Title Picture

కె.ఎ.అబ్బాస్ నిర్మించిన 'సెహర్ ఔర్ సప్నా' బొంబాయి వాళీ కళాఖండం. 1963వ సంవత్సరపు అత్యుత్తమ చిత్రంగా రాష్ట్రపతి స్వర్ణపతకాన్ని అందుకున్నది.

చిత్రం మంచి చెడ్డల మాట అటుంచి-అసలు ఆనవాయితీ ప్రకారం స్వర్ణపతకం బెంగాలీ కళాఖండానికి దక్కకుండా దీనికి దక్కడం ఒక విశేషం. సత్యజిత్ రాయ్ తీసిన 'మహానగర్' కంటే రెండు మెట్లు పైన నిలబడటం (నిలబెట్టటం) అంతకంటే పెద్ద విశేషం. ('మహానగర్'కు అఖిలభారత స్థాయిని మూడవ స్థానం లభించింది') ఈ రెండు కారణాల వల్ల ఈ చిత్రాన్ని గురించి విశేష ప్రచారం జరిగింది. ఈ ప్రచారం నిర్మాతలు కూడా స్వయంగా చేసుకున్నారు (ఆర్థిక విజయం సాధించటానికి ఇతర ఆకర్షణలు చిత్రంలో ఏమీ లేవు కనుక).

అబ్బాస్ ఇంతకు ముందు తీసిన చిత్రాలలో మాదిరిగానే ఈ చిత్రంలో కూడా కొంత ప్రత్యేకత ఉంది. అయితే 'గోల్టు మెడల్ సినిమా' అనగానే, ఎవరికైనా ఇంతకు ముందు చూసిన గోల్టు మెడల్ చిత్రాలతో - ముఖ్యంగా సత్యజిత్ రాయ్ చిత్రాలతో - పోల్చి చూడాలనిపిస్తుంది. అలా పోల్చి చూడకపోతే, బొంబాయివాళీ ఉత్తమ చిత్రాలనే దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ చిత్రం గొప్పదనే అనిపిస్తుంది. ప్రపంచ చలన చిత్ర మహాకావ్యాల జాబితాలో దీనిని చేర్చవచ్చునని కొన్ని ఉత్తరాది పత్రికలు ప్రశంసించాయి. అందులో అతిశయోక్తి ఉన్నా అబద్దం మాత్రం కాదు.

బొంబాయి నగరంలోని పేదల దైన్య జీవితాలను ఇందులో చిత్రీకరించారు. ఎన్నో ఆశలతో బొంబాయి చేరిన పల్లెటూరి యువకుని కలలు కల్లలు కావటం ఇందులోని కథ. సగటు చిత్రాలలో కంటే ఇందులో వాస్తవికత ఎక్కువగానే ఉందికానీ అవాస్తవిక సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. కథలో బలహీనమైన అంశాలు ఉన్నా చిత్రీకరణ సంవిధానం శ్రేష్ఠంగా ఉంది.

'గోల్డు మెడల్' పేరు చెబితే కకావికలైపోతారు మన నిర్మాతలు. అటువంటి చిత్రాలు దివాలా తీస్తూ ఉంటాయి. కానీ అబ్బాస్ కు గోల్డ్ మెడల్ అంటే భయం లేదు. దేశమంతటా ఒక్కొక్క వారం ఆడినా నష్టం రాకుండా ఉండేటంత కారుచౌకగా ఈ చిత్రాన్ని నిర్మించారు. చాలా సాహసమైన ప్రయోగం చేశారు.

ఇందులో కథానాయకుడుగా దిలీప్ రాజ్, నాయికగా సురేఖ నటించారు. వీరిద్ధరూ సరికొత్త వారే. ఇంకా డేవిడ్, నానాపల్సికర్, అన్వర్ హుస్సేన్, మన్ మోహన్ కృష్ణ మున్నగువారు నటించారు. చిత్రానికి నిర్మాత, దర్శకుడు, రచయిత అబ్బాస్.

నండూరి పార్థసారధి
(1964 ఆగస్టు 12వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post