనిపించింది. అది ఏఎన్నార్ హితోపదేశ ఫలితమని 'కోతికొమ్మచ్చి' చదివాక నాకు అర్థమయింది. బాపు సినిమాలలోని ప్రతి ఫ్రేములోనూ ఆయన ముద్ర, 'సంతకం' కనిపిస్తుందన్న మాట నిజమే. ఒక సీను చూడగానే ఇది బాపు సినిమా అయి ఉంటుందని పోల్చుకోగలమన్న మాట నిజమే. కాని, సినిమా-గొప్ప సినిమా-అంటే ప్రేములూ, కెమెరా యాంగిల్స్, హీరోయిన్ బారెడు పొడుగు జడ మాత్రమే కాదని నా అభిప్రాయం. 1968 తర్వాత-అంటే బాపు గారు సినిమా డైరెక్టర్ అయిన తర్వాత - బాపు గారిని కలిసినా, ఫోన్ లో మాట్లాడుకున్నా సినిమాల ప్రస్తావన ఎప్పుడూ రాలేదు. ఆయనకీ నాకూ కామన్ సబ్జెక్ట్ హిందుస్థానీ సంగీతపు రాగాలు, బడే గులాం టేపులు, ఖాన్ సాహెబ్ రికార్డింగ్స్ ఇచ్చి పుచ్చుకోవడమే. ఐదారేళ్ళ క్రిందట ఆయన పుట్టిన రోజుకు కానుకగా నేను ఖాన్ సాహెబ్ కచేరీ లైవ్ రికార్డింగ్ డీవీడీని పంపించగా ఆయన ఎంత సంబరపడిపోయారో! వెంటనే ఫోన్ చేసి 'ఇది నాకు బెస్ట్ బర్త్ డే గిఫ్ట్' అన్నారు. ఖాన్ సాహెబ్ డీవీడీ బహుశా ఇప్పటిదాకా అదొక్కటే.

బాపు గారి ఇష్టాలు, అయిష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆయనకి ఇష్టమైన గాయకులను మనం మెచ్చుకుంటే ఎంతగా సంతోషిస్తారో ఇష్టం లేని గాయకులను మెచ్చుకుంటే అంత కోపం వస్తుంది. పదేళ్ళ క్రిందట ఒకసారి ఆయన నాకు ఫోన్ చేసి 'పార్థసారథి గారూ... ఏమిటీ... మీకు కడుపులో బాగా లేదా?' అని అడిగారు. 'బాగానే ఉందండీ... అలా అడుగుతున్నారేమిటీ?' అన్నాను. 'ఏం లేదు... మెహ్దీ హసన్, గులాం అలీ యించుమించు సమానమైన ప్రతిభగల వారు అని మీరు రాస్తేనూ... మీకు ఒంట్లో బాగా లేదనుకున్నాను' అన్నారు ఆయన.

మెహ్దీహసన్ కు వీరాభిమాని ఆయన. ఇంకెవరినీ మెహ్దీహసన్ తో పోల్చకూడదని ఆయన ఉద్దేశం. పాకిస్థానీ గాయకుల గురించి రాసిన ఒక వ్యాసంలో నేను 'మెహ్దీహసన్, గులాం అలీ ఇంచుమించు సమాన ప్రతిభగలవారు. ఎవరి శైలి వారిదే. గజల్ అభిమానులకు వారిద్దరూ ఆరాధ్య దైవాలే. అయినా కొందరికి మెహ్దీహసన్ అంటే కాస్త ఎక్కువ ఇష్టం. మరికొందరికి గులాం అలీ పట్ల కొంచెం ఎక్కువ అభిమానం' అని రాశాను. బాపుగారి కోపానికి అదీ కారణం. నిజానికి నాక్కూడా బాపుగారి లాగానే మెహ్దీహసన్ అంటేనే ఇష్టం. కాని గులాం అలీ పాట అంటే మరీ అంత విముఖత లేదు.

నాకు బడే గులాం అలీఖాన్ తో సమానంగా అమీర్ ఖాన్ అంటే కూడా చాలా ఇష్టం. వీరిద్దరివీ పూర్తిగా భిన్నమైన మనోధర్మాలు. వారిని ఒకరితో మరొకరిని పోల్చడం మంచిది కాదు. అది కూడా బాపు గారికి ఇష్టం లేదు. ఒకసారి ఎప్పుడో ఉత్తరంలో 'మీ జీర్ణశక్తికి జోహార్లు' అని రాశారు. సంగీతం విషయంలో ఆయన అభిప్రాయాలపై పి.బి. శ్రీనివాస్ ప్రభావం ఉందేమోనని నా అనుమానం. ఎందుకంటే అమీర్ ఖాన్ గానంపై పి.బి. శ్రీనివాస్ ఒక జోకు వేశాడు. అమీర్ ఖాన్ విలంబిత్ ఖ్యాల్ చాలా మంది కంటే చాలా విలంబంగా పాడేవాడు. ఆయన అది పాడుతున్నప్పుడు పక్కన తబ్లా వాయించే మనిషి తన చూపుడు వేలుతో తబ్లాపై అలవోకగా ఒక దెబ్బ వేసి బైటికి పోయి పాన్ వేసుకుని వచ్చి ఇంకో దెబ్బ వేస్తాడట. అంటే అమీర్ ఖాన్ గానంలో ఒక ఆవర్తనం పూర్తి కావడానికి అంత టైము పడుతుందని భావం. బడేగులాం సభారంజకంగా పాడతాడు. అమీర్ ఖాన్ ఒక యోగిలాగా పాడతాడు. బడే గులాం ఎక్స్ ట్రావర్ట్. అమీర్ ఖాన్ ఇంట్రావర్ట్. అదీ తేడా. అమీర్ ఖాన్ గానం అంటే విలాయత్ ఖాన్, రవిశంకర్, మెహ్దీహసన్, ఈమని శంకర శాస్త్రి, బాలచందర్ లాంటి గొప్ప విద్వాంసులకు కూడా ఎంతో గౌరవం.

బాపు గారికి బాలమురళీకృష్ణ గానం అంటే పడదు. (మరి 'అందాల రాముడు'లో టైటిల్ సాంగ్ ఆయన చేత ఎందుకు పాడించారో) ఐదారేళ్ళ క్రిందట ఒకసారి కొడవటిగంటి కుటుంబరావు గారి మనవడు పద్మాకర్ బాపు గారికి విమానంలో తటస్థపడ్డాడు. పద్మాకర్ తనను తాను పరిచయం చేసుకున్నాడు. తర్వాత పద్మాకర్ ఇయర్ ఫోన్ పెట్టుకుని ఐపాడ్ లో ఏదో వింటుంటే బాపు గారు 'ఏమిటా పాట' అని అడిగారట. 'ఇది బాలమురళి గారి పాట. మీరు వినితీరాలి' అని ఐపాడ్ ఇచ్చాడట. బాపు అయిష్టంగానే తీసుకుని విని త్రిల్లైపోయారట. ఆ తర్వాత కొద్దిరోజులకే బాపు నాకు ఫోన్ చేసి ఈ సంగతి చెబుతూ, 'కళ్యాణి రాగం ఎంత అద్భుతంగా పాడాడండీ... మహానుభావుడు; ... ఏమిటో... అజ్ఞానమండీ' అన్నారు. ఆ ఒక్క సంఘటనతో బాలమురళిపై ఆయన అభిప్రాయం మారిపోయింది.

బాపుగారి జ్ఞాపకాలను గురించి ఇలా చెప్పుకుంటూ పోతే దానికి అంతు ఉండదు. చలన చిత్రకారుడుగా కాదు గానీ... చిత్రకారుడుగా మాత్రం ఆయన చివరిదాకా ఇంకా ఇంకా పైపైకి ఎదుగుతూనే ఉన్నాడు-ఎవరికీ అందనంత. అరవయ్యేళ్ళ ఆయన చిత్ర కళా ప్రస్థానంపై ఎన్నో పరిశోధనలు జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు సమకూర్చి అటువంటి పరిశోధనలను ప్రోత్సహించడం అవసరం.

నండూరి పార్థసారధి
(2014 డిసెంబర్ 15వ తేదీన ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైనది)

Previous Post