Title Picture

(కథాసంపుటి. రచన : డి. రామలింగం ; ప్రచురణ, ప్రాప్తిస్థానం : దేశికవితా మండలి, విజయవాడ-2; క్రౌన్ సైజు : 142 పేజీలు; వెల : రెండు రూపాయలు)

ఇందులో కాగితపు పడవలు, సిపాయిరాముడు, బర్సాతీ, గమ్యస్థానం, భంగపడిన రాగబంధం, భార్యోపహతుడు, అత్తా-అల్లుడు, జాగృతి, కబుర్లలో కత్తిగాట్లు, ప్రాప్తం లేదు-అనే పదికథలు ఉన్నాయి.

ఈ కథలలో 'ప్రాప్తం లేదు' అనేది ఒకటి మాత్రం విషాదాంతం. అన్నిటికంటే మంచికథ, హృదయాన్ని కదిలించి, మనమొహం మీద గంభీరముద్ర వేయగల కథ ఇదే. మిగిలిన కథలలో విశేషమేమీ లేదు. చదివిన వెంటనే మరచిపోవటానికి వీలైనవే. వీటిల్లో చాలాభాగం 'అమ్మాయి-అబ్బాయి' కథలే.

ఈ కథల్లో ఏవీకూడా ఏడుపుగొట్టుగా, జిడ్డుగా లేవు. రేపు చదవవచ్చులే అని సగంలో వాయిదా వేయకుండా గబగబ ఒక్క ఊపులో ఒక్క గంటలో చదివేసెయ్యగలం. కాలక్షేపానికి ఎంతబావున్నప్పటికీ ఒక్క గంట భాగ్యానికి రెండు రూపాయలు పెట్టి కొనడానికి ఉసూరు మనిపిస్తుంది. కథాసాహిత్యంపై ఆసక్తికల వారు కొని అట్టే పెట్టుకొనకపోయినా, తీరిక ఉన్నప్పుడు గ్రంథాలయానికి వెళ్ళి చదవ తగిన పుస్తకం 'కాగితపు పడవలు'.

నండూరి పార్థసారథి
(1964 సెప్టెంబర్ 30వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post