Title Picture

తస్వీర్ స్తాన్ వారి 'చాంద్' లేఖ్ రాజ్ భాక్రీ దర్శకత్వంలో సినీమావాళీ కరుణరస భరితంగా శరత్ నవలల నమూనాలో సగటు చిత్రంగా రూపొందింది.

కపూర్ (బల్రాజ్ సహానీ) అనే యువకునికి బోలెడు డబ్బూ, భారీ సెట్టు అంత భవనం అంతకన్నా విశాలమైన హృదయం, సుగుణవతియైన కమల (పండరీబాయి) అనే భార్య మొదలయినవన్నీ ఉంటాయి. కానీ వంశోద్ధారకుడు ఒక్కడైనా కడుపున పడకపోవటంతో ఆమెకూ, అతనికీ కూడా సమస్యగా, బాధగా, నిస్సారంగా, ఈ సినిమాగా తయారవుతుంది జీవితం. మన మెరుగని కాలంలో అయితే పుత్రకామేష్ఠి యాగం చేసేవారు రాజులు. కాని కపూర్ కి మరొక స్త్రీని వివాహం ఆడటం కన్నా గత్యంతరం ఉండదు. భార్య విశాల హృదయిని కనుక మరో వివాహం చేసుకోమని ప్రోత్సహిస్తూ, బ్రతిమాలుతుంది. అతి కష్టంమీద అతను ఒప్పుకుంటాడు. తన నౌకరు చుట్టాలలో ఒక అమాయికయైన అల్లరి పిల్ల ఉంది. ఆమె పేరు విమల (మీనాకుమారి). ఆమె తండ్రి బీదవాడు కావటం చేతనూ, రెండో పెళ్ళి అయినా కపూర్ ఉదారుడు కావటం వల్లనూ, విమలకూ, కపూర్ కూ వివాహం అవుతుంది. మొదటి భార్య మీది జాలితో, తాను తప్పుచేశాననే మనస్తాపంతో అతడు విమలను సమీపించలేడు. వారిద్దరి మధ్య పొత్తు కుదర్చాలని కమల ఎంతో ప్రయాస పడుతుంది. పనిమనిషి చెప్పుడు మాటల వల్ల విమలకు కమలపై ద్వేషం కలుగుతుంది. విమలకు మగపిల్లవాడు పుడతాడు. భర్త అనుకూలంగాలేడని పిల్లవాణ్ణి కూడా విడిచి పుట్టింటికి వచ్చేస్తుంది. పిల్లవాణ్ణి తనకిచ్చి వెయ్యమని పేచీ పెడుతుంది. కోర్టుకెక్కుతుంది. ఓడిపోతుంది. పిచ్చెక్కుతుంది. ఆస్పత్రినుంచి అర్ధరాత్రి ఇంటికి పరుగెత్తుకొచ్చి, పిల్లాణ్ణి తీసుకుని రోడ్లవెంట, వంతెనల మీద, రైలుపట్టాలమీద, పరుగెత్తి, క్లయిమాక్సు హడావుడి అంతా చేసి, నదిలో పిల్లవాడితో సహా దూకుతుంది. వెంట పరుగెత్తుతున్న కపూర్ కూడా ఆమెను రక్షించేందుకు నదిలో దూకుతాడు. తర్వాత సీనులో ఆమె, పిల్లవాడు బతుకుతారు. అంతా కలిసి కిలకిలా నవ్వుతారు. ఇందులో శరత్ నమూనా దేవత కమలగా పండరీబాయి, విమలగా మీనాకుమారి నటించారు. మీనాకుమారి గొప్పగా నటించింది. అంత నేలబారు పాత్రను అంత ఉన్నతస్థాయికి ఉద్దరించి ప్రేక్షకుల సానుభూతి పొందటం ఆమెకే చెల్లింది. బల్రాజ్ సహానీ బొత్తిగా హాలీవుడ్ నటుడిలా నటించాడు. ఆఫీసులో అయితే ఫరవాలేదు కానీ, స్వంత ఇంటిలో భార్య దగ్గర కూడా, హాలీవుడ్ నటుడిలా అభినయించటం, పోజులివ్వటం కృత్రిమంగా, ఎబ్బెట్టుగా ఉంది. పండరీబాయి ముచ్చటగా నటించింది. సుందర్ హాస్యం చౌకబారుగా ఉంది.

హేమంత్ కుమార్ సంగీతం ప్రత్యేకంగా చెప్పుకోతగింది. ఉన్న నాలుగైదు పాటల్లోనూ సుందర్, తదితర ఆడా మగా కలిసి పాడిన కవ్వాలీ పాట మినహా మిగతావన్నీ (లత పాడినవి) చక్కని వరసల్లో హాయిగా ఉన్నాయి. పాటల చిత్రీకరణ విసుగుపుట్టించినా, విడిగా వింటే పాటలు చాలా బావుంటాయి. నేపధ్య సంగీతం గొప్పగా ఉంది.

ఈ చిత్రంలో ఇంటర్వెల్ వరకూ, కపూర్ రెండో పెళ్ళి చేసుకోకపోవడం వల్ల ఉండే బాధలూ, తర్వాత చేసుకుంటే ఉంటే బాధలూ వర్ణించారు. రెండింటినీ తూకంవేసి చివరికి, చేసుకోవడమే మంచిదని తేల్చారు దర్శకులు. చిత్రం ఆద్యంతం కథానాయకుడితో మనం సహానుభూతి పొందుతాం. గృహకల్లోలంతో అతని మనస్సు ఎంత చికాకు పడుతుంటుందో చిత్రం చూస్తుంటే మనమూ అంత చికాకు పడతాం.

నండూరి పార్థసారథి
(1960 జనవరి 17వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Previous Post Next Post