బెంగాలీ సంగీత ప్రియులకు హేమంత ముఖర్జీగా, యావద్భారత శ్రోతలకు హేమంతకుమార్ గా దాదాపు నాలుగు దశాబ్దాలుగా సుపరిచితుడైన హేమంతకుమార్ ముఖర్జీ అస్తమయంతో భారతీయ సంగీత రంగంలో ఒకానొక ఉజ్జ్వల శకం పరిసమాప్తమయింది. ఇటు చలన చిత్ర సంగీతంలోనూ, అటు రవీంద్ర సంగీతంలోనూ కూడా అంతటి ఎత్తుకు ఎదిగిన వ్యక్తులు అరుదు.

హేమంతకుమార్ గొప్పతనం బెంగాలీలకు తెలిసినంతగా ఇతర భారతీయులకు తెలియదు. తెలిసే అవకాశం లేదు. బెంగాల్ వెలుపలి ప్రజలకు ఆయన హిందీ చలన చిత్ర సంగీత దర్శకుడుగా, గాయకుడుగా-మరీ ముఖ్యంగా 'నాగిన్' సంగీత కర్తగా-మాత్రమే తెలుసు. కానీ రవీంద్ర సంగీత ప్రచారానికి ఆయన చేసిన కృషి, బెంగాలీ భావగీతాల గాయకుడుగా ఆయన పొందిన ప్రజాభిమానం-ఇవి ఆయన సినిమా సంగీతంలో సాధించిన విజయానికి ఏమాత్రం తీసిపోయేవి కావు. రవీంద్ర సంగీతంలో పంకజ్ మల్లిక్ తరువాత చెప్పుకోదగిన పేరు హేమంతకుమార్ ది. ఆయన పాడిన ఎన్నో రవీంద్ర గీతాలు రికార్డులుగా వెలువడ్డాయి. హేమంత్ పాట రవీంద్ర సంగీతానికి ప్రమాణం. అందుకే రవీంద్ర భారతి విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.

హిందీ సినిమా సంగీత దర్శకుడుగా, గాయకుడుగా ఆయన అందించిన అసంఖ్యాక మధుర గీతాలు దేశమంతటా మారుమ్రోగాయి. రెక్కలు విప్పి, సరిహద్దులు దాటి అవి ప్రపంచమంతటా విహరించాయి. ఆయన సృష్టించిన కొన్ని ఫణితులు విశ్వజనీన సంగీతానికి అచ్చమైన మచ్చుతునకలు. 'శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః' అనే ఆర్యోక్తికి 'నాగిన్' చిత్రంలోని నాగస్వరం ఒక చక్కని ఉదాహరణ. అంతకంటే గొప్ప నాగస్వర సంగీతాన్ని ఎవరూ ఊహించలేనట్లుగా ఆయన ఆ ఫణితిని రచించారు.

1920లో వారణాసిలో జన్మించిన హేమంతకుమార్ పదిహేనేళ్ల పిన్న వయస్సులోనే సినిమా సంగీత రంగంలో అడుగు పెట్టారు. 1935లో న్యూ థియేటర్స్ వారి ఒక చిత్రానికి కోరస్ లో గొంతు కలిపారు. సైగల్, పంకజ్ మల్లిక్, కె.సి. డే వంటి గొప్ప గాయకులు సినీ సంగీత సామ్రాజ్యాన్ని ఏలుతున్న కాలంలో - 1941లో-తొలిసారిగా 'నెమై సన్యాస్' అనే బెంగాలీ చిత్రం ద్వారా నేపథ్య గాయకునిగా హేమంతకుమార్ పరిచయమైనారు. 1945లో 'పూర్బరాగ్' అనే బెంగాలీ చిత్రానికి తొలిసారిగా సంగీత దర్శకత్వం వహించారు.

1950 ప్రాంతంలో 'ఆనందమఠ్' చిత్రం ద్వారా ఆయన హిందీ చిత్ర రంగానికి పరిచయమైనారు. సంగీత దర్శకుడుగా ఆయన తొలి హిందీ చిత్రం 'షర్త్'. 'నాగిన్' చిత్రంతో ఆయన అగ్ర సంగీత దర్శకుల కోవలో చేరారు. 'చంపాకలి', 'మిస్ మేరీ', 'బీస్ సాల్ బాద్', 'కోహ్రా', 'ఖామోషీ', 'సాహిబ్ బీబీ ఔర్ గులాం', 'అనుపమ' వంటి ఎన్నో చిత్రాలకు ఆయన మరపురాని మధుర సంగీతాన్ని అందించారు. ఆయన పాడిన గొప్ప పాటలలో అధిక భాగం ఆయన స్వయంగా సంగీత రచన చేసినవే. ఇతర సంగీత దర్శకులలో ఆయన ప్రతిభను అందరికంటే ఎక్కువగా ఉపయోగించుకొన్నవారు ఎస్.డి. బర్మన్. హేమంత్ చేత బర్మన్ పాడించిన 'సున్ జా దిల్ కా దాస్తాన్', 'తేరీ దునియామే జీనేసే', 'న తుమ్ హమె జానో', 'జానె వో కైసే లోగ్...' వంటి పాటలు ఎప్పటికీ వసివాడవు. అవి కలకాలం ఎడతెరిపి లేకుండా పరిమళాలను గుబాళించే పారిజాతాలు.

సైగల్ అస్తమయానికి కొంచెం ముందుగా రంగంలోకి వచ్చి ఆ తరువాత మూడు, నాలుగు దశాబ్దులపాటు హిందీ సినీ శ్రోతలను సమ్మోహపరచిన ఆరుగురు విశిష్ట గాయకులు-ముఖేష్, రఫీ, తలత్, హేమంత్, మన్నాడే, కిశోర్ కుమార్. వీరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విశిష్టమైన శైలి ఉన్నది. వీరిలో ఇప్పడిక తలత్, మన్నాడే మాత్రమే ఉన్నారు. వారూ ఇంచుమించుగా రిటైరైనట్లే. వీరి తరువాత వీరితో పోల్చదగిన ప్రతిభావంతులెవరూ రంగంలోకి రాలేదు. ఇప్పటి గాయకులందరూ ఈ ఆరుగురిలో ఎవరో ఒకరిని అనుకరిస్తున్నవారే.

హేమంతకుమార్ తన గానంలో గాని, సంగీత రచనలో గాని ఎన్నడూ చౌకబారు తనానికి దిగజారలేదు. ఆయన పాటలన్నింటిలోనూ ఒక ఉత్తమాభిరుచి వ్యక్తమవుతూ ఉంటుంది. ఆయన స్వరంలో హుందాతనం, గాంభీర్యం, ఆర్ద్రత నిండి ఉండేవి. వ్యక్తిగా గొప్ప సంస్కారవంతుడు కావడం వల్ల ఆ సంస్కారమే ఆయన సంగీతంలో ప్రతిబింబించేది. బెంగాలీ సంగీతపు అందాలను ఆయన సినిమా సంగీతంలో అందంగా పొదిగారు. ఆ విధంగా యావద్భారత శ్రోతలకు బెంగాలీ సంస్కృతిని రుచి చూపించారు. అటు బెంగాలీ సంగీత రంగంలో గాని, ఇటు హిందీ సినిమా సంగీత రంగంలో గాని హేమంతకుమార్ వంటి గాయకుడు మరొకరు అవతరించగలరని ఆశించలేము. ఇప్పుడిక మిగిలినవి ఆయన మధుర గీతాలు, మధుర స్మృతులు.

నండూరి పార్థసారథి
(1989 సెప్టెంబర్ 29వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Previous Post Next Post