Title Picture

ఆదుర్తి సుబ్బారావు లోగడ నిర్మించిన చిత్రాల కోవలోకే వస్తుంది మహేంద్రా పిక్చర్స్ వారి 'కృష్ణప్రేమ' చిత్రం. కాకపోతే ఇది పౌరాణిక చిత్రం. అదొక్కటే తేడా. ఆదుర్తి చిత్రాల పట్ల ఆసక్తి గల ప్రేక్షకులకు ఈ చిత్రం ఆశాభంగం కలిగించదనే చెప్పవచ్చును. ఆయన చిత్రాలన్నింటి వలెనే ఈ చిత్రంలో కూడా వినోదంపాలు హెచ్చుగా ఉంది.

ఎంతో చక్కని చిత్రం నిర్మించడానికి తగిన కథా వస్తువు ఇందులో ఉంది. దర్శకునిలో ప్రతిభ ఉండాలేగాని ఈ చిత్రాన్ని ఎంత అద్భుతంగానైనా నిర్మించవచ్చును.

"పేరునకెన్నిలేవు ప్రేమలు మూడుదినాల ముచ్చటల్, మారును, తారుమారగును, మాయమగున్ నశియించు నింతలో ఆరయ పావనంబు మహిమాతిశయంబునమోఘ భాగ్యమై ధారుణి నిల్వజాలు సతతంబును ఒక్కటి కృష్ణ ప్రేమయే" అని నిరూపించడం ఈ చిత్రం ఉద్దేశం.

రాధ (ఎస్.వరలక్ష్మి) చెల్లెలు చంద్రావళి (జమున). ఆమె భర్త చందగోవుడు (రేలంగి). చంద్రావళి, చందగోవుల దాంపత్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతూ ఉంటుంది. రాధ బ్రతుకే బుగ్గి అయిపోయింది. ఆమె కృష్ణా కృష్ణా అని నిత్యం కలవరిస్తూ ఉండటం భరించలేక ఆమె భర్త కథారంభానికి ముందే ఇల్లు విడిచిచక్కాపోయాడు. ఊరంతా ఆమెను ఏవగించుకుంటూ ఉంటుంది. ఎవరూ ఆమె గడపతొక్కరు. తన అక్క బ్రతుకును బుగ్గిచేసినందుకు కృష్ణుడంటే చంద్రావళికి అసహ్యం, ద్వేషం. కృష్ణుడు (బాలయ్య) పరమాత్ముడంటూ అక్క చెల్లికి ప్రతిరోజూ పాఠాలు చెబుతూ ఉంటుంది. కృష్ణుడు ఆమెను లొంగతీసుకోవడానికి నానా మాయోపాయాలు పన్నుతాడు. చెంపదెబ్బ తింటాడు. అయినా తన ప్రయత్నం మానడు. చివరికి చంద్రావళి శత్రుభక్తి మధురభక్తిగా మారుతుంది. ఆమె కృష్ణప్రేమను చవిచూడబోతూండగా భర్త కొంపవిడిచి సన్యాసులలో కలుస్తాడు. ఆ తర్వాత పంచాయితీ జరిపి అగ్నిపరీక్ష పెట్టిస్తాడు. పరీక్షలో ఆమె నెగ్గుతుంది. కృష్ణుడు విష్ణుమూర్తిగా ప్రత్యక్షమై రాధ సాక్షాత్తూ ప్రకృతి అనీ, చంద్రావళి మాయ అనీ జనులకు తెలియజేస్తాడు.

పెండ్యాలగారి సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేకాకర్షణకాకపోయినా మొత్తానికి బావుంది. రెండు జానపదగీతాలు ప్రత్యేకంగా మెచ్చుకోతగ్గట్టు ఉన్నాయి. ఇంకా రెండు మూడు పద్యాలు, ఒక యుగళగీతం కూడా బావున్నాయి. రచన బాగానే ఉంది. 'ఇంటికి మించిన కోవెల లేదు' (ఆరుద్ర) 'ఇంటికీ దీపమూ ఇల్లాలు' (కొసరాజు), 'ఇల్లు ఇల్లని యేవు' (ఆరుద్ర) పాటల రచన, వాటికి కూర్చిన వరసలు చక్కగా ఉన్నాయి. జమున ఈ చిత్రానికి ఆకర్షణ. మిగతా వారంతా శక్తివంచనలేకుండా నటించారు.

నండూరి పార్థసారథి
(1961 మే 26వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post