ఆయన దారే వేరు. ఆయన తీరే వేరు.

ఒకరు చూపిన దారిలో ఆయన నడవలేదు. ఆయన దారిలో మరొకరు నడవలేరు. ఆ దారిలో ఆయన ఒంటరి యాత్రికుడు.

ఇతరులు నడిచిన దారిలో ఆయన నడవ లేడు. అలా నడవడం ఆయన స్వభావానికే విరుద్ధం. అటు వైపు పోవద్దు అని పెద్దలెవరైనా చెబితే ఆయన అటు వైపే పోతాడు. పోయి తీరతాడు. పోయి చూపిస్తాడు. 'ఇక్కడ ఎన్నో అందాలున్నాయి-మీరూ రండి' అని ఎలుగెత్తి పిలుస్తాడు.

ఆయన తన దిశను తానే నిర్దేశించుకున్నాడు. ఆ దిశలో తన మార్గాన్ని తానే నిర్మించుకున్నాడు. 'కొండలు, అడవులు, ఎడారులా మన కడ్డంకి' అని పాడుకుంటూ, తుప్పలు పొదలు నరికేసి, రాళ్ళు రప్పలు పక్కకు నెట్టేసి తన బాటను తానే తీర్చి దిద్దుకున్నాడు.

బజారులో రెడీగా దొరికే ముత్యాలు కొనుక్కోడు ఆయన. సాహసంతో సముద్రగర్భంలోనికి చొచ్చుకు పోయి, వెతికి వెతికి వాటిని వెలికి తీసుకు వచ్చాడు.


ఎన్నో శతాబ్దాలుగా వస్తున్న రాగాలను, ప్రతిరోజూ వింటూ, ఆనందిస్తూ, మనకు బాగా అలవాటైపోయిన రాగాలను పూర్తిగా కొత్త కోణాల నుంచి చూపించడానికి, వాటి అందాలను గురించి మనకొక కొత్త అవగాహన కల్పించడానికి, 'రాగదారీ' సంగీతానికొక కొత్త దారి చూపించడానికి గంధర్వ లోకం నుంచి దిగి వచ్చాడు ఆయన. వచ్చిన పని అయిపోయిందనుకున్నాడో, వీసా, పాస్ పోర్టుల గడువు తీరిపోయిందో-మళ్ళీ తన లోకానికి వెళ్ళిపోయాడు ఈ మధ్యనే.


కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లాలో-సూళెభావి అనే గ్రామంలో 1924 అక్టోబరు 8వ తేదీన-ఒక మహారాష్ట్ర కుటుంబంలో ఈ గంధర్వుడు అవతరించాడు. బారసాలలో పెట్టిన పేరు శివపుత్ర. తండ్రి పేరు సిద్ధరామయ్య. ఇంటి పేరు కొంకలి. వెరసి అతడి పేరు శివపుత్ర సిద్ధరామయ్య కొంకలి అయింది. చిన్న వయస్సులోనే, ఎవరి దగ్గరా నేర్చుకోకుండానే సహజ మధురంగా పాడుతున్న ఆ పిల్లవాడిని సిద్ధరామయ్య గారు బొంబాయి తీసుకు వెళ్ళి ప్రొఫెసర్ దేవ్ ధర్ సంగీత పాఠశాలలో చేర్చారు. ప్రొఫెసర్ దేవ్ ధర్ గ్వాలియర్ ఘరానా విద్వాంసుడు. హిందూస్థానీ సంగీత చరిత్రలో ఒక కొత్త శకాన్ని ప్రారంభించిన పండిత్ విష్ణు దిగంబర్ పలూస్కర్ సీనియర్ శిష్యులలో ఆయన ఒకరు. ఆయన శిక్షణలో శివపుత్ర సంగీత సౌధానికి గట్టి పునాది పడింది. సంగీత శాస్త్రానికి సంబంధించిన ప్రాథమిక విషయాలన్నింటినీ ఆయన వద్దనే నేర్చుకున్నాడు శివపుత్ర.

పదేళ్ళ పసి వయస్సులోనే అతడు కచేరీలు చేయడం మొదలు పెట్టాడు. పదకొండోయేట-1935లో అలహాబాద్ లో జరిగిన అఖిల భారత సంగీత సమ్మేళనంలో కచేరీ చేసి గొప్ప గొప్ప పండితుల, ఉస్తాదుల ప్రశంసలందుకున్నాడు. అప్పట్లోనే అతడి మొదటి గ్రామఫోన్ రికార్డు విడుదలయింది. అతడి ప్రతిభకు ముగ్ధుడై ఆశీర్వదిస్తూ ఒక సాధువు ఇచ్చిన 'కుమార్ గంధర్వ' అన్న బిరుదే పేరుగా స్ధిరపడిపోయింది. మహారాష్ట్రలో అప్పటికే ఇద్దరు గంధర్వులున్నారు-బాల గంధర్వ, సవాయ్ గంధర్వ. ఇతడు మూడవ 'గంధర్వ'.

యువ ప్రాయంలో గాయకుడుగా మంచి పేరు తెచ్చుకుంటున్న దశలో ఆకస్మికంగా అతడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అది శ్వాసకోస సంబంధమైన వ్యాధి (క్షయ) కావడం వల్ల ఇక మీదట అతడు పాడడానికి వీల్లేదని డాక్టర్లు చెప్పారు. సంగీత సాధన చేస్తే వ్యాధి ముదురుతుందనీ, బతకడం కష్టమవుతుందనీ హెచ్చరించారు. ఏదైనా కొండ ప్రాంతానికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటూ చికిత్స చేయించుకోవాలని సలహా ఇచ్చారు. ఆ సలహా ప్రకారం కుమార్ గంధర్వ కుటుంబం మధ్యప్రదేశ్ లోని దేవస్ కు మకాం మార్చారు. అది 1948లో.

ఆధునిక నగర సంస్కృతికి, శుద్ధ శాస్త్రీయ ఘరానా సంగీతానికి దూరంగా, గిరిజన సంస్కృతికి, జానపద సంగీతానికి చేరువగా, ప్రకృతి సౌందర్యానికి నెరవైన మాళవ ప్రాంతంలో, పురాణ ప్రసిద్ధిగాంచిన క్షిప్రానదీ తీరాన ఉన్న చిన్న పట్టణం దేవస్. గాత్ర సాధనకు స్వస్తి చెప్పినా అక్కడి ప్రశాంత వాతావరణంలో జానపద సంగీత సౌందర్యాన్ని తనివి తీర ఆస్వాదించే అపురూపమైన అవకాశం కుమార్ కు లభించింది. ఆ సంగీతాన్ని ఆయన చాలా లోతుగా అధ్యయనం చేశారు. జానపద సంగీతాన్ని మధించగా మధించగా ఆయనకు జ్ఞాననేత్రం తెరుచుకున్నట్లు అనిపించింది. శాస్త్రీయ రాగాలన్నింటికీ మూలాలు జానపద సంగీతంలోనే ఉన్నట్లు తెలుసుకున్నాడు. అప్పటి నుంచి ఒక్కొక్క రాగానికీ మూలాన్ని అన్వేషించడం ప్రారంభించాడు.

మహాదేవుని ఐదు ముఖాల నుంచి ఐదు రాగాలు, పార్వతీదేవి ముఖం నుంచి మరొక రాగం పుట్టాయనీ, ఆ ఆరు ఆది రాగాల నుంచి ఇతర రాగాలన్నీ వచ్చాయనీ పూర్వపు సంగీత గ్రంధాలలో రాశారు. శివ పార్వతుల ముఖాల నుంచి కాదు-రాగాలన్నీ జానపద సంగీతం నుంచి పుట్టాయని కుమార్ గంధర్వ ప్రకటించారు. అందుకు ఆధారాలు చూపించారు. తన పరిశోధన సారాన్ని ఆయన 'అనూప్ రాగ విలాస్' అనే గ్రంథంలో ఆవిష్కరించారు.

1948లో వ్యాధిగ్రస్థుడైనప్పుడు ఆయనకు ఒక ఊపిరి తిత్తిని తీసివేశారు. తర్వాత వ్యాధినుంచి కోలుకున్నా డాక్టర్ల సలహాకు బద్ధుడై ఏడెనిమిది సంవత్సరాలు ఆయన కచేరీ వేదిక మీదకు రాలేదు. ఇక ఆపైన ఆయనను ఎవరూ ఆపలేకపోయారు. తన దేహస్థితిపై తిరుగుబాటు చేసి, ఒక్కసారిగా ఆయన సంగీత ప్రపంచం మీదికి ఉత్తుంగ తరంగంలా విరుచుకు పడ్డారు. కేవలం ఆత్మబలంతో, సంకల్ప శక్తితో ఆయన తన అనారోగ్యాన్ని జయించారు. అది ఆయనకు పునర్జన్మ. ఆ తర్వాత కచేరీ వేదిక మీదికి వచ్చిన వ్యక్తి పూర్తిగా కొత్త కుమార్ గంధర్వ. అప్పటి నుంచి మరణదినం (1992 జనవరి 12వ తేదీ) వరకు-నాలుగు దశాబ్దాల పాటు-ఆయన సంగీత ప్రపంచంలో మధ్యందిన మార్తాండునివలె ప్రకాశించారు. ఈ నాలుగు దశాబ్దాలలో ఆయన పాడినదంతా అక్షరాలా అపూర్వ సంగీతం. రాగాన్ని ఆయన ఆవిష్కరించే పద్ధతి మనకు బాగా తెలిసిన సంప్రదాయ పద్ధతికి భిన్నంగా ఉంటుంది. ఘరానాల 'బంధనాలను' ఆయన ఛేదించుకున్నాడు. తనకు ముందున్న మహా విద్వాంసుల బాణీల నీడకూడా తనపై పడకుండా తన శైలిని తాను నిర్మించుకున్నాడు.

పుట్టిన ప్రతి మనిషికీ తల్లీ తండ్రీ ఉన్నట్లే హిందూస్థానీ సంగీతంలో ప్రతి గాయకుడుకీ ఒక 'ఘరానా' ఉంటుందనీ, ఉండాలనీ అనుకుంటే, ప్రొఫెసర్ దేవ్ ధర్ వద్ద నేర్చుకున్నాడు కనుక కుమార్ గంధర్వది గ్వాలియర్ ఘరానా అని అనుకోవాలి. కాని నిజానికి ఆయనకి ఘరానాలేదు. మనిషికి పేరు లాగా గాయకుడికి ఘరానా తప్పదంటే ఆయనది 'కుమార్ గంధర్వ ఘరానా' అనే చెప్పాలి. గాయకుడుగా పునర్జన్మ ఎత్తిన కుమార్ గంధర్వ నిజానికి స్వయంభువు.

ఆయన సంగీతం సంప్రదాయ విరుద్ధమని కొందరు విమర్శించారు. అయితే శాస్త్రవిరుద్దమని ఎవరూ అనలేరు. సప్తస్వరాలపై ఆయన అధికారానికి తిరుగులేదు. అపస్వరాలు, స్ఖాలిత్యాలు ఆయన చాయలకు రావు. ఆయన స్వరాలు సాన బట్టిన వజ్రాల్లా ప్రకాశిస్తాయి. 'ప్రతిభావంతుడే కాని ప్రతిభ కొంచెం వక్రించింది' అని కొందరు అన్నారు. ఎవరేమనుకున్నా ఆయన చలించలేదు. రాజీ పడలేదు. డబ్బిచ్చి టిక్కెట్లు కొనుక్కుని కచేరీకి వచ్చే శ్రోతల కోసం కూడా ఆయన తన ధోరణి మార్చుకోలేదు. గ్యాలరీ శ్రోతలను ఆకట్టుకోవడానికి జమ్మిక్కులు చేయడం ఆయన పద్ధతి కాదు. విలక్షణమైన ఆయన గాన శైలిని అర్ధం చేసుకోవడానికి, ఆయన సంగీతపు లోతును తెలుసుకోవడానికి రసికులకి చాలా కాలమే పట్టింది. గత పది, పన్నెండు సంవత్సరాలలో కుమార్ గంధర్వ అభిమానుల సంఖ్య చాలా పెరిగింది.

ఆయన ఏ రాగం పాడినా అందులో ఎక్కడో లీలగా జానపద సంగీతచ్చాయలు కనిపిస్తూనే ఉంటాయి. దీనికి తోడు తన సంగీత వనంలో ఆయన కొత్త కొత్త హైబ్రిడ్ రాగాలు చాలా సృష్టించారు. ఒక రాగంలోని ఒకానొక సంచారాన్ని కత్తిరించి మరొక రాగానికి దాన్ని అంటుకట్టడం, ఆ కొత్త మొక్కకి కొత్త రంగు, కొత్త రూపం, కొత్త పరిమళం గల పూలు పూయించడం ఆయనకు చాలా ఇష్టం. భావమత్ భైరవ్, మధ్ సూర్య, శ్రీకళ్యాణ్, చైతీ భూప్, బీహాద్ భైరవ్, మాళవతి, త్రివేణి, కామోద్ వంతి, సహేలీ తోడి, లగన్ గంధార్, గాంధీ మల్హార్-ఇవన్నీ ఆయన వనంలో విరిసిన నవరాగ కుసుమాలు. శ్రీ, కళ్యాణ్-రెండూ పూర్తి భిన్న ప్రకృతి గల రాగాలు. ఆ రెండింటినీ అంటు కట్టి విచిత్ర సుందరమైన 'శ్రీకళ్యాణ్' రాగాన్ని ఆయన సృష్టించాడు. భూపాలీ, దేశ్కార్, శుద్ధ కళ్యాణ్ రాగాల మధ్య అంతరం అతి స్వల్పం. ఆ మూడింటినీ కలిపి 'చైతీభూప్' అనే మధుర మనోహర రాగాన్ని సృష్టించాడు. కామోద్, జయ జయవంతి రాగాలను కలిపి 'కామోద్ వంతి' సృష్టించాడు.

ఆయన సంగీత స్వభావాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే దేశంలో అటువంటి గాయకుడు ఆయన ఒక్కడేననిపిస్తుంది. ఆయన సంగీతం పూర్తిగా ఆయన సొంతం. ఆయన ప్రోడక్టులో ఇంపోర్టెడ్ స్పేర్ పార్టులు, కాంపొనెంట్లు ఉండవు. 'సెంట్ పర్సెంట్ ఇండిజెనెస్' అని చెప్పవచ్చు. (రాగం సొంతం, బందిష్ (రచన) సొంతం, ఆఖరికి ఘరానా కూడా సొంతం. ఆయన కచేరీలలో, రికార్డులలో సాధారణంగా ఆయన సొంత రాగాలే వినిపిస్తాయి. ఒక వేళ ప్రసిద్ధ రాగాలు పాడినా అవి మనకు అలవాటైన పద్ధతిలో వినిపించవు. వాటిని క్రొత్త యాంగిల్స్ నుంచి ప్రొజెక్టు చేస్తాడు. దాని కొక కొత్త డైమన్షన్ ఇస్తాడు. మామూలుగా ఇతరులకి కనిపించని కొత్త విశేషమేదో ఆయనకి కనిపిస్తుంది. ఆ విశేషాన్ని ఫోకస్ లోకి తీసుకొస్తాడు. డిస్కవరీ, రీడిస్కవరీ ఆయన నిత్యకృత్యాలు. ఖయాల్, భజన్, ఠుమ్రీ, టప్పా, దాద్రా, కజరీ, ధున్, చైతీ, హోరీ, నాట్య సంగీత్ (మరాఠీ రంగస్థల సంగీతం), జానపద సంగీతం-వీటిల్లో దేన్నీవదిలి పెట్టలేదు ఆయన. తన కార్ఖానాలో వీటన్నింటినీ ఆయన రీప్రోసెస్ చేశాడు. తన బ్రాండ్ నేమ్ తో వాటిని కచేరీలలో, రికార్డులలో ప్రెజెంట్ చేశాడు.

కుమార్ గంధర్వ సంగీతం ఎప్పుడూ అనూహ్యంగా ఉంటుంది. ఆయన ప్రత్యేకతలలో ఇదొకటి. ఒక రాగాన్ని అందుకుంటే దాన్ని ఆయన ఎలా పాడతాడో, ఎంత సేపు పాడతాడో, ఎలా ముగిస్తాడో ఊహించడం కష్టం. సాధారణంగా ఒక విద్వాంసుడి కచేరీలు రెండు మూడు వింటే అతడి 'ఫార్మాట్' అర్థమైపోతుంది. కచేరీలే అక్కర్లేదు. ఎల్.పి.రికార్డులు, క్యాసెట్లు విన్నా తెలిసిపోతుంది. రవిశంకర్, బిస్మిల్లాఖాన్, భీమ్ సేన్ జోషి, జశ్ రాజ్, మల్లికార్జున్ మన్సూర్, గంగూబాయ్ హంగల్, కర్ణాటక సంగీతంలో అయితే ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, లాల్గుడి జయరామన్-వీళ్ళల్లో ఎవరి కచేరీకి వెళ్లినా మనం వినబోయే సంగీతం ఏమిటో ముందుగా తెలుస్తూనే ఉంటుంది. వాళ్ళు రాగం మొదలు పెట్టగానే అది ఎలా సాగబోతున్నదో, ఎంత సేపు సాగి, ఎలా ముగియబోతున్నదో మనకు ముందే తెలుస్తుంది. వాళ్ళు ఎప్పుడూ అలాగే పాడతారు, ఎప్పుడూ మనం ఆనందిస్తూనే ఉంటాం. వాళ్ళ సంగీతంలో సర్ ప్రైజెస్ ఏవీ ఉండవు. వెల్ ప్లాన్డ్, వెల్ రిహార్స్ డ్, వెల్ ప్రెజెంటెడ్ అన్నట్లుగా ఉంటాయి. కుమార్ గంధర్వ విషయం అలా కాదు. ఆయన తీసుకుపోయే దారిలో ఒక పది అడుగుల ముందు ఏముందో మనకు తెలియదు.

ఆయన పద్ధతిలో ఆలాపన ఎక్కువగా ఉండదు. 'నొంతొం' (తానం) ఉండదు. సర్గమ్ (స్వరకల్పన) ఉండదు. అతి క్లుప్తంగా రేఖా మాత్రంగా రాగ స్వరూపాన్ని పరిచయం చేయగానే 'బందిష్' అందుకుంటాడు. విలంబ కాలంలో పాడడం చాలా తక్కువ. మధ్య లయలో, ధ్రుత్ లయలో పాడడం ఎక్కువ. బోల్ తాన్ లు తక్కువ. గానం అంతా అకారతాన్ లతో సాగుతుంది. ఆయన గీసే రాగ చిత్రాలు ఏ ఫ్రేములలోనూ ఇమడవు. ఆయన రేఖలు, రంగులు ఫ్రేము దాటి బైటికి పోతున్నట్లుంటాయి.

చాలా మంది విద్వాంసుల ఎదుగుదల సుమారు 30, 35 సంవత్సరాల వయస్సులో ఆగిపోతుంది. అప్పటికి వారి కళా స్వరూపం స్థిరపడిపోతుంది. ఏ రాగాన్ని ఎలా ఆవిష్కరించాలో, జనాకర్షణ కోసం ఎటువంటి జిమ్మిక్కులు చేయాలో, అంతా పథకం సిద్ధమైపోతుంది. ఆ తర్వాత జీవితాంతం అలాగే పాడుతూ, వాయిస్తూ ఉంటారు. రవిశంకర్, అలీ అక్బర్, బిస్మిల్లా, భీమ్ సేన్ జోషీ, లాల్గుడి, ఎం.ఎస్. సుబ్బలక్ష్మి రికార్డులు, క్యాసెట్లు వింటే అవి పాతిక ముప్పయ్యేళ్ళ కిందటివో, ఇటీవల రికార్డు చేసినవో తేడా పెద్దగా తెలియదు. అలా కాకుండా ఎంత వయస్సు వచ్చినా ఇంకా ఇంకా ఎదుగుతూనే ఉండే సంగీత విద్వాంసులను ఒక చేతి వేళ్ళ మీద లెక్కించవచ్చు. వాళ్ళలో కుమార్ గంధర్వ ఒకరు. ఆయన గానంలో రిపిటిషన్, రీసైక్లింగ్ కనిపించవు.

కుమార్ గంధర్వ ప్రత్యేక లక్షణాలను వివరించడానికే ఇదంతా రాసింది. అయితే అంతటి మహాగాయకుడు మరొకరు లేరని గాని, సంగీతం అంటే అలాగే ఉండాలని గాని నా అభిప్రాయం కాదు. ఆయన సంగీతం ఆయన వ్యక్తిత్వానికి దర్పణం. నిజానికి ఎవరి సంగీతమైనా అంతే. ఆయన సంగీతం రెస్ట్ లెస్ గా ఉంటుంది. అమీర్ ఖాన్ గానంలా సంతత శాంత గంభీర వాహినిలా సాగదు. కరీంఖాన్ గానంలోని ఆర్ధ్రత, ఆర్తి, బడే గులాం గానంలోని పాండిత్య వైభవం ఆయన సంగీతంలో కనిపించవు. కుమార్ గంధర్వ గానం కల్లోల సముద్రంలా, ఉత్తుంగ జలపాతంలా గర్జిస్తూ, విరుచుకు పడుతుందే గాని హుందాగా నిండుగా సాగదు. ఉరుములు, మెరుపులే గాని మలయ పవనాలు, పున్నమి వెన్నెలలు కనిపించవు. కబీర్ నిర్గుణ్ భజన్ ల గానంలో ఆయన అంతర్మథనం కూడా తీవ్రంగానే ఉంటుంది. పట్టపగ్గాల్లేని సంగీతం ఆయనది.

ఎవరి ప్రవృత్తిని బట్టి, సంస్కారాన్ని బట్టి, అభిరుచిని బట్టి వారు సంగీతంలో తమకు కావలసిన లక్షణాలను వెతుక్కుంటారు. కరీంఖాన్, అమీర్ ఖాన్ ల సంగీతాన్ని ఆరాధించేవారు కుమార్ గంధర్వగానాన్ని ఎక్కువ సేపు భరించలేక పోవచ్చు. కాని నిస్సందేహంగా ఈ శతాబ్దపు పది మంది గొప్ప హిందూస్థానీ గాయకులలో ఆయన ఒకడు. అంతేకాదు-హిందూస్థానీ గాత్ర సంగీత విద్వాంసులలో 'పద్మవిభూషణ్' అవార్డు నందుకున్నవాడు ఆయనొక్కడే. ఈ మధ్యనే ఆయనకు హఫీజ్ అలీఖాన్ మెమోరియల్ అవార్డు కూడా ప్రకటించారు. దాన్ని అందుకోకుండానే ఆయన అస్తమించాడు.

పబ్లిసిటీ కోసం, అవార్డుల కోసం ఆయన ఎప్పుడూ పాకులాడలేదు. ప్రలోభపడలేదు. కాని దేశంలోని అన్ని అవార్డులూ ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. వ్యక్తిగా, కళాకారుడుగా కూడా సర్వతంత్ర స్వతంత్రుడు కుమార్ గంధర్వ.

నండూరి పార్థసారథి
(1992లో రచన సచిత్ర మాస పత్రికలో ప్రచురితమైనది)

Previous Post Next Post