Apursansar Picture

డాక్యుమెంటరీ సంవిధానాన్ని సంకేతాల (సింబల్స్)తో, ధ్వనుల (సజెషన్స్)తో, కళావిలువలతో మేళవించి, ఒకానొక వినూత్నమైన, విలక్షణమైన సంప్రదాయాన్ని ప్రవేశపెట్టిన శకపురుషుడు సత్యజిత్ రాయ్. చలనచిత్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయం ఆయనతో ఆరంభమయింది. వాస్తవిక దృక్పథం, సాంకేతిక (సింబాలిక్) దృక్పథం, కళాదృక్పథం ఆయన చిత్రాలలోని ప్రత్యేక లక్షణాలు, ఆయన చిత్రాలు మానవ జీవితమంతటి నిగూఢమైనవి, అగాధమైనవి-ఎవరికి ఎంత సంస్కారం వుంటుందో వారికి ఆయన చిత్రాలు అంత గొప్పగా వుంటాయి - కళా కైవల్యానికి స్వర్ణసోపానాలు ఆయన చిత్రాలు.

ఇది అసాధ్యం, అది అసంభవం అంటూ హేమాహేమీలు సవాళ్ళు చేసిన విషయాలను ఆయన అతి నిరాడంబరంగా, అవలీలగా చేసి చూపించాడు. అందుకే ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకులంతా ఆయనకు జోహార్లు చెబుతున్నారు. ఒక్కొక్క చిత్రంతో ఒక్కొక్క సారి దిగ్విజయంచేసి వస్తున్న 'విశ్వజిత్' రాయ్.

మామూలుగా మనం చూస్తున్న ఫీచర్ ఫిల్ములకూ, సత్యజిత్ రాయ్ చిత్రాలకూ ఏ విధంగానూ పోలికలేదు. వాటి దృక్పథాలలోనే భిన్నత్వం వున్నది. మామూలు చిత్రాలలో అసహజమైన వాతావరణం, కల్పితమైన సంఘటనలు, నాటకీయమైన సన్నివేశాలు, సంభాషణలు వుంటాయి. సత్యజిత్ రాయ్ చిత్రాలలో వాతావరణం సహజంగా వుంటుంది. సంఘటనలు, సన్నివేశాలు, పాత్రలు అన్నీ వాస్తవికంగా వుంటాయి. వాటిని తన దృక్పథం నుంచి వ్యాఖ్యానించేందుకై దర్శకుడు కొన్ని సంకేతాలను, థ్వనులను ప్రయోగిస్తాడు.

ఒక దృశ్యంలో ఒకానొక వస్తువును సంకేతంగా గ్రహించి, దానిని ప్రేక్షకుని దృష్టికి తీసుకొని రావాలంటే, కెమెరాదృష్టిని ఆ వస్తువుపైకి మరల్చడమో, లేక ఆ వస్తువుపై ఎక్కువ కాంతిని ఫోకస్ చేయడమో జరుగుతుంది మామూలు చిత్రాలలో. కాని సత్యజిత్ రాయ్ చిత్రాలలో ఆ సంకేతం దృశ్యంలో ఒక భాగంగా మాత్రమే వుంటుంది. అయినా ప్రేక్షకుడు సంకేతాన్ని గ్రహించగలుగుతాడు. ఉదాహణకు-ఒక స్త్రీ దీనావస్థకు ప్రకృతి కన్నీరు కారుస్తున్నట్లు చూపడానికై, ఆకుల చివళ్ళ నుంచి వర్షపు నీరు బొట్లు బొట్లుగా రాలుతున్నట్లు క్లోజప్ లో చూపించారు ఒక చిత్రంలో, సత్యజిత్ రాయ్ చిత్రాలలో యీ మాదిరి సంకేతం 'ఫ్రేం'లో ఒక చిన్న భాగంగా మాత్రమే వుంటుంది. (అయినా అసలు అటువంటి చౌకబారు సంకేతాలను ఆయన ప్రయోగించడు).

ఆయన సంకేతాలు సన్నివేశానికీ, వాతావరణానికీ విరుద్ధంగా, వాటి నుంచి వేరుగా వుండవు. అందుకే ఆయన చిత్రీకరణ సంవిధానం డాక్యుమెంటరీ పద్ధతిలో వుంటుంది. ఆయన చిత్రాలను చూడడానికి ముందు, యింతకాలం మన మనస్సుల్లో చౌకబారు చిత్రాలు వేసిన పాడు ముద్రలను చెరిపివేసుకోవాలి.

సత్యజిత్ రాయ్ నిర్మించిన 'పథేర్ పాంచాలి', 'అపరాజిత', 'అపూర్ సంసార్' మూడూ మూడు రకాలైనవి. ఒక చిత్రంలో కంటే మరొక చిత్రంలో ఆయన ఎంతో పరిణతి చెందినట్లు కనుపిస్తుంది. మొదటి చిత్రం కంటే రెండవ చిత్రం, దాని కంటే మూడవ చిత్రం స్వభావతః క్లిష్టతరమైన యితివృత్తాలు కలవి. ఈ మూడు చిత్రాలను చూసిన వారికి సత్యజిత్ రాయ్ ప్రతిభ వైవిధ్యపూర్ణమైనదని తెలుస్తుంది.

Satyajit Ray
సత్యజిత్ రాయ్

జీవిత పథంలోని సుఖదుఃఖాలకు, ఆశ నిరాశలకు, వెలుగు నీడలకు, 'అపూ' జీవితం ఒక సంకేతం. 'పథేర్ పాంచాలీ'లో తల్లి, తండ్రి, అక్క, దూరపు బంధువైన ఓ ముసలమ్మ గారాబంతో ఆకుల మధ్య మొగ్గలాగా అతి సుకుమారంగా పెరిగాడు అపూ. ఏడెనిమిదేండ్ల పసితనంలోనే ఆ ముసలమ్మ, అక్కయ్యల మృత్యువులను చూడవలసి వచ్చింది. అక్క చనిపోవడం అతని లేతమనస్సుని తీవ్రంగా గాయపరచింది. 'అపరాజిత'లో అపూ-12 ఏళ్లవాడుగా వుండగా తండ్రి మరణిస్తాడు. కాలేజీలో చదువుకొనే వయస్సులో తల్లి కూడా మరణిస్తుంది.

'అపూర్ సంసార్'లో-

అపూ యువకుడు. ఇంటర్మీడియట్ మొదటి తరగతిలో పాసయ్యాడు. కలకత్తాలోని ఓ మారు మూల ప్రాంతంలో ఒక మేడపై చిన్నటిక్కీ అతని నివాసం. పులూ అనే మిత్రుడు తప్ప అతనికి 'నా' అనే వారు ఎవరూ లేరు. దుర్బర దారిద్ర్యంలో ఒంటరి జీవితం గడుపుతున్నాడు. ఉద్యోగాల కోసం కాళ్లు ఆరిగేటట్లు తిరిగి అందరిచేత 'లేద'నిపించుకున్నాడు. ప్రపంచంలో అతనికి ఆసరా ఎవరూ లేరు. అతని ఆసరా ఎవరూ కోరడం లేదు. అతన్ని ఎవరూ ప్రేమించడం లేదు. అతని ప్రేమను ఎవరూ కోరడమూ లేదు. జీవించడం తప్ప మరే బాధ్యత అతనికి లేదు. అదీ అతని స్థితి.

తను నిస్సాహయుడనని అతను ఎప్పుడూ అనుకోడు. అసలు ఆ ఆలోచనే రాదు. గతాన్ని గురించి తలుచుకుని బాధపడే తత్వం అసలే కాదు. ఉన్నంతలో ఎక్కడికక్కడే తృప్తినీ ఆనందాన్నీ సృష్టించుకొని నిశ్చింతగా రోజులను దొర్లిస్తున్నాడు. తోచక పోతే కాసేపు వేణువు వాయించుకొంటాడు. పులుతో షికారు వెళ్తాడు. కవిత్వం రాస్తాడు. ఉద్యోగాల కోసం తిరుగుతాడు. ఎప్పుడూ పసిపిల్లాడిలా అమాయకంగా నవ్వుతూ వుంటాడు. భవిష్యత్తులో అతనికి ఒకే ఒక ఆశ ఉన్నది- తాను వ్రాస్తున్న తన జీవితకథ ఏనాటికైనా ప్రచురింపబడితే అది తనకు పేరు తెచ్చి పెట్టగలదని. జీవితమంతా కష్టాలమయమే అయితే, నిస్పృహ తప్ప మరేదీ లేకపోతే ఆత్మహత్య తప్ప మానవునికి గత్యంతరం లేదు. అందుకే ఆశలతో, మమతలతో, బాధ్యతలతో బంధించి మానవుణ్ణి చావనీకుండా చేస్తుంది విధి. క్షణికమైన ఒక్క సుఖాన్ని కల్పించి, దాని కోసం మానవుడు పది కష్టాలను అనుభవించేటట్లు చేస్తుంది. తెలిసో తెలియకో సుఖాల ఎరలకోసం కష్టాల వలల్లో చిక్కుకుంటాడు మానవుడు. అశలే మానవుడికి ప్రాణాలు. అవి అంతరించిన నాడు అతను మరణిస్తాడు. సత్యజిత్ రాయ్ యీ మూడు చిత్రాలలో విధి ఎంత బలీయమైనదో, అగాధ మైనదో వ్యాఖ్యానించాడు.

'అపూ' తన మిత్రుని వెంట అతని వూరు ఒక పెళ్లికి వెళ్లాడు. మిత్రుడు ఆహ్వానిస్తే, కేవలం కాలక్షేపానికి, పట్నంలో తోచక సరదాగా బయలుదేరి వెళ్లాడు. కాని ఆ సంఘటనతో హఠాత్తుగా అతని జీవితం కొత్త మలుపులు తిరిగింది. పెళ్లి కూతురు పులు మేనకోడలు. వీరు వెళ్లేసరికి పెళ్లిసంరంభం జరుగుతూవుంది. ఇంతలో పెళ్లికొడుకు పిచ్చివాడని తెలిసి ఏడుపులూ, పెడబొబ్బలూ, ప్రారంభమవుతాయి. పెళ్లి ఆగిపోతుంది. మగ పెళ్లి వారు వెళ్లిపోతారు. పెళ్లిపందింట్లో విషాదవాతావరణం అలముకొంది. అదే లగ్నానికి తన మేనకోడలును వివాహం చేసుకొని కుటుంబ గౌరవం నిలబెట్టమని పులూ అపూను ప్రాధేయపడతాడు. అపూ నిర్విణ్ణుడైపోతాడు. పరిస్థితిని అర్థం చేసుకొని సరేనని అంగీకరిస్తాడు. అపూ, అపర్ణల వివాహం జరుగుతుంది.

Apursansar Picture
సౌమిత్రాచటర్జీ, శర్మిళా టాగూర్

ఆ రోజు రాత్రి శోభనం గదిలో తన స్థితిగతులను అపర్ణతో చెప్పుకుంటాడు-మరునాడే ఆమెను వెంటబెట్టుకొని కలకత్తా వస్తాడు. ఆ చిన్న గదిలోనే వారి కాపురం. తర్వాత ఒక చిన్న గుమాస్తా ఉద్యోగం దొరుకుతుంది. తృప్తిగా ఆనందంగా ఏడాది గడిచిపోతుంది. తర్వాత, ఆమె పురిటికి పుట్టింటికి వెళ్తుంది. పిల్లవాణ్ణి కంటుంది. అంతటితో తన బాధ్యత తీరిపోయినట్లు ప్రపంచం నుంచి నిష్ర్కమిస్తుంది. అపూ జీవితకథలో ఆమె పాత్ర అంతటితో చెరిగిపోతుంది. అపూ స్థాణువైపోతాడు. విధి తమ ఇద్దరి జీవితాలను ఎందుకు ముడివేసిందో, తిరిగి ఎందుకు త్రెంచి వేసిందో తెలీదు. ఆమె సాహచర్యంలో ఒక్క ఏడాదిలో అనుభవించిన ఆనందం అంతకు పది రెట్లు దుర్భరమైన విషాదంగా పర్యవసించింది. మనశ్శాంతి కోసం అనేక ప్రదేశాలు 'బికారి'లా తిరిగాడు. అత్త వారింటికి వెళ్లి బిడ్డను చూడనైనాలేదు. అయిదేళ్లు గడిచాయి. పిల్లవాడు గడ్డుగ్గాయిగా తయారయ్యాడు. ఇంతలో ఇంగ్లండు నుంచి పులూ తిరిగి వచ్చి పరిస్థితులన్నీ చూస్తాడు. అపూను వెతికి పట్టుకొని బాధ్యతను గుర్తు చేస్తాడు. బలవంతం మీద అపూ బయలుదేరుతాడు. అపర్ణ మరణించినా, విధి అతన్ని స్వేచ్ఛగా వదలలేదు. అతని కాళ్లకు మరో బంధం వేసింది.

అత్తవారింటికి వెళ్లి, కొడుకును చూసేందుకు గదిలోకి వెళ్తాడు. అది తన పెళ్లినాటి శోభనం గది. అదే మంచం. దాని మీద అపర్ణ స్థానంలో కొడుకు-గాఢంగా నిద్రపోతున్నాడు. అంతవరకు వూహించని, అనిర్వచనీయమైన మమకారం ఏర్పడుతుంది. కొడుకు తన దగ్గరకు రాడు. ఎంతో ప్రయత్నం, సంఘర్షణ జరిగిన మీదట తండ్రీ కొడుకులకు మైత్రి, అనుబంధం ఏర్పడుతాయి. కొడుకును భుజాల మీద కూర్చోబెట్టుకుని కొత్త ఆశలతో తిరిగి యాత్ర ప్రారంభిస్తాడు అపూ.

Apursansar Picture

జన్మించగానే మానవుని జీవితంలో మొట్టమొదటిగా జరిగిన సంఘటన, దాని తర్వాత జరిగిన వరస సంఘటనలకు ఆధారమవుతుంది. ఈ విధమైన సంఘటనల పరంపరే జీవితం. అందుకే జీవితంలోని ఏ సంఘటనా ఆధార రహితం, అర్థరహితం కాదు. వర్తమాన సంఘటనలు భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలకు పునాది అవుతాయో తెలియదు. కాని, గతంలో ఏ సంఘటన ఎటువంటి పరిస్థితులకు దారి తీసిందో విమర్శించుకుంటే కొంత తెలుస్తుంది. ఈ దృష్టితో పరిశీలీస్తే ఈ మూడు చిత్రాలలోని సంఘటనలు వాస్తవికంగా, అర్థవంతంగా కనుపిస్తాయి. సంఘటనలను, పాత్రల వ్యక్తిత్వాలను అంత గొప్పగా నిలుపుకుంటూ రావడం అసాధారణమైన విషయం. అందుకే అత్యుత్తమ చిత్రాలుగా పేర్కొనబడే యితర చిత్రాలకూ, యీ చిత్రాలకూ ఏ విధంగానూ పోలిక లేదు. తపస్సు చేసి జీవిత సత్యాలను సాక్షాత్కరింపచేసుకొన్నాడు సత్యజిత్ రాయ్. ఆ తపస్సు వల్లనే ఆయనకు 'వాస్తవిక' దృక్పథం, కళా దృక్పథం అలవడినాయి. ప్రకృతిలోని ప్రతీ వస్తువూ విశ్వ రహస్యానికి ఒక సంకేతంగా ఆయనకు గోచరిస్తుంది.

పండిత్ రవిశంకర్ సమకూర్చిన సంగీతం యీ చిత్రమంత అద్భుతంగా వుంది. ముఖ్యంగా యింత గొప్ప టైటిల్ మ్యూజిక్ యిది వరకు ఎన్నడూ వినలేదు. అపూ జీవితానికి యీ సంగీతం టూకీ వ్యాఖ్యానం. 'అపరాజిత' చిత్రంలో మాదిరిగానే యిందులో కూడా రైళ్ల శబ్దాలను నేపథ్యంలో ఎక్కువగా వాడుకున్నారు. అందుకు అనువుగా అపూ నివాసాన్ని రైలు స్టేషన్ కు సమీపంలో అమర్చారు.

అపూ పాత్రను సౌమిత్రాచటర్జీ, అపర్ణ పాత్రను శర్మిళా టాగూర్ అద్భుతంగా పోషించారు.

జనవరి మొదటి వారంలో యీ చిత్రం విజయవాడ అలంకార్ లో విడుదలైయింది. ఆంధ్రప్రాంతానికి డిస్ట్రిబ్యూటర్లైన పూర్ణా ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని ముందుగా పత్రికల వారికి ప్రత్యేకంగా ప్రదర్శించారు.

నండూరి పార్థసారధి
(1960 డిసెంబరు 25వ తేదీన - ఆంధ్రప్రభ పత్రికలో ప్రచురితమయింది.)

Previous Post Next Post