Humor Icon

నవ్వలేని వాడు మనిషికాడు. దీనికి కొంచెం వివరణ అవసరం. ఇక్కడ, నవ్వడం అంటే - ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, అయిన దానికీ కాని దానికీ నవ్వడం కాదు. నవ్వ దగిన సందర్భంలో కనీసం మందస్మితమైనా చేయలేనివాడు మనిషికాడు అని భావం. రాక్షసుడు నవ్వకుండా వుండగలడేమో! మన సినిమాల్లో నరరూప రాక్షసుల్లాంటి విలన్లు నవ్వరు.

నవ్వగల శక్తి మానవుడికి మాత్రమే వుందనీ, జంతువులకు వుండదనీ కొందరు ప్రముఖ రచయితలు సిద్ధాంతీకరించారు. ఈ సిద్ధాంతం నమ్మదగినది కాదేమోనని నా అనుమానం. కుక్క భాష మనకి అర్థం కానంత మాత్రాన కుక్కలకి భాషే లేదనడం ఏమి న్యాయం? అలాగే వాటికీ ఏదో రకమైన హాస్యం వుండవచ్చు; వాటికీ నవ్వగలిగే శక్తి వుండవచ్చు.

అసలింతకీ-నవ్వంటే ఏమిటి? హాస్యమంటే ఏమిటి? ఆ రెండింటికీ గల సంబంధం ఏమిటి? 'హాస్యం' అంటే నవ్వు పుట్టించేది. హాస్యం కర్మ. నవ్వు దాని తాలూకు ఫలం. హాస్యం అనేది నవ్వించి తీరాలి. నవ్వించకపోతే అది హాస్యం కాదు. నవ్వించడానికి ప్రయత్నించి నవ్వించలేకపోయిన 'ప్ర్రక్రియ' నవ్వుల పాలవుతుంది.

హాస్యం సాహిత్యంలో వుండవచ్చు. అభినయంలోనూ వుండవచ్చు. అభినయం అంటే సాత్వికం, ఆంగికం, వాచికం, ఆహార్యం కూడా. మాట పలుకూ లేకుండా, ఒళ్ళు కదలకుండా కేవలం ముఖంలో హావభావాలతో హాస్యాన్ని సృష్టించవచ్చు. అది సాత్వికం. ముఖంలో భావప్రదర్శన చేయకుండా వట్టి శారీరక చేష్టలతో హాస్యాన్ని సృష్టించవచ్చు. అది ఆంగికం. సాత్విక, ఆంగికాలతో నిమిత్తం లేకుండా మాటలతో నవ్వించవచ్చు. అది వాచికం. ఈ మూడింటి అవసరం లేకుండా విచిత్రమైన, వికృతమైన వేషంతో కూడా నవ్వించవచ్చు - సర్కస్ లో బఫూన్ లాగా. అది ఆహార్యాభినయం. ఈ చతుర్విధాభినయాలలో ఏ ఒక్క దాని ద్వారా గాని, రెండింటి ద్వారా గాని, మూడింటి ద్వారా గాని, నాలుగింటి ద్వారా గాని హాస్యాన్ని పండించవచ్చు.

హాస్యం అనేది నవ్వంచి తీరాలన్న మాట నిజమేగాని, నవ్వించే ప్రతిదీ హాస్యం కానక్కర్లేదు. మనల్ని నవ్వించడానికి ప్రత్యేకంగా ఎవరూ ప్రయత్నించకపోయినా అనేక వేరే కారణాల వల్ల నవ్వు రావచ్చు. అరటి పండు తొక్కమీద కాలువేసి జారిపడిన వాడిని చూసినప్పుడు అసంకల్పిత ప్రతీకార చర్యగా నవ్వురావచ్చు. అలా నవ్వడంలో దురుద్దేశమేమీ వుండదు. నవ్విన వెంటనే పశ్చాత్తాపం కలగవచ్చు. "అయ్యో అతను జారిపడితే జాలిపడడానికి బదులు నవ్వడం ఏమిటీ... బుద్ధి లేక" అనుకోవచ్చు. పడినవాడు రౌడీ అయితే నవ్వినందుకు పశ్చాత్తాపం కలగదు. "తిక్కకుదిరింది వెధవకి" అనుకుంటాం. పడిన వాడు మంచి వాడైనా, చెడ్డవాడైనా మన నవ్వుకు కారణమైన వాడు కాబట్టి అతడిని 'హాస్యగాడు' అనడానికి వీల్లేదు. అలాకాక, నాటకంలోనో, సినిమాలోనో, సర్కస్ లోనో మనల్ని నవ్వించడం కోసమే ఎవడైనా అలా జారిపడితే అతడిని హాస్యగాడనీ, ఆ చేష్టను హాస్యమనీ అనుకోవచ్చు. ఒక్కోసారి అది చౌకబారుగా వుండవచ్చు. అది వేరే సంగతి.

హాస్యంతో ఏ మాత్రం సంబంధం లేని నవ్వులెన్నో వున్నాయి. తెలిసిన వాళ్ళు కనిపిస్తే నవ్వుతూ పలకరిస్తాము. పసిపిల్లల్ని ముద్దులాడుతూ నవ్వుతాము. ఎవరైనా చక్కిలిగింత పెడితే నవ్వుతాము. ఈ నవ్వులన్నింటినీ హాస్యం ఎక్కౌంట్ లో జమచేయడం సమంజసం కాదు. మనం ఆడిస్తున్నప్పుడు పసి పిల్లలు కిలకిల నవ్వుతారు. ఆ నవ్వు హాస్య సంబంధమైనది కాదు.

నవరసాలలో హాస్యం ఒకటి. హాస్యానికి స్థాయీ భావం 'హాసం' - అంటే నవ్వు. నవ్వులో ఆరు రకాలుంటాయని భరతముని నాట్యశాస్త్రంలోని ఆరో అధ్యాయంలో చెప్పాడు. అవి : స్మితము, హసితము, విహసితము, ఉపహసితము, అపహసితము, అతిహసితము. వాటి లక్షణాలను ఆయన వివరించాడు. వాటికి హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు గారు తనదైన ప్రత్యేక శైలిలో అర్థాలు చెప్పారు. 'స్మితం' అంటే - కనుబొమ్మలెత్తి కళ్ళు విప్పడం, 'హసితం' అంటే - పళ్ళు బయటపడేట్టు చేసి, పెదిమల్ని కళ్ళెం వెనక్కి లాగినట్లు ఆకర్ణాంతం లాగి పట్టి వుంచడం; 'విహసితం' అంటే - చల్లని శబ్దం చేయడం; 'ఉపహసితం' అంటే - తల కూడా ఝాడించడం; 'అపహసితం' అంటే విరగబడి పక్కలు పట్టుకుని గిలగిలలాడి, మెలికలు తిరిగి, దొర్లి పెద్ద ఏడుపులో లాగా నానా యిదీ అవడం. ఇవి కాక మరికొన్ని రకాలున్నాయంటూ ఆయన ఇంకో లిస్టు యిచ్చాడు. అవి : తలకాయ నవ్వు - తల మాత్రం తెగ ఝాడిస్తూ వంచేసి కళ్ళు మూసుకుని నవ్వడం; లయ ధాటి నవ్వు - తాళం వెయ్యడానికి వీలై వుండేది; తుపాకి నవ్వు - పెదిమలు బద్దలు చేసుకుని ఠప్పున బయల్దేరేది; కొనవూపిరి నవ్వు - గుక్కతిరగని సమయం దాకా మాట్లాడి అప్పుడు మాట తెమలకుండా, నవ్వూరాకుండా నవ్వడం. ఇవి కాక కోతి నవ్వు, దాగుడు ముచ్చీ నవ్వు, డోకు నవ్వు, దగ్గు నవ్వు, కొలిమితిత్తినవ్వు, గూడ్సు బండి నవ్వు లాంటివి చాలా చెప్పాడు ఆయన. వీటన్నింటి తర్వాత ఆయన విషపు నవ్వు గురించి చెప్పాడు. అది 'నవ్వు జాతిలో చెడబుట్టి, లోపలి ఏడుపుని ఓ పక్కనించే వెళ్ళగక్కేది' అని చెప్పాడు. హీనులూ, దీనులూ, అర్భకులూ, వృద్ధులూ, వికలాంగులూ, దరిద్రులూ, అజ్ఞానులూ, పరాజితులూ మొదలైన వారిని హాస్యలక్ష్యం చేయడం తగదని ఆయన హెచ్చరించాడు.

వాక్చమత్కృతి, శ్లేష, వ్యంగ్యం, వెటకారం-ఇవన్నీ హాస్య పరిధిలోని వేర్వేరు విషయాలు. హాస్యంలో వ్యంగ్యం ఉండనవసరం లేదు. వ్యంగ్యంలో హాస్యమూ ఉండనవసరం లేదు. విశుద్ధ హాస్యం, విశుద్ధ వ్యంగ్యం విడివిడిగా వుండవచ్చు. కాని, ఆ రెండూ తరచుగా ఎంతో కొంత నిష్పత్తిలో కలుస్తూ వుంటాయి. అలాగే - వ్యంగ్యం వేరు, వెటకారం వేరు. వ్యంగ్యంలో అవహేళన గాని, అధిక్షేపణ గాని నర్మగర్భంగా వుంటాయి. బాహ్యార్థం వెనక నిగూఢార్థం ధ్వనిస్తూ వుంటుంది. వెటకారం అలాకాదు. దానికి ఒకటే అర్థం. అది దేనినీ దాచడానికి ప్రయత్నించదు. సాధారణంగా వెటకారానికి వాక్చమత్కృతులు తోడై నవ్విస్తాయి.

ప్రాచీన తెలుగు కావ్యాలలో హాస్యం అత్యల్పం. తెలుగులో హాస్య-వ్యంగ్య సాహిత్యానికి పెద్ద పీట వేసిన ఆద్యుడు కందుకూరి వీరేశలింగం గారు. ఆయన తర్వాత గురజాడ, చిలకమర్తి, పానుగంటి, మొక్కపాటి, మునిమాణిక్యం, భమిడిపాటి, ముళ్ళపూడి వంటి వారు ఒక ఉద్యమ స్థాయిలో హాస్య - వ్యంగ్య రచనా వ్యాసంగం సాగించారు. హాస్య రసికతలో తెలుగువారు ఎవ్వరికీ తీసిపోరని నిరూపించారు.

నం.పా.సా
(ఇది ఇంతకు ముందు ప్రచురితం కానిది)

Previous Post