కళా పిపాస గల మానవునికి ప్రకృతిలోని ప్రతిదృశ్యమూ సౌందర్యమయంగా, ప్రతి శబ్దమూ సంగీతమయంగా గోచరిస్తుంది. పక్షుల కిలకిలా రవాలు, ఆలమందల అంబారవాలు, జలపాతాల గంభీరనాదాలు, సెలయేళ్ల నీళ్ళ చిరుసవ్వళ్ళు, పడుచుపిల్లల కాలియందెల చప్పుళ్ళు అతన్ని పరవశింపచేస్తాయి. చుంయ్ చుంయ్మని పితికేపాలల్లో, రంయ్ రంయ్ మని వడికే రాటంలో, రోకటిపోటులో, రంపపు కోతలో, సమ్మెట దెబ్బలో అద్భుత 'లయ' విన్యాసాన్ని దర్శించి ముగ్ధుడవుతాడు. 'లయ' అతన్ని పురిగొల్పుతుంది. వార్షుక మేఘాన్ని గాంచిన నెమలిలా వెర్రి ఆనందంలో పరవశించి నర్తిస్తాడు.
ప్రకృతి సౌందర్యాన్ని దర్శించిన ఆనందంలోనే సంగీత, నృత్య, సాహిత్య శిల్పకళలు ఆవిర్భవిస్తాయి. కళాసృష్టిలో స్రష్టపొందిన అనుభూతిని ప్రేక్షకులకు, శ్రోతలకు అందజేసేది కళ. ఆనందమే కళకు పరమావధి.
'రాగం' మానవుని ఆనందంలో మైమరపించేస్తుంది. 'లయ' మైమరచిన మానవుని జాగృతం చేస్తుంది. సంగీతానికి జీవం రాగం. నృత్యానికి జీవం లయ. రాగతాళాల సమ్మేళనం సంగీతం. సంగీత నృత్యాలకు గాఢమైన అనుబంధం వున్నది.
శాస్త్రీయ సంగీతం గంధర్వవిద్యగా, అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యవర్ణాలవారికి మాత్రమే ప్రవేశం గల రాజదర్బారులకూ, పండిత సభలకూ మాత్రమే పరిమితం కావటం వలన జానపద సంగీతం ఉద్భవించిందని కొందరు చెబుతారు. ఎన్ని యుగాలనాడు యీ జానపద సంగీతం, నృత్యాలు పుట్టాయో తెలియదు.
ప్రకృతిలోని సహజశబ్దాలే జానపదులకు రాగాలను, తాళగతులను నేర్పాయి. సంఘంలోని మిగిలిన మూడు వర్ణాలవారికంటే వీరికి ప్రకృతితో సాన్నిహిత్యం ఎక్కువ. వారి కంటే వీరు శారీరకంగా ఎక్కువ శ్రమిస్తారు. ప్రకృతే వీరి శ్రమను బాపి ఆనందాన్నిస్తుంది. సకాలంలో వర్షాలుపడితే, పంటలు బాగా పండితే వెర్రి ఆనందంతో గంతులు వేస్తారు. పాటలుపాడుకుంటారు. వసంతకాలం వచ్చి ప్రకృతిని సౌందర్యంతో వెలిగిస్తే, శరత్కాలంలో వెన్నెలలు వెల్లివిరిస్తే ఆనందం పట్టలేక సంగీతనృత్యాలతో వేడుకలు జరుపుకుంటారు. ప్రకృతి శీతకన్నువేస్తే, బ్రతుకు గడవడమే కష్టమయితే వినోదాలు, వేడుకలూ అన్నీ సమసిపోతాయి. వారి జీవితంలోని సుఖదుఃఖాలు కేవలం ప్రకృతిమీదనే ఆధారపడి వుంటాయి.
శాస్త్రీయ సంగీతంలో రాగానికి ప్రాముఖ్యం ఉంటే, జానపద సంగీతంలో తాళానికి ప్రాముఖ్యం. అందుకే మైమరపించే గుణం శాస్త్రీయ సంగీతంలోనూ, ఉత్తేజపరచే గుణం జానపద సంగీతంలోనూ ఎక్కువగా కనుపిస్తాయి.
లయ నృత్యాన్ని పురిగొల్పుతుంది. లయ మానవుని కర్తవ్యోన్మఖుణ్ణి చేస్తుంది. కదన రంగంలోని భేరీ నినాదాలు సైనికుల పదగతులను తొందరింపజేస్తాయి. రోకటిపోటులోని లయ, పోటును తొందరింపజేస్తుంది. శ్రామికునికి ఉత్సాహాన్నిచ్చి, ఉత్తేజపరుస్తుంది లయ; జానపద నృత్య, సంగీతాలకు లయ ప్రాణం.
ప్రకృతిలోని శబ్దసంచయమే జానపదసంగీతానికి ప్రాతిపదిక, అందుకే జానపద సంగీత సంప్రదాయం ఒకతరం నుంచి మరొక తరానికి వారసత్వంగా వస్తున్నప్పటికీ, ప్రకృతిలోని మార్పులకు అనుగుణంగా, యీ సంగీతం కూడా మార్పులకు లోనవుతూ వుంటుంది. ఒక ప్రాంతానికి చెందిన జానపదులు మరొక ప్రాంతానికి వలసపోతే, పరిసరాలలోని ఆ మార్పు క్రమంగా వారి సంగీతానికి కూడా సంక్రమిస్తుంది.
ప్రకృతిలో అనునిత్యమూ మనకు గోచరించే లయవిన్యాసవైచిత్రిని శాంతారాం తాను నిర్మిస్తున్న ప్రతి చిత్రంలోనూ చూపుతున్నారు. ఫిల్మ్స్ డివిజన్ తరపున ఆయన నిర్మించిన 'ధర్తీకి ఝంకార్' డాక్యుమెంటరీ వర్ణ చిత్రంలో యీ లయ సిద్ధాంతాన్ని ప్రత్యక్షంగా నిరూపించారు. గుజరాతీ జానపద సంగీతంపై లోగడ శాంతారాం ఫిల్మ్స్ డివిజన్ తరపున ఒక డాక్యుమెంటరీ నిర్మించారు. భారత దేశంలోని వివిధ ప్రాంతాల జానపద నృత్య సంగీత సంప్రదాయాలను ఒక మాలగా ఈ చిత్రంలో కూర్చారు. జానపద నృత్య, సంగీతాలకు లయ ప్రాణంవంటిది. అందుకే ప్రకృతిలోని వివిధ శబ్దాలలో గోచరించే 'లయ'ను గురించి చిత్రం ఆదిలో పరిచయం చేశారు.
ప్రకృతిలోని వైలక్షణ్యం, శీతోష్ణస్థితి, పరిసరాలు, భాష, నాగరికత, పూర్వచరిత్ర-యిన్నింటి ప్రభావం జానపద నృత్య సంగీతాలపై వుంటుంది. దుర్గమారణ్య ప్రాంతాల నృత్యసంగీతాలలో క్రూరమృగాలభయం, భద్రతలేని జీవన స్వభావం, సాహసం, మొదలయిన లక్షణాలు కనుపిస్తాయి. సస్యశ్యామలమయిన మైదాన ప్రాంతాల నృత్య సంగీతాలలో ప్రశాంతత, చీకూచింతాలేని స్వభావం, తృప్తి గోచరిస్తాయి. ఇలాగే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క లక్షణం ప్రధానంగా కనుపిస్తుంది. ఈ విషయాలను ''ధర్తీకి ఝంకార్'' చిత్రం నిరూపిస్తుంది. తూర్పున మణిపూర్ నుంచి పశ్చిమాన మహారాష్ట్ర వరకూ, ఉత్తరాన కాశ్మీర్ నుంచి దక్షిణాన కేరళ వరకూ మొత్తం 13 ప్రాంతాలలోని 35 రకాల జానపద నృత్య సంగీతాలను యిందులో చూడవచ్చు. కేవలం నృత్యాలను చూడటం, పాటలు వినడమేకాకుండా ఆయా ప్రజల జీవన విధానాలను అర్థం చేసుకునేందుకు కూడా యీ చిత్రంలో అవకాశం వుంది. భారతదేశంలోని ప్రకృతి స్వరూప స్వభావాలలో, ఆచార సంప్రదాయాలలో, వేష భాషలలో, ఎంత వైవిద్యం వున్నదో, యీ చిత్రంలో మనం చూసే నృత్య సంగీతాలలో కూడా అంతవైవిధ్యం వున్నది.
ఈ జానపద గీతాలలో కొన్నింటి రాగాలు మనం యిదివరకు విన్నవిగా కనుపిస్తాయి. మన సినిమా సంగీత దర్శకులు యీ రాగాలను యధేచ్ఛగా వాడుకొంటూ వుండటమే యిందుకు కారణం. అయితే వ్యాపార చిత్రాలలో మాదిరిగా కాక యీ చిత్రంలో మనం స్వచ్ఛమైన జానపద సంగీతాన్ని వినగలం. అయితే యీ కాలంలో జానపదులకు సైతం పట్టణాలతోనూ, సినిమాలతోనూ సంబంధం ఏర్పడుతూ వుండడం వలన వారి సంగీత నృత్యాలలోని స్వచ్ఛత కొంత లోపిస్తున్నది. ఇంకా కొంత కాలానికి ఆధునిక నాగరికత సర్వత్రా వ్యాపించి, జానపదనృత్య, సంగీతాలలోని వైలక్షణ్యం పూర్తిగా నశించిపోయే ప్రమాదం వున్నది. సాధ్యమైనంత వరకు ఆధునిక కృతక నాగరికత వలన ప్రభావితంకాని నృత్యాలనే ఎంచుకుని యీ చిత్రాన్ని నిర్మించారు. ఏనాడో తీసి ఉండవలసిన ఈ చిత్రం కనీసం ఈనాటికైనా - ముఖ్యంగా నృత్య చిత్రీకరణలో, వర్ణ సమ్మేళనంలో సిద్ధహస్తుడైన శాంతారాం ఆధ్వర్యం క్రింద-నిర్మితం కావడం ఎంతైనా హర్షించతగిన విషయం. వేలుపెట్టి చూపించతగినంతటి లోపాలేమీ లేకుండా చక్కగా చిత్రీకరించిన దర్శకుడు ఎ. భాస్కరరావు అభినందనీయుడు.
'రోఫ్' (కాశ్మీర్), 'మహాసు' (హిమాచల్ ప్రదేశ్), 'భాంగ్రా (పంజాబ్), 'గర్బా' (గుజరాత్), 'కోలి' (మహారాష్ట్రం), 'ఘుమర్' (రాజస్థాన్), 'స్టిల్ట్' (మధ్యప్రదేశ్), 'తబల్ చోంగ్బా' (మణిపూర్), 'మోప్లా' (కేరళ), 'బంజారా' (ఆంధ్రప్రదేశ్), నృత్య విశేషాలు, ఇంకా మద్రాసు, బీహార్, అస్సాం, నాగ ప్రాంతాల నృత్యాలు ఈ చిత్రంలో వున్నాయి.
మైసూరు, ఒడిస్సా ప్రాంతాలను నిర్మాతలు పూర్తిగా విస్మరించడం అన్యాయమనిపిస్తుంది. జానపద సంగీత నృత్యాలు వారికి బొత్తిగా లేవనడం దుస్సాహసమే అవుతుంది.
బంజారా (లంబాడీలు) నృత్యానికంటే చక్కని నృత్యాలు ఆంధ్రలో లేకపోలేదు. ''గొబ్బీఎళ్లో సకియా వినవే'' అని పాడుతూ ఆడపిల్లలు చేసే గొబ్బి నృత్యం, అట్లతద్దినాడు పడుచుపిల్లలు చేసే కోలాటనృత్యం, దీపపు సెమ్మచుట్టూ వలయాకారంలో నిలిచి భక్తులు చేసే చెక్క భజనవంటివి ఆంధ్రదేశంలో చాలా వున్నాయి. ప్రతిరాష్ట్రంలోనూ యింకా ఎన్నో రీతుల జానపద నృత్యాలు వుంటాయి. కాని స్థలభావం వల్ల అన్నింటినీ చూడడం వీలుపడదు. ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒకటి రెండు నృత్య విశేషాలను కంటే ఎక్కువ గ్రహించడం సాధ్యపడదు.
ఒకానొక ప్రాంతపు ప్రజల జీవనంలో గోచరించే ప్రముఖ లక్షణాన్ని గ్రహించి, ఆ లక్షణాన్ని ప్రతిభింబించే నృత్య విశేషాన్ని మాత్రమే యీ చిత్రంలో స్వీకరించడం జరిగింది. ఉదాహరణకు రాజస్థాన్ ప్రజలకు శౌర్య సాహసాలు వంశానుగతంగా వస్తున్న లక్షణాలు. వారి నృత్యంలో కత్తులను ఉపయోగిస్తారు. ఇంకా అనేక రీతుల నృత్యాలు వారికి వుండవచ్చును. కాని దర్శక, నిర్మాతలు యీ నృత్యాన్నే స్వీకరించారు. మహారాష్ట్రంలోని కోస్తా ప్రజలకు చేపలుపట్టడం వృత్తి. అందుచేత జాలరి నృత్యాన్ని నిర్మాతలు స్వీకరించారు.
ఇక వాద్యాలలో చెప్పలేనన్ని రకాల కనిపిస్తాయి. ఉత్తర హిందూస్థానంలో కనుపించినన్ని రకాల వాద్యాలు దక్షిణాదిన కనుపించవు. నాటురకం సారంగులు, వింతవింత ఫిడేళ్లు, గజన్నర పొడుగు పిల్లన గ్రోవులు ఉత్తరాదిన కనిపిస్తాయి. దక్షిణాదిన సన్నాయి ప్రధానంగా కనిపిస్తుంది. లయవాద్యాల ఆకృతులలో శబ్దాలలో మరింత వైవిద్యం, వైచిత్ర్యం ఆగుపిస్తుంది. మద్దెళ్ళూ, డోళ్ళూ, రండోళ్ళూ, డప్పులు, డోలకులు, తబలాలు, తాషామర్బాలు, చిడతలు, చెక్కలు, కోలాటంకర్రలు, ఘటాలు, అగుపిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే శాస్త్రీయ సంగీతంలో ఎన్ని వాద్యాలు వున్నాయో, అన్నింటినీ చౌక వాద్యాలుగా జానపదులు తయారు చేసుకున్నారు.
మూడు సంవత్సరాలు శ్రమించి ఫిల్మ్స్ డివిజన్ వారు యీ చిత్రాన్ని నిర్మించారు. ఆయా ప్రాంతాలకు వెళ్లి నృత్యాలను చిత్రీకరించడానికి రెండు సంవత్సరాలు, ప్రాసెసింగ్, ప్రింటింగ్ పనులకు మరొక సంవత్సరం పట్టింది. వివిధ ప్రాంతాలలో పండుగలు, వేడుకలు ఎప్పుడు జరుగుతాయో తెలుసుకొని ఆ సందర్భాలలో కెమేరాలను, రికార్డింగ్ పరికరాలను, సిబ్బందిని తీసుకుపోయి ఎన్నో శ్రమలకోర్చి యీ చిత్రాన్ని రూపొందించారు. నృత్యాల చిత్రీకరణతోపాటే రికార్డు చేసిన సహజ సంగీతం కాక, మిగిలిన నేపధ్య సంగీతమంతా శాస్త్రీయంగా వుంది. అలాకాక జానపద రాగాలలోనే కూర్చినట్లయితే మరింత సహజంగా వుండేదేమోననిపించింది. ఎస్.ఎన్. భగవత్ వర్ణ ఛాయా గ్రహణం చక్కగా వుంది.
ఫిల్మ్స్ డివిజన్ లో అడిషనల్ డిప్యూటీ ప్రొడ్యూసర్ గా వుంటున్న శ్రీ ఎ. భాస్కరరావు యీ చిత్రానికి దర్శకత్వం వహించారు. స్క్రిప్టు కూడా ఆయనే వ్రాశారు. ఈయన లోగడ శాంతారాం నిర్మించిన 'ఆద్మీ' చిత్రానికి కథ వ్రాశారు. 'ధర్తీకి ఝంకార్' చిత్రాన్ని చూస్తుంటే, అన్ని విధాలా భాస్కరరావు శాంతారాం ప్రతిభను పుణికి పుచ్చుకున్నట్లు అనిపిస్తుంది. టైటిల్స్ మొదలుకొని సమాప్తం వరకు చిత్రమంతటా శాంతారాం తరహా ప్రతిభ మనకు ద్యోతకమవుతుంది.
శ్రీ ముల్క్ రాజ్ ఆనంద్ హిందీలో వ్యాఖ్యానం వ్రాశారు-ఇది ఫిల్మ్స్ డివిజన్ వారు నిర్మించిన చిత్రం కాబట్టి, దేశవ్యాప్తంగా ప్రదర్శింపబడవలసిన చిత్రం కాబట్టి మామూలు న్యూస్ రీల్సులోవలె దేశంలోని అన్ని ముఖ్య భాషలలోనూ వ్యాఖ్యానం ఏర్పాటు చేస్తే బాగుండేది. అలాకాక అన్ని ప్రతులలోనూ హిందీ వ్యాఖ్యానాన్నే ఉంచడం వలన చిత్రం యొక్క ముఖ్య ప్రయోజనం దెబ్బ తింటున్నది. ఇందులో వ్యాఖ్యానానికి ఎంతో ప్రాముఖ్యత వుంది. హిందీ తెలియనివారికి యీ చిత్రం కేవలం జానపద నృత్యాల జాబితాగా కనిపిస్తుంది. విసుగు పుడుతుంది. హిందీ తెలిసినవారికి యీ చిత్రం మధురమైన జానపద గీతంలా వుంటుంది.
నం.పా.సా.
(1960 అక్టోబరు 23 ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)