సారథీ స్టూడియోస్ ఇంతకు ముందు నిర్మించిన చిత్రాల స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా-ఒకవిధంగా వాటికంటే ఒక మెట్టు ఉన్నత స్థాయిలో ఉన్నది 'కలసివుంటే కలదుసుఖం' చిత్రం. ఆ చిత్రాల మాదిరిగానే ఇది కూడా 'సాంఘిక ప్రయోజనం' పేరుతో నిర్మించబడింది. సారథీ స్టూడియోస్ ఇంతకు ముందు నిర్మించిన చిత్రాలన్నీ నినాద ప్రధాన చిత్రాలు. ఈ చిత్రంలో నినాదం పేరులో తప్ప వేరే ఎక్కడా వినిపించదు. ఇది వినోద ప్రధాన చిత్రం. ఆర్థిక విజయానికి కావలసిన బాక్సాఫీసు హంగులన్నింటినీ ఏర్చి కూర్చారు ఈ చిత్రంలో. అందుకే కథ 17,800 అడుగులు పొడుగుసాగింది.
ఈ చిత్రం విశేషమంతా పేరులోనే ఉంది. మూడు గంటల కథ ఆ పేరులో ఇమిడిపోయింది. ఇది ఉమ్మడి కుటుంబ వ్యవస్థను గురించిన చిత్రమని పేరును చూసి ఇట్టే గ్రహించవచ్చు. ఆనంద నిలయంగా ఉన్న ఉమ్మడి కుటుంబంలోనికి ఒక విలన్ ప్రవేశిస్తాడనీ, అతని వల్ల కుటుంబం చీలిపోయి నానా కష్టాలపాలు అవుతుందనీ, చివరికి విలన్ కుట్ర బైటపడి అంతా కలుస్తారనీ ఈ చిత్రం పేరు సూచిస్తుంది. టూకీగా కథ ఇంతే.
పట్టాభిరామయ్య (రంగారావు) సుందరరామయ్య (పెరుమాళ్లు) అన్నదమ్ములు. వారిది ఉమ్మడి కుటుంబం. ఎలాంటి పొరపొచ్చాలు లేక హాయిగా సంతృప్తితో జీవిస్తున్నారు. కలిమికి లోటులేదు. పట్టాభిరామయ్యకు సూర్యకాంతం మార్కు భార్య (సూర్యకాంతం) ఉంది. ఆవిడపేరు సౌభాగ్యమ్మ. సంతానం లేదు. సుందరరామయ్య భార్య రమణమ్మ గుణవతి (హేమలత). వారికి ఇద్దరు పిల్లలు. పెద్దవాడు కిష్టయ్య (రామారావు) ఒట్టి అమాయకుడు. చిన్నతనంలో కరెంట్ షాక్ తగిలి ఒక చెయ్యి, కాలు అవిటి అయినాయి. రెండవ వాడు రఘు (హరనాథ్) పట్నంలో పెద్ద చదువు చదివాడు. ఈ కుటుంబంలోనికి రంగూన్ రాజా (రేలంగి) రూపంలో శని ప్రవేశిస్తుంది. అతను సౌభాగ్యమ్మకు మేనల్లుడి వరస అవుతాడు. ఆ చుట్టరికం కలిపి తిష్టవేశాడు. ఒక్కడే రాకుండా చెల్లెలు జానకి (గిరిజ)ని కూడా తీసుకు వచ్చాడు. రమణమ్మ రాధ అనే అనాధ యువతి (సావిత్రి)ని చేరదీసి ఆదరిస్తుంది. ఆమె కూడా ఆ యింట్లో ఒకతెగా కలిసిమెలిసి ఉంటుంది. రంగూన్ రాజా సౌభాగ్యమ్మకు విషం నూరిపోసి ఇంట్లో కలహాలు పుట్టిస్తాడు. అతని వల్ల ఆ ఇల్లు రెండు చెక్కలవుతుంది. ఆస్తి పంపకాలు జరుగుతాయి. సుందరరామయ్య రెండవ కొడుకు రఘును తనవైపు తిప్పుకొని రంగూన్ రాజా తన చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేస్తాడు. తర్వాత సౌభాగ్యమ్మకు మంచి మాటలు చెప్పి ఇల్లు తాకట్టు పెట్టించి వేలకు వేలు గుంజుతాడు. పట్నం వెళ్లి సర్కస్ కంపెనీ పెడతాడు. కుటుంబాన్ని సర్వవిధాలా ధ్వంసం చేస్తాడు. ఈలోగా కిష్టయ్యకు, రాధకు పెళ్లి అవుతుంది. చివరికి క్లయిమాక్సులో కిష్టయ్యకు కరెంట్ షాక్ తగిలి కాలు, చెయ్యి మామూలుగా వచ్చేస్తాయి. అన్నదమ్ములిద్దరూ కలసి రంగూన్ రాజాకు బుద్ది చెప్తారు. మళ్లీ అంతా కలుసుకుంటారు.
ఆత్రేయ రచన, రేలంగి అభినయం ఈ చిత్రానికి పెద్ద రక్షణలు. తెరవెనుక సామగ్రిలో ఆత్రేయ రచన, తెరమీది అంశాలలో రేలంగి నటన డామినేట్ చేశాయి. రచనలోని ధాటియే చిత్రానికి వేగం, జవం చేకూర్చి పెట్టాయి. ముఖ్యంగా రేలంగి కనుపించే ప్రతి సన్నివేశం చాలా ఉత్తేజకరంగా ఉంది. మిగతా నటీనటులంతా కథోచితంగా నటించారు. ఎన్.టి. రామారావుకు ఈ చిత్రంలో కొత్తరకం పాత్ర లభించింది. ఆయన నటనకు బహుజనాదరణ లభించగలదనడంలో సందేహం లేదు. ఇందులో 8 పాటలు ఉన్నాయి. వీటిలో చాలా పాటలు హిట్ కాగల అవకాశం ఉంది. 'ముద్దబంతిపూలు బెట్టీ' అనే పాటకు కూర్చిన వరస-అనుకరణే అయినా-చక్కగా ఉంది. ఆ పాట చిత్రీకరణ కూడా బాగా ఉంది. ఈ చిత్రానికి సర్కస్ ఒక ఆకర్షణ.
దర్శకత్వం: తాపీ చాణక్య; మాటలు: ఆచార్య ఆత్రేయ; పాటలు: కొసరాజు, ఆరుద్ర, శ్రీశ్రీ; సంగీతం: మాస్టర్ వేణు; ఛాయాగ్రహణం: యూసుఫ్ మూల్జీ; తారాగణం: ఎన్.టి. రామారావు, సావిత్రి, రేలంగి, రంగారావు, హరనాథ్, గిరిజ, సూర్యకాంతం, పెరుమాళ్లు, హేమలత, అల్లు రామలింగయ్య వగైరా.
నండూరి పార్థసారథి
(1961 సెప్టెంబర్ 10వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)
Copyright © 2021 nanduri.com | All Rights Reserved | Site designed and maintained by CodeRhythm Works