Title Picture

శాంతికళా ఫిలింస్ వారి 'శాంత' చిత్రం తెలుగు చిత్రాల సంప్రదాయానికి అనుగుణంగా, పామర జనరంజకంగా రూపొందింది. ఇంతకాలం తెలుగులో ఆర్థిక విజయాన్ని సాధించిన మెజారిటీ చిత్రాల లక్షణాలు-అనగా బాక్సాఫీస్ లక్షణాలు అని చెప్పబడేవీ ఈ చిత్రంలో ఉన్నాయి. శృంగార-కరుణ, హాస్య, రౌద్ర, బీభత్స, భయానక రసాలని నిర్మాతలచే పిలువబడుతున్న కొన్ని అంశాలు కూడా ఈ చిత్రం నిండా పుష్కలంగా ఉన్నాయి. పవిత్ర ప్రేమ, త్యాగం, సాహసం మొదలయినవి ఈ చిత్రం నిండా క్రిక్కిరిసి ఉన్నాయి.

శాంత (అంజలి) పల్లెటూరి 'పిల్ల'. చిత్రం ప్రారంభంలోనే ఆమెను ఒక రంగయ్య బలాత్కారం చేస్తాడు. ఆమె తండ్రి ఆమెను రక్షించబోయి అతని చేతిలో మరణిస్తాడు. ఆమె తప్పించుకుని పట్నం వచ్చి దయానిధి (గుమ్మడి) అనే విలన్ చేత చిక్కుతుంది. అతను బలాత్కారం చేయబోతే తప్పించుకొని పారిపోతుంటే గాలి వాన వస్తుంది. శ్రీనివాస్ అనే నాయకుడు (రామారావు) ఆమెను కాపాడి తన ఇంట్లో ఆశ్రయం ఇస్తాడు. తర్వాత ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. ఒక పిల్లాడు పుడతాడు. దయానిధి కుట్రవల్ల శ్రీనివాస్ శాంతను అనుమానించి ఇంటి నుంచి వెళ్ళకొడతాడు. దయానిధి చేత వంచించబడిన శ్యామల (కృష్ణకుమారి) అనే అమ్మాయి తన బిడ్డను శాంతకు అప్పజెప్పి మరణిస్తుంది. ఈ పిల్ల, శాంత, శ్రీనివాస్ ల కొడుకు ఒకే కాలేజీలో చదువుతూ ప్రేమించుకుంటారు. వారి ద్వారా శాంత, శ్రీనివాస్ కలుసుకుంటారు. నిజం బయటపడుతుంది. దయానిధి ఆత్మహత్య చేసుకుంటాడు. అంతా కులాసాగా ఉంటారు.

ఈ చిత్రంలో మొత్తం ఏడు పాటలు ఉన్నాయి. వీటిలో 'ఏలనో ఎందుకో', 'కలలోని కవితాలతా' అనే పాటలు బాగానే ఉన్నాయి- రచన కాదు - సంగీత రచన. నటీనటులంతా శక్తి వంచన లేకుండా ప్రేక్షకులను రంజింప చేశారు.

నిర్మాత: జయరాం; దర్శకత్వం: మానాపురం అప్పారావు; రచన: సముద్రాల (జూ); పాటలు: సముద్రాల (జూ), కొసరాజు, ఆరుద్ర; సంగీతం: రమేష్ నాయుడు; ఛాయాగ్రహణం: కమల్ ఘోష్; తారాగణం: అంజలి, రామారావు, కృష్ణకుమారి, గుమ్మడి, రేలంగి, గిరిజ, చలం, సూర్యకాంతం, సురభి బాలసరస్వతి, బాలకృష్ణ వగైరా.

నండూరి పార్థసారథి
(1961 జూలై 23వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post