Title Picture

హేమాహేమీల శిఖరాగ్ర సమావేశం

దర్శకత్వం : రాజ్ ఖోస్లా; రచన : రాజేంద్రసింగ్ బేడీ; పాటలు : మజ్రూహ్ సుల్తాన్ పురీ; సంగీతం : ఎస్.డి. బర్మన్; ఛాయాగ్రహణం : జాల్ మిస్త్రీ; నేపథ్యగానం : ఆశాభోన్ స్లే, మహమ్మద్ రఫీ, మన్నాడే, ముఖేష్; నటీనటులు : దేవానంద్, సుచిత్రాసేన్, నాజిర్ హుస్సేన్, ఆచలాసచ్ దేవ్, ధుమాల్-వగైరా.

అనాథుడు, వీధులపక్క బిచ్చగాళ్ళ మధ్య పెరిగాడు. చిన్నతనంలో తెలియకచేసిన ఏ తప్పుకో ఫలితంగా బాలనేరస్థుల శిక్షణాలయం చేరాడు. పెరిగి పెద్దవాడై బయటికి వస్తే, ఆదరించిన వారొక్కరు లేకపోయారు. ఒక్క చల్లని ఓదార్పు మాటకు కరువాచిపోయాడు. దుష్టగ్రహాలు చుట్టు ముట్టగా, నిస్సహాయుడై అవి చెప్పినట్లల్లా చేశాడు. పొరపాటున శత్రువును హత్యచేశాడు. పోలీసులకు వెరచి వందల మైళ్ళు ప్రయాణం చేసి ఒక మారుమూల కుగ్రామానికి చేరాడు బెదురుతూ బెదురుతూ. అక్కడ మరో శనిగ్రహం అతని రాకకై వేచియున్నాడు. బలహీనుడై ఆ గ్రహంచేతికి కీలుబొమ్మ అయ్యాడు. విషమపరిస్థితులు క్రమ్ముకొన్నాయి. భయం, నిస్సహాయత ముసురుకొన్నాయి. మరోతప్పు చేశాడు. ఆ తప్పుతో ఒక స్వర్గసీమకు ద్వారాలు తెరుచుకున్నాయి-ఇరవైయేళ్ళ క్రితం ఒక్కగాను ఒక్కకొడుకు తప్పిపోగా బెంగతో కుమిలిపోతున్న ఒక జమిందారు దంపతులకు పుత్రుడుగా నటించాడు. తనను కన్న బిడ్డడుగా భావించి, ఊహించశక్యంకాని ప్రేమ, వాత్సల్యం కురిపిస్తే పరవశించిపోయాడు. జమీందారు కూతురు తనను అన్నగా భావించి ఎనలేని ప్రేమ చూపుతుంది. చిలిపిగా అతనితో హాస్యాలాడుతుంది. అల్లరి చేస్తుంది. ఆడుకొంటుంది. కాని అతనికి ఆమెపై సోదరీభావం లేదు. నిస్సారమైన తన ఎడారిజీవితంలో అమృతవాహినులు ప్రవహించినట్లు తన్మయుడైపోయాడు. ఆమెపై రోజురోజుకీ మమకారం గాఢతరమవుతుంది. ఆమె తన జీవిత సర్వస్వమయింది. కాని తాను అన్నను కాదని ఆమెతో చెప్పలేడు. జమీందారు దంపతులగుండెలు బ్రద్దలవుతాయి. తాను హత్య చేసింది వారి కుమారుణ్ణేనని నిదర్శనం దొరుకుతుంది. వారి పుత్రుణ్ణి హత్యచేసినందుకు వారికి పుత్రుడు లేని లోపాన్ని తీర్చటం తన విధి అనుకొన్నాడు. అతడు తనసోదరుడుకాదని ఒక సన్నివేశంలో ఆమెకు ధ్రువపడుతుంది. కాని రహస్యం బైటపెడితే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. అతనిపై పెంచుకున్న సోదర ప్రేమను త్రెంచివేసుకోలేదు. తనపై తనకు విరుద్ధమైన ప్రేమను పెంచుకొని, వ్యక్తం చేయలేక తనలో తాను కుమిలిపోతున్న అతని పట్ల ఆమెకు అపారమైన జాలి కలుగుతుంది. తనను గుప్పిటిలో పెట్టుకుని తమస్వార్థానికి వినియోగించుకొంటున్న దుష్టగ్రహాలపై అతను తిరుగుబాటు చేసి వాటిని వదిలించుకుంటాడు. ఆమెకు వేరే సంబంధం కుదిరి, పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిపోతుంది. రహస్యాన్ని వెల్లడించి తల్లిదండ్రులను క్షోభపెట్టవద్దని అతనికి సూచించుతుంది. అంతులేని వియోగాన్ని దిగమింగి, మౌనంగా ఉండిపోతాడు అతడు.

Picture
సుచిత్రా సేన్, దేవానంద్

ఇంత ఉదాత్తమైన ఇతివృత్తాన్ని దాదాపు ఇంత సున్నితంగానూ, అద్భుతంగానూ వెండి తెరమీద శిల్పించారు దర్శకుడు, ఛాయాగ్రాహకుడు. అతిక్లిష్టమైన పరిస్థితుల మధ్య ఆయా పాత్రలు అనుభవించే క్షోభను, విషాదాన్ని, సంఘర్షణనూ, అనిర్వచనీయమైన వారి మనఃస్థితినీ, ప్రేక్షకుల హృదయాలు సానుభూతితో ద్రవించగల విధంగా, అద్భుతంగా వ్యాఖ్యానించాడు సంగీత దర్శకుడు బర్మన్. ఉన్న ఏడు పాటలలోనూ మూడు పాటలు చాలా గొప్పగా ఉన్నాయి. మిగతా పాటలు కూడా బాగానే ఉన్నాయి.

చిత్రంలో కొన్ని చోట్ల మరీ 'వెకిలితనం' అనిపించేంతగా పాటలు, పిల్లి మొగ్గలు వేయించకుండా ఉంటే నాయికా నాయకులపై ప్రేక్షకులకు ఇంకా ఎంతో సానుభూతి కలిగేది. ఈ విషయంలో ముఖ్యంగా సుచిత్రాసేన్ కు దర్శకుడు చాలా అన్యాయం చేశాడు.

నవలలనీ, పురాణాలనీ, ఉద్ర్గంథాలనేకానీ చిన్న కథలనూ, స్కెచ్ లనూ చిత్రాలుగా తీసే అలవాటు భారతీయులకు లేదు. అలా జరిగిన బహుకొద్ది ప్రయత్నాలలో యిదీ ఒకటి. ఇందులో తీరుబడిగా చెప్పుకోతగినంత కథ ఏమీ లేదు. జమీందారు కుటుంబానికీ అతనికీ మధ్యగల ఆ ఉదాత్తభావం ఒక్కటే ఇందులోని కధాంశం. ఆ 'ఒక్క సెంటిమెంటు'తోనే 13 వేల అడుగుల చిత్రంగా దీన్ని నిర్మించారు. నిడివి ఇంకా కుదించి, 10 వేలలో తీస్తే ఇంకా బావుండేది.

'అతను'గా దేవానంద్, 'ఆమె'గా సుచిత్రా సేన్ నటించారు. జమీందారు దంపతులుగా నాజిర్ హుస్సేన్, అచలాసచ్ దేవ్ లు నటించారు. శిఖరాగ్రశ్రేణి నటీనటులు సాంకేతిక నిపుణులు ఈ చిత్రంలో సమావేశమయారు కనుక అద్భుతంగా ఉండి తీరాలనే అత్యాశాభావంతో ఈ చిత్రాన్ని చూస్తే అంతగా ఆశాభంగం కలగదనే చెప్పవచ్చును.

నండూరి పార్థసారథి
(1960 మే 22వ తేదీన ఆంధ్రప్రభ సంచికలో ప్రచురితమైనది)

Previous Post Next Post