Title Picture

ఫిల్మాలయావారి సమ్మోహనాస్త్రం

నేటి నవనాగరిక ప్రపంచంలో యువతీ యువకుల మధుర స్వప్నాలకు ప్రతిబింబం 'లవ్ ఇన్ సిమ్లా'. స్వాప్నిక ప్రపంచంలోవలెనే ఈ చిత్రంలో కూడా వాస్తవికతకు తావులేదు. అయితే కల మధురంగా ఉంటే వాస్తవికత ప్రశ్నరాదు. తియ్యటి కలల్ని మళ్ళీ మళ్ళీ నెమరువేసుకున్నట్లే ఎన్ని సార్లు చూసినా తనివితీరని చిత్రం 'లవ్ ఇన్ సిమ్లా'. యువ ప్రేక్షకులపై ఎస్. ముఖర్జీ గారి తాజా సమ్మోహనాస్త్రం ఇది.

చల్లని, తెల్లని, నిశ్శబ్ద, ప్రశాంత ప్రదేశం; సహస్ర వసంతాలు, శతసహస్ర శరత్తులు, అక్కడ ఎల్లకాలం వెల్లివిరుస్తూ ఉంటాయి. మంద పవనాలు, పాలవెన్నెలలు, కోకిలారవాలు, ఉద్యానవనాలు, పొదరిండ్లు, అన్నీ అక్కడ సమావేశమైనాయి. ఒక్కమాటలో అదో స్వర్గం, లేక సిమ్లా. అందులో అందరూ యవ్వనులు. అమృతం తాగిన వారిలా ఏ చీకూచింతా, రోగం రొష్టూ లేకుండా పైలాపచ్చీస్ గా ఉంటారు. వసంతుడు, మన్మథుడు కలిసి చెట్టపట్టాలు వేసుకుని ఎల్లప్పుడూ షికార్లు కొడుతూ ఉంటారు.

Picture
జాయ్ ముఖర్జీ, సాధన

ఈ వాతావరణంలో సోనియా అనే అమ్మాయి, దేవ్ అనే అబ్బాయి ఆడుకొంటూ, పాడుకొంటూ, ముచ్చటగా అల్లరీ ఆగం చేయటం ఈ చిత్రంలోని ఇతివృత్తం.

Picture
సాధన

సోనియాకు తల్లిదండ్రులు లేరు. బాబాయి ఇంట్లో ఉంటోంది. వాళ్ల పిన్ని, బాబాయి కూతురు, ఈమెను హేళనచేస్తుంటారు. బామ్మ మాత్రం గారాబం చేస్తుంది. బాబాయి కూతురు పేరు షీలా. ఆమె బహు షోకేలా. ఆమెతో యువకులంతా పూసుకు తిరుగుతూ ఉంటారు. రాక్కెన్ రోల్ చేస్తుంటారు. తన వంక ఎవరూ చూడటం లేదని సోనియాకు బెంగ పట్టుకుంది. ఇలా ఉండగా వాళ్లింటికి దేవ్ అనే అబ్బాయి వచ్చి షీలాతో ప్రేమ సాగిస్తూ ఉంటాడు. ''ఎల్.ఒ.వి.యి. లవ్, లవ్ అంటే ప్రేమ'' అని వాళ్లు పాడుతూ డాన్సు చేస్తుంటే ఈ అమ్మాయి 'బి.ఓ.ఆర్.యి. బోర్' అని విసుక్కుంటుంది. సోనియా వచ్చినప్పుడల్లా షీలా తరిమేస్తూ ఉంటుంది. 'అతణ్ణి నీ నుంచి దూరంచేసి, నువు నా పాదాలమీద పడేట్టు చేస్తాను చూడు' అని సోనియా పంతం పడుతుంది. షీలా పకపక నవ్వేస్తుంది. సోనియా వాళ్ల బామ్మ దగ్గరికి వెళ్లి ఆ అబ్బాయి తనని చూడటం లేదని ఏడుస్తుంది. అప్పుడు వాళ్ల బామ్మ ఈ అమ్మాయికి మంచి డ్రస్సువేసి, జుట్టు చక్కగా కత్తిరించి, మేకప్ చేసి, కొంతకాలం రాక్కెన్ రోల్ నేర్పి తర్ఫీదు చేస్తుంది. సోనియా ఒప్పులకుప్పగా, ముద్దుల మూటగా తయారవుతుంది. నిద్రబాగా పట్టేందుకు వాళ్ల బామ్మ వేసుకునే మాత్రలు, షీలాకు పాలల్లో కలిపి యిచ్చి, నిద్రపుచ్చి, రోజూ షీలా బదులు తాను సంకేత స్థలంలో దేవ్ ను కలుసుకొంటూ ఉంటుంది. కొంతకాలానికి సోనియా దేవ్ ల ప్రేమ ముదిరి పాకాన పడుతుంది. సోనియా, దేవ్ కు కొన్ని ప్రేమ పరీక్షలు పెడుతుంది. నట్టనడి రోడ్డు మీద తనని కూర్చోపెట్టుకుని రిక్షాలాగమంటుంది. పొగరుమోతు గుర్రం చూపించి స్వారీ చెయ్యమంటూంది. పోలీసు నెత్తి మీది టోపీ లాక్కురమ్మంటుంది. అతను అన్నీ చేసి 'సెభాష్' అనిపించుకుంటాడు. చివరికి షీలా ఓటమిని ఒప్పుకుని దేవ్ ను తన కిచ్చెయ్యమని సోనియా పాదాలమీద పడుతుంది. ప్రేమను త్యాగం చేసి, సోనియా ఇంట్లో నుంచి పారిపోతుంది. షీలా, దేవ్ ల పెళ్లి ఖాయమవుతుంది. కాని, సోనియా పరారీ వల్ల వాయిదా పడుతుంది. తర్వాత తుఫాను రావటం, నేపధ్య గీతం మారుమ్రోగటం, సోనియా తుపానులో చిక్కుకొని మూర్ఛపోవటం, మంచుతో కప్పబడి పోవటం, నాయకుడు వచ్చి రక్షించి పెళ్లి చేసుకోవటం జరిగిపోతాయి.

కథ బహు చిన్నదైనా కథనం సుదీర్ఘంగా ఉంది. దర్శకుడెంత ఘటికుడైనా నిడివి పెరిగినకొద్దీ నాణ్యం తగ్గుతుందనే వాదానికి ఈ చిత్రం కూడా ఒక తార్కాణం. సోనియా చెప్పినట్లు ప్రేమ అంటే 'బోర్' అనే దాంట్లో బొత్తిగా నిజం లేకపోలేదని చిత్రం ఉత్తరార్థంలో భావించవలసి వచ్చింది. యువతీ యువకుల యవనోధృతం, విచక్షణా రాహిత్యం చిత్రం ఆద్యంతం అగుపించాయి.

సోనియాగా క్రొత్త నటి సాధన మనోహరంగా నటించింది. 'ముగ్ధ' అనే పదానికి నిర్వచనంలా ఉంది ఆమె. షీలాగా నటించిన అజ్రా అక్షరాలా 'ప్రౌఢ'లా ఉంది. ఆ రెండు పాత్రలకూ వీరిద్దరినీ తీసుకోవటం మెచ్చుకోతగ్గ విషయం. నాయకుడు జాయ్ ముఖర్జీ అందంగా లేడు కాని ఆజానుబాహుడు. ఆరడుగుల పొడుగు వాడు. వెడద యురమువాడు. చలాకీగా ఉన్నాడు.

ఇక్బాల్ ఖురేషీ సంగీతం డబల్ గేస్ సోడాకాయిలా ఉంది. పాటలు మరీ 11 కావటంతో పూర్వార్థంలో చూరగొన్న ప్రేక్షకుల అభిమానాన్ని ఉత్తరార్థంలో నిలుపుకోలేకపోయాడు. మొదటి మూడు, నాలుగు పాటలు చాలా బావున్నాయి. ముఖ్యంగా ''ఎల్.ఒ.వి.యి. లవ్, లవ్ కా మత్లబ్ హై ప్యార్'' అనే పాట, ''ఏ బీబీ ఏజీ, ఇధరావ్ ఆగయా'' అనే పాట మరీ బావున్నాయి. వాటి రచనకూడా హుషారుగా వుంది. పాటలు రాసింది రాజేంద్రకిషన్.

దర్శకుడు ఆర్.కె. నయ్యర్, ఛాయాగ్రాహకుడు డి.కె. ధురీ, ప్రత్యేకంగా అభినందించతగినవారు. ఆర్.కె. నయ్యర్ నుంచి ముందు ముందు మరిన్ని మంచి చిత్రాలు వెలువడగలవని ఆశ కలుగుతోంది.

నండూరి పార్థసారథి
(1960 జూన్ 12వ తేదీన ఆంధ్రప్రభ సంచికలో ప్రచురితమైనది)

Previous Post Next Post