Title Picture

మూసలో పడని మహానటుడు

భారత చలన చిత్ర విహాయసంలో మూడు దశాబ్దాలు ఉజ్జ్వలంగా వెలిగిన ఒక తార జూలై 24వ తేదీ రాత్రి అస్తమించింది. ఉత్తమ్ కుమార్ లేని బెంగాలీ చిత్ర సీమను ఉహించడమే కష్టం. భర్తీ చేయడానికి వీల్లేని ఈ దారుణ నష్టాన్ని బెంగాలీ చిత్రసీమ ఇక భరించక తప్పదు. చేదు విషం లాంటి ఈ సత్యాన్ని కళాప్రియులు దిగమింగక తప్పదు.

బెంగాలీ సినిమా రంగంలో ఇప్పుడు అంతటి ప్రతిష్ఠగల వ్యక్తి ఒక్క సత్యజిత్ రాయ్ మాత్రమే. నటుల్లో అంతటి ఔన్నత్యాన్ని అందుకున్న వారు మరొకరు లేరు. బెంగాలీ తారాపథంలో ఆయనను ధ్రువతార అంటే తప్పులేదు. అసలు యావద్భారత స్థాయిలో మాత్రం అంతటి నటులు ఎందరున్నారు? అశోక్ కుమార్, సంజీవ కుమార్ - ఇంకెవరైనా ఒకరిద్దరున్నారేమో? నాగయ్య, ఎస్వీ రంగారావు, లింగమూర్తి, ఫృధ్వీరాజ్ కపూర్, ఛబీ బిశ్వాస్ వంటి మహానటులతో బాటు ఇప్పుడు ఉత్తమ కుమార్ చరిత్రలో కలిసిపోయాడు. హిందీ సినిమా రంగంలో ఎప్పుడూ ఐదారుగురు సూపర్ స్టార్లుంటారు. తెలుగులో ముప్ఫయి ఏళ్ళుగా ఇద్దరే సూపర్ స్టార్లు. తమిళంలోనూ ఇద్దరే. బెంగాలీ సినిమా రంగానికి ఒక్కగాను ఒక్క సూపర్ స్టార్ - ఉత్తమ్ కుమార్. ఆ స్టార్ దేదీప్యమానంగా వెలుగుతూ వెలుగుతూ ఒక్కసారిగా గప్పుమని ఆరిపోయి చిమ్మచీకటిని సృష్టించింది.

ఒకటి కాదు, రెండు కాదు, మూడు దశాబ్దాలు గ్లామర్ బాయ్ గా, మహా నటుడుగా కోట్లాది కళా హృదయాలను కొల్లగొట్టిన నటుడు. ఆయనతో దీటైన వాడు మరొకరెవరున్నారు దేశంలో? భరత్ అవార్డ్, పద్మశ్రీ లాంటివి ఆయనకు చంద్రుడికో నూలుపోగు లాంటివి. ఫిలిం ఫేర్ అవార్డులు, రాష్ట్ర స్థాయి అవార్డులు ఆయన సాధించినవి లెక్కలేనన్ని. 1941లో 'దృష్టిదాన్' బెంగాలీ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన నాటి నుంచి ఆయన దాదాపు 175 చిత్రాలలో నటించారు. వాటిలో అధికభాగం బెంగాలీ చిత్రాలే అయినా, హిందీ చిత్రాలు కూడా చాలా ఉన్నాయి. సుచిత్రాసేన్, సుప్రియాదేవి, షర్మిళాటాగూర్, అపర్ణాసేన్ వంటి అగ్రశ్రేణి నటీమణుల పక్కన ఆయన నటించారు. ఆయన బెంగాలీ చిత్రాలలో స్వర్ణోత్సవమో, రజతోత్సవమో, శతదినోత్సవమో చేయించుకోని చిత్రాలు చాలా అరుదు. వ్యాపార సరళిలో నిర్మించిన సాదా చిత్రాలలో గ్లామర్ బోయ్ గానే నటించినప్పటికీ, ఆయన ఎన్నో క్లిష్టమైన వైవిధ్యం గల పాత్రలను అనన్య సాధ్యం అనిపించే విధంగా పోషించారు. సత్యజిత్ రాయ్ తీసిన 'నాయక్', 'చిడియాఖానా' చిత్రాలలో ఆయన నటన మహాద్భుతం. హిందీలో 'ఛోటీసీ ములాకాత్', 'అమానుష్', 'ఆనందాశ్రమ్', 'దూరియా', 'కితాబ్' చిత్రాలలో నటించారు. చాలామంది హీరోలలో కనిపించే మూసపోత నటన ఆయనలో కనిపించదు. అతిగా నటించడం అసలు చేతకాదు.

మరణించే నాటికి ఆయన వయస్సు 54 సంవత్సరాలు. అయితే మేకప్ అవసరం లేకుండానే ఆయన తన వయస్సు కంటే కనీసం 15 ఏళ్ళు తక్కువగా కనిపించేవారు. ఇరవై ఏళ్ళ క్రిందటే ఆయన వయస్సు పెరగడం ఆగిపోయిందేమో ననిపిస్తుంది. నిత్యయవ్వన నటుడుగా, హీరో వేషాలు వేస్తూ, హీరో ఇమేజ్ తోనే మరణించే అదృష్టం ఎందరికి లభిస్తుంది? ఉత్తమ్ కుమార్ స్వయంగా చిత్రాలు నిర్మించారు. దర్శకత్వం వహించారు కూడా. కాని, భారతీయ చలన చిత్ర చరిత్రలో ఒక ఫెనామినన్ గా ఆయన పేరు నిలిచిపోయేది నటుడుగానే.

నండూరి పార్థసారధి
(1980 జూలై ఆఖరి వారం ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post