Navrang Title Picture

చలనచిత్ర కావ్య జగత్తులో శాంతారాంను కాళిదాసుగా వర్ణించవచ్చు. 30 సంవత్సరాల చలనచిత్ర చరిత్రలో కావ్యగౌరవం అందుకున్నవి బహుకొద్ది. వాటిలో రాజకమల్ కళామందిర్ సమర్పించిన ఒక్కొక్క చిత్రం ఒక్కొక్క మధుర కావ్యం. శాంతారాం నిర్మించిన ప్రతి చిత్రం, ప్రేక్షకుల ఆరాధనలందుకొని, వారి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంది.

Shantaram
Director Shantaram

ఇరవై యేళ్లనాడు శాంతారాం నిర్మించిన 'శకుంతల' చూసినవారంతా అతను కాళిదాసు కావ్యానికి అపూర్వ రూపకల్పన చేశాడని ప్రస్తుతించారు. కాళిదాసు 'శాకుంతలం'లోని ప్రతి అంశాన్ని అలంకారాలతో సహా యథాతథంగా సెల్యూలాయిడ్ మీదకి రసాత్మకంగా అనువదించగలిగిన మహాకవి శాంతారాం ఒక్కడేనని ఆ చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు. తర్వాత ఆయన నిర్మించిన డాక్టర్ కోట్నిస్, పర్ ఛాయీఁ, సుభాకాతారా, ఝనక్ ఝనక్ పాయల్ బాజే, దో ఆంఖే బారాహాత్ వంటి చిత్రాలన్నీ ఒకదానికంటే మరొకటి కళాసౌధానికి స్వర్ణ సోపానాలు కట్టాయి. ఒక్కొక్క చిత్రం జీవితంలోని ఒక్కొక్క అంశాన్నీ, రామణీయకతనూ అద్భుతంగా ప్రతిబింబించాయి.

కళ అంటే కేవలం వాస్తవికత కాదుగానీ, వాస్తవికతకు ఎంత దగ్గరగా వస్తే అంత గొప్పదవుతుంది అంటారు కొంతమంది. కాని శాంతారాం చిత్రాలు చూస్తుంటే వాస్తవికతను గురించి ఆలోచన రాదు. అదొక ప్రత్యేక సుందర ప్రపంచం. దాని సృష్టికర్త శాంతారాం. ఆ చిత్రాలు చూస్తుంటే, స్పర్శ నశించి, పరవశించి ఏదో ఆనంద లోకంలోకి మునిగిపోతాం. ఆ అనుభూతి సంవత్సరాల తరబడి హృదయంలో మిగిలిపోతుంది.

శాంతారాం భావుకత, నవరంగ్ చిత్రంతో పరాకాష్ట నందుకొన్నది. అది ఒక కవి జీవితం. సాధారణంగా భావుకుడైన ప్రతి యువకునిలాగే అతనిలో తీవ్రమైన మధురవాంచలు స్వర్గానికి నిచ్చనలు వెయ్యాలన్నంత వుద్రేకంతో వుంటాయి. కానీ వాస్తవిక ప్రపంచంలో తన కోర్కెలు తీరకపోవటం వల్ల ఆ అశాంతిని తృప్తి పరచుకు నేందుకు ఊహాగానాలు ప్రారంభిస్తాడు. ఊహా ప్రపంచానికి, వాస్తవిక ప్రపంచానికి మధ్య సతమతమౌతూ, తీయని కల, లేక కమ్మని నిద్ర లేని కలత నిద్రవలే ఉంటుంది ఆ కవి జీవితం. అతని జీవితానికి అర్థం, గమ్యం, సమస్తం ప్రేయసి. ఆ ప్రేయసి రెండు రూపాలుగా ఉంటుంది. ఒకటి వాస్తవిక జీవితంలోనిది-భార్య. రెండోది ఊహా ప్రపంచంలోనిది-మోహిని. వాస్తవిక ప్రపంచానికి, ఊహా ప్రపంచానికి ఎంత దూరమో, ఎంత విరోధమో అంత తేడా ఉంటుంది భార్యకీ, మోహినికి. అతనికి మోహిని అన్నా, ఆమె విహరించే ప్రపంచమన్నా ఎక్కువ మక్కువ. అందుకని ఎప్పుడూ ఆ లోకంలోనే ఉండాలనుకుంటాడు. కానీ వాస్తవిక ప్రపంచం ఉండనివ్వదు. పెళ్లాం కొరకరాని కొయ్యగా ఉంటుంది. అంత మాత్రం చేత ఆమె భర్తని విముఖత్వంతో చూడదు. ఎనలేని భక్తి, వినయం ఉంటాయి. సంసార పోషణకు ఉద్యోగం చేయాలి. ఆత్మని చంపుకోవాలి. ఇదే అతని సమస్య. ప్రతి సంఘటనలోనూ, ప్రతి సమస్యలోనూ మనం ఆ కవితో సహానుభూతి పొందుతాం. అతని బాధ మనం అనుభవించుతాం. అతను మోహినితో ఆనందిస్తుంటే మనమూ ఆనందిస్తాం. ఆ ఊహా లోకంలో నుంచి మళ్ళీ మామూలు సంకుచిత ప్రపంచంలోకి పడిపోతే ఎంతో నిరాశతో వుస్సురంటాము. శాంతారాం కథనం, చిత్రీకరణం యీ చిత్రంలో అత్యున్నత స్థాయి నందుకున్నాయి. ముఖ్యంగా హోలీ నృత్య చిత్రీకరణ చలన చిత్ర ప్రపంచంలోనే అపూర్వం అనిపించేదిగా వుంది. అలాగే కవి మోహిని రంగురంగుల వస్త్రాలను లాగి ఆకాశంలోకి విసిరేస్తున్నప్పుడు అవి గాలిలో తేలుతూ, ఒకదానినొకటి అల్లుకుంటూ, మబ్బుల్లాగా వివిధ వర్ణాకృతులు పొందటం, ఆ కవి భావనాశక్తికి చిహ్నంగా శాంతారాం అపూర్వంగా చిత్రించాడు.

Navrang Song Scene
Navrang Song Scene

చివరి దృశ్యాలలో 'ఛుపీహై కహాఁ' అన్న గీతాన్ని కూడా శాంతారాం అపూర్వంగా చిత్రించాడు. అది అనన్య సాధ్యం. తన హృదయాన్ని ముక్కలు చేసి, తన జీవితాన్ని ఎడారిగా, నిస్సారంగా చేసి వెళ్లిపోయిన ప్రేయసికోసం, తన మనస్సుతో ఊహాశక్తితో, దిగంతాలదాకా వెళ్లి వెతుక్కుంటాడు కవి. ఎక్కడో మ్రోడులతో, బీటలువారిన ఎడారిలో తన ప్రేయసి దుస్సహావస్థలో కనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని చిత్రీకరించటానికి శాంతారాం కవి కళ్లల్లోని ఆవేదనాపూరిత దైన్యాన్ని చూపి, ఆ కళ్లల్లోంచి అతని హృదయం లోపలకు మనని తీసుకువెళ్లి అతని అనుభూతుల స్వరూపాన్ని చూపిస్తాడు.

రచన, సంగీతం, నృత్యం, వర్ణ ఛాయాగ్రహణం, శబ్ద గ్రహణం, అలంకరణం, కళ, దుస్తులు అన్నీ పరిపూర్ణత సాధించాయి ఈ చిత్రంలో. సంగీతంలో చిత్రవిచిత్రమైన ప్రయోగాలు చేశారు. రచనలో భరత్ వ్యాస్, సంగీత రచనలో సి. రామచంద్ర యింతటి ఉన్నత ప్రమాణాలను ఇదివరకు ఎన్నడూ సాధించలేదు.

మోహినిగా, సహధర్మచారిణిగా సంధ్య చక్కగా నటించింది. కాని కొన్ని కొన్ని దృశ్యాలలోఆమె దుస్తులు, మేకప్, ఆమె నృత్యం కూడా అతి అనిపించే విధంగా ఉన్నాయి. మహీపాల్ యింత చక్కగా నటించగలడని ఊహించటం ఒక్క శాంతారాంకే చేతనయింది. పూర్వం అతడు ధరించిన ప్రాతలకీ, దీనికీ ఏవిధంగానూ పోలిక లేదు. ఎంతో నిగ్రహంతో, మితిమీరకుండా జాగ్రత్తగా నటించాడు అతను. మిగతా కేశవరావ్ దాతే, బాబూరావ్ పెండార్కర్, ఉల్హాస్, వందన మొదలైనవారందరూ కూడా పాత్రోచితంగా గొప్పగా నటించారు. హాలీవుడ్ చిత్రాలకు దీటువచ్చే స్థాయిలో వుంది ఛాయాగ్రహణం. వర్ణసమ్మేళనం, మన దేశంలో యింతవరకూ విడుదలైన వర్ణ చిత్రాలలో ఏదీ సాధించలేనంత అద్భుతంగా వుంది. అన్నివిధాలా 'నౌరంగ్' సాటిలేని చిత్రం అంటే అతిశయోక్తి కాదు.

చిత్రం ప్రజలను ఎంతగా ఆకర్షించిందో తెలుసుకోవడానికి ఒకసాధనం 'రిపీట్ ఆడియన్స్'-అంటే ఒకసారి చిత్రాన్ని చూసిన ప్రేక్షకుడు మళ్ళీ మళ్ళీ ఆ చిత్రాన్నే చూడటానికి వెళ్ళడం. ఆ చిత్రంలోని సంగీతమో, నృత్యమో ఏదో ఒకటి అతని హృదయంలో శాశ్వతమైన ముద్రవేస్తుంది. మరపురాని దివ్యసృతులను రేపుతుంది. అలా ఒకసారి కాక కొన్నిసార్లు ప్రేక్షకులను 'నౌరంగ్' చిత్రం ఆకర్షించిందంటే అందులోనే దాని ఉత్కష్టత తేటబడుతుంది.

నండూరి పార్థసారథి
(1959 డిసెంబరు1వ తేదీన-ఇరవయ్యేళ్ళ వయస్సులో-నేను విజయవాడలో ఆంధ్రప్రభ దిన పత్రికలో సబ్ ఎడిటర్ గా ఉద్యోగంలో చేరాను. తర్వాత రెండు రోజులకు 'నౌరంగ్' సినిమాపై ఈ సమీక్ష రాశాను. అది డిసెంబరు 6వ తేదీ ఆదివారం సంచిక అనుబంధం-కళా సాహిత్య విజ్ఞాన వేదిక-లో ప్రచురితమయింది. - నం.పా.సా)

Next Post