Title Picture

జోహార్ నిర్మించిన 'బేవకూఫ్' (పరమశుంఠ) చిత్రం నవరస భరితంగా ఉంది. హాస్యరసం మోతాదు కాస్త ఎక్కువగా ఉంటుందన్న సంగతి ఈ చిత్రం పేరు చూస్తేనే స్ఫురిస్తుంది. ఏ రసమైనా వికటించినప్పుడు జుగుప్సగా తయారవుతుంది. అట్టి జుగుప్స మన ప్రేక్షకులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ కిటుకు జోహార్ కు తెలుసు. అతని చిత్రాలన్నీ ఆర్థికంగా నూటికి నూరు పాళ్ళు విజయవంతమవుతున్నాయి. మెజారిటీ జనరంజకంగా ఉంటున్నాయి. ప్రజాస్వామ్య సూత్రాన్ని అక్షరాలా పాటిస్తున్న చాలమంది సినిమా దర్శకులలో జోహార్ ఒకడు. ఎన్నికలు పెడితే జనం కళ్ళు మూసుకుని అతనికే వోటు వేస్తారు.

ఈ చిత్రానికి రచన, దర్శకత్వం కూడా జోహారే కావడం వల్లనూ, చిత్రంలో తురుపులాంటి ఒక పాత్రను అతను ధరించడంవల్లనూ చిత్రం ప్రత్యంగుళంలోను జోహార్ ధోరణి చిందులు త్రొక్కుతుంటుంది. అసలు జోహార్ తన అభిరుచులను యథాతథంగా అమలు జరిపేందుకే నిర్మాత గాను, రచయితగానూ కిషోర్ కుమార్ ను ఎంచుకున్నాడు. మాలాసిన్హా వారి అడుగుజాడల లోనే నడుచుకొంది. అసలు మాలాసిన్హా లోనూ, కిషోర్ కుమార్ లోనూ పరకాయ ప్రవేశం చేసి జోహారే నటించాడనిపించింది. జోహార్, కిషోర్ హాస్య ధోరణులు చూసి చూసి అలవాటు చేసుకున్నవారికీ, వారిని అభిమానించేవారికీ ఈ చిత్రం అమృత ప్రాయంగా ఉంటుంది.

ఈ చిత్రానికి సంగీతం బర్మన్. మామూలు గానే ఆయన కూర్చిన వరసలు గొప్పగా ఉన్నాయి. చిత్రంలో కాక విడిగా విన్నా, లేక చిత్రంతోపాటు వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని విన్నా ఆ పాటలు మరింత బావుంటాయి. నాయకుడు కిషోర్ కావడం వల్ల సంగీతం కాస్త శ్రుతిమించకతప్పలేదు. కళ్ళు మూసుకుని విన్నా ఆ పాటలు పొట్టచెక్కలయ్యేట్టు నవ్వించగలవు. మనకు తెలియని ఏ వాద్యాల మీదనో ఆయన ఎన్నెన్నో తమాషాలు చేశారు. కిషోర్ హాస్యంకన్నా బర్మన్ హాస్యం సున్నితంగా ఉంది. టైటిల్స్ లో ఆయన సంగీతం దిగ్భ్రమ కల్గించేలా ఉంది.

కథ ఈ చిత్రానికి ప్రత్యేకాకర్షణ కాదు కాబట్టి, ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే-కథ కోసం ఈ చిత్రం చూడడం అనవసరం కాబట్టి కథ కోసం ఇక్కడ కొంత చోటు కేటాయించనక్కరలేదు. కిషోర్, జోహార్, మాలా, బర్మన్, అభిమానులు పదేపదే చూడతగిన చిత్రం 'బేవకూఫ్'.

నండూరి పార్థసారథి
(1960 సెప్టెంబర్ 04వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post