Title Picture

ముమ్మడి కృష్ణరాజ ఒడయర్ మైసూరు రాజ్యాన్ని పరిపాలించిన కాలంలో మైసూరు రాజాస్థానం అపూర్వవైభవంతో, సమస్త విద్వాంసులు, రసికులు, కళాకోవిదుల నిలయంగా విరాజిల్లుతూ ఉండేది.

మహారాజావారు స్వభావతః ఉదారశీలురు. స్వయంగా పండితుడు, శాస్త్రవిదుడు, కావ్యకర్త. అందువల్ల విద్య పట్ల ఆయనకు పూజ్యభావం ఉండేది.

ఈ కారణం వల్ల ఆయన ఏ కళలోనైనా, ఏ కొద్దిపాటి పరిజ్ఞానమున్న వారైనా తనను ఆశ్రయిస్తే కాదనకుండా ఆదరించేవారు.

ముమ్మడి కృష్ణరాజ ఒడయర్ 1794–1868

1860 ప్రాంతంలో ఆవిధంగా మహారాజావారి పోషణలో జీవించిన పండితులలో పురాణ కోవిదుడైన నారాయణశాస్త్రిగారు ఒకరు.

శాస్త్రిగారి పూర్వీకులు రామరాజనగరవాసులు. మూడు నాలుగు తరాల కిందట వారు అక్కడి నుంచి మైసూరుకు వచ్చి స్థిరపడ్డారు. శాస్త్రిగారు ప్రాచీన సంస్కృత సాహిత్యమంతటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అయితే పురాణ పఠనంలో ఆయనకు ప్రత్యేకమైన ప్రావీణ్యం ఉండేది. ఆయన కంఠస్వరం గంభీరంగా, మధురంగా ఉండేది. ఆయన గొంతు నుంచి పదాలు అవిరళధారాప్రవాహంగా వెలువడేవి. అందుచేత సభలో ఉపన్యాసమివ్వడంలో ఇతర పండితులందరికంటే ఎక్కువగా ఆయన రాణించేవారు.

రాజావారు దైవభక్తి నిరతుడు కావడం వల్ల శాస్త్రిగారిని పురాణపఠనానికి వినియోగించారు. శాస్త్రిగారు శ్రావ్యంగా వినిపించడమేకాక ఆయా పురాణాలకు పండితులు చెప్పిన భాష్యాలను వివరించేవారు. శాస్త్రిగారు పఠనాన్ని ఒక కళగా సాధన చేశారు. అందుకే ఆయనను అందరూ 'పురాణం శాస్త్రిగారు' అంటూ ఉండేవారు.

నారాయణ శాస్త్రిగారికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు. అతడి పేరు సుబ్బణ్ణ. అతడు ఇద్దరు ఆడపిల్లల తర్వాత వాడు. తండ్రిలా సుబ్బణ్ణ కూడా సంస్కృతపండితుడై ఉంటే అతడిని సుబ్రహ్మణ్యశాస్త్రి అని పిలిచి ఉండేవారు. తండ్రిలాగే అతడు కూడా రాజాస్థానంలో పురాణపఠనం చేసి ఉండేవాడు. కాని అతడి మనస్సు సంస్కృతంపై లగ్నం కాలేదు. సంగీతం అతడిని ఆకర్షించింది. అందుకే అతడు సుబ్రహ్మణ్యశాస్త్రి కాలేకపోయాడు. సుబ్బణ్ణగానే మిగిలిపోయాడు. ఆరోజుల్లో శాస్త్రి అనిపించుకునేటంత యోగ్యత సంగీత కళాకారుడికి ఉండేది కాదు. ఈకథ ఆ సుబ్బణ్ణదే.

నేను సుబ్బణ్ణ గారిని చూసినది ఆయన చివరి రోజుల్లోనే. ఆయన బాల్య జీవితవిశేషాలను ఆయనే అప్పుడప్పుడూ కొద్ది కొద్దిగా చెప్పగా తెలుసుకున్నాను. ఆయన తొరెయపురంలో ఉన్నప్పటి కథ అంతా మా మామగారికి, మా అక్కకి తెలుసు. అప్పటి ఆయన జీవితాన్ని నేనూ కొద్దిగా చూశాను. ఆయన చరమ జీవితాన్ని మాత్రం నేను పూర్తిగా కళ్ళారా చూశాను. ఆయన జీవితానికి సంబంధించిన మరికొన్ని విశేషాలను అక్కడక్కడ అడిగి తెలుసుకున్నాను. ఆయన వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని ఈకథలో నేను సమగ్రంగా చిత్రించగలిగానని చెప్పలేను. కఠినశిల మధ్యలో ఏక్కడో రవంత బంగారం ఉంటుంది. ఆ బంగారాన్ని రాబట్టడానికి ఆ శిలను పగలకొడతాం. చూర్ణం చేస్తాం. కరగిస్తాం. బంగారాన్ని వేరుచేసి శుద్ధి చేస్తాం. ఆ బండరాయికి ఈ బంగారానికి ఏమైనా పోలిక ఉందా?

సుబ్బణ్ణ మొదట గండశిలలాగానే ఉండేవాడు. దైవానుగ్రహం వల్ల క్రమక్రమంగా అతడి మనస్సు పూర్ణసంస్కారాన్ని సంతరించుకొని అపరంజిగా మారింది. ఆ విచిత్ర పరిణామ క్రమమంతటినీ యథాతథంగా వర్ణించగల శక్తి నాకు లేదు. కనీసం నేను కళ్లారా చూసిన ఆయన చరమ దశలోని ఔన్నత్యాన్నైనా సమగ్రంగా వర్ణించడం నావల్ల కాదు. ఆ చివరి రోజుల్లో ఆయన ఆత్మవిశ్వాసక్రమాన్ని నేను ప్రత్యక్షంగా గమనించాను. రోజురోజుకూ ఆయనలో ఎటువంటి మార్పు వస్తున్నదో కాస్త పరిశీలనగా చూసిన వారెవరికైనా కనిపించేది. నా వర్ణన సమగ్రం కాకపోయినా పాఠకులు సానుభూతితో, తమ ఊహాశక్తిని జోడించి చదివితే సుబ్బణ్ణ కథకు పూర్ణత్వం సిద్ధించవచ్చు.

(2)

సుబ్బణ్ణ సుబ్రహ్మణ్యశాస్త్రి కాలేకపోయాడని ఇంతకు ముందు చెప్పాను. ఈ కథ సారాంశం ఇదే అని చెప్పవచ్చు. మగపిల్లవాడు పుట్టినందుకు నారాయణశాస్త్రి గారు ఎంతో సంతోషించారు. అప్పటికి ఆయనకి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. వారిలో ఒక పిల్ల చనిపోయింది. నాల్గవ సంతానం కూడా ఆడపిల్ల అయితే ఏం చేయాలి? అలా కాకుండా మగపిల్లవాడు పుట్టడం ఆయనకు నిజంగా పుత్రోత్సవమే అయింది. ఆయన భార్య కూడా ఎంతో సంతోషించింది.

దంపతులిద్దరూ పిల్లవాడిని అతిగారాబంగా పెంచసాగారు. పిల్లవాడు ఏడేళ్లవాడయ్యాడు. శాస్త్రిగారు వాడికి అక్షరాభ్యాసం చేశారు. అమరకోశంలోని ఒకటి రెండు సర్గలను చదివించారు. ఆ తరువాత పిల్లవాడి విద్య ముందుకు సాగలేదు.

మొదటినుంచీ ఎందుకో పిల్లవాడికి సంగీతం మీదనే మనస్సు. అతడికి శాస్త్రిగారి మధుర గంభీర స్వరం అబ్బింది గాని ఆయనగారి సంస్కృతం మాత్రం అబ్బలేదు. అమరకోశంలోని ఏదైనా శ్లోకం కంఠస్థంచేసి వల్లించమంటే రాగయుక్తంగా, శ్రావ్యంగా వినిపించేవాడు గాని దాని అర్థం మాత్రం అతడి మనసుకెక్కేది కాదు. తండ్రి అతడిని ఇంట్లో పాఠానికి కూర్చోపెట్టి పనిమీద బైటికి వెడితే పిల్లవాడు ఆయన వచ్చేవరకు రాగాలు సాధన చేస్తూ ఉండేవాడు. పాఠం సంగతి మరచిపోయేవాడు.

పిల్లవాడు శ్రావ్యంగా శ్లోకాలు గానం చేస్తున్నందుకు తల్లిదండ్రులు మొదట మురిసిపోయారు. ఇంటికి ఎవరైనా వస్తే వాడిచేత శ్లోకాలు చదివించేవారు. విన్నవారు శభాష్ అని మెచ్చుకునేవారు. అలా మెచ్చుకుంటున్న కొద్దీ పిల్లవాడు ఇంకా శ్రద్ధగా గానసాధన చేసేవాడు. అలా చిన్నతనం నుంచి అతడికి సంగీతం పట్ల శ్రద్ధ, సంస్కృతం పట్ల అశ్రద్ధ ఏర్పడ్డాయి.

మైసూరు మహారాజభవనం

ఆ చిన్న వయస్సులోనే రాజావారి అంతఃపురంలో జరిగిన ఒక సంఘటనలో సుబ్బణ్ణ సహజ గాన ప్రావీణ్యానికి మరింత ప్రోత్సాహం లభించింది. ఒకరోజు శాస్త్రిగారు రాణివాసంలో పురాణ పఠనానికి వెడుతూ పిల్లవాడిని కూడా తీసుకువెళ్లారు. పురాణం ప్రారంభించే ముందు పిల్లవాడి చేత 'శుక్లాంబరధరం' శ్లోకం చదివించారు. పిల్లవాడి స్వర మాధుర్యాన్ని అంతఃపుర స్త్రీలు మెచ్చుకున్నారు. కాసేపటికి రాజావారు కూడా వచ్చి కూర్చున్నారు. సుబ్బణ్ణ తండ్రి పక్కనే ఒదిగి కూర్చుని ఆయన చెప్పే ప్రతి మాటా ఎంతో కుతూహలంతో వింటూ మధ్య మధ్య రాజావారికేసి చూస్తున్నాడు. రాజావారి సుందర వదనాన్ని, ఆ వదనానికి గాంభీర్యాన్ని చేకూర్చే పెద్ద పెద్ద మీసాలను వింతగా చూస్తున్నాడు. రాజావారు కూడా రెండు మూడు సార్లు సుబ్బణ్ణకేసి చూసి పిల్లవాడు ముచ్చటగా ఉన్నాడని మనస్సులోనే మెచ్చుకున్నారు.

పురాణ పఠనం ముగిసిన తరువాత "ఈ పిల్లవాడు మీ కుమారుడా?" అని శ్రాస్తిగారిని అడిగారు. శాస్త్రిగారు "అవును మహాప్రభూ?" అన్నారు. రాజావారు సుబ్బణ్ణవైపు తిరిగి నవ్వుతూ, "ఏమయ్యా... పెద్దయ్యాక నువ్వూ మీ నాన్నగారిలాగానే పురాణ పఠనం చేస్తావా?" అని అడిగారు.

పిల్లవాడు "లేదండీ, నేను పురాణాలు చదవను. సంగీతం పాడతాను" అని జవాబిచ్చాడు.

రాజావారు "ఓహో అలాగా? ఏదీ ఒక పాట వినిపించు" అని అడిగారు.

సుబ్బణ్ణ "శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం" శ్లోకాన్ని రాగయుక్తంగా శ్రావ్యంగా గానం చేసి, "నాకు కస్తూరీ తిలకం శ్లోకం కూడా వచ్చు" అని చెప్పాడు.

రాజా వారు ఎంతో సంతోషించారు. ఒక పళ్లెంలో నూతన వస్త్రాలు ఉంచి పిల్లవాడికి బహూకరించారు. "నువ్వు మంచి బుద్ధిమంతుడివి. సంగీతం ఇంకా బాగా నేర్చుకో, మేము ఇంకా మంచి కానుకలు ఇస్తాము" అని మెచ్చుకున్నారు.

తరువాత శాస్త్రిగారి వైపు తిరిగి "మీ అబ్బాయి బలే చురుకైన వాడు. బాగా తర్ఫీదు ఇవ్వండి. గొప్పవాడవుతాడు" అన్నారు. శాస్త్రిగారు, సుబ్బణ్ణ సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు.

అప్పటి నుంచి సుబ్బణ్ణకు ఇంకా బాగా సంగీతసాధన చేసి రాజావారి సన్మానాలందు కోవాలనే పట్టుదల ఎక్కువయింది. నేను స్వయంగా చూసిన సుబ్బణ్ణ గారు కూడా అటువంటి పట్టుదల మనిషే. ఏ పనైనా పట్టు విడవకుండా చివరిదాకా చేసేవాడు. ఆ లక్షణం ఆయనకు చిన్నప్పటి నుంచే ఉండి ఉంటుంది. రాజావారి మెప్పు పొందాలనే లక్ష్యంతో సుబ్బణ్ణ సంగీత కచేరీ ఎక్కడ జరిగినా వెళ్లి శ్రద్దగా వినేవాడు. సంగీత విద్వాంసుల నుంచి మెలకువలు గ్రహించేవాడు. చిన్న చిన్న కచేరీలలో తనూ పాడుతూ ఉండేవాడు.

అలా పధ్నాలుగేళ్ల వయస్సుకే అతడికి సంగీతంలో అద్భుతమైన పరిజ్ఞానం అలవడింది. వయస్సులో అతడికంటే ఎంతో పెద్దవారైన గాయకులు అతడిని తమ సాటి గాయకుడిగా పరిగణించి గౌరవించేవారు. కొందరు అతడిని చూసి ఈర్ష్య పడేవారు కూడా. గాత్ర సంగీతంలోనే కాదు, వీణ, వైలిన్, మృదంగం వాయించడంలో కూడా సుబ్బణ్ణ ప్రావీణ్యం సంపాదించాడు. కుమారునికి సంస్కృతం పట్ల, పురాణాల పట్ల శ్రద్ధ లేకపోవడం శాస్త్రిగారికి బాధాకరంగా ఉండేది. అయితే సుబ్బణ్ణ ఏకాగ్రతతో, సంగీత సాధన చేస్తున్న సంగతి ఆయనకు తెలియదు. తెలిస్తే కనీసం ఇంకొక రంగంలోనైనా తన కుమారుడు అభివృద్ధి సాధిస్తున్నందుకు ఆయనకు కొంత ఊరటగా ఉండేదేమో. కాని సుబ్బణ్ణ తన సంగీత సాధనను గోప్యంగా ఉంచుకున్నాడు. సంగీతంలో అత్యున్నత స్థితిని అందుకున్న తరువాత తన విద్వత్తును ప్రదర్శించి సంగీత ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేయాలనీ, అంతవరకు తన సాధన గురించి ఇంట్లో వాళ్లకి తెలియనివ్వకూడదనీ అనుకున్నాడు.

సుబ్బణ్ణ తన సాధన గురించి ఇంట్లో వాళ్ళకి తెలియనివ్వకపోవడానికి మరో కారణం కూడా ఉంది. ఈ సంగీత కచేరీలు, గాయకుల గోష్ఠులు-ఎప్పుడైనా విద్వాంసుల ఇళ్ళలో జరిగినా-ఎక్కువగా వారకాంతల ఇళ్ళలో జరుగుతూ ఉండేవి. సంగీతం పట్ల ఆసక్తితో సుబ్బణ్ణ అటువంటి కచేరీల కోసం తరచుగా వారకాంతల ఇళ్ళకు వెడుతూ ఉండేవాడు.

సుబ్బణ్ణ అందగాడు. విశాలమైన నుదురు, మెరిసే పెద్ద పెద్ద కళ్ళు తీర్చిదిద్దినట్లుండే కనుబొమలు, ఎర్రటి పెదవులు చూపరులను ఆకర్షించేవి. ఆ కాలపు వారు నెలకో, రెండు నెలలకో ఒకసారి క్షౌరం చేసుకొనేవారు. అలా పెరిగిన లేత మీసం సుబ్బణ్ణ ముఖానికి వింత అందాన్ని తెచ్చింది. అతడు నిత్యకర్మలు యథావిధిగా నిర్వర్తించేవాడు. వాటి వల్ల అతడి ముఖానికి అవర్ణనీయమైన వర్చస్సు చేకూరింది. పాలకోసం మాతృస్తనాన్ని తడుముకొనే శిశువులాగా జీవితంలో తీయదనం కోసం వెతుక్కునే కౌమార ప్రాయపు అమాయకత అతనిలో కనిపించేది.

అటువంటి యువకుని చూసిన వారు మోహించకుండా ఎలా ఉండగలరు? అతడంటే వారకాంతలకు అసాధారణమైన ప్రేమ ఉండేది. సంగీతం కోసం అతడు వారి ఇళ్ళకు వెళ్ళినప్పుడు వారు పళ్ళు, పాలు ఇచ్చి మర్యాద చేసేవారు. ఒక పాట పాడమని కోరేవారు. అలా పాడమని అడిగితే మహాభాగ్యంగా భావించి పాడి వినిపించేవాడు. అలా పదహారేళ్ళ వయస్సు వచ్చేసరికి అతడు సంగీత ప్రపంచంలో తనకొక నిశ్చితమైన స్థానాన్ని సంపాదించుకొన్నాడు. ప్రముఖ సంగీతకారుల కోవలో చేరాడు.

అప్పటికే సుబ్బణ్ణకు పెళ్ళయింది. ఆయన భార్య పేరేమిటో నాకు ఇప్పటికీ తెలియదు. ఆయనతో నాకు గల పరిచయంలో ఎప్పుడైనా యథాలాపంగా తప్ప-తన భార్య గురించి చెప్పలేదు. ఆవిడ పేరేమిటని ఆయనని అడిగే ధైర్యం నాకు లేకపోయింది. ఆయనెప్పుడూ 'ఆవిడ' అని మాత్రమే ప్రస్తావించేవారు. ఒకసారి ఆయన "లలిత అనే పేరు అమ్మకు సరిగా సరిపోయే పేరు. అందుకే శంకరాచార్యుల వారు సహస్రనామాన్ని లలితా సహస్త్రనామం అన్నారు. ఆ లలితమ్మే మన తల్లి కాకపోతే మనందరి గతి ఏమయ్యేది?" అన్నారు.

కొంచెం ఆగి "ఆ పేరు గల స్త్రీల తీరే వేరు. లోకమాత అంశంతో పుట్టారా అనిపిస్తుంది వారి ప్రవర్తన చూస్తే" అన్నారు. ఎక్కడో దూరంగా శూన్యంలోకి చూస్తూ ఆయన ఆ మాటలన్నారు. తన భార్య జ్ఞాపకం రాగా ఆయన అలా అన్నట్లు నాకు అనిపించింది. దాన్ని బట్టి ఆయన భార్య పేరు లలిత అయి ఉండవచ్చునని అనుకున్నాను.

సుబ్బణ్ణకు పదిహేడేళ్ళ వయస్సు వచ్చేసరికి అతడి భార్య కాపురానికి వచ్చింది. ఒక్క శాస్త్రిగారి సంపాదనతోనే ఇట్లు గడవ వలసిన పరిస్థితి. సుబ్బణ్ణకు సంపాదన లేదు. సంగీతంలో ధనార్జన చేయాలంటే ఇంకా చాలా కాలం కృషి చేయవలసి ఉంటుంది. సంస్కృత పరిజ్ఞానం కాస్తయినా ఉంటే పౌరోహిత్యం చేసుకోవచ్చు. లేదా ఇంకేదైనా పని దొరికేది. సంస్కృతం ఇంకా బాగా నేర్చుకుంటే పురాణాలు చెప్పి సంపాదించవచ్చు. కాని సుబ్బణ్ణకు సంస్కృతం రాదు.

శాస్త్రిగారికి ఇంట్లో ఎదిగిన కొడుకు ఉన్నా అదనపు సంపాదన లేకపోయింది. సుబ్బణ్ణకు పెళ్ళికాకపోయి ఉంటే అంత ఇబ్బంది ఉండేది కాదు. కాని అతగాడికి పెళ్ళయి పిల్ల కాపురానికి రావడంతో కుటుంబంపై అదనపు భారం పడింది. శాస్త్రిగారు ఎంత మంచివాడైనప్పటికీ, ఎదిగిన కొడుకు పైసా సంపాదన లేకుండా ఇంట్లో ఊరికే ఉండడం ఆయనకు కష్టంగా తోచింది.

ఏదో ఒక సంపాదన చూసుకోవడం మంచిదని ఆయన అప్పుడప్పుడూ కొడుకుతో అనేవారు. సుబ్బణ్ణ చాలాసార్లు మౌనంగా సహించాడు గాని చివరికి ఒకరోజు "సంపాదించడం లేదని మాటిమాటికి సతాయిస్తారు దేనికి? నేను ఈ ఇంటికి అంత భారంగా ఉంటే చెప్పండి. ఎక్కడికైనా పోతాను. నా తిండి నేను సంపాదించుకోగలను" అని జవాబిచ్చాడు.

"అవునవును. నువ్వు వెడతావు. నీ తిండి నువ్వు సంపాదించుకుంటావు. కాని నీ పెళ్ళాం సంగతేమిటి? దానికి తిండి ఎవరు పెడతారు? దాన్ని కూడా తీసుకుపోతావా?" అంది తల్లి.

"నాకు పెళ్ళి చెయ్యమని ఎవరడిగారు? నేను అడిగానా? కోడలిని తెచ్చుకున్నది మీరు. మీరే పోషించండి దాన్ని. పోషించలేకపోతే దాన్ని పుట్టింటికి పంపేయండి" అని సమాధానమిచ్చాడు సుబ్బణ్ణ.

ఇంట్లో ఈ రాద్ధాంతం జరగడంతో సుబ్బణ్ణ కోపంగా బైటికి వెళ్ళిపోయాడు. రాత్రి భోజనానికి రాలేదు. అతను రాకపోవడంతో అతడి భార్య లలిత కూడా తినలేదు. శాస్త్రిగారికి భోజనం చేయాలనిపించలేదు. కాని ఎలాగో నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని అయిందనిపించి బైటికి వెళ్ళిపోయారు. ఆయన భార్య కోడలిని భోజనం చేయమని అడిగింది. కోడలు నిరాకరించడంతో ఆవిడ "నీకూ మీ ఆయనకీ భోజనం అక్కర్లేకపోతే నాకేనా కావలసింది?" అంటూ ఆ పూట పస్తుపడుకుంది.

సుబ్బణ్ణ అప్పటికింకా సంగీతం ద్వారా డబ్బు సంపాదించకపోయినా సంపాదించగల స్థితికి వచ్చాడు. రాబోయే నవరాత్రి ఉత్సవాలలో మహారాజా వారి ఎదుట గానం చేసే అవకాశం అతడికి లభించింది. అందుచేత అతడు ఇంకా ఎక్కువగా సాధన చేయడం మొదలుపెట్టాడు. ఇల్లు అనుకూలంగా లేకపోవడంతో అతడు ఒక వేశ్య ఇంటికి వెళ్ళి సాధన చేసేవాడు. ఆ వేశ్య వల్ల అతడు చెడిపోయాడో లేదో నేను చెప్పలేను. నాకు తెలియదు.

అదీ కాక, 'చెడిపోయాడు' అనే మాటను జనం ఏ ఉద్దేశంతో అంటారో నాకు అర్థం కాదు. నీలసాని అనే వేశ్య ఇంట్లో సుబ్బణ్ణ గాత్ర సాధన, వైలిన్ సాధన చేసేవాడు. నీలసాని అతడి సంగీతాన్ని ఆరాధించేది. బ్రాహ్మణుడు కావడం వల్ల అతడిని దేవుడిలా చూసేది. ఆమెకు డబ్బు కొదవలేదు. సిరిగల దొరలెందరో ఆమె వద్దకు వచ్చేవారు. కాని ఆమెకు సుబ్బణ్ణ పట్ల విశేషమైన భక్తి గౌరవాలు ఉండేవి. ఆమె గోపిక వంటిది. శ్రీకృష్ణ భక్తురాలు. సుబ్బణ్ణ సుందర రూపాన్ని అతడి వర్చస్సును చూసి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే ఈ రూపంలో వచ్చాడా అనుకునేది.

అతడు రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేది. తరువాత తన మేడ మీద పెద్ద గదిలోకి తీసుకువెళ్ళేది. ఆ గదిలో అతడి సంగీత సాధనకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసేది. ధ్యానం చేసుకోవడానికి పీట, గానం చేసేటప్పుడు కూర్చోవడానికి రత్నకంబళం, విశ్రాంతి తీసుకోవడానికి ఒరగుదిండు, ఫిడేలు, వీణ, మృదంగం అన్నీ ఆ గదిలో ఉండేవి. అతడికి ఆకలి వేస్తే తినేందుకు ఒక అలమరులో బ్రాహ్మణుల చేత శుచిగా వండించిన వంటకాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవి.

సుబ్బణ్ణ గదిలోకి వచ్చి కూర్చున్న తరువాత ఆమె అల్లంత దూరంలో కూర్చుని ఓ పది నిమిషాలు మాట్లాడి "ఇంక మీరు సాధన చేసుకోండి" అని చెప్పి వెళ్ళిపోయేది. సుబ్బణ్ణ ఒక్కడూ కూర్చుని గాత్ర సాధన చేసేవాడు. కొంత సేపు వైలిన్ అభ్యాసం చేసేవాడు. గాత్రంలోని కొన్ని గమకాలను వైలిన్ మీద, వైలిన్ మీది గమకాలను గాత్రంలో పలికించడానికి ప్రయత్నించేవాడు. అలా గంటల తరబడి సాధన చేసేవాడు. నీలసాని వచ్చి "చాలా పొద్దుపోయింది. మీరు ఇంక ఇంటికి వెళ్ళాలి" అని జ్ఞాపకం చేసే వరకు అతడికి కాలాతీతమయిందన్న సంగతి తెలిసేది కాదు.

ఆ రోజు ఇంట్లో జగడమైన తరువాత సుబ్బణ్ణ తిన్నగా నీలసాని ఇంటికి వెళ్ళాడు. అనేక కారణాల వల్ల అతడి మనస్సు వ్యాకులంగా ఉంది. తను తండ్రికి భారంగా ఆయన ఇంట్లో ఉంటున్నాననే భావన అతడి అశాంతికి మొదటి కారణం.

ఒక వయస్సు వచ్చేసరికి సాధారణంగా ఎవరికైనా ఇటువంటి అసంతృప్తి కలుగుతుంది. బాల్యంలో అందరం తండ్రి ఇంట్లోనో, ఇతర బంధువుల ఇళ్ళలోనో ఉంటాము, తింటాము. అలా ఉండేందుకు, తినేందుకు మనకు హక్కు ఉన్నదా అనే ప్రశ్న ఆ వయస్సులో రాదు. కొంత వయస్సు వచ్చాక ఆ ప్రశ్న వస్తుంది. అలా తినే హక్కు మనకు లేదనే గుర్తింపు వస్తుంది. తన బతుకుతెరువు తాను చూసుకోవాలన్న సంగతి తన తండ్రి చెప్పకముందే గుర్తించాడు సుబ్బణ్ణ.

కాని, బ్రతుకుతెరువు కోసం ఏం చేయాలో అతను నిర్ణయించుకోలేకపోయాడు. త్వరలో తాను మహారాజా వారి సమక్షంలో తన సంగీత ప్రావీణ్యాన్ని ప్రదర్శించబోతున్నాడు. రాజావారు మెచ్చి తనకు నెలసరి వేతనం ఏదైనా మంజూరు చేయవచ్చునన్న ఆశ కూడా ఉంది. అది జరిగితే తాను ఇలా తండ్రి సంపాదనపై ఆధారపడవలసిన అవసరం ఉండదు.

ఈ ఆశతో సుబ్బణ్ణ తాను రాజావారి ఎదుట గానం చేస్తున్నట్లు, సభలో విద్వాంసుల మధ్య కూర్చున్న తండ్రి తన పాండిత్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నట్లు, కొడుకు ఇంతటి వాడైనందుకు ఆయన గర్విస్తున్నట్లు ఊహించుకునేవాడు. అలా తీయని ఊహల్లో తేలిపోతున్న తరుణంలో ఇంట్లో ఇంత రాద్ధాంతం జరగడం, తల్లిదండ్రులు తనని అయోగ్యుడుగా, అప్రయోజకుడుగా జమకట్టడం అతడికి చాలా మనస్తాపం కలిగించింది.

తండ్రి తనను చూసి గర్వించకపోగా, తనకు తిండి పెట్టడానికే బాధపడుతున్నాడు. తను దమ్మిడీకి చెల్లని వాడని ఆయన అనుకుంటున్నాడు. తనకి తోడు తనకొక భార్య. తను ఒక్కడే అయితే తల్లిదండ్రులకి భారం కాకుండా తన దారిని తాను పోయి ఉండేవాడు. కాని భార్య కాపురానికి వచ్చి పరిస్థితిని మరీ జటిలం చేసింది. ఎంత దౌర్భాగ్యం!

భార్యల పట్ల ఆ కాలపు వారికి గల ప్రేమ ఆపాటిదేనా అని పాఠకులకు సందేహం కలగవచ్చు. కానీ నిజానికి ఇప్పుడు మనం మామూలుగా 'ప్రేమ' అంటున్నది శారీరక వాంఛమాత్రమే.

ఆ కాలపు వారి ప్రేమ ఒక రకమైన అశ్రద్ధతో ప్రారంభమై భార్య అంటే జగన్మాత అంశ అనే పూజ్యభావంతో ముగిసేది! సుబ్బణ్ణ విషయంలోనూ అలాగే జరిగింది!.

ఆ చిన్న వయస్సులో అతనికి భార్య విషయంలో ఏ మాత్రం శ్రద్ధ ఉండేది కాదు. అతని దృష్టి ఎప్పుడూ తన కళపైన, తన జీవనపరిస్థితిపైనే ఉండేది. అదీగాక ఆ రోజుల్లో భార్యాభర్తలు ఒకరిపట్ల ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకోవటానికి ఎక్కువ అవకాశం ఉండేది కాదు.

లలితమ్మ సావిత్రి అవతారమే అయినా ఇంట్లో తన భర్తకు పాదసేవ చేయటానికి ఆమెకు అవకాశమే దొరికేది కాదు.

భర్త ఇంట్లో ఉన్నప్పుడు ఆమె దూరం నుంచే అతనిని చూసి సంతోషించేది.

"మీ ఆయన వచ్చాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వు" అని అత్తగారు ఆజ్ఞాపిస్తేనే ఆమె నీళ్ళు ఇవ్వాలి. రోజూ ఇంతే మామూలే కదా అని ఆమె ఒక రోజు అత్తగారు చెప్పకుండానే నీళ్ళు ఇచ్చింది. ఆ రోజు అత్తగారు స్వగతంగా అనుకుంటున్నట్లే ఇతరులకి వినిపించేటంత బిగ్గరగా దీర్ఘాలు తీస్తూ "అబ్బ... ఎంత నాగరికత ముదిరింది ప్రపంచంలో! ఏదో యాభై యేళ్ళ నుంచీ కాపురం చేస్తున్నదానివల్లే తనంతట తనే వెళ్ళి మొగుడికి నీళ్ళిస్తోంది. మా కాలంలో ఇవన్నీ ఎరుగదుమా?" అంది. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఐదారుసార్లు ఆవిడ అలా సణిగింది.

"అత్తగారు ఈ ఒక్క అపరాధం మన్నిస్తే ఇంకెప్పుడూ ఇలా చేయను దేవుడా" అని తనలో తనే అనుకుంది లలితమ్మ. ఆ సంఘన తరువాత మళ్ళీ ఎప్పుడూ ఆమె ఆ పని చేయలేదు. లలితమ్మ తనకు నీళ్ళు ఇచ్చినందుకు తల్లి ఎంత రాద్ధాంతం చేసిందో సుబ్బణ్ణకూ తెలుసు. కానీ ఏమీ ఎరగనట్లు మెదలకుండా ఉండిపోయాడు. నిజానికి ఆ సంఘటన గురించి అతను అంతగా ఆలోచించలేదు కూడా. అతను పూర్తిగా సంగీత ప్రపంచంలో నిమగ్నుడై ఉన్నాడు.

ఈ ఇంట్లో భార్య నీళ్ళు ఇవ్వకపోయినా వేరే ఇంట్లో నీలసాని మాత్రం ఇస్తుంది. సాధారణంగా మగవారు ఎక్కడో ఒకచోట తమకు ఈ మాదిరి మర్యాదలు జరిగితే చాలుననుకుంటారు. ఒకచోట అటువంటి సేవ దొరికితే మరొకచోట దొరకలేదన్న చింత ఉండదు. సుబ్బణ్ణ జీవితంలో భార్య కంటే ముఖ్యమైన స్థానం నీలసానికి లభించింది. భార్య చేసే శుశ్రూషకంటే నీలసాని చేసే సేవ మనస్సుకు ఎంతో సంతోషం కలిగించేది. భార్య తనకొక భారంగా కూడా అనిపించేది. అందుకే అతను ఆ రోజంతా నీలసాని ఇంట్లో గడపి రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు.

శాస్త్రిగారు అంతకు కొంచెం ముందుగా ఇంటికి చేరాడు. ఎదిగిన కొడుకుని తను ఆ విధంగా అనడం తప్పని ఆయనకి అనిపించింది. తన మాటలకి కొడుకు బాధపడినందుకు ఆయనెంతో నొచ్చుకున్నాడు. ఎంతైనా కొడుకంటే ఆయనకి ప్రేమే. ఇంటికి రాగానే ఆయన - "వాడింకా ఇంటికి రాలేదా" అని భార్యని అడిగాడు. ఆవిడ రోజంతా పస్తు ఉంది. చాలా కోపం మీద ఉంది. "నన్ను అడుగుతారు దేనికి? ఆ లోపాముద్రని అడగండి" అంది. భార్య ఏమన్నదో శాస్త్రిగారికి సరిగా వినిపించలేదు. "ఎవరినే అడగమంటున్నావు?" అని అడిగాడు ఆయన.

"మీదంతా అయోమయం. ఎప్పుడూ కొడుకు కొడుకు అంటూ వాడినే కలవరిస్తారు. ఎప్పుడూ వాడి మీదే భ్రాంతి. కనడం పెంచడం వరకే మన వంతు. ఆ తరువాత ఏలుకోవడానికి ఇంకొకరు వచ్చి కూర్చుంటారు. చూడండి మీ అబ్బాయి వరస. ఇంట్లో అమ్మ అన్నం తినకుండా ఎదురు చూస్తూ ఉంటుందన్న జ్ఞానం ఏమైనా ఉందా వాడికి? నాతోపాటు కోడలు కూడా అన్నం మెతుకు ముట్టలేదు. అన్నానికి రావద్దని అదే నేర్పి పెట్టింది వాడికి. ఈ కాలపు ఆడపిల్లల తీరే అంత. మాయావినులు; నేను ఉపవాసాలతో చస్తే చూడాలనుకుంటోంది. అందుకే భోజనానికి రావద్దని మొగుణ్ణి పంపించేసింది" అంది ఆవిడ.

ఇల్లాలి వాగ్ధార ఆగిన తరువాత శాస్త్రిగారు "ఒకరు చెప్పడం ఏమిటే. ఎవరికి తోచినట్టు వారు చేస్తారు" అన్నారు.

"ఈవిడ గారు రాక ముందు మీ అబ్బాయి ఇలా ఎప్పుడైనా ప్రవర్తించాడా? ఈవిడ గారు వచ్చాకనే ఇల్లు ఈ స్థితికి వచ్చింది" అంది శాస్త్రిగారి భార్య. తన మాటలు లలితమ్మను ఎంతగా బాధిస్తాయో ఆవిడకు తెలియదు.

ఇలాంటి రగడలు సాధారణంగా ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉంటాయి. తన కొడుకు తనంతట తానుగా తప్పు చేస్తాడంటే తల్లికి నమ్మబుద్ధికాదు. ఎవరో అతణ్ణి పురికొల్పి ఉంటారని అనుకుంటుంది. ఎవరో అని సందేహం కూడా దేనికి? ఆ మాయావిని కోడలేనని అత్తగారి ప్రగాఢ విశ్వాసం. అసలు ప్రతి తల్లి తన కొడుకు చేసే తప్పులన్నింటికీ నిందలు మోసేందుకే కోడలిని తెచ్చుకుంటుందా అనిపిస్తుంది.

సుబ్బణ్ణ ఇంటికి వచ్చేసరికి తల్లి ఇంకా బిగ్గరగా మాట్లాడుతూనే ఉంది. తండ్రి సంధ్యావందనం మొదలుపెట్టాడు. లలితమ్మ ఓ మూల కూర్చుని ఏడుస్తోంది. సుబ్బణ్ణ ఎవరితో మాట్లాడకుండా నీళ్ళు తీసుకుని కాళ్ళూ చేతులూ కడుక్కుని సంధ్యావందనానికి కూర్చున్నాడు. ఇంట్లో ఆడవాళ్ళు అరుస్తుంటే మగవారికి సంధ్యావందనంపై మనస్సు ఎలా నిలుస్తుంది? తండ్రీ కొడుకులిద్దరూ తొందరగా సంధ్యావందనం ముగించారు. వెంటనే సుబ్బణ్ణ మళ్ళీ ఉత్తరీయం భుజాన వేసుకుని బయలుదేరాడు. తల్లి అరుపులు వింటుంటే అతనికి ఇంట్లో ఉండ బుద్ధి కాలేదు. తండ్రి అతనిని గమనించి "అదేమిట్రా... భోజనం చేసి వెళ్ళు" అన్నాడు. "నాకు ఆకలిగా లేదు" అన్నాడు సుబ్బణ్ణ.

"అవునురా నాయనా. నీ కెందుకు ఆకలిగా ఉంటుంది. నీ పెళ్ళాం పుట్టింటి నుంచి అమృతం తెచ్చిందిగా. రోజూ ఆ అమృతం తాగుతూ ఉంటే ఆకలెందుకు వేస్తుంది? నీకూ ఆకలి లేదు. దానికీ ఆకలి లేదు. ఈ రాకాసి ఆకలంతా నాకూ, ఆయనకే" అంది తల్లి.

శాస్త్రిగారు "ఎందుకే నోరుపారేసుకుంటావు. ఊరుకో" అని భార్యని కసిరి కొడుకు వైపు తిరిగి "ఎందుకురా నా మీద అంత కోపం? పొరపాటున నోరు జారి నేనేదైనా అన్నాననుకో. ఆ మాత్రానికి నువ్వూ, నీ పెళ్ళాం భోజనం మానేయాలా?" అన్నాడు.

"భోజనానికి రావే. నువ్వు భోజనం చేస్తే నేనూ చేస్తాను అని ఎంతో బతిమాలాను దాన్ని. కాళ్ళ మీద పడడం ఒక్కటే తక్కువ. ఎంత చెప్పినా వింటేనా? దానికీ, దాని మొగుడుకీ అన్నం అక్కర్లేకపోతే నాకేనా కావాల్సింది" అంది శాస్త్రిగారి భార్య.

ఆ మాటలను బట్టి తల్లి భోజనం చేయలేదన్న సంగతి సుబ్బణ్ణకు తెలిసింది. దానితో అతనికి ఒక్కసారిగా భార్య మీద కోపం పెల్లుబికింది. రోజంతా అతి కష్టం మీద అణచుకున్న కోపమంతా ఆ క్షణంలో వెళ్ళగక్కాడు. భార్య దగ్గరకు వెళ్ళి కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ - "ఈ రభసంతా ఏమిటి? ఎందుకు భోంచేయలేదు నువ్వు" అని గర్జించాడు. తల్లికీ, తండ్రికీ వినిపించేటంత గట్టిగా లలితమ్మ చెంప ఛెళ్ళుమనిపించాడు.

ఈ మాటలు రాస్తుంటే నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. లలితమ్మ తరువాత జీవితంలో చాలా సుఖసంతోషాలను అనుభవించింది. సుబ్బణ్ణ ఆమెను దేవి అవతారంగా సంభావించాడు. కాని ఆ రోజు అతడు ఆమెను కొట్టిన సంగతి తలుచుకుంటే ఎవరికైనా బాధ కలుగుతుంది.

లలితమ్మ చేసిన తప్పేమిటి? భర్త భోజనం చేయలేదు కనుక తానూ భోజనం చెయ్యలేదు. అతడు భోజనం చేయకపోవడానికి కారణం కోపం. ఆమె తినకపోవడానికి కారణం భర్త తినకపోవడమే. అంతకుమించి వేరే కారణం లేదు. భర్తకు గాని, తనకు గాని ఏదో అవమానం జరిగిందన్నది కారణం కాదు. తన భర్తను మామగారు ఏదో అనడం, తన భర్త కోపంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కూడా కారణం కాదు. ఆ ఇంటికి తన భర్త భారమైపోతే తనూ భారమేకదా అన్న ఆలోచనకూడా ఆమెకు రాలేదు. ఒకవేళ అటువంటి ఆలోచన వచ్చినా ఆమె సరిపెట్టుకుపోయేది. తండ్రీ కొడుకుల మధ్య ఏవో గొడవలుంటాయి. వాటితో తనకేమి సంబంధం అనుకుని సమాధానపడి ఉండేది. తల్లీ కొడుకులు మాటా మాటా అనుకున్నప్పుడు కూడా ఆమె అలాగే అనుకుని ఊరుకుంది. "కన్నది, పెంచింది ఆవిడ. కోపం వస్తే ఏదైనా అంటుంది. ఆవిడకి ఆ అధికారం ఉంది" అని సరిపెట్టుకునేది.

తన వల్ల ఏదైనా పొరపాటు జరిగి అత్తగారు కోప్పడినప్పుడు కూడా ఆమె "అవును మరి... ఆవిడ కొడుకు ఆవిడ కొడుకే. నేనెవరిని? మధ్యలో బైట నుంచి వచ్చినదాన్ని" అని సమాధానపడేది. తను ఆ ఇంటికి పరాయిదాన్ననే భావం వచ్చినప్పుడు ఒక్కక్షణం బాధపడి "ఇంకెప్పుడూ ఈ పొరపాటు చేయకూడదు. అత్తగారి ఇష్టప్రకారమే నడుచుకోవాలి" అనుకునేది.

లలితమ్మ మంచి గౌరవ కుటుంబంలో పుట్టిన పిల్ల. ఆమె తల్లి ఎంతో ఉత్తమ ఇల్లాలు. అత్తమామలు, బావగార్లు, మరదులు, తోడికోడళ్ళు ఉన్న ఇంట్లో ఇరవైయేళ్ళు సంసారం చేసిన అనుభవసారమంతటినీ ఆవిడ తన కూతురికి నూరిపోసింది. సహనం, వివేకం బోధించింది. ఆవిడ బోధల వల్ల లలితమ్మకు పదహారేళ్ళకే ముప్ఫయ్యేళ్ళ స్త్రీకి ఉండే పెద్దరికం అబ్బింది. అత్తమామల విషయంలో గాని, ఇతరుల విషయంలో గాని ఆమె ఎప్పుడూ ఏది మంచి అని ఆలోచించి తదనుగుణంగా ప్రవర్తించేది. ఇంట్లో ఏం జరిగినా సరే అత్తమామల పట్ల ఆమె గౌరవం మాత్రం చెదిరేది కాదు.

ఆ వివేకంతోనే ఆమె ఆరోజు ఉపవాసం చేసింది. తన భర్త ఆకలితో ఉన్నాడు. అతడు భోజనం చేయకుండా తను ఎలా తినగలదు? తను చేసింది మంచిపనేనని ఆమె నిశ్చితాభిప్రాయం. కాని అలా చేసినందుకే భర్త తనని కొట్టాడు.

ఆ క్షణంలో ఆమె నిర్ఘాంతపోయింది. పూజగదిలోకి వెళ్ళి గోడను ఆనుకుని నించుని, తన తల్లిని తలుచుకుని ఐదు నిమిషాలు వెక్కి వెక్కి ఏడిచింది. తర్వాత ఎలాగో తనను తాను సంబాళించుకుంది. తాను ఇప్పుడు చేయవలసింది ఏడుస్తూ కూర్చోవడం కాదని తెలుసుకుంది. గదిలో నుంచి బైటకు వచ్చి మామగారికీ, తన భర్తకీ పీటలు, విస్తళ్ళు వేసింది.

భార్యను కొట్టినందుకు సుబ్బణ్ణ బాధపడుతున్నాడు. భార్యపై చెయ్యి చేసుకున్న మరుక్షణంలోనే అతను తాను చేసింది పిరికి పని అని గ్రహించాడు. కోపం వల్లనే తాను ఒకతప్పు తరువాత ఒక తప్పు చేస్తున్నానని కూడా గ్రహించాడు. ఇంట్లో నుంచి బైటికి పోయే ఆలోచన విరమించుకున్నాడు. తండ్రి స్తోత్రం పూర్తి చేసిన తరువాత వెళ్ళి విస్తరిముందు కూర్చున్నాడు. తండ్రీ కొడుకులిద్దరూ మౌనంగా భోజనాలు చేశారు. తరువాత సుబ్బణ్ణ తన తండ్రి భద్రపరచిన పాత పుస్తకాల దుమ్ము దులపడం మొదలుపెట్టాడు. మరికాసేపటికి లలితమ్మ కూడా భోజనం చేసి అత్తగారికి అన్నం వడ్డించింది. అత్తగారి భోజనం అయిన తరువాత వంటఇల్లు సర్ది, కడిగి, తుడిచి పడకగదిలోకి వెళ్ళింది. భర్తకు పక్కవేసి, మళ్ళీ వచ్చి దేవుడి గదిలో అత్తగారి పక్కన కూర్చుంది.

అంత రగడ జరిగాక ఇంకా మేలుకొని కూర్చోవాలని ఎవరికీ అనిపించలేదు. శాస్త్రిగారు అంతకుముందే సావిట్లో తన మామూలు స్థానంలో పడకవేశాడు. అత్తగారు కోడలిని వెళ్ళి పడుకోమని చెప్పింది. "ప్రతిరోజూ నేను చెప్పేదాకా ఆగడం దేనికమ్మాయ్. పో... వెళ్ళి పడుకో" అంది ఆవిడ. లలితమ్మ తన గదిలోకి వెళ్ళింది.

చేతనైతే నేనిక్కడ లలితమ్మను వర్ణించాలి. ఆమె మానసిక స్థితిని వివరించాలి. కాని నాకు అంతటి శక్తిలేదు. నేను ఆమెను చూడలేదు. ఆమె రూపం ఎలా ఉండేదో నాకు తెలియదు. ఆమెను చూడలేక పోయినందుకు నాకేమీ విచారం లేదు. ఒకవేళ చూసి ఉండినా ఆమెను వర్ణించేవాణ్ణి కానేమో. కవులు స్త్రీని వర్ణించేటప్పుడు ఔచిత్యపు హద్దు మీరుతున్నారని నా అభిప్రాయం.

అయ్యా కవిగారూ? మీరు మీవంటి కాముకులను తృప్తిపరచడానికి కామదృష్టితో వర్ణించే స్తనాలు జగన్మాత ఈలోకంలో మనలాంటి కోట్లాది అల్పజీవుల ఆకలి తీర్చడం కోసం ధరించిందని గ్రహించండి. వాటిని మీరు ఒక విటుడిలాగా వర్ణించడం ఎంత అవమానకరం! మీ తల్లిని అలా అంగాంగ వర్ణన చేస్తారా? కవి అనేపేరు తగిలించుకున్నంత మాత్రాన స్త్రీని అలా వర్ణించే అధికారం మీకుందా? స్త్రీ ప్రేయసి కావచ్చు. కాని అంతకంటే ముఖ్యంగా ఆమె ఒక తల్లి. మీ భార్యకూడా మీ సంసారంలో ఒక సమయంలో మాత్రమే భార్య. మిగిలిన కాలమంతా ఆమె మిమ్మల్ని తల్లి లాగానే చూస్తుంది.

నేను కవిని కాను. అందుచేత నేను లలితమ్మను చూసి ఉన్నా ఆమె ముఖాన్ని కళ్ళని, పెదవులని వర్ణించడానికి నాకు మనసాప్పేది కాదు. ఆమె అందంగా ఉంటుందని ఒక్కమాట మాత్రం చెప్పి ఊరుకునేవాడిని. మన గృహిణులలో మనం చూసే సౌందర్యం ఏమిటి? వారి రూపురేఖలు కావు. ఎవరైనా ఒక అపరిచిత స్త్రీని మొదటిసారి చూసినప్పుడు ఆమె రూపాన్ని గమనిస్తామేమోగాని రోజూ ఇంట్లో స్త్రీలను అలా చూడము కదా. ఎంత అందగత్తె అయిన స్త్రీనైనా ఆమె సొగసును గమనించేది స్వల్పకాలమే. ఆ తరువాత మనం చూసేది అవర్ణనీయమైన స్త్రీ వ్యక్తిత్వాన్నో ఆమె ప్రేమ, దయ, కరుణ, లాలిత్యం, సౌకుమార్యం-ఒక్కమాటలో చెప్పాలంటే ఆమె స్త్రీత్వాన్ని చూస్తాము. చేతనైతే లలితమ్మలోని ఈ గుణాలను నేను వర్ణించాలి. కాని వర్ణించగల శక్తి నాకు లేదు.

స్త్రీత్వాన్ని ఇంతగా ప్రస్తుతిస్తున్నానంటే ఈ ప్రస్తుతి స్త్రీలందరికీ వర్తిస్తుందని గాని, స్త్రీలందరూ ఒక్కలాగా ఉంటారని గాని నా అభిప్రాయంకాదు.

లలితమ్మా స్త్రీయే. ఆమె అత్తగారూ స్త్రీయే. కాని వారిద్దరి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. స్త్రీలలో లలితమ్మ శ్రేష్టురాలు. ఆ రోజు భర్త తనను కొట్టినప్పుడు భీతి, బాధ ఆమెను అవహించాయి కాని, త్వరలోనే ఆమె ఆ స్థితి నుంచి బైటపడింది. అంతేకాదు. భర్త విషయంలో-అప్పటి వరకు ఎరుగని ఒకకొత్త భావన - 'ఇతను నావాడు. నా సొంతం' అనే భావన ఏర్పడింది.

అప్పటి వరకు ఆమె, సుబ్బణ్ణ ఒకరితో ఒకరు ఎక్కువగా మాట్లాడుకోలేదు. కాపురానికి వచ్చినా ఆమె ఇంకా చిన్నపిల్ల. అతనూ చిన్నవాడే. మాట్లాడేందుకు ప్రత్యేకంగా ఏమీలేకపోయినా ఏదో ఒకటి కల్పించుకుని మాట్లాడే స్వభావం కాదు ఇద్దరిదీ. మాట్లాడుకోవాలన్నా రాత్రి పడకగదిలో తప్ప అవకాశం ఉండదు. పడకగదిలో భర్తకు దగ్గరగా ఉన్నా మాట్లాడడానికి జంకేది లలితమ్మ. గదిబైట తలుపు దగ్గర నుంచుని అత్తగారు వింటుందేమోనని ఆమెకు అనుమానం. అందు వల్ల ఎప్పుడైనా మాట్లాడవలసివస్తే ఒకటి రెండు మాటలు మాత్రమే మాట్లాడేది.

సుబ్బణ్ణ కూడా సంసార సుఖం గురించి అట్టే ఆలోచించేవాడు కాడు. సంగీతంలో గొప్ప పాండిత్యం సంపాదించాలన్న ఆలోచన తప్ప అతనికి వేరే ఆలోచన ఉండేది కాదు. ఆ వయస్సులో సాధారణంగా ఏమగవాడైనా స్త్రీ నుంచి పొందగోరే ఉపచారాలన్నీ అతనికి నీలసాని నుంచి లభించేవి. అటువంటి ఉపచారాలు అతడికి తన ఇంట్లో లభించవు. లలితమ్మ తన భర్తను తృప్తిగా కళ్ళారా చూసుకోవాలంటేనే రాత్రి పడకగదిలో తప్ప సాధ్యమయ్యేది కాదు. ఇంక నీలసాని లాగా అతడికి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళు ఇవ్వడం, పీటవేసి కూర్చోబెట్టి నవ్వుతూ మాట్లాడడం-ఇవన్నీ ఎలా కుదురుతాయి?

అందుకే సుబ్బణ్ణ, లలితమ్మల సంబంధం అప్పటి వరకు సూక్ష్మంగానే ఉండిపోయింది. దీన్నే మనవాళ్ళు 'చీమకుట్టినంత' అని వర్ణిస్తారు. ఎందుకంటే చీమకుట్టితే అట్టే నెప్పెట్టదు. కాబట్టి దాన్ని 'కరవడం' అనడానికి వీల్లేదు. 'ముద్దుపెట్టుకుంది' అనడానికీ వీల్లేదు. ఎందుకంటే చీమ కుడితే హాయిగా ఉండదు.

సమాజం లతమ్మని, సుబ్బణ్ణని భార్యా భర్తలుగా గుర్తించింది కనుక వారు దంపతులయ్యారు. ఆరోజు సుబ్బణ్ణ భార్యను కొట్టాడంటే తమ ఇద్దరి మధ్యగల దాంపత్య బంధాన్ని పురస్కరించుకొని తనకు గల అధికారాన్ని ఉపయోగించుకున్నాడన్నమాట. ఆ చర్య ద్వారా తమ సంబంధాన్ని ధ్రువపరచుకొన్నాడన్నమాట. ఇదే భావం లలితమ్మకూ కలిగింది.

"మేమీద్దరం ఒకటి. మామగారు, అత్తగారు, మిగతా ప్రపంచం అంతా వేరు. మేమిద్దరం మాత్రమే ఒకటి" అని ఆమె మనస్సు పదేపదే చెప్పింది. "ఆయన నన్ను కొట్టడంలో ఆశ్చరమేముంది? కొట్టింది నా భర్తేకదా. పరాయి వాడు కాదు కదా. ఆయన నావాడు" అనుకున్నది తనలో తనే.

అప్పుడు ఆమెకు తల్లి చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. "నీ భర్త ఏం చేసినా అతనే నీదైవం, మగవారు తమ దైవం కోసం బైట వెతుక్కోవాలి. కాని ఆడవారికి పతియే ప్రత్యక్ష దైవం. భగవంతుడు మనకు కష్టాలు కలిగిస్తున్నాడని ఆయన్ని మనం వదిలేస్తున్నామా? వదిలేద్దామనుకున్నా దేవుణ్ణి కాదని ఎక్కడికి వెడతాము? అలాగే స్త్రీ కూడా భర్తకొట్టినా తిట్టినా అతణ్ణి విడిచి ఎక్కడికీ పోలేదు".

తల్లి చెప్పిన ఈ మాటలను మననం చేసుకోవడంతో పడక గదిలో చేరే సమయానికి ఆమె మనకు కుదుట బడింది.

"ఆయన ఈపాటికే నిద్రపోయి ఉంటాడా? మేలుకుని ఉంటాడా? నాతో మాట్లాడతాడా?" అనుకుంటూ గదిలో అడుగుపెట్టింది. చప్పుడు కాకుండా నెమ్మదిగా తలుపువేసి పడక వద్దకు వెళ్ళింది.

సుబ్బణ్ణ ఎడమ చేతి వైపు తిరిగి కళ్ళు మూసుకుని పడుకున్నాడు. లలితమ్మ అంత త్వరగా గదిలోకి వస్తుందని అతను అనుకోలేదు. మామూలుగా ఆమె అతను పడుకున్న చాలాసేపటికి వచ్చి పడుకుంటుంది. సుబ్బణ్ణ కళ్ళు మూసుకున్నా మెలకువగానే ఉన్నాడు. అతను తన జీవన పరిస్థితి గురించి ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచనతో పాటే రోజూ లలితమ్మ గదిలోకి ఎలా వస్తుందో, తనకు నిద్రవస్తుండగా నెమ్మదిగా - నిద్రాభంగం కలగకుండా - ఎలా దుప్పటి కప్పుతుందో, దీపం అర్పి తన పక్కకు వచ్చి ఎలా పడుకొంటుందో జ్ఞాపకం చేసుకొంటున్నాడు.

"ఇవాళ కూడా రోజులాగే చేస్తుందా, లేకపోతే కొంచెం దూరంగా పడుకొంటుందా? ఆమె లోపలికి వచ్చిన తరువాత తను ఆమెతో మాట్లాడాలా, మౌనంగా ఉండిపోవాలా?" ఈ ప్రశ్నలు అతని మనస్సులో తిరుగుతున్నాయి.

"తప్పు ఆమెదే. అయినా నేను కొట్టకుండా ఉండాల్సింది. కాని ఈ సంఘటనకు ఆమె బాధ్యురాలు. అయినా ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తాను" అనుకున్నాడు.

లలితమ్మ మామూలుగా అతనికి దుప్పటికప్పి ఉంటే, దీపం ఆర్పి ఉంటే ఆమె వచ్చిన సంగతి అతడికి తెలిసేది. కాని, లలితమ్మ దీపం అలాగే ఉంచి, చప్పుడు కాకుండా నెమ్మదిగా పడక దగ్గరకు వచ్చి కూర్చుంది. భర్త నిద్రపోతున్నాడని ఆమె అనుకుంది.

అతను పూర్తిగా తన సొంతం అనే భావన కొత్తగా ఏర్పడడంతో ఆమె మామూలుగా కంటే ఎక్కువగా అతడి ముఖాన్ని తేరిపార చూసింది.

"ఆడది భర్తని కన్నార్పకుండా చూడకూడదు. మగవాడు పారిజాత పుష్పంలాంటివాడు. కన్నార్పకుండా చూస్తే పారిజాతం వాడిపోతుంది. అలా చూస్తే మగవాడికి దిష్టితగులుతుంది" అని చిన్నప్పుడు తల్లి చెప్పిన మాటలు జ్ఞాపకం రావడంతో లలితమ్మ తన చూపు మరలించుకుంది.

కాని అతను తనవాడు అనే భావన బలీయం కావడంతో ఆమె చూపులు మళ్ళీ భర్తవైపే తిరిగాయి. అతణ్ణి చూస్తుంటే ఆమెకు చెప్పలేనంత ప్రేమ కలిగింది. పాపాయిలాగా అతణ్ణి తన చేతుల్లోకి తీసుకోవాలనిపించింది.

కాని అంత చనువు ఎలా తీసుకోగలదు? పైగా అతను నిద్రపోతున్నాడు. అందుకని ఆ ఆలోచన మానుకుని తనని కొట్టిన అతడి కుడిచేతిని చూస్తూ కూర్చుంది. ఒక్కక్షణం ఆగి నెమ్మదిగా ముందుకు వంగి అతి సున్నితంగా ఆ చేతిని ముద్దు పెట్టుకుంది.

నిజంగా నిద్రపోతున్న వాడైతే అతడికి ఏమాత్రం నిద్రాభంగం కలగనంత సున్నితంగా ముద్దు పెట్టుకుంది.

సుబ్బణ్ణ నిద్రపోవడంలేదు కనుక అతడికి స్పర్శ తెలిసింది. కళ్ళు తెరిచి, తన చేత దెబ్బలు తిన్న భార్యను చూశాడు.

పార్వతీదేవి తపస్సుకు మెచ్చి అనుగ్రహించిన శివుడి లాగా నిశ్శబ్దంగా, నిస్సంకోచంగా ఆమె చేతిని అందుకొని దగ్గరకు తీసుకున్నాడు. "బాగా నొప్పెట్టిందా?" అని అడిగాడు.

ఈ సన్నివేశం రాస్తుంటే నవ్వొస్తోంది. ఇక్కడ శివపార్వతుల ప్రస్తావన దేనికి? చెంప చెళ్ళుమనిపించి 'నొప్పెట్టిందా' అని అడగడం ఏమిటి? ఇది నాటకం కాదు. జీవితం. అందుకని ఆ పరిస్థితిలో సంభాషణ అలాగే ఉంటుంది. సుబ్బణ్ణ నాటక రచయిత కాదు. రచయిత అయి ఉంటే రసవత్తరమైన పదజాలంతో మాట్లాడే వాడేమో? నాయకుడు అడిగిన ప్రశ్నకు నాయిక అందమైన మాటలతో ఎలా బదులు చెప్పాలో నాటక రచయితకి తెలుస్తుంది. కాని మనం రోజూ ఆడే జీవిత నాటకంలో భార్య ఏం మాట్లాడబోతున్నదో భర్తకి తెలియదు. అందుచేత తను ఏం మాట్లాడాలో ముందుగా ఆలోచించుకొని తయారు కావడం కుదరదు.

ఆ రాత్రి అతడు అడిగిన ఆ ప్రశ్న తరువాత వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఎలా వర్ణించడం? సుబ్బణ్ణ, లలితమ్మ ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన చిన్నపిల్లలు. కొత్తగా అనుభవంలోకి వచ్చిన ఆ ప్రేమలో వారిద్దరూ ఏమేమో మాట్లాడుకున్నారు. ఆ మాటల అర్థం ఏదైతేనేం - మొత్తం మీద ఇద్దరూ ఇదివరకెప్పుడూ మాట్లాడుకోనంత ఎక్కువ సేపు మాట్లాడు కున్నారు.

ఫలితంగా వారిరువురి హృదయాలూ పరస్పరం సన్నిహితమైనాయి. ఇరువురి హృదయాలూ దాదాపు ఒక్కటైనాయి. లలితమ్మ ఒక్కసారిగా తన భర్తకు యజమానురాలూ, అతడి ఆస్తీ కూడా అయింది.

అంతకు ముందు మాత్రం అతను ఆమె సొంతం కాదా, ఆమె అతడి ఆస్తికాదా అని మీరు అడగవచ్చు.

భర్త హృదయంలో స్థిరమైన స్థానం తనకు లభించిందన్న భావన కలిగినప్పుడే స్త్రీకి తన భర్త సొంతమవుతాడు, తను అతడికి సొంతం మవుతుంది.

సుబ్బణ్ణ హృదయంలో లలితమ్మకు అటువంటి స్థానం ఆరాత్రే లభించింది.

నండూరి పార్థసారథి
(1987లో అనువదించబడినది)

Previous Post Next Post