Title Picture

నితీష్ కుమార్, రాంవిలాస్ పాశ్వాన్, లాలూప్రసాద్ - ఈ ముగ్గురూ పిచ్చాసుపత్రిలో పేషెంట్లు. బూటాసింగ్ డాక్టరు. ఓ రోజు ఆయన ఆ ముగ్గుర్నీ పిలిచి "ఇప్పుడు మీకో పరీక్ష పెడతాను. గెలిచిన వారిని డిశ్చార్జి చేస్తాను" అన్నాడు. ముగ్గురూ సరేనన్నారు. బూటాసింగ్ ముగ్గుర్నీ ఒక్కచుక్క నీరు లేని ఖాళీ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకెళ్ళి 'జంప్' అన్నాడు. నితీష్, పాశ్వాన్ పూల్ లోకి దూకి కాళ్ళూ చేతులూ విరగ్గొట్టుకుని కుయ్యో మొర్రో అన్నారు. లాలూప్రసాద్ మాత్రం దూకకుండా ఆలోచిస్తూ నిలబడ్డాడు. బూటాసింగ్ లాలూ భుజం తట్టి "శభాష్... నా పరీక్షలో నెగ్గావు. ఆ పిచ్చి వాళ్ళకి బుర్ర లేదు కాబట్టి దూకారు. నిన్ను ఇప్పుడే డిశ్చార్జి చేస్తాను. అవును గానీ... నవ్వెందుకు దూకలేదు" అని అడిగాడు. లాలూ బుర్రగోక్కొని "నాకు ఈత రాదుగా" అన్నాడు.

ఓ సారి సోనియాగాంధి విలేకరుల సమావేశంలో ప్రసంగించాల్సి వచ్చింది. ఎందుకైనా మంచిదని ప్రణబ్ ముఖర్జీ ఆవిడ చెప్పాల్సిన మాటలని వివరంగా రాసి యిచ్చాడు. ఎవరో రాసిచ్చింది చదువుతున్నట్టుంటే బాగుండదని మధ్య మధ్యలో ఏం చేయాలో బ్రాకెట్లలో పెట్టి రాశాడు. (ఇప్పుడు మీరు తలెత్తి, ఓ రెండు నిమిషాలు గంభీరంగా అందర్నీ చూడండి). (ఇప్పుడు కాస్సేపు ఆలోచిస్తున్నట్లు మొహం పెట్టండి) ఇలా అన్న మాట. సోనియాగాంధి ప్రణబ్ ముఖర్జీ రాసిచ్చిన ప్రసంగాన్ని అలాగే చదివింది. బ్రాకెట్లోని సూచనలని కూడా తు.చ తప్పకుండా పాటించింది. అయితే చివర్న ప్రణబ్ ఒక సూచనను బ్రాకెట్లో పెట్టడం మరిచిపోయాడు. పాపం సోనియా ఆ సూచనను కూడా యథాతథంగా బైటికి చదివేసింది. "ఇప్పుడు మీరు గాఢంగా నిట్టూర్చి మీ ఎదురుగా ఉన్న మంచినీళ్ళని గబగబా తాగెయ్యండి".

విలేకరులు ఆమె చెప్పినట్లే చేశారు.

ఈ పుస్తకంలో యిలాంటివెన్నో! అసలు వ్యాసాలకు కొసరుగా వడ్డించిన మిఠాయి వుండల్లాంటి బాక్స్ ఐటమ్ లు యివి. బాక్సులు కాక వందకు పైగా సరదా వ్యాసాలు యిందులో వున్నాయి. అవన్నీ 2005 జనవరి-2008 సెప్టెంబరు మధ్యకాలంలో ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో 'సరదాకి' శీర్షిక కోసం రాసిన వాటిల్లోంచి ఎంపిక చేసినవి. అంటే, వైఎస్సార్ ముఖ్యమంత్రిగా వున్నప్పటివన్నమాట. అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగస్థలికే పరిమితమైనవి. వైఎస్సార్, ఎమ్మెస్సార్, కేసీఆర్, చంద్రబాబు, బొత్స, రోశయ్య, నరేంద్ర, కేకే, నారాయణ, దత్తన్న, ఉప్పునూతల, జానా, వైఎస్ తైనాతి సూరి-వీళ్ళందరినీ వెటకారాలూ మిరియాలతో వాక్చిత్రీకరించాడు రచయిత రాజగోపాల్. అడపాదడపా ఢిల్లీ నుంచి సోనియాగాంధి, మన్ మోహన్ సింగ్, దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్లు గెస్టార్టిస్టుల్లాగా రంగం మీదికి వచ్చి పోతుంటారు.

వైఎస్ హయాంలో జరిగిన రాజకీయాల పట్ల అవగాహనగలవారే ఈ పుస్తకంలోని హాస్య వ్యంగ్యాలను పూర్తిగా ఆస్వాదించగలుగుతారు. 'సరదాకి' శీర్షిక ప్రధానంగా వారిని వుద్దేశించినదే. ఐతే రాజగోపాల్ ఈ వ్యాసాలలో సందర్భోచితంగా గుప్పించిన బోలెడు పేరడీ పాటలు యితర సామాన్య పాఠకులను సైతం ఆకట్టుకోగలవు. పేరడీ చేసిన పాటలన్నీ సుమారుగా 1950 దశకం నుంచి 2008 దాకా వచ్చిన తెలుగు సినిమాల్లోనివి. ఏ పాట ఏ సినిమాలోని ఏ పాటకు పేరడీనో, దాని ట్యూన్ ఏమిటో తెలిసిన వాళ్ళు ఆ ట్యూన్ లో పేరడీ పాటను పాడుకుంటూ ఎంజాయ్ చేయగలుగుతారు. ఒరిజినల్ ట్యూను తెలియని వారు అంతమేరకు ఎంజాయ్ చెయ్యలేరు. యువతరం వారికి పాత హిట్ సాంగ్స్ లో కొన్ని తెలియకపోవచ్చు. పాతతరం వారికి కొత్త పాటల సంగతి తెలియకపోవచ్చు. ఎవరికి ఎంత అర్థమైతే అంతమేరకే ఎంజాయ్ మెంట్.

సరదాకి కొన్ని పేరడీలు :

"అయ్యయ్యో... రోశయ్యా... అన్యాయం చేశావేమయ్యా... నే చెప్పినవన్నీ ఓకే చేస్తే... ఎంత గుమ్ముగా వుండేదయ్యా... య్యా... య్యా..."

"రాజశేఖరా... మనకు అప్పు తీరలేదురా.. కొత్త అప్పు లేలరా? నోరు జారబోకురా... మాట మాసి పోదురా... మధ్య నాకు బాధరా... చంపబోకురా... ఆ ఆ ఆ... రాజశేఖరా..."

"అంతా భ్రాంతియేనా? జీవితానా నిధులొచ్చేనా? ఆశా నిరాశేనా? మిగిలిందీ బోర్డేనా?"

ఎమ్మెస్ : "అయ్యయ్యో చేతిలో పదవీ పోయెనే! అయ్యయ్యో బుర్ర ఖాళీ ఆయనే! ఉన్నది కాస్తా ఊడిందీ... సర్వమంగళం పాడిందీ... ఇంటా బైటా పరువుతో సహా తిరుక్షవరమై పోయిందీ... అయ్యయ్యో..."

వైఎస్, కేకే : "ఆ మహా మహా మన ఇందిరమ్మకే తప్పలేదు భాయీ... ఓటమి తప్ప లేదు భాయీ" (వగైరా... ఇది చాలా పసందైన పెద్ద పాట). ఇలా... పాటలే కాదు-సినిమా మాటల పేరడీలు కూడా చాలానే వున్నాయి.

అన్యాపదేశంగా, డొంక తిరుగుడుగా కాకుండా నేరుగా - పేరు పెట్టి, గురిపెట్టి - పాత్రలపైకి ఉండేల్ బద్ధతో వ్యంగ్యోక్తులు విసరడం తెలుగులో బహుశా యిదే మొదటిసారి. ఇలాంటి రాతలు రాయడానికి, రాయించడానికి చాలా దమ్ము కావాలి. అలవోకగా రాసినట్లు కనిపించే ఈ రకం రచనల వెనక చాలా యాతన వుంటుంది. ఏది పడితే అది ఎలా పడితే అలా గీకి పడెయ్యడానికి వీల్లేదు. 'ఈ వారం ఏం రాయాలీ, ఎలా రాయాలి' అనేది వారం పొడుగునా ఏ పని చేస్తున్నా బుర్రని తొలిచేస్తుంటుంది. సరైన సబ్జెక్టూ, అందులో పేల్చాల్సిన టపాకాయలూ దొరికే వరకూ ఒకటే టెన్షన్. కాలమ్ కు తగిన సబ్జెక్టూ, దానికి తగిన మూడ్డూ వచ్చేదాకా కాలం ఆగదు. ఏదో ఒకటి ఎలాగోలా రాసివ్వక తప్పదు. రాసింది తనకే నచ్చకపోతే వేదన తప్పదు. అందుకే అన్ని వ్యాసాలలో నాణ్యతా ప్రమాణం ఒకే విధంగా వుండదు. కాకలు తీరిన రచయితకైనా అది తప్పదు. ఈ పుస్తకంలో కూడా అది కనిపిస్తుంది. ఇందులోనూ త్రీస్టార్, టూ స్టార్ రచనలు కనిపిస్తాయి. చాలా బావున్నవీ, బాగానే వున్నవీ, ఫరవాలేదనిపించేవీ వున్నాయి. పుస్తకమంతటా అవసరం లేని చోట్ల కూడా పొట్టలో చుక్కలు పొడుచుకుంటూ పోవడం తప్ప భాషా దోషాలు లేవనే చెప్పవచ్చు. రాజగోపాల్లో పర్ ఫెక్షనిస్టు లక్షణాలు కనిపిస్తాయి. తెలుగులో మంచి హాస్యం, వ్యంగ్యం కొంచెమైనా యింకా మిగిలి వున్నాయనడానికి 'సరదాకి' ఒక దాఖలా.

నం.పా.సా.
(3 జూన్, 2012 ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది)

Previous Post