సుప్రసిద్ధ హిందూస్థానీ సంగీత విద్వాంసురాలు కుమారి ప్రభా ఆత్రే క్రిందటి ఆదివారం నాడు ఇక్కడ 'బెంగళూరు సంగీత సభ' ఆధ్వర్యాన కచేరీ చేశారు. ఎం.ఏ. పట్టభద్రురాలైన కుమారి ఆత్రే సంగీతంలో పరిశోధన చేసి, డాక్టరేట్ స్వీకరించారు. యువతరానికి చెందిన హిందూస్థానీ గాత్ర సంగీత విద్వాంసులలో ఆమె ప్రముఖురాలు. ఆమె బెంగుళూరులో కచేరీ చేయడం అపురూపం. అందుకే ఆదివారం సాయంత్రం జోరున వర్షం కురుస్తున్నా కచేరీమందిరం సంగీత ప్రియులతో కిటకిటలాడి పోయింది.

కుమారి ప్రభా ఆత్రే 'బేహాగ్' రాగంతో కచేరి ప్రారంభించారు. ఈ రాగంలో ఆలాప్, విలంబిత్ ఖయాల్, ధ్రుత్ తరానా గంటసేపు గానం చేశారు. మొదట కొద్దినిమిషాలు కొంత మందకొడిగా అనిపించినా, వేగం పుంజుకున్న తర్వాత మనస్సును పూర్తిగా రాగభావంలోనికి మగ్నం చేసిన తర్వాత ఆమె గానం గొప్పగా రక్తి కట్టింది. ఈ రాగం తర్వాత ఆమె 'మిశ్రఖమాస్'లో ఒక ఠుమ్రీ గానం చేశారు.

విరామానంతరం ఆమె 'రాగేశ్వరి' రాగాన్ని విస్తారంగా గానం చేశారు. ఈ రాగంలో కొద్దిసేపు ఆలాపన చేసినపిమ్మట విలంబిత్ ఖయాల్, ధ్రుత్ ఖయాల్ లను మనోహరంగా గానం చేశారు.

'రాగేశ్వరి' ముగించగానే, బయట కురుస్తున్న వర్షానికి శ్రుతికలిపి 'మియాకిమల్హార్' రాగాన్ని అత్యద్భుతంగా గానం చేశారు ప్రభా ఆత్రే. మియాతాన్ సేన్ సృష్టించిన 'మియా కి మల్హార్' రాగం వర్షఋతువులో రాత్రి వేళ గానం చేయవలసిన రాగం. వర్షఋతు సౌందర్యాన్ని కళ్ళకు కట్టినట్లుగా చిత్రించే ఈ రాగం శ్రోతలను ఉర్రూతలూగించింది. దీని తర్వాత హిందూస్థానీ కచేరీ సంప్రదాయానుసారం 'భైరవి'తో కచేరీని ముగించారు.

ప్రక్క వాద్యాలుగా వాసంతి మహాప్సేకర్ హార్మోనియం వాయించగా, బాజీరావ్ సోరావనే తబలా వాయించారు. అగ్రశ్రేణి విద్వాంసులెందరికో ప్రక్క వాద్యం వాయించి, కాకలు తీరిన శ్రీమతి మహాప్సేకర్ అతి క్లిష్టమైన సంగతులను సైతం అవలీలగా వాయించి శ్రోతల ప్రశంసలందుకున్నారు.

నండూరి పార్థసారథి
(1975 జూలై 13వ తేదీన ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమైనది)

Next Post