అనంతపురంలో ఆంధ్రనాటక కళాపరిషత్తు 23వ మహాసభ

అనంతపురంలో ఆంధ్ర నాటక కళాపరిషత్తు 23వ మహాసభ ఏప్రిల్ 26వ తేదీన తుఫానుతో ప్రారంభమై 30వ తేదీ రాత్రి తుఫానుతో ముగిసింది-రసవత్తరమైన కథానికలాగ. ఈ మధ్య నాలుగు రోజుల్లో చండప్రచండమైన ఎండలవేడికి నటీనటులు, కార్యకర్తలు వడియాల్లాగా వేగిపోయారు. అల్లకల్లోలానికీ, అవకతవకలకు ఆలవాలంగా తయారైన ఈ అనంతపురం పరిషత్తు ఏ ఒక్కరికీ మధుర స్మృతిగా మిగలదు.

26వ తేదీ ఉదయం 9 గంటలకు నటరాజ పూజతో మహాసభ కార్యక్రమం ప్రారంభమయింది. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు: ఎం.ఎం.హాక్, ఐ.ఎ.ఎస్. గారు తమ ఉపన్యాసాన్ని ఆంగ్లంలో చదివారు. తర్వాత ఉపాధ్యక్షుడు: ఎ.చిదంబర రెడ్డి, కార్యదర్శి: కె.సత్యరంగారావు తమ ఉపన్యాసాలు చదివారు. కల్లూరు సుబ్బారావుగారు ప్రారంభోపన్యాసం చేశారు. తర్వాత పరిషత్ అధ్యక్షుడు: ఎం.ఆర్.అప్పారావు, ప్రధానకార్యదర్శి: పసల సూర్యచంద్రరావు ప్రసంగించారు. మధ్యాహ్నం 2 గంటలకు సినీనటుడు జగ్గయ్యకు సన్మానం జరగవలసి ఉంది. కాని మద్రాసు నుంచి వారి రైలు చేరవలసిన సమయానికి చేరలేదు. ఈలోగా రామదాసు ఏకపాత్రాభినయం ప్రారంభించుదామనుకున్నారు. కాలవిలంబనం సహించలేక జనం గోలపెట్టగా సాయంత్రం మూడున్నరకు తెరఎత్తారు. ఏకపాత్రాభినయం జరుగుతూ ఉండగా తుఫాను ముంచుకొచ్చింది. అర్థంతరంగా తెర వాలిపోయింది. ఆ రోజుకు నాటకాలు జరగవనే అనుకున్నారు. కానీ ఎలాగో మళ్లీ రాత్రి 9 గంటలకు ప్రారంభించారు. ఈలోగా వాసాలు, గుంజలు, తడికెలు పూర్తిగా పీకివేసి ఆరుబయట వెన్నెల్లో కుర్చీలు, బెంచీలు సర్దారు. తర్వాత జగ్గయ్య గారికి సన్మానం జరిగింది. ఆ రాత్రి ప్రదర్శించవలసిన రెండు నాటికలు, రెండు నాటకాలలో ఒక నాటిక, ఒక నాటకం వాయిదా పడ్డాయి. కారణం-ఆ రెండింటికీ వయొలిన్ వాయించే వ్యక్తికి గుండెనొప్పి రావటం.

మొదటిరోజునే ఇలా కిచాటుగా జరిగింది కార్యక్రమం. ఇహ ఆ తర్వాత కార్యక్రమంలో ఏ ఒక్క అంశం జరగవలసిన సమయానికి జరగవలసిన విధంగా జరగలేదు. పందిళ్లు ఎగిరిపోవటం వల్ల మధ్యాహ్నంపూట నాటకాలు ఆడటానికి వీలులేకపోయింది. చీకటిపడితే గానీ తెర ఎత్తడానికి వీల్లేదు. అందుచేత నాటకాలు తెల్లారుజామున సుమారు 4 1/2 వరకు ఆడవలసి వచ్చింది. సన్మానాలు, గోష్టులు మొదలయినవాటిని స్థానిక కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు జూబిలీ హాలులో పొద్దున పూట 9 1/2 నుంచి 1 1/2 వరకు ఏర్పాటు చేశారు. అంటే దాదాపు రోజుకు 14 గంటల సేపు కార్యక్రమం జరిగిందన్నమాట. ప్రేక్షకులు, నటీనటులు, కార్యకర్తలు కూడా హైరానపడిపోయారు. మామూలు ప్రేక్షకులయితే ఓపిక ఉన్నంత వరకు చూసి ఓపిక అయిపోగానే పైపంచ దులుపుకుని చక్కాపోతారు. కానీ నాటక నాటికలకు న్యాయమూర్తులుగా వ్యవహరించవలసినవారికి తెల్లారుజామున ప్రదర్శనలు ముగిసేవరకు తలపక్కకు తిప్పేందుకు వీల్లేకపోయింది. అంతకంటే ఎక్కువగా ఈ సమీక్ష వ్రాస్తున్న ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక ప్రత్యేక ప్రతినిధికి మరీ ఇబ్బంది అయింది. ఎందుకంటే ఈ వ్యక్తి తెల్లారుజాముదాకా మేలుకొని మళ్లీ పొద్దున్న 9 1/2 కి ఉపన్యాసాలు మొదలయిన వాటికి కూడా హాజరు కావలసి వచ్చింది.

ఎన్నో వందలమైళ్ల దూరం నుంచి ఎన్నో వందల రూపాయలు ఖర్చుపెట్టుకుని శ్రమపడి వచ్చిన నాటక సమాజాలవారు తిన్నగా తిండీ, స్నానం లేక, విడిది సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు.

నాటక నాటికల పోటీ ఫలితాలు

పోటీలలో మొత్తం ఏడు నాటకాలు, ఎనిమిది నాటికలు పాల్గొన్నాయి. 'రామదాసు' ఏక పాత్రాభినయం పోటీలో నలుగురు పాల్గొన్నారు. నాటకాలు: 1. రైల్వే ఇన్ స్టిట్యూట్ డ్రమెటిక్ క్లబ్, విజయవాడవారి 'వేరుబడి తీరాలి'. రచన: ఎస్. జగన్నాథ్, 2. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ వారి 'సత్యం-సుందరం'. రచన: ప్రఖ్య శ్రీరామమూర్తి. 3. విద్యానగర్ కల్చరల్ అసోసియేషన్, హైదరాబాదు వారి 'మరో మొహెంజదారో'. రచన: ఎన్.ఆర్. నంది. 4. విజయకళాసమితి, సికింద్రాబాదు వారి 'యాచకులు', రచన: కప్పగంతుల మల్లికార్జునరావు. 5. ర.స.న. సమాఖ్య, విజయవాడ వారి 'రాగరాగిణి'. రచన: గొల్లపూడి మారుతీరావు. 6. జాతీయ కళామందిర్, బాపట్లవారి 'శ్రీరంగనీతులు', రచన: వడ్లమూడి సీతారామారావు. 7. ఆంధ్రడ్రమెటిక్ లిటరరీ సొసైటీ, జంషెడ్ పూర్ వారి 'మాటతప్పకు'. రచన: ఆర్. వి. చలం.

నాటికలు: 1. అరుణోదయ సంగీత నాట్య మండలి, విజయవాడవారి 'జ్వలిత జ్వాల', రచన: చింతపల్లి హనుమంతరావు, 2. వి.ఎ.డి. అసోసియేషన్, విజయవాడవారి 'రిక్రియేషన్ క్లబ్', రచన: రావుల తాతారావు, 3. సెంట్రల్ రైల్వే ఇన్ స్టిట్యూట్, సికింద్రాబాదువారి 'చిట్టి', రచన: కమలాకాంత్, 4. జయా ఆర్ట్ థియేటర్, ఏలూరువారి 'మారిన మనసులు', రచన: పుప్పాల సూర్య నారాయణ, 5. ప్రభాకర్ నాట్యమండలి, గుంతకల్లు వారి 'దేశద్రోహి', రచన: జె.డి. ప్రభాకర్, 6. కళాప్రబోధ, గుడివాడ వారి 'శిరోమణి', రచన: దివ్య ప్రభాకర్, 7. నటరాజ కళాసమితి, ఖర్గపూర్ వారి 'ఆశయాలకు సంకెళ్లు', రచన: గొల్లపూడి మారుతీరావు, 8. ఫ్రెండ్స్ యూనియన్ డ్రమెటిక్ అసోసియేషన్, పెనుగొండవారి 'స్వార్థం', రచన: అరుణకుమార్.

నాటకాలలో పోటీ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి: ఉత్తమ ప్రదర్శన 'మాట తప్పకు'; ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: 'మరో మొహెంజొదారో'. ఉత్తమ రచన: 'మాటతప్పకు'; ద్వితీయ ఉత్తమ రచన: 'మరో మొహెంజొదారో'. ఉత్తమ నటుడు: సి.హెచ్. కృష్ణమూర్తి (రాగరాగిణి); ఉత్తమ నటి: సరస్వతి (సత్యం-సుందరం). ఉత్తమ హాస్యనటుడు: జె.వి. శ్రీరామమూర్తి (మాటతప్పకు). నటనకు ప్రత్యేక బహుమతులు పొందినవారు ఐ. వెంకట్రావు, చంద్రశేఖర్, జి.ఎస్.ఆర్. మూర్తి, కె. సూర్యనారాయణమూర్తి, రాజరత్నం, రత్నమాల. ఉత్తమ రంగాలంకరణ 'సత్యం-సుందరం'.

ఉత్తమ నాటిక: 'జ్వలిత జ్వాల'; ద్వితీయ ఉత్తమ నాటిక: 'చిట్టి'; ద్వితీయ ఉత్తమ రచన: 'శిరోమణి'. ఉత్తమ నటుడు: ఎన్. వీరభద్రరావు (జ్వలితజ్వాల). ఉత్తమ నటి: ఎం. పార్వతి (చిట్టి). రంగాలంకరణ: 'దేశద్రోహి'. ప్రత్యేక బహుమతులు: మూర్తి, వి.వి. నారాయణ, కె. చంద్రకళ, బేబీ ఏడిద కృష్ణకుమారి.

'రామదాసు' ప్రత్యేక పాత్రాభినయం పోటీలో ప్రథమ బహుమతి నలనాగుల లక్ష్మీకాంతారావు (మచిలీపట్టణం), ద్వితీయ బహుమతి శుభశ్రీ (కొల్లూరు) పొందారు. వీరుకాక పుష్పగిరి శంకర్ (తెనాలి), వారణాసి శ్రీహరిరావు (దోసూరు) కూడా పాల్గొన్నారు.

మహాసభ కార్యక్రమాన్ని నాలుగు భాగాలుగా విభజించవచ్చు. 1. నాటక, నాటిక, ప్రత్యేక పాత్రాభినయ పోటీలు, 2. గోష్టులు, చర్చలు, 3. సన్మానాలు, 4. ప్రత్యేక నృత్య ప్రదర్శనలు మొదలయినవి. వీటిలో నాటక పోటీలు ముఖ్యమైన అంశం. మొత్తం మీద చూస్తే ఈ ఏడాది నాటకాల స్థాయి ఉన్నతంగా ఉంది. నాటికలు మాత్రం బాగాలేవు. ప్రేక్షకులకు కూడా నాటకాల పట్ల ఉన్న ఆసక్తి, గౌరవం నాటికల పట్ల ఉన్నట్లు కనిపించలేదు. ఈ 15 నాటకాలను, నాటికలను ఎన్నిక చేసిన వారు పోలవరపు సూర్యనారాయణరావు గారు; దాదాపు 80 నాటకాలను, నాటికలను పరిశీలించి వీటిని ఎన్నిక చేశారు. ఆయన ఇటు పరిషత్తువారికి, అటు సమాజాలవారికి కూడా అభిమానపాత్రుడు. ఆయన స్ర్కూటినీకి వస్తే అన్యాయం జరగదన్న హామీ ఉంటుంది అందరికీ. ఆయన నిర్ణయాలను ఎవ్వరూ ఆక్షేపించరు. ఆయన అందరికీ మిత్రుడు. చక్కటి నాటకాలను ఎన్నిక చేసిన ఆయనే ఇటువంటి నాటికలను కూడా ఎన్నిక చేశారంటే దేశంలో ఉన్న సరుకే అంత అని సరిపెట్టుకోవాలి.

నాటకాలు దాదాపు అన్నీ కూడా సగటు స్థాయికి మించి ఉన్నాయి. నాటికలలో రెండు మూడు తప్ప మిగిలినవి సగటు స్థాయికంటే తక్కువగా ఉన్నాయి. నాటకాలు అన్నీ ప్రశంసనీయంగా ఉన్నాయని చెప్పలేము కానీ ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విశేషం కనిపిస్తుంది.

'సత్యం-సుందరం':

ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ కల్చరల్ అసోసియేషన్, హైదరాబాదు వారు ప్రఖ్య శ్రీరామమూర్తి రచించిన 'సత్యం-సుందరం' ప్రదర్శించారు. ఈ నాటకం చూస్తున్నంతసేపూ హిందీ సినిమా 'ఏ రాస్తే హై ప్యార్ కే' జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఇద్దరు స్నేహితులుంటారు. వారిలో ఒకరు కథానాయకుడు. రెండోవాడు విలన్. కథానాయకుడి భార్యకు విలన్ కు పూర్వాశ్రమంలో సంబంధం ఉన్నది. ఆ విలన్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించి, ఆమె చేత బ్రాందీతాగించి, మైకంలో ఉండగా వశపరుచుకుంటాడు. ఇదంతా ఫ్లాష్ బాక్ కథ. ఈ రహస్యం బయటపడి కథానాయకుడు ఆగ్రహం పట్టలేక విలన్ ను చంపడానికి పిస్తోలు పుచ్చుకుని వెళ్తాడు. అతను పిస్తోలు ప్రేల్చే అవసరం లేకుండానే ఆ విలన్ ను ఇంకో వ్యక్తి చంపేస్తాడు. అయితే నేరం మాత్రం కథానాయకునిమీద పడుతుంది. చివరికి ధర్మం జయిస్తుంది. కోర్టు దృశ్యంతో నాటకం ప్రారంభించి ఒక్కొక్క సాక్షి చెప్పే సాక్ష్యం ఫ్లాష్ బాక్ గా చూపించారు. 'ఏ రాస్తే హై ప్యార్ కే' చిత్రంలో కూడా ఇలాగే ఉంది. రచన విషయం ఎలా ఉన్నా ఇది సాహసోపేతమైన ప్రదర్శన. ఎందుకంటే నాటకంలో ఫ్లాష్ బాక్ చూపించడం చాలా కష్టమైన విషయం. లైట్లు ఆర్పేసి తెరవేసి రెండు నిమిషాలలో సెట్టింగ్ అంతా మార్చేసి తెరఎత్తటం సామాన్యమైన విషయం కాదు. ఇదివరకు-1958లో గుడివాడలో పరిషత్తు జరిగినప్పుడు ఒక సమాజం వారు ఇదే ప్రయోగం ఒక నాటికలో జరిపి అపజయం పొందారు. కానీ వీరు ఈ నాటకాన్ని దిగ్విజయంగా ప్రదర్శించారు. అయితే ఈ నాటకాన్ని ప్రదర్శించాలంటే ఎంతో అంగబలం, అర్థబలం కావాలి. ఈ రెండూ ఉన్నాయి ఈ సమాజం వారికి. వీరు తప్ప ఇంకెవ్వరూ దీన్ని ప్రదర్శించలేరు. దీనికోసం హైదరాబాదు నుంచి 38 మంది అనంతపురం వచ్చారు. దాదాపు రెండు వేల రూపాయలు ఖర్చు చేశారు. ఇంత ఆర్థిక స్తోమతు ఆంధ్రదేశంలో మరే ఔత్సాహిక నాటక సమాజానికీ లేదనుకుంటాను. ఇందులో నాయికగా నటించిన సరస్వతి, పాప వేషం వేసిన బేబీ ఆదిలక్ష్మి, నిర్మల చక్కగా నటించారు. సరస్వతి ఉత్తమ నటిగా ఎన్నిక కావడానికి న్యాయమూర్తుల ఓట్లేగాక ప్రేక్షకులందరి ఓట్లు కూడా పడ్డాయి. ఈ సమాజం వారు ఈ నాటకాన్ని ఇంతకు ముందు రాజమండ్రి, కాకినాడ, వరంగల్, హైదరాబాదులలో ప్రదర్శించి వేలకు వేలు ఆర్జించారట.

'మరో మొహెంజొదారో':

శ్రీ ఎన్.ఆర్. నంది రచించిన ఈ నాటకం రచన దృష్ట్యానూ, ప్రదర్శన దృష్ట్యానూ కూడా సాహసోపేతమైనది. తెలుగు నాటక రంగంలో ఇదొక సరికొత్త ప్రయోగం. ఇందులో రచయిత చెప్పదలుచుకున్నది ఇది: ''మానవ నాగరికత పతనానికి చిహ్నం మొహెంజొదారో. చరిత్రలో ఎన్నోసార్లు మానవ నాగరికత ఉజ్జ్వలంగా ప్రకాశించి ఆరిపోయింది. ఎన్నోసార్లు శిఖరాగ్రాలనందుకుని అగాధాలలోనికి పతనమైపోయింది. 'నాగరికత' అనేది నైతిక ప్రమాణాలకు అభిజ్ఞ. నాగరికత పతనం అంటే నైతిక పతనం. ప్రపంచంలో ఇకముందు ఇలా పతనం సంభవించకూడదు. 'మరో మొహెంజొదారో' వెలయకూడదు. సమాజంలో ఇప్పుడు అవసరమయింది విప్లవం కాదు-సంస్కరణ''. ఇందులో ఒక ప్రొఫెసర్ ఆధునిక మానవుని మీద ప్రయోగాలు జరుపుతాడు. ఆయన ప్రయోగశాల ఒక స్మశాన వాటిక అనుకోవచ్చు. చనిపోయిన ఒక్కొక్క వ్యక్తిని పిలిచి అతని వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తాడు. ఆయన సూత్రధారిగా వ్యవహరిస్తూ ఆ వ్యక్తులచేత నాటకం ఆడిస్తాడు. అది నాటకం కాదు-నిజంగా ఆ వ్యక్తులు బ్రతికి ఉన్నప్పుడు వారి మధ్య సంభవించిన జీవితం. అంటే ఒక విధంగా దాన్ని ఫ్లాష్ బాక్ అని చెప్పుకోవచ్చు. అయితే మిగతా నాటకాలకూ దీనికీ ఉన్న భేదం, ఇందులో చేసిన నూతన ప్రయోగం ఏమిటంటే-సూత్రధారి మనకు తన పరిశోధన గురించి చెబుతున్నప్పుడే రంగం మీద ఆ ఫ్లాష్ బాక్ సన్నివేశం జరుగుతూ ఉంటుంది. ప్రొఫెసర్ మాట్లాడుతున్నప్పుడు ఆ ఫ్లాష్ బాక్ సన్నివేశంలోని వ్యక్తుల మాటలు వినిపించవు. ప్రొఫెసర్ తెరలోకి వెళ్లిపోగానే వీళ్ల మాటలు వినిపిస్తూ ఉంటాయి. అంటే ప్రస్తుతం, గతం ఒకే కాలంలో, ఒకే స్థలంలో జరుగుతూ ఉంటాయన్నమాట. వేదిక మీద 'గతం' జరుగుతున్నప్పుడు ప్రొఫెసర్ (సూత్రధారి) రన్నింగ్ కామెంటరీ చేస్తూ ఉంటాడు. మరో విశేష మేమిటంటే-దీనికి రంగాలంకరణ అంటూ ఏమీ లేదు. వట్టి నీలం తెరలే. ''ఇది కోటీశ్వరుని సౌధం. ఇటు పడకగదికి దారి ఇటు బయటకు దారి'' అంటూ ప్రొఫెసర్ పరిచయం చేసి సెట్టింగును ప్రేక్షకులకు వదిలేస్తాడు. అలాగే చేతుల్లో వస్తువులు ఏమీ లేకుండా అన్నీ ఉన్నట్లు నటించడం ఇంకో విశేషం. పెన్ను ఉండదు, కాగితం ఉండదు. కానీ జేబులోంచి పెన్ను తీయడం, కాయితం మడతపెట్టి దాని మీద వ్రాయడం నటిస్తారు. నోట్లో చుట్ట ఉండదు. కానీ ఉన్నట్టూ, అది ఆరిపోతే మళ్లీ అగ్గిపుల్ల గీసి వెలిగించినట్లు నటిస్తారు. చివరికి అందులో కోటీశ్వరుడు మిగతా వాళ్లందరినీ పిస్తోలుతో కాల్చి చంపేస్తాడు. పిస్తోలు లేకుండానే అభినయం అంతా చేశారు. మామూలుగా అయితే ప్రేక్షకులు ఇది చూసి నవ్వి గోల చేయవలసింది. కానీ సన్నివేశాన్ని అర్థం చేసుకుని, ఉత్కంఠతో చాలా శ్రద్ధగా, నిశ్శబ్దంగా నాటకం చూశారు. అది నటీనటుల గొప్పతనం. రచన ప్రేక్షకులలో నూటికి 90 మందికి పైగా అర్థం కాలేదు. అయినా వాళ్లు గోలచేయకపోవడానికి కారణం నటీనటుల అభినయ చాతుర్యమే. ఇందులోని ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. పరిషత్తులో ప్రదర్శించిన ఏ నాటకంలోనూ నటులు ఇంత చక్కగా సమన్వయంతో నటించలేదు. వీరిలో ముఖ్యంగా గరిమెళ్ల రామ్మూర్తి, జె.ఎల్. సరసు, జి.వి. సుబ్బారావు గొప్పగా నటించారు. ఈ నాటకానికి దర్శకత్వం వహించిన శ్రీరాములు ప్రత్యేకంగా ప్రశంసనీయుడు. ప్రొఫెసర్ పాత్రను కూడా ఆయనే నిర్వహించారు. 'ఆడవాళ్లందరూ ఒకటే' అనే దాన్ని చెప్పడం కోసమని ఇందులో ఒకే అమ్మాయి చేత రెండు వేషాలు వేయించారు. కనీసం దుస్తులయినా మార్పించలేదు. ఇది కొంచెం బడాయిగా ఉంది. జనానికి ఎవ్వరికీ ఇది అర్థం కాలేదు కూడాను.

ఉత్తమ ప్రదర్శనకు, ఉత్తమ రచనకు బహుమతి పొందిన 'మాటతప్పకు' నాటకంలో చెప్పుకోదగ్గ కొత్తదనం ఏమీ లేదు. అయితే ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించే విధంగా మొదటి నుంచి చివరి వరకూ మంచి బిగువుగా, హుందాగా నాటకాన్ని నడిపించగలిగారు. ఇందులో ముఖ్యపాత్రను ఆర్.వి. చలం చాలా గొప్పగా పోషించారు. కీర్తిశేషుడు సి.ఎస్.ఆర్.ను జ్ఞాపకం తెచ్చే విధంగా నటించారు. ఆయనకు ఉత్తమ నటుడి బహుమతి వస్తుందని చాలామంది ఆశించారు. ఇందులో కవికుమార్ పాత్రను ధరించిన శ్రీరామమూర్తి ప్రేక్షకుల అభిమానాన్ని విశేషంగా చూరగొని, ఉత్తమ హాస్య నటుడి బహుమతి కూడా పొందారు. జెంషెడ్ పూర్ నుంచి ఎంతో శ్రమపడి వచ్చినందుకు ఈ సమాజం వారికి తగిన ప్రతిఫలమే లభించింది. ఎందుకంటే పరిషత్తువారు 'ఉత్తమ ప్రదర్శన' బహుమతి పొందిన సమాజానికి ప్రయాణం ఖర్చులుఇస్తారు. ఉత్తమ రచనకు 500 రూపాయలు ఇస్తారు. ఈ రెండు బహుమతులు ఈ నాటకానికే వచ్చాయి.

'శ్రీరంగనీతులు' నాటకంలో ఏ విశేషమూ లేకపోయినా చూసినంత సేపు ప్రేక్షకులకు పుష్కలంగా వినోదం అందించగలిగింది. కడుపు చెక్కలయ్యేట్టు నవ్వించగలిగారు. ఇందులో నటించిన రామచంద్ర కాశ్యప, రామన్నపంతులు, నండూరి సుబ్బారావు, వడ్లమూడి సీతారామారావు బాగా కాకలు తీరిన నటులు. ఎక్కువ మేకప్ లేకుండా, దుస్తులలోగానీ, సెట్టింగ్ లో గానీ ఆడంబరం లేకుండా సహజంగా నాటకాన్ని ప్రదర్శించారు. సంభాషణలు పట్టి పట్టి చెప్పడం, నిగడదన్ని నిలబడటం, పోజులుకొట్టడం లాంటి పనులు ఈ బృందంలో ఒక్కరు కూడా చెయ్యలేదు. ఈ నాటకానికి ఏ బహుమతీ రాలేదు.

'రాగరాగిణి' నాటకం నిజంగా అనివార్యమైన కారణాలవల్లనే దెబ్బతిన్నది. ఇంతకు ముందు ఈ నాటకాన్ని చూసినవారికి ఈ ప్రదర్శన చాలా నిరుత్సాహం కలిగించింది. ఇందులో ముఖ్యపాత్ర ధరించవలసిన కె. వెంకటేశ్వరరావు రానందున మూడవ రోజున ప్రదర్శించవలసిన ఈ నాటకాన్ని నాల్గవ రోజుకు వాయిదా వేశారు. రావలసిన వ్యక్తి రానేలేదు. అదృష్టవశాత్తూ ఆ పాత్రను ఇదివరకు ఒకసారి ధరించిన వ్యక్తి ఒకరు వారికి దొరికారు. అప్పటికప్పుడు ఆయనచేత ఆ సంభాషణలు మళ్లీ వల్లెవేయించి రంగస్థలం మీదికి ఎక్కించారు. ఈ ఒడుదుడుకువల్ల నాటకం కొంత దెబ్బతిన్నది. ఏ నాటకం విజయమైనా చాలావరకు ప్రదర్శన సమయంపైనా, వాతావరణంపైనా, రంగస్థలం పరిస్థితిపైనా ఆధారపడి ఉంటుంది. ఈ నాటకాన్ని సాయంత్రం 5.30 నిలకు ప్రారంభించారు. రోజు సాయంత్రం ఏడు గంటల వరకు వచ్చేపోయే జనంతో గోలగా ఉంటుంది. అప్పటికి గానీ అందరూ సర్దుకుని స్థిమితంగా కూర్చోరు. ఈ గోలలో నాటకం ప్రారంభమయింది. మైకులు పనిచేయలేదు. సుమారు ముప్పావుగంటసేపు అలా గడిచిన తర్వాత సినీ తారలు జమున, అంజలీదేవి విచ్చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని అర్థంతరంగా తెరదించారు. జమునగారిని సన్మానించారు. సన్మానం తర్వాత మళ్లీ తెర ఎత్తి, ఇంతకు ముందు సంభాషణలు ఎవరికీ వినిపించలేదు కనుక మళ్లీ మొదటి నుంచి ఆడించారు. ఇక ఆ నటుల అవస్థను సులభంగా ఊహించుకోవచ్చు. అందరిలోనూ ఉత్సాహం చచ్చిపోయింది. కథానాయకుడు కృష్ణమూర్తి, పరంధామయ్య పాత్రధారి జి.ఎస్.ఆర్. మూర్తి మాత్రం చక్కగా నటించారు. కృష్ణమూర్తి ఉత్తమ నటుడుగా ఎన్నికయ్యారు.

'వేరుబడితీరాలి' అనే నాటకం కుటుంబ ఐకమత్యాన్ని ప్రబోధించేది. ప్రదర్శన చక్కగా ఉంది. తమ్ముడుగా నటించిన తాడయ్య, వదిన పాత్ర ధరించిన బాలకోటేశ్వరి చక్కగా నటించారు. వీరి నాటకంలో వయొలిన్ వాయించే వ్యక్తికి గుండె నొప్పి రావటం వలన, మొదటి రోజు ప్రదర్శించవలసిన నాటకాన్ని మూడవ రోజుకు వాయిదా వేశారు. తెల్లారు జామున సగంమంది జనం లేచిపోయిన తర్వాత ప్రదర్శించారు. వీరు కూడా చాలా ఇబ్బందులకు గురియైనారు. అయినా వీరి నాటకం ప్రేక్షకుల అభిమానం చూరగొన్నది. ఉత్తమ నాటకంగా ఎన్నికవుతుందని చాలామంది ఆశించారు కూడా.

నాటికలలో 'జ్వలితజ్వాల', 'ఆశయాలకు సంకెళ్లు' తప్ప మిగిలినవేవీ చెప్పుకోదగ్గవిగా లేవు. ఈ రెండూ కూడా విశేషంగా ఏమీ లేవు. 'జ్వలిత జ్వాల' రచనలో కొత్తదనమేమీ లేకపోయినా చక్కగా ప్రదర్శించడానికి తగిన అవకాశాలు ఉన్నాయి. వీరి ప్రదర్శన చక్కగా ఉంది. కథానాయకుడుగా వీరభద్రరావు చక్కగా నటించారు. ఉత్తమ నటుడు బహుమతి ఈయనే గెల్చుకున్నారు. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు, ఉత్తమ రచనకు, ఉత్తమ నటికి బహుమతులు సంపాదించిన 'చిట్టి' నాటిక ఏవిధంగా చూసినా బాగాలేదు.

ఈ నాటకాలు, నాటికలు కాక కుమారి నర్రా కనకదుర్గ నాట్య ప్రదర్శనాన్ని, వేదాంతం సత్యనారాయణశర్మ బృందం (కూచిపూడి) వారి నాట్య ప్రదర్శనాన్ని కూడా ఏర్పాటుచేశారు. ఈ ప్రదర్శనలు చాలా గొప్పగానే ఉన్నాయి కానీ - ఇవి నాటకాలపై చాలా దెబ్బతీశాయి. పరిషత్తుకు నాటక పోటీలు ముఖ్యంగానీ ఈ ప్రదర్శనలు కావు. ఆ విషయం మరచిపోయి, నాటకాలను, నాటికలను వెనక్కు నెట్టి మధ్యలో రెండేసి గంటలసేపు ఈ నృత్య ప్రదర్శనలను ఏర్పాటు చేయటం చాలా అన్యాయం. అది నాటక సమాజాలకు అవమానం. నర్రా కనకదుర్గ నాట్య ప్రదర్శనం తర్వాత - సుమారు తెల్లారుజామున 5 గంటల వరకు ఒక నాటకాన్ని, ఒక నాటికను ప్రదర్శింపచేశారు. ఈ నాటకాలకంటే నృత్య ప్రదర్శనం ముఖ్యం అనుకున్నారు కార్యకర్తలు. వీరు చేసిన మరో ఘోర కృత్యం సినిమా తారలు రాగానే ఆడుతున్న నాటకాన్ని ఆపుచేయించడం. నటులకు ఇంతకంటే ఫరాభవం ఇంకొకటి లేదు. అసలు సినిమా తారలను ఆ సమయంలో అక్కడకు తీసుకురావటం పొరపాటు. అది తప్పనిసరి అయితే ఆ సమయంలో ఆ నాటకాన్ని ఏర్పాటు చేయకుండా ఉండవలసింది. పోటీ నిష్పాక్షికంగా ఉండాలంటే అన్ని నాటకాలకు సమానమైన సౌకర్యాలు (సమయం, సందర్భం మొదలయినవి) కల్పించాలి. ఒకరికి తెల్లవారుజామున మంచు కురిసేటప్పుడు, మరొకరికి రాత్రి తొమ్మిది గంటలకు ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రదర్శనలు ఏర్పాటుచేస్తే అది సరైన పోటీగా ఉండదు.

ప్రతిరోజూ సాయంత్రం ఆరుగంటలకు సినిమా కళాకారులకు, ప్రొద్దునపూట ఇతర కళాకారులకు సన్మానాలు జరిపారు. 26వ తేదీ సాయంత్రం జగ్గయ్యకు, 27 సాయంత్రం ఆదుర్తి సుబ్బారావుకు, 28 సాయంత్రం రమణారెడ్డికి, 29 సాయంత్రం జమునకు సన్మానాలు జరిగాయి. ప్రొద్దుటిపూట సమావేశంలో 27వ తేదీన ఇ. జగన్నాధాచారి (తిరుపతి) గారికి, సురభి ధనలక్ష్మి (ఏలూరు) గారికి, రొడ్డం హనుమంతరావు (అనంతపురం) గారికి సన్మానాలు జరిగాయి. 28వ తేదీ ఉదయం గిడుగు సీతాపతి, డి.వి. నరసరాజు, జె. దొడ్డన్న గౌడ, ఎస్. రాజేశ్వరరావు గార్లను సన్మానించారు. 29వ తేదీ ఉదయం రూపనగుడి నారాయణరావు గారి 'ఛాయచిత్ర' కావ్య ఆవిష్కరణోత్సవం గిడుగు సీతాపతిగారి అధ్యక్షతన జరిగింది. జమ్మలమడక మాధవరావు శర్మగారి 'నాట్యవేదము' రెండవ సంపుటం ఆవిష్కరణ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారి అధ్యక్షతన జరిగింది.

ఉదయంపూట సమావేశాలలోనే నాటక కళను గురించి గోష్టులు, చర్చలు జరిగాయి. పూర్వపు పరిస్థితులను, ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు. ఇక ముందు కర్తవ్యాన్ని గురించి చర్చించారు. కొన్ని విమర్శలు వచ్చాయి. వాటిపై తర్జన భర్తనలు జరిగాయి. ఇది ఈ ఒక్క కళాపరిషత్తుకు సంబంధించిన విషయం కాదు. యావదాంధ్ర నాటక రంగానికి సంబంధించిన సమస్య.

నండూరి పార్థసారథి
(1964 మే 27వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Next Post