శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ మూసలో తయారయిన 'ఉషాపరిణయం' అను 'బాణాసుర' చిత్రం తెలుగు పౌరాణిక చిత్రాల సగటు స్థాయికి మచ్చుతునక అనదగ్గట్లుగా ఉంది. కడారు నాగభూషణం గారు తమ యావచ్ఛక్తినీ ఈ చిత్రంలో ప్రదర్శించినట్లున్నారు.
తన తండ్రిని పాతాళానికి అణగద్రొక్కినందుకు హరిపై కినిసి, హరునిగూర్చి ఘోర తపమాచరించి బాణాసురుడు సహస్రభుజబలాన్ని సంపాదించాడు. భక్తవశంకరుడైన శంకరుని తన కోటవాకిట కింకరునిగా కావలికి నియమించాడు. దిక్పతులను పదవీభ్రష్టులను చేశాడు.
కలహంతో కడుపునింపుకొనే నారదుడు తర్వాత కథ నడిపించాడు. బాణాసురుని కూతురు ఉషకు గౌరీ ఆశీర్వాదం వలన కృష్ణుని పౌత్రుడు అనిరుద్ధ కుమారుడు స్వప్నంలో సాక్షాత్కరించి హృదయాన్ని దొంగిలిస్తాడు. ఉష చెలికత్తె చిత్రలేఖ చెలివిరహాన్ని చూడలేక, తన అణిమాది శక్తులను ప్రయోగించి ద్వారకలో నిద్రిస్తున్న అనిరుద్ధుణ్ణి ఉష పడకగదికి చేర్చి వారికి గాంధర్వ వివాహం జరిపిస్తుంది. కొంత కాలానికి ఈ విషయం బాణాసురునికి తెలిసి అనిరుద్ధుణ్ణి కారాగారంలో బంధిస్తాడు. చివరకు కృష్ణునికి, బాణాసురునికి యుద్ధం జరుగుతుంది. బాణాసురుడు ఓడిపోయి, హరిహరులిద్దరూ ఒక్కరేనని తెలుసుకొని లెంపలు వేసుకొంటాడు. ఉషా అనిరుద్ధుల వివాహం జరుగుతుంది.
ఉషగా జమున చక్కగా ఉంది. అనిరుద్ధుడుగా కాంతారావు, బాణాసురుడుగా రంగారావు, కృష్ణుడుగా రఘురామయ్య, నారదుడుగా సూరిబాబు, చిత్రలేఖగా సూర్యకళ, ఆమె ప్రియుడుగా రేలంగి రాజరాజేశ్వరీ కంపెనీ మూసలో అవధిమేరకు బాగానే నటించారు.
సదాశివబ్రహ్మం గారి రచన కడారువారి అభిరుచులకు అనుగుణంగా ఉంది. పాటలు, పద్యాలు అమాంబాపతు 22 ఉన్నాయి. వీటిలో రెండు మూడింటి వరసలు బాగానే ఉన్నాయి. జమునకు సరిపోక పోయినా జమునారాణి గొంతు హాయిగా, శ్రావ్యంగా ఉంది.
దర్శకుడు: కె.బి.నాగభూషణం; మాటలు: సదాశివబ్రహ్మం; పాటలు: సదాశివబ్రహ్మం, వేణుగోపాల్; సంగీతం: ఎస్.హనుమంతరావు; నృత్యం: పసుమర్తి; కెమెరా: లక్ష్మణ్ గోరే; తారాగణం: జమున, కాంతారావు, రంగారావు, రేలంగి, ముక్కామల, రఘురామయ్య, సూరిబాబు, కన్నాంబ, సూర్యకళ, మీనాకుమారి, పేకేటి వగైరా.
నండూరి పార్థసారథి
(1961 జనవరి 21వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)
Copyright © 2021 nanduri.com | All Rights Reserved | Site designed and maintained by CodeRhythm Works