Title Picture

(గేయ సంపుటి, రచన : 'చిత్రభాను' (కేతిరెడ్డి సింహాచలం నాయుడు) ; ప్రచురణ : చిత్రభాను ప్రచురణలు, విజయనగరం-2; ప్రాప్తి స్థానం కూడా అదే. క్రౌన్ సైజు : 48 పేజీలు; వెల : 75 నయా పైసలు)

'ఈ పుస్తకంలో 37 గేయాలు ఉన్నాయి. వీటిలో ఎనిమిదింటికి హిందీ మాతృకలు, రెండింటికి ఉర్దూ మాతృకలు ఉన్నాయి. ఈ గేయాలన్నిటిలో దాదాపు సగం ప్రేమ గీతాలు. మిగిలిన వాటికి ముడిపదార్ధం దేశభక్తి, జీవితం పట్ల విరక్తి, అశక్తత.

ఆచార్య రోణంకి అప్పలస్వామి ఈ పుస్తకానికి ముందు అయిదు పేజీలు 'పరిచయం' వ్రాశారు. కవిత్వ ప్రయోజనం ఏమిటి? అది ఎల్లా ఉండాలి? కళలు, శాస్త్రాలు ఎక్కణ్ణుంచి పుట్టుకొచ్చాయి? మొదలయిన విషయాలను వారు ఐదు పేజీల్లో చర్చించారు. పుస్తకం వెనక అట్టపై ఆనవాయితీ ప్రకారం రచయిత ఫొటో, ఆయన్ను గురించిన సమాచారం ప్రచురించారు. చిత్రభాను నవకవితా ధ్యానంలో కొత్త గొంతు వినిపిస్తున్న బాలవిహంగం అనీ, ఆయన మనస్సులాగే కవితలు కూడా మృదుమధురాలనీ, దశాబ్దంగా సాహితీ వ్యవసాయం చేస్తున్నారనీ వ్రాశారు. రచయిత ఈ పుస్తకాన్ని స్వయంగా ప్రచురించుకున్నారు.

గేయాలన్నీ 'స్వేచ్ఛా ఛందస్సు'లో నడిచాయి. అయినా వీటిలో ఓ పది గేయాలు తీయగా, హాయిగా ఉన్నాయి. నూతన సంప్రాప్తమైన యౌవనంలోని స్నిగ్ధత్వం, సౌకుమార్యం వాటిలో తొంగి చూస్తున్నాయి. రచయిత 22 ఏళ్ళ యువకుడు. అనువాదాలకంటే స్వతంత్ర రచనలే కొన్ని బావున్నాయి. హిందీ నుంచి అనువదించిన వాటిలో కొన్నింటి నడక మరీ హిందీ ఫక్కీలో ఉంది. కవి అనిపించుకోవాలనే బులబాటం ఉన్న చాలామంది యువకుల్లో లేని సుగుణం ఈయనలో ఒకటుంది. ఈయన భాషలో ఎక్కడా దుష్ట సంధులూ, దుష్ట సమాసాలూ లేవు.

 "నేను స్నేహాన్నై-
 నీ హృదయంలో నివసిస్తాను
 అశ్రువునై -
 నీ నయనంలో వసిస్తాను
 గీతాన్నై -
 నీ అధరాలను స్పృశిస్తాను"

ఈ మాదిరి అందమైన గేయపాదాలు చాలా ఉన్నాయి. విశేషంగా లేకపోయినా హాయిగా, మధురంగా-ఉన్న గేయాలు కొన్ని ఉన్నాయి. మిగిలినవి నేలబారుగా ఉన్నాయి.

చిత్రభానుగారు సాహితీ వ్యవసాయం కొనసాగించి, ఇంకా మేలైన ఫలసాయం సాధించగలరని ఆశించుదాం.

నండూరి పార్థసారథి
(1964 ఫిబ్రవరి 19వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post