Title Picture

(రచన : కో. నరసింహాచారి ; ప్రచురణ, ప్రాప్తిస్థానం : ఓరియంటల్ లాంగ్మన్స్, 36 ఎ, మౌంట్ రోడ్, మద్రాసు-2; క్రౌన్ సైజు : 243 పేజీలు; వెల : రూ. 7.30 పైసలు)

కాగితం, అట్ట, ఊలు, దారం మొదలయిన వాటితో రకరకాల బొమ్మ వస్తువులను తయారు చేసే విధానాలను రచయిత ఈ పుస్తకంలో తెలియజేశారు. సులభంగా గ్రహించడానికి వీలుగా చిత్రాలు, వివరణలు కూడా పొందుపరిచారు. రచయిత దీనిని పిల్లలకోసమే ఉద్దేశించినా, ఉపాధ్యాయులకూ, గృహస్థులకూ కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుంది.

చేతి పనులను గురించీ, బిడ్డలకు వాటిని నేర్పవలసిన అవసరాన్ని గురించీ రచయిత చాలా విలువైన ఉపోద్ఘాతం వ్రాశారు. పిల్లలకు ఇటుంటి పుస్తకాలు ఎంత అవసరమో చెప్పాలంటే రచయిత మాటలనే ఉదహరించవలసి ఉంటుంది. పిల్లలకు నేర్పతగిన చేతిపనులను గురించి రచయిత చాలా పరిశోధన చేసి దీనిని రచించినట్లు కనిపిస్తుంది. పగలంతా బడిలో గడిపి, అలసటతో తిరిగి వచ్చే పిల్లలను ఇంట్లో కూడా అస్తమానం పాఠాలు చదువుతూ కూర్చోమంటే వారికి చికాకుగా ఉంటుంది. వినోదం, ఉత్సాహం, విశ్రాంతి కల్పించే 'మార్పు' వారికి అవసరం. పిల్లలోని ఉత్సాహం, ఊహాశక్తీ ఒక్కొక్కప్పుడు విధ్వంసకంగా కూడా పరిణమిస్తాయి. పుస్తకాలు చింపేయటం, దెబ్బలాడుకోవటం మొదలయిన అల్లరులకు దిగుతారు. అందుచేత వారి ఉత్సాహాన్నీ, తెలివి తేటలనూ సరి అయిన మార్గాలలోనికి తిప్పటం అవసరం. వారిలోని సృజనాత్మక శక్తిని క్రమపద్ధతిలో ప్రోత్సహించాలి. అటువంటి సాధనమే చేతిపనులు.

రచయిత ఇందులో కొన్ని వందల వస్తువులను తయారు చేసే పద్ధతులు తెలిపారు. 115 బొమ్మలు ప్రచురించారు. వీటిని తయారు చేసేటప్పుడు పిల్లలకు కొత్తకొత్త ఊహలు కలిగి తామే స్వయంగా మరికొన్ని వస్తువులు తయారు చేసే పద్ధతులు తెలుసుకోగలుగుతారు. ఉపాధ్యాయుల తోడ్పాటు ఉంటే పిల్లలు మరింత తేలికగా వీటిని నేర్చుకోగలుగుతారు. ఇంట్లో అల్లరి ఎక్కువగా చేసే పిల్లలకు ఈ పుస్తకం కొన్ని ఇస్తే, అల్లరి మాని శ్రద్ధగా బొమ్మలు తయారు చేస్తూ కూర్చుంటారు. కనుక అల్లరి పిల్లల తలిదండ్రులకు బాగా పనికివస్తుంది.

కేంద్ర ప్రభుత్వం 1961లో నిర్వహించిన ఏడవ 'బిడ్డల గ్రంథాల పోటీ'లో ఈ పుస్తకానికి బహుమతి లభించింది. ముద్రణ ప్రశస్తంగా ఉంది కానీ, ధరమాత్రం పిల్లలుగలవారికి అందుబాటులో లేనంతగా ఉంది.

నండూరి పార్థసారథి
(1964 డిసెంబర్ 16వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Next Post