ఈ మధ్య మన దేశంలో కూడా 'కళాఖండాల' పిచ్చి వెర్రితలలు వేస్తోంది. ఈ పిచ్చి ఆనవాయితీ ప్రకారం ముందు హోలీవుడ్ లో పుట్టి, అక్కణ్ణుంచి మన దేశానికీ, మన రాష్ట్రానికీ దిగుమతి అయింది. 'కళాఖండాలు' అంటే ఉత్తమ చలన చిత్రాలకు మన మేధావులు పెట్టుకున్న ముద్దుపేరన్నమాట. (అంటే ''కళను నరికి పోగులు పెట్టిన ముక్కలు'' అని అర్థం).
'కళాఖండం' అనే దానికి హాలీవుడ్ లో చాలా అర్ధాలు చెబుతారు. ''జీవితమును అత్యంత వాస్తవికముగా చిత్రించునది'' అని కొందరు చెబుతారు. (ఉదా : హీరో భోంచేస్తున్నాడనుకోండి. అతని ఎదురుగ్గా కెమేరాని పావుగంటసేపు పాతేస్తారన్న మాట). ''తక్కువ ఖర్చుతో ఔట్ డోర్ లో నిర్మించునది'' అని మరికొందరు అంటారు. (ఉదా: వీటిల్లో, పడిపోయిన గోడలు, దుబ్బు జుట్టు బిచ్చగాళ్ళు, హృదయసౌందర్యము గల మెల్లకన్ను హీరో, రొమ్ము దగ్గర చిరిగిపోయిన జాకెట్ ధరించిన పేద హీరోయిను మొదలయినవి వుంటాయి. ''అత్యంత మేధావంతముగా నిర్మించినవి'' అని మరొక నిర్వచనం. (సింబాలిజం గట్రా నింపి అర్థం కాకుండా తీయడం అన్నమాట. ఎంత అర్ధం కాకపోతే అంత గొప్ప కళాఖండం. ఈ చిత్రాల్లో అన్నీ సింబల్సే వుంటాయి. హీరోకి బదులు అతని వీపు మాత్రం కనిపిస్తుంది).
అసలు హాలీవుడ్డేతర చిత్రాలన్నింటినీ కళాఖండాలుగా భావించేవారు కూడా వున్నారు. అంతేకాదు. వాళ్ళ దృష్టిలో ఎంత దూరం దేశం నుంచి దిగుమతి అయితే అంత కళాఖండం. ఈ అభిప్రాయాన్ని మన్నించే హాలీవుడ్ నిర్మాత ఎవరైనా కళాఖండం నిర్మించదలచుకుంటే కెమేరా బుజాన వేసుకుని దేశాంతరం పోవాలి.
కళాఖండాలు అసలు ముందు ఇటలీ లోనూ, జపాన్ లోనూ పుట్టాయి. ఈ మధ్య ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా (బెంగాల్), రష్యాలలో కూడా తయారవుతున్నాయి. ఈ దేశాల్లో తయారైన చిత్రాలకే అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో బహుమతులు వస్తున్నాయి. ఈ చిత్రాలను మిగతావాళ్లంతా బరితెగించి కాపీ కొట్టేస్తున్నారు. కళాఖండం అంటే (1) హాలీవుడ్డేతర (2) చౌక (3) వాస్తవిక చిత్రమని అభిప్రాయపడే అమెరికన్ యువదర్శకులు కొందరు ఈమధ్య న్యూయార్క్ వీధుల్లో సినిమాలు తీయడం ప్రారంభించారు. మొత్తానికి కళాఖండాల నిర్మాణానికి తగిన వాతావరణం హాలీవుడ్ లో లేదన్న నమ్మకం మాత్రం అందరిలోనూ పాతుకుపోయింది.
ఎక్కడైనా కొత్తదనం కనిపిస్తే వేలం వెర్రిగా అందరూ దాన్నే గుడ్డిగా అనుకరిస్తూ, చివరికి దానిమీద అసహ్యం పుట్టేటట్లు చేయడం అన్నిరంగాల్లోనూ జరుగుతూనే వుంది. మోడరన్ పొయిట్రీ ఇలాగే వెర్రితలలు వేశాయి. శ్రీశ్రీ గారు మహాప్రస్థానం రాసింతర్వాత యువకవులంతా పొలోమని ఆయన వెంట పడ్డారు. జుట్టుపీక్కుని, చొక్కాలు చింపుకుని, గుండెలుబాదుకుంటూ ఆకలి కవిత్వం రాశారు. చివరికి ఆకలికవిత్వం మీద అందరికీ డోకుపుట్టింది. ముళ్ళపూడి రవణగారు హాస్యంలో కొత్తశైలిని సృష్టించే సరికి ఓ వందమంది రచయితలు ఆయన చొక్కా పట్టుకుని నడవటం మొదలు పెట్టారు. హాస్యం పేరు చెప్పుకుని వాళ్లంతా సింపుల్ సెంటెన్సులు రాయడం మానేశారు. అలాగే ఆబ్ స్ట్రాక్ట్ ఆర్ట్ పేరిట సిరామరకలు, పిచ్చి గీతలు కూడా చిత్రకళగా చెలామణీ అవుతున్నాయి.
సుమారు పన్నెండేళ్ళ క్రితం బొంబాయిలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరిగింది. అప్పట్నించే కళాఖండాల మోజు ప్రారంభమయింది. దరిమిలా మోజు ముదిరి పిచ్చి అయింది. 'బైసికిల్ థీఫ్', 'రాషొమాన్', 'యూకీవారీసూ' వంటి గొప్ప చిత్రాలను, ఆ ఉత్సవంలో ప్రదర్శించారు. 'బైసికిల్ థీఫ్'ను చూసిన మర్నాడే బిమల్ రాయ్ గారు 'దోబిఘా జమీన్' తీయడం ప్రారంభించారు. 'యూకీవారీసు' చిత్రాన్ని చూసి మన వాళ్ళంతా కథలో జాగా లేకపోయినా ఎలాగో ఒకలాగు ఒక అరటిక్కెట్టును ఇరికించడం, చివరికి ఆ పిల్లాణ్ణి రైలు పట్టాలమీద పరుగెత్తించడం ప్రారంభించారు. 'యూకీవారీసు'లో పిల్లాణ్ణి రైలు పట్టాలమీద పరుగెత్తించడం కేవలం 'త్రిల్' కోసం కాదు. దానికి వేరే చాలా ప్రయోజనం వుంది. అది సూక్ష్మరహస్యం. అదేమిటో చిత్రం చూసినవాళ్ళలో నూటికి 90 మందికి అర్థం కాదు. మన ప్రొడ్యూసర్లు నూటికి 90 మంది కోవకే చెందుతారు.
తర్వాత సత్యజిత్ రాయ్ గారు వచ్చి మొదటి చిత్రంతోనే దిగ్విజయయాత్ర చేసే సరికి, మర్నాటికల్లా ఓ డజను నకిలీ సత్యజిత్ రాళ్ళు వెలిశాయి. వీళ్ళలో ఎక్కువ మంది బెంగాలీలే. సత్యజిత్ రాయ్ ని అనుకరింపజూస్తున్న వాళ్ళలో చాలామంది చిత్రం యెంత నెమ్మదిగా నడిస్తే అంత కళాఖండం అని మాత్రమే అర్థం చేసుకున్నారు. వీళ్ళు ఎలాంటి చిత్రాలు తీసినా 'అయ్య బాబోయ్ కళాఖండం' అని గుండెలు బాదుకునే పత్రికలు చాలా వున్నాయి.
కళాఖండాలపిచ్చి మన ఆంధ్రా 'ఇంటలెక్చువల్స్'కి కూడా పుట్టింది. అసలు ఈ ఇంటలెక్చువల్స్ (మేధావులు) ఎవరో ముందు తేల్చుకుందాం. వీళ్ళు సాధారణంగా 20 ఏళ్ళు దాటినవారూ, 55 ఏళ్ళలోపు వాళ్లూ అయి వుంటారు. వీళ్ళు ఎక్కువగా రచయితలు, జర్నలిస్టులు, కళాకారులు, లాయర్లు, కాలేజీ విద్యార్థులు అయివుంటారు. చేతులో ఏదైనా ఇంగ్లీషు పత్రికగానీ, మాగజైను గానీ పట్టుకుని, లావుపాటి కళ్ళజోడు పెట్టుకున్న పెద్ద మనిషి ఎక్కడైనా కనిపిస్తే నిస్పందేహంగా అతను ఇంటలెక్చువల్. కళాఖండం అంటే మీ ఉద్దేశం ఏమిటి అని నిగ్గదీసి అడిగితే వీళ్ళలో ఒక్కరూ చెప్పలేరు. అసలు చెప్పుకోడానికి నామోషీగా వుంటుంది కూడాను. కాని వీళ్ళకి కొన్ని బండగుర్తులున్నాయి. ఆ గుర్తులున్న వాటిని వీళ్ళు కళాఖండాలంటూ వుంటారు. ఇంటలెక్చువల్స్ లిస్టులో చేరాలని మోజుపడేవాళ్ళు వాటిని పొగుడుతూ వుంటారు. పాపం కొందరు ఈ గుర్తులు తెలియక మామూలు చిత్రాన్ని కూడా కళాఖండమనుకుని పొగిడేసి, తర్వాత కాదని తెలుసుకుని నాలిక్కరుచుకుంటూ వుంటారు. అలాంటి వారు కళాఖండాలను గుర్తించడానికి ఈ క్రింది బండగుర్తులను బట్టీ పట్టడం మంచిది.
ఈ బండగుర్తులను జ్ఞాపకం పెట్టుకుని, తదనుగుణంగా మీరు వ్యాఖ్యానాలు చేస్తుంటే మిమ్మల్ని ఇంటిలెక్చువల్స్ కాదని అనగల దమ్ము ఎవరికీ వుండదు.
నండూరి పార్థసారథి
(1963లో 'జ్యోతి' మాసపత్రికలో ప్రచురితమైనది)