రేఖా చిత్రావారి 'ఖిలాడి' హిందీ చిత్రం అక్టోబరు 26వ తేదీన విడుదల అయింది. ఈ చిత్రంలో క్తతి యుద్ధాలూ, గుర్రపు స్వారీలూ, జెమినీ సర్కస్సూ ఉన్నాయి. నాయకుడుగా రంజన్ చక్కగా చేశాడు. అతను ఇందులో ఒకే పోలికలు కల ఇద్దరబ్బాయిల వేషాలు వేశాడు. నాయికగా జబీన్ నటించింది. నర్తకిగా నటించిన నూతన తార షకీలాబానో భోపాలీ (స...
చాలా కాలంగా ఎదురు చూస్తున్న 'ఎరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 డేస్' చిత్రాన్ని జూల్స్ వెర్న్ రచించిన నవల ఆధారంగా మైఖేల్ టాడ్ నిర్మించాడు. మైఖేల్ ఆండర్సన్ దర్శకత్వం వహించాడు.
ఈ చిత్రానికి కథాస్థలం లండన్. కథాకాలం 1872. విమానాలు లేని ఆ రోజులలో ఒక పెద్ద మనిషి 80 రోజుల్లో భూప్రదక్షిణం చేసి వస్తానని మిత్రులతో 20 వేల పౌనులకు పందెం కాశాడు. ఒక విదూషకుడిని, ఒక చిన్న బస్తాడు నోట్ల కట్టలనీ వెంట తీసుకుని యాత్ర ప్రారంభించాడు. బెలూన్లు, బస్సులు, రైళ్ళు, ఓడలు, స్లెడ్జి బళ్ళు, గుర్రాలు, ఏనుగులు ఇత్యాది నానారకాల వాహనాలలో ప్రయాణం చేసి, అనేక ఆపదలకు గురియై చివరకు పందెం గెల్చుకుంటాడు. ఈలోగా అతనికి యాత్రలో ఒక ప్రేయసి తటస్థ పడుతుంది. ఈ భూప్రదక్షిణంలో వారు చూచిన వింతలనూ, ప్రకృతి దృశ్యాలనూ, అనుభవించిన కష్టాలనూ, చేసిన సాహసాలనూ చిత్రిస్తుంది ఈ చిత్రం.
'అద్భుతం', 'అమోఘం' ఇత్యాది పదార్థాలు మారిపోతున్న ఈ కాలంలో పండితులు, పత్రికలు, ఈ చిత్రాలను అద్భుతం, అమోఘం అని వర్ణిస్తే ఆశ్చర్యం లేదు. ఎలా ఉన్నాయని నిగ్గదీసి అభిప్రాయం అడిగితే చెప్పడం కష్టం. అందుకే-అనిర్వచనీయంగా ఉన్నాయంటే సరిపోతుందేమో. ఇక ఈ చిత్రాల స్థాయిని గురించి ప్రశ్నిస్తే-నూటికి 90 తెలుగు డబ్బింగు చిత్రాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో ఇవీ అలాగే ఉన్నాయని చెప్పక తప్పదు.
పాపం పెచ్చుపెరిగి, ప్రళయం విరుచుకుపడబోతున్నప్పుడు ధర్మదేవత మూడు కాళ్ళు విరక్కొట్టుకొని నాలుగో పాదంపై అల్లాడుతున్నప్పుడు, ధర్మసంస్థాపనార్థం భగవంతుడు భూమిమీద అవతారాలు తాల్చినట్లే -డబ్బింగ్ చిత్రాల హోరు పరాకాష్ట నందుకొని ప్రేక్షకుల మనస్సులు కకావికలమై, తలలు పగిలిపోగల పరిస్థితి ఏర్పడినప్పుడు, సినీ ప్రపంచంలో కళాదేవత ఒంటికాలిపై అఘోరిస్తున్నప్పుడు, మలయమారుతంలా, పన్నీటిజల్లులా, వేణుగీతంలా సేదతీర్చి, హాయికూర్చి, ప్రేక్షకమనస్సులలో ఆశాభావాలను చిగురెత్తించడానికి ఏ నాలుగు నెలలకో అయిదు నెలలకో ఒకసారి కళాత్మకం, వినోదాత్మకం అయిన - 'హమ్ దోనో' వంటి - చిత్రాలు విడుదల అవుతూ ఉంటాయి. సకాలంలో ఇటువంటి చిత్రాలు వచ్చి ఆదుకొంటున్నందువల్లనే సినీమా పరిశ్రమ విద్యావంతుల కోపానలానికి, శాపానలానికి ఆహుతి కాకుండా పోతున్నదేమో.
'జేబుదొంగ', 'కన్యకాపరమేశ్వరీ మహాత్మ్యం' (డబ్బింగు) చిత్రాలు రెండూ కొంచెం హెచ్చు తగ్గుగా ఒకే స్థాయిలో ఉన్నాయి. ఈ రెండు చిత్రాలూ కూడా ప్రేక్షక హృదయాలను కలచివేయగల విధంగా, ప్రేక్షకులలో తీవ్రమైన పశ్చాత్తాపాన్ని రేకెత్తించగల విధంగా రూపొందించబడ్డాయి. ఏ కారణాల వల్లనైతే నేమి ఈ చిత్రాలను చూస్తున్నంత సేపూ అన్ని వర్గాల ప్రేక్షకులు నవ్వుకొంటూ, దుఃఖిస్తూ, పశ్చాత్తాప పడుతూ, నిట్టూరుస్తూ ఉంటారు.
బాలల చలనచిత్ర సంఘం వారు 'గురుభక్తి', 'ఏకత' చిత్రాలను నిర్మించారు. వీటిలో 'ఏకత' చిత్రం నిడివి 2,875 అడుగులు. ప్రదర్శనకాలం 30 నిమిషాలు ఉంటుంది. ఐకమత్యాన్ని గురించి ప్రబోధించే చిత్రం ఇది. భారతదేశంలో పూర్వం రాజులు తమలో తాము కక్షలు పెంచుకోవడం వల్ల విదేశీశత్రువులు మన దేశం మీదికి దండెత్తి సర్వనాశనం చేశారనీ, అందరూ ఐకమత్యంతో మెలగితే ఏశక్తీ మనను ఎదిరించలేదనీ ఒక పాఠశాలలో ఉపాధ్యాయిని పిల్లలకు చెబుతున్నట్లుగా దీనిని చిత్రీకరించారు. దేశద్రోహి అంభి వల్ల పురుషోత్తముడు అలెగ్జాండర్ చేతుల్లో ఎలా ఓడిపోయాడో ఆమె ఉదాహరణగా చెబుతుంది.
శంకర్ మూవీస్ వారి 'డార్క్ స్ట్రీట్' హిందీ డిటెక్టివ్ చిత్రం. తెలుగులో ఈనాడు లారీల కొద్దీ ఉత్పత్తి అవుతూ, తెలుగు పాఠకుల, ప్రేక్షకుల ఆదరాభిమానాలకు గురి అవుతున్న డిటెక్టివ్ నవలలకు నకలుగా ఉంది ఈ చిత్రం. ఈ 'అపరాధపరిశోధన' తెలుగులో చలన చిత్రాలకు వ్యాపించకుండా, కేవలం సాహిత్యానికే పరిమితమై ఉండడం మన అదృష్టం. పాపం హిందీ, తమిళ రంగాలలో ఈ అపరాధ పరిశోధన... చలన చిత్రాలకూ, సాహిత్యానికీ కూడా పట్టింది.
ఇది స్టంటు చిత్రమని పేరు చూస్తేనే తెలిసిపోతుంది. అంత చక్కగా అతికేటట్లు పెట్టారు పేరు. ఈ చిత్రంలో ఇంకా స్టంటు చిత్రానికి కావలసిన సర్వలక్షణాలు ఉన్నాయి. స్టంటుకు అంతరాయం కల్పించని కథ, కథకు తగ్గ భాష అన్నీ చక్కగా అమరాయి. రీళ్ళ తరబడి కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు చేసి నటీనటులు అలసిపోగానే వారికి విశ్రాంతి కల్పించడంకోసం మధ్య మధ్య కథ వచ్చిపోతూ ఉంటుంది. ఈ కథలో మరొక విశేషం కూడా ఉంది. అది అవసరమైనప్పుడు జానపద చిత్ర వాతావరణంలోనికి, అక్కర్లేదనుకున్నప్పుడు సాంఘిక చిత్ర వాతావరణంలోనికి అంగలు వేస్తుంది. ఆయా సందర్భాలననుసరించి కత్తులు, గుర్రాలు, పిస్తోళ్ళు, జీప్ కార్లు కథలో ప్రవేశిస్తూ ఉంటాయి. నటులు కూడా కాసేపు జానపద వీరుల దుస్తులు, కాసేపు పాంట్లూ, జర్కిన్ లూ ధరిస్తారు.