Title Picture

(సచిత్ర మాసపత్రిక ప్రారంభ (జూన్) సంచిక; సంపాదకుడు : సుధానిధి, కార్యాలయ స్థానం, గవర్నర్ పేట, విజయవాడ-2; 1/8 డెమ్మి సైజు, 112 పేజీలు; వెల : రూ. 60 పైసలు)

ఈ సంచికలో బలివాడ కాంతారావు, పాలంకి వెంకటరామచంద్రమూర్తి, హవిస్, ఇసుకపల్లి లక్ష్మీనరసింహశాస్త్రి, రంధి సోమరాజు, తూలికా భూషణ్, పి. ఆనందారామంల కథలు ఉన్నాయి. కొడవటిగంటి కుటుంబరావు సీరియల్ నవల 'అనామిక' ప్రారంభం అయింది. రాజకీయాలకు సంబంధించి 'లోకాలోకనం' అనే శీర్షిక ఉంది. దీని నిర్వహణ అమృతరావు. సినిమా శీర్షిక 'చిత్ర శ్రీ' నిర్వహణ - ఎల్లోరా, బొమ్మలు - సరాగం.

కథల నాణ్యం, సంచిక రూపు రేఖలు సంతృప్తికరంగా ఉన్నాయి. ఇదే నమూనాలో ఇంతకు ముందే నాలుగైదు సచిత్ర మాస పత్రికలు ఉన్నాయి కనుక, వీరు పత్రికకు వేరే సైజు, తరహా ఎంచుకుని ఉంటే మరింత బాగుండేది. కొత్త దనాన్ని చవిచూపించినట్లూ అయేది. పత్రికకు ప్రత్యేకత ఉండాలంటే ఇతర పత్రికలలో లేని కొత్త శీర్షికలను ప్రవేశపెట్టటం అవసరం. ఆ పని ముందు ముందు చేస్తారని ఆశిద్దాం. అంతే కాక కనీసం ప్రారంభ సంచికకైనా ముఖపత్రం పై సినిమా తార బొమ్మ వేయకుండా ఉంటే బాగుండేది. మిగిలిన మాసపత్రికల కంటే ధర తక్కువగా పెట్టటం మెచ్చతగ్గ విషయం. 60 పైసలకు ఎనిమిది మంది ప్రముఖుల కథలు చదివే అవకాశం కల్పించారు.

నండూరి పార్థసారథి
(1965 జూలై 28వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post